మెయన్ ఫీచర్

అయోధ్యపై మధ్యవర్తిత్వం ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుండి అ యోధ్య వివాదం జనసామాన్యంలో ఉన్నా, న్యాయస్థానాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న రామజన్మభూమి సమస్యకు పరిష్కారం చూపే దిశగా సుప్రీం కోర్టు వడివడిగా అడుగులు వే స్తోంది. అయోధ్యపై వాదనలను వచ్చే నెల 18 నాటికి పూర్తి చేయాలని ఉభయ పక్షాలకూ సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ఈ చిరకాల వివాదానికి తెరపడుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాలూ వివాదాన్ని పరిష్కరించదలుచుకుంటే ఇందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి సహా ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ బాబ్డీ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు ఉన్నారు. అక్టోబర్ 18 నాటికి ఇరుపక్షాల న్యాయవాదులు తమ రోజువారీ వాదనలు వినిపించడం పూర్తి చేస్తే తీర్పు రాయడానికే దాదాపు నాలుగు వారాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే నవంబర్ 10 నాటికి తీర్పు సిద్ధం అవుతుంది. అదే నెల 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వాదనలకు సంబంధించి ఓక షెడ్యూలును రూపొందించుకోవాలని ఇరుపక్షాలకూ ధర్మాసనం ఇప్పటికే సూచించింది.
మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించేందుకు కొంత మంది ఆసక్తిగా ఉండగా, మరికొంత మంది నిరాసక్తంగా ఉన్నారు. మధ్యవర్తిత్వం జరిపిన త్రిసభ్య ప్యానల్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీపుల్లా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వేళ మధ్యవర్తిత్వంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే ఆ ప్యానల్ ముందే తమ వాదనలు వినిపించుకోవాలని, ఆ వివరాలను బహిర్గతం చేయాల్సిన పనిలేదని పేర్కొంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఈ ఏడాది ఆగస్టు ఆరో తేదీ నుండి రోజూ విచారణ కొనసాగిస్తోంది. సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో మధ్యవర్తుల కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి ఖలీపుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులను సభ్యులుగా నియమించింది. మార్చి 8న కేసును విచారించిన సుప్రీం కోర్టు మరో 8 వారాల గడువును ఇచ్చింది. అయోధ్యకు ఏడు కిలోమీటర్లు దూరంలోని ఫైజాబాద్ వేదికగా మధ్యవర్తిత్వం జరపవచ్చని సుప్రీం నిర్ణయించింది. మధ్యవర్తుల కమిటీకి కార్యాలయం, ఇరు పార్టీలు ఉండటానికి బస, భద్రత, వాహనాలు నిలపడానికి సౌకర్యాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ వారం రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని, అవసరం అనుకుంటే మరికొంత మందిని కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమించుకోవచ్చని పేర్కొంది. మధ్యవర్తుల కమిటీ నివేదికను రహస్యంగా ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పత్రికల్లో ప్రచురించడానికి, టీవీల్లో ప్రసారం చేయడానికి వీలు లేదని పేర్కొంది. నాలుగు వారాల అనంతరం సంప్రదింపులు జరుగుతున్న తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దృష్టికి మధ్యవర్తిత్వ మండలి చైర్మన్ తీసుకురావాలని సూచించింది. మధ్యవర్తిత్వానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు సాగాలని నిర్దేశించింది.
2.77 ఎకరాల భూమికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఆ భూమిని మూడు పార్టీలకూ సమానంగా పంచాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీం కోర్టులో మధ్యవర్తిత్వ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు ముస్లిం సంస్థలు స్వాగతించాయి. నిర్మోహి అఖరా మినహా మిగిలిన హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. తొలి ఫిర్యాదుదారుడైన ఎం సిద్ధిఖ్ వారసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపిస్తూ కక్షిదారులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నపుడు మధ్యవర్తిత్వమే మేలైన మార్గమని పేర్కొన్నారు. ఒక్క మధ్యవర్తినే కాకుండా ముగ్గురు నలుగురితో మండలిని ఏర్పాటు చేస్తే మంచిదని పేర్కొన్నారు. ఆలయ మూల విరాట్ రామ్‌లాలా విరాజ్‌మాన్ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రజల నుండి విరాళాలు సేకరించి మరో చోట మసీదు నిర్మించడానికి తాము సుముఖమేనని రామజన్మస్థలి నిర్థారణ విషయంలో మాత్రం సంప్రదింపులకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు.
నిజానికి రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించింది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉండాలని 2017 మార్చి 21న సుప్రీం పేర్కొంది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ , జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతోకూడిన ధర్మాసనం ఈ సూచన చేసింది. ఆ సమయంలో కక్షిదారులు ఇందుకు అంగీకరించలేదు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే అయోధ్య వివాదంపై నియమితులైన ముగ్గురు సభ్యుల మధ్య సారూప్యత, సాన్నిహిత్యం కూడా ఉంది. ముగ్గురూ తమిళనాడు వాసులే, వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులే. మధ్యవర్తిత్వ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ ఖలీఫుల్లాకు మంచి పేరుంది. శస్తచ్రికిత్సలు చేసే సమయంలో వైద్యులు ఎంత సూక్ష్మపరిశీలన చేస్తారో సామాన్యులకు న్యాయం అందించడంలో కూడా ఖలీఫుల్లా అలా వ్యవహరిస్తారనే పేరుంది. జమ్మూ కశ్మీర్ హైకోర్టులో పనిచేసినపుడు ఆయన రాష్ట్రం అంతా తిరిగి న్యాయ సహాయ క్లినిక్‌లను ఏర్పాటు చేయించారు. దీంతో కశ్మీరీలకు భారతీయ న్యాయవ్యవస్థపై ఎన్నడూ లేనంత నమ్మకం పెరిగింది. వేదిక్ జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా పరిగణించడమేగాక విశ్వవిద్యాలయాల్లో అభ్యాసానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పు, క్రికెట్ కంట్రోల్ బోర్డులో చేపట్టాల్సిన సంస్కరణలపై చేసిన సూచనలు ఆయన సునిశిత దృష్టికి ఇందుకు అద్దం పడతాయి. బీసీసీఐ సంస్కరణలపై ఆయన చేసిన కృషిని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఎంతగానో ప్రశంసించారు. 1951 శివగంగై జిల్లా కారైకుడిలో జస్టిస్ ఖలీఫుల్లా జన్మించారు. 1975లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2000లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోనూ, అనంతరం సుప్రీం కోర్టులో పనిచేస్తూ 2016 జూలైలో పదవీ విరమణ చేశారు. శ్రీశ్రీ రవిశంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తంజావూరు జిల్లా పాపనాశనంలో జన్మించారు.
ఇక శ్రీరాం పంచు అంటే మధ్యవర్తిత్వానికి ఆద్యుడని చెప్పాలి. మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు దేశంలో మధ్యవర్తిత్వ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారు. దేశంలో తొలిసారి మద్రాసు హైకోర్టుకు అనుబంధంగా ‘ద మీడియేషన్ చాంబర్స్’ను ఏర్పాటు చేశారు. ‘మీడియేషన్ ప్రాక్టీస్ అండ్ లా’ పేరుతో మధ్యవర్తిత్వంపై సమగ్ర కరదీపికను రచించారు. ‘సెటిల్ ఫర్ మోర్’ పేరుతో మధ్యవర్తిత్వం ఆవశ్యకతపై పుస్తకం రాశారు. సింగపూర్ మీడియేషన్ సెంటర్‌లో సర్టిఫైడ్ మీడియేటర్‌గా వ్యవహరించారు. సుమారు 40 ఏళ్లుగా ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అయోధ్య కేసులో చిట్టచివరి అవకాశంగా మధ్యవర్తిత్వానికి సుప్రీం మొగ్గు చూపింది. కుదిరితే మధ్యవర్తిత్వం లేకుంటే సుప్రీం ధర్మాసనం తుది తీర్పు ప్రకటించనుంది. రామజన్మభూమి వివాదానికి సంబంధించి శతాబ్దాల చరిత్రను అధ్యయనం చేసిన ధర్మాసనం- ‘రాముడు ఎక్కడ పుట్టాడు? ఆయనకు వారసులు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు?’ అనే వౌలిక అంశాలను వాదనల సందర్భంగా లేవనెత్తుతోంది. రామ్‌చబూత్రపై కీలకమైన ప్రశ్నలను సంధించింది. నేలమట్టమైన బాబ్రీ మసీదులో కేంద్రక గుమ్మటం కింద భాగంలోనే రాముడు పుట్టాడని హిందువులు విశ్వసిస్తున్నారేమో, దీనిపై మీరేం అంటారు? అని వక్ఫ్‌బోర్డు తరఫున, అసలు కక్షిదారుడైన సిద్ధిఖీ తరఫున హాజరైన న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. మూడు గుమ్మటాల వెలుపలి భాగంలో రామ్ చబుత్రా ఉందని, దానికి సమీపంలో రెయిలింగ్ పెట్టారని హిందువులు చెబుతున్నారు, కేంద్రక గుమ్మటం కింద ఉన్న ప్రదేశం వద్దకు (లోపలికి వెళ్లేందుకు) హిందువులకు ఎన్నడూ ప్రవేశం లేదని ముస్లింలు అంటున్నారు, ఆ కేంద్రక గుమ్మటం కింద ఏదో దైవత్వం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారేమో, లోపలికి వెళ్లే వీలు లేక చబూత్రా వద్దే పూజలు చేస్తున్నారేమో కదా..? అని ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నీ జడ్జీ ఊహలేనని, వాటికి ఆధారాలు లేవని ముస్లింల పక్షాన న్యాయవాది చెబుతున్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాలనూ స్పృశించడమే కాదు, అన్ని సంభావ్యతలనూ పరిశీలిస్తున్నామని మరో న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఇంకో పక్క మసీదుకు సంబంధించి లిఖిత పూర్వక ఆధారాలు, భూమి యాజమాన్య హక్కుల పత్రాలు తమ వద్ద లేవని బాబ్రీ మసీదు యాజమాన్య బోర్డు ఒప్పుకోక తప్పలేదు. ఇక తీర్పు రావడమే తరువాయి, కేంద్రం ఎపుడు రామాలయం నిర్మిస్తుందా? అని హిందువులు ఎదురుచూస్తున్నారు. జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేకే ఉన్నాయి. ఆయన కూడా ప్రస్తుత ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్నారు.

-బీవీ ప్రసాద్ 98499 98090