మెయిన్ ఫీచర్

పౌష్టికాహార లోపంతో సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌష్టికాహార లోపంతో ప్రతియేడు ఎందరో మహిళలు బాధపడుతున్నారు. ఒక్క మహిళలే కాదు బాలికలు, బాలురు, ఎదుగుతున్న పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేక బలహీనంగా కనిపిస్తూ చిక్కి శల్యం అవుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, పేదరికం ఒక కారణమైతే, తెలిసీ తెలియనితనం మరో కారణం అని చెప్పవచ్చు.
పౌష్టికాహార లోపాలు వ్యక్తి ఆహారంలోని పౌష్టిక పదార్థాలు ప్రతిపాదించిన మోతాదుకంటే నిరంతరంగా తగ్గటంవల్ల పౌష్టికాహార లోపం వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రకారం 10-19 సం. వయస్సుగల పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. పొద్దస్తమానం ఒకటే చికాకు, టెన్షన్, ఆందోళన, ఇరిటేషన్.. ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి, మానసికంగా అంతా అయోమయం. ఇదంతా ఎమోషనల్ ఈటింగ్ సిండ్రోమ్‌తో వచ్చిన సమస్య అని చాలామందికి తెలియదు. పని ధ్యాసలో పడి సమయానికి తినకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడంతో చాలామంది ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. 70 శాతం ఆరోగ్య సమస్యలు పౌష్టికాహారం సరైన మోతాదులో అందకపోవడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. పౌష్టికాహార ప్రాధాన్యంపై అవగాహన పెంచడానికి ప్రతిఏటా జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఎమోషనల్ ఈటింగ్ సిండ్రోమ్, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడంవల్ల ఎమోషనల్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సిండ్రోమ్ ఎక్కువగా ఐటి రంగంలో పనిచేసేవారికి ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడిలో ఏది పడితే అది తినడం, అందులోనూ జంక్‌ఫుడ్ ఎక్కువగా ఉండటంవలన పౌష్టికాహారం అందడంలేదు. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు వున్న ఆహారం తీసుకోవాలి కానీ అలా జరగడంలేదు. దీనికి కారణం పని సమయాలు, టార్గెట్లు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, బద్ధకం, జీవన విధానమని ఒకరకంగా చెప్పొచ్చు.
పౌష్టికాహార లోపంవల్ల కొంతమందిలో ఆకలి చచ్చిపోతుంది. మరికొందరిలో ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడంవల్ల మూడ్స్ మారుతుంటాయి. ఇటువంటివారిలో డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి కొరవడుతోంది. విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చేసే పనిపై లగ్నం వుండదు. దీనివల్లనే వెంట్రుకలు ఊడిపోవడం, కళ్లదగ్గర నల్లటి మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. చాలామంది ఆకలి వేసినప్పుడు రెడీమేడ్ ఆహారం, ప్యాకేజీ ఆహారం తీసుకుంటారు కానీ ఇందులో సరైన పౌష్టికాహారం ఉండదు.
మహిళల్లో హార్మోన్ల లోపం
పౌష్టికాహారం లోపంతో మహిళల్లో హార్మోన్ల లోపం ఎక్కువగా ఉంటోంది. వాళ్లు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయి. ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తీసుకోకపోవడం, పాలు తాగకపోవడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడంవల్ల హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. పిల్లల్లో పౌష్టికాహారం లోపిస్తే జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం. దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 16 కోట్లమంది ఉన్నారు. భారతదేశంలో ఆకలి, పౌష్టికాహార లోపాలపై ఇటీవల విడుదలైన నివేదిక ప్రధానమంత్రిని కూడా స్పందించేలా చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువ పార్లమెంటేరియన్లతో కూడిన పౌరవేదిక పౌష్టికాహార లోపాలపై నివేదికను తయారుచేసింది. నాందీ ఫౌండేషన్ సమన్వయంతో తయారైన ఈ నివేదికను ‘హంగామా నివేదికగా’ పిలుస్తారు. దేశంలోని అయిదేళ్లలోపు పిల్లల్లో ఇప్పటికీ 42.3 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యవస్థలో వున్న లోపాలకు, ఆరోగ్యపరమైన లోపాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇతర అన్ని రంగాల్లా మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారినవర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో వెనుకబడి ఉన్నారు. దేశంలో వున్న ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, తెగల పిల్లల్లో తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20 శాతం వరకూ అధికంగా వున్నారు. అదేవిధంగా పౌష్టికాహార లోపాలను తగ్గించడం కూడా ఈ వర్గాల ప్రజల్లో మందకొడిగా సాగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలే కాకుండా ముస్లింల పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపాలు తీవ్రంగా వున్నాయి. బాలికల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా వున్నాయి. ఇది వారిపట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
సరైన పౌష్టికాహారం తీసుకోక ఎంతోమంది మహిళలు, బాలికలు, బాలురు అని కాకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైన ఎంతో ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ఈ లోపాన్ని కనుక త్వరగా రూపుమాపకపోతే కొన్ని తరాలు కేవలం పౌష్టికాహార లోపంతో అంతరించిపోతాయి. కనీసం ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి సరైన పోషక విలువలు గల ఆహారాన్ని ప్రజలకు అందిస్తే ముందుతరానికి మంచి ఆరోగ్యాన్ని అందించినవారవుతారు.

-పుష్యమీ సాగర్ 9010350317