మెయన్ ఫీచర్

భారతీయ ఆత్మ.. మహాత్మా గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ స్వాతంత్య్రం కోసం పలు రూపా లలో, పలువురు నేతల నేతృత్వంలో సు దీర్ఘకాలం పోరాటం జరిగింది. చివరకు మహా త్మా గాంధీ పేరుతో మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. భారతీయులెవరూ అంచనా వేయలేని పరిస్థితులలో మనకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకు దారితీసిన కారణాలపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలిచినా- ఆర్ధికంగా, సైనికంగా తీవ్ర నష్టాలకు గురైన బ్రిటన్ 1857 వంటి మరో తిరు గుబాటును ఎదుర్కొనలేని నిస్సహాయ స్థితిలో చిక్కు కుపోయింది. అటువంటి తిరుగుబాటు భారత్‌లో మరలా చెలరేగే ప్రమాదం ఉన్నదని భయపడి- గౌరవ ప్రదంగా, భారత్‌ను వీలైనంతగా దేశ విభజన పేరుతో బలహీన పరచి మరీ వైదొలిగింది.
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు ప్రపంచం ఆయనను చరిత్ర మలుపు తిప్పిన ఒక మహానేతగా గుర్తించడం సంతోషం కలిగిస్తుంది. అప్పటి వరకు పట్టణాలకు, కొన్ని వర్గాలకు పరిమితమై ఉన్న స్వతంత్ర పోరాటాన్ని జన సామాన్యంలోకి తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. శాసన ఉల్లంఘన కానీయండి, ఉప్పు సత్యాగ్రహం కానీయండి, పన్నులు చెల్లించక పోవడం కానీయండి.. ఆయన ఏది చేపట్టినా అత్యధికంగా ప్రజలను సమీకరించే రీతిలో సాగింది. ఆ విధంగా ప్రపంచానికే ఒక నూతన దిశను చూపారు. అప్పటి వరకూ స్వతంత్ర పోరాటాలు తుపాకీ ద్వారా లేదా విజ్ఞప్తుల ద్వారా మాత్రమే ప్రపంచంలో జరుగుతూ ఉండేవి. గాంధీజీ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ సహితం ప్రజా సమస్యలపై బ్రిటిష్ పాలకులకు విజ్ఞప్తులు ఇచ్చుకొంటూ పోవడం తప్ప ప్రజలను సమీకరించి చెప్పుకోదగిన పోరాటాలు చేయలేదని గుర్తించాలి. ఈ రెండు మార్గాలలో కాకుండా శాంతియుతంగా, సత్యాగ్రహం ద్వారా, అహింస అనే ఆయుధంతో ప్రపంచంలోనే ఆర్థికంగా, సైనికంగా బలమైన బ్రిటి పాలకులను తలవంచేటట్లు చేయవచ్చని గాంధీజీ నిరూపించారు. ఆ తర్వాత ప్రపంచంలో పలు చోట్ల పలు ఉద్యమాలకు స్ఫూర్తి కలిగించారు.
ఆయన కేవలం రాజకీయ అంశాలకు తన పోరాటాలను పరిమితం చేయలేదు. అనైతికత, ఆధ్యాత్మికతలతో పాటు ప్రజల జీవన గతులను మార్చే అనేక అంశాలపై దృష్టి సారించారు. అంటరానితనం, సామాజిక సమన్వయం, ప్రజలలో వర్తమాన అంశాలపై అవగహన కలిగించడం, మహిళా విద్య, మహిళలు గౌరవంగా - పురుషులతో సమానంగా జీవించేందుకు దోహద పడటం, స్వతంత్ర పోరాటంలో సహితం వారు ముందుకు వచ్చే విధంగా చేయడం.. వంటి ఎన్నో అంశాలపై దృష్టి సారించారు. ఒక సామాజిక సంస్కర్తగా వ్యవహరించారు. గాంధీకి మతం, ఆధ్యాత్మికత పట్ల అపారమైన విశ్వాసం ఉంది. హరే రామ.. అంటూ తన ఉద్యమంలో భజనలు చేస్తూ ఉండేవారు. అయితే ఆయన ఎన్నడూ మత విశ్వాసాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయలేదు. ఇతర మతాల పట్ల అగౌరవంగా వ్యవహరింపలేదు. మతం పేరుతో ప్రజల మధ్య విభజనలు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మతాన్ని వ్యక్తిగత అంశంగానే పరిగణిస్తూ వచ్చారు. బాలగంగాధర తిలక్ వలే మతపరమైన ఉత్సవాలను ఉద్యమంగా చేసే ప్రయత్నం చేయలేదు. సత్యానే్న దైవంగా భావించి, రాజకీయాలను మానవ పురోభివృద్ధికి ఒక వాహనంగా స్వీకరించారు. కేవలం స్వాతంత్య్రం పొందటమే కాకుండా, స్వపరిపాలన నిజంగా భారతీయంగా, స్వతంత్రంగా ఉండేందుకు అవసరమైన పునాది ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. స్థానిక స్వపరిపాలన, స్వభాషల ప్రోత్సాహం, ఆర్థిక- సామాజిక అంశాలు వంటి అనేక విషయాలపై దృష్టి సారించారు. నిరాడంబరమైన జీవనంతో, సాధారణ ప్రజలకు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అహంకారం, ఆడంబరాలకు తావీయలేదు. తనతో విధానపరంగా వ్యతిరేకించే వారితో సహితం నిర్మొహమాటంగా చర్చలకు సిద్ధపడేవారు. పలు సందర్భాలలో వివిధ అంశాలలో రాజీ ధోరణి కూడా అవలంబించారు.
ఒక ప్రముఖ గాంధేయవాది అభిప్రాయం ప్రకారం- గాంధీజీ తాను చేపట్టిన ఏ ఉద్యమంలో సహితం పూర్తిగా విజయం సాధించలేక పోయారు. అర్ధాంతరంగా ఆయా ఉద్యమాలను ఆపివేస్తూ వచ్చారు. తాను అనుకున్న విధంగా శాంతియుతంగా ఉద్యమం ముందుకు వెళ్లలేని పక్షంలో ఆపివేసేవారు. క్విట్ ఇండియా ఉద్యమం అందుకు ఉదాహరణ. అయితే చివరకు ఆయన పేరుతో మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఆయన ఒక గొప్ప నైతిక శక్తిగా వ్యవహరించారు. అనేకమంది గాంధీ వాదం అంటూ చెప్పడాన్ని ఆయన ఒప్పుకొనేవారు కాదు. తాను ప్రత్యేకంగా ఎటువంటి కొత్త వాదాన్ని ప్రతిపాదించడం లేదని చెబుతూ ఉండేవారు. భారతీయ తాత్విక భావాల నుండే సత్యాగ్రహం, సత్యం, అహింస వంటి ఆయుధాలను ఆయన సమకూర్చుకున్నారు. అందుకనే ఆయనను భారతీయ ఆత్మగా పేర్కొనవచ్చు. భారతీయ తాత్విక చింతనకు ఆధునిక ప్రతిరూపంగా భావిం చవచ్చు. ఉపదేశాలు ఇవ్వడమే కాకుండా, చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయడం గాంధీజీలోని నిజమైన ఔన్నత్యం. ప్రాథమికంగా ఆయన ఒక రాజకీయ నేత. కానీ లక్ష్యానికి కాకుండా, లక్ష్య సాధనకు అనుసరించే మార్గానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే ఆయన ఉపదేశించిన సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి వినూత్నమైన అంశాలు సాధారణ ప్రజానీకాన్ని తన రాజకీయ ఉద్యమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లు చేయడం కోసం అనుసరించిన ఒక వ్యూహాత్మక పంథా కావడం గమనార్హం. ప్రజలు న్యాయం పొందేందుకు, తమ మధ్య గల విబేధాలను సామరస్యంగా పరిష్కరించు కొనేందుకు, క్రియాశీల పౌరులుగా వారు మారేందుకు గాంధీజీ రాజకీయాలను ఒక సాధనంగా మలచుకున్నారు. ఆయనకు రాజకీయాలు అధికారంలోకి వచ్చేందుకు సాధనాలు ఏమాత్రం కావు. ప్రజాస్వామ్యం అంటే అత్యధిక ప్రజలు మిగిలిన వారిపై స్వారీ చేయడం కాదని గాంధీజీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తాను నమ్మిన విశ్వాసాలు, విలువల కోసం ఎల్లప్పుడూ నిలబడ్డారు. అందుకోసం కొన్నిసార్లు అపఖ్యాతిపాలు కావడానికి కూడా వెనుకాడలేదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వాతంత్య్రం, స్వేచ్ఛ కీలకమైన అంశాలుగా స్వీకరించారు. వ్యక్తిగత వికాసానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అధికార కేంద్రీకరణకు ఆయన పూర్తిగా వ్యతిరేకం. వికేంద్రీకృత ప్రజాస్వామ్యం పట్ల విశేషమైన ఆసక్తి కనబరచారు. ప్రజాస్వామ్యం క్షేత్ర స్థాయిలో వికసించాలని గాంధీజీ ఆశించారు. అందు కోసం గ్రామీణ రిపబ్లిక్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేస్తుండేవారు.
లక్ష్య సాధనకు దగ్గరి దారులు వెదుక్కోనలేదు. హింస ద్వారా తక్షణ ఫలితాలు పొందే అవకాశం ఉన్నా ఆయన తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం హింస హింసాయుతమైన స్వరాజ్‌ను తీసుకు వస్తుందనే భయమే కారణం. గాంధీజీ దృష్టిలో స్వరాజ్ అంటే కొద్దిమంది చేతులలో అధికారం కేంద్రీకృతం కావడం కానేకాదు. అధికార దుర్వినియోగం జరిగినా దానిని ప్రతిఘటించగల సామర్ధ్యం ప్రజలకు చేకూరడంగా భావిస్తూ వచ్చారు. ప్రజల సాధికారికత కోసం ఆయన తపన చెందారు. రాట్నం ఉపయోగించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని వ్యతిరేకించారు. వికేంద్రీకృత ఆర్ధికాభివృద్దికి ఎంతగానో కృషి చేశారు. ప్రజలు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధి సాధించాలని తపన చెందారు. ఆర్థిక విధానాలలో పాశ్చాత్యులు కోరుకొంటున్న కేంద్రీకృత పెట్టుబడిదారీ విధానానికి, పశ్చిమ దేశాలు విశ్వసించిన కేంద్రీకృత సామ్యవాద విధానాలను పూర్తిగా గాంధీజీ తిరస్కరించారు. ప్రభుత్వం వ్యాపారం చేయరాదని స్పష్టం చేస్తూ వచ్చారు.
అదే సమయంలో కొంతమంది పారిశ్రామిక వేత్తల చేతులలో ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతం కావడాన్ని కూడా గాంధీజీ తిరస్కరించారు. వికేంద్రీకృత ఆర్థిక వికాసాన్ని సూచిస్తూ అసలైన భారతీయ ప్రత్యామ్నాయాన్ని ప్రపంచం ముందు ఉంచారు. గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్య్రం పట్లనే దృష్టి కేంద్రీకరించలేదు. వివిధ రంగాలలో మనం అనుసరించవలసిన విధానాల గురించి దృష్టి కేంద్రీకరించారు. అందుకోసం భారతీయమైన ప్రత్యామ్నాయాలను మనముందుంచారు. అన్ని రంగా లలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు.
మొదటి ప్రధాని జవహర్ లాల్ నెస్రూ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు గాంధీజీ ప్రవచనాలను ప్రస్తావిస్తూ, ఆయన మార్గంలో నడుస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారెవ్వరూ గాంధీజీ వలే నికార్సయన భారతీయ ఆత్మను కీలక రంగాలలో ప్రదర్శించలేక పోతున్నారని చెప్పవలసిందే. గాంధీజీ మృతి చెంది కూడా ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రపంచం ఆయన చూపించిన మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తున్నది. ప్రపంచంలో అనేకమంది నేతలు ఆయన నుండి స్ఫూర్తి పొందుతూ వస్తున్నారు.
గాంధీజీ బోధనల గురించి నేడు భారత్‌లో కన్నా విదేశాలలో ఎక్కువగా అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. గాంధీ గురించి విశేషంగా అధ్యయనం చేస్తున్న ప్రపంచంలోని మొదటి పది మందిలో- ఇద్దరికి మించి భారతీయులు లేరని చెప్పవలసిందే. అంటే నేడు గాంధీ గురించి భారతీయులకన్నా విదేశీయులు ఎక్కువగా అధ్యయనం చేస్తున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం గాంధీజీ పేరును ఇంకా ఉపయోగించుకొంటున్న మన నేతలు ఇప్పటికైనా ఆయన బోధనల సారాంశాన్ని అర్థం చేసుకొని, ఆ మార్గంలో నిరాడంబరమైన భారతీయ జీవనం గరిపే ప్రయత్నం చేయవలసి ఉంది. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే ప్ర యత్నం చేయకుండా, నిర్మాణాత్మకమైన కృషితో ప్రజలలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం జరగాలి. అధికార కేంద్రీకరణను తిరస్కరించి, వికేంద్రికృత పాలనకు నడుం బిగించాలి. అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత కల్పించి, లక్ష్య సాధనలో విలువలకు అత్యంత ప్రా ధాన్యత ఇవ్వడమే గాంధీజీకి నిజమైన నివాళి కాగలదు.

-చలసాని నరేంద్ర 98495 69050