మెయిన్ ఫీచర్

సద్బుద్ధి ప్రదాయని గాయత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ
వమర్థానాం మూలం ధనదనమనీ యాంఘ్రి కమలే
త్వమాదిః కామానాం జనని కృతకం దర్ప విజయే
సతాం ముక్తేద్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహీషీ
- శ్రీ శంకర భగవత్పాదులు
తల్లీ వేదమాతా! నీవు వేద ధర్మాలను విధించు జగన్మాతవు. అఖిల ధర్మాలకు మూలం- వేదములు. ‘వేదోఖిలో ధర్మమూలమ్’. ‘వేదమాతవు నీవే తల్లీ’ అనగా గాయత్రీ మాతవు. మా బుద్ధులను చక్కగా వికసింపజెయ్యి. ధర్మబుద్ధిని ప్రసాదించు. ధర్మబుద్ధికోసం నిన్ను అర్చిస్తాను, ఉపాసిస్తాను. మొదటి పాదం ధర్మాన్ని, రెండవ పాదం అర్థాన్ని, మూడవ పాదం కామాన్ని, నాల్గవ పాదం మోక్ష పురుషార్థాన్ని ప్రతిబింబిస్తోంది. సకల ధనపతి కుబేరుడు. అటువంటి కుబేరుడు నీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాడు. ధర్మార్థ కామ మోక్షములనేవి నాలుగు పురుషార్థములు. కనుక అర్థాలకు మూలం అయిన నిన్ను, అర్థపురుషార్థానికై ప్రార్థిస్తాం, పూజిస్తాం, ఉపాసిస్తాం. నీవే గాయత్రీ మాతవు.
మన్మథునికి విజయం కలిగించిన తల్లివి. పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించినపుడు, మొదటగా ఇచ్ఛాశక్తి అవతరించింది జగన్మాత. పరమేశ్వరునికి సంకల్పశక్తి అయింది. కామాలకు మొదట తల్లి జగజ్జనని. కామభావనలకు నిలయం మన్మథుడు. శివుడు మన్మథుని భస్మం చేశాడు. మన్మథుడు అనంగుడైనాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది. మన్మథుని భార్య రతీదేవి, తన భర్తను జీవింపజేయమని ప్రార్థించింది, మాతని. రతీదేవికి మాత్రమే కనిపించి, స్ర్తి పురుషులలో ధర్మబద్ధమైన కామభావనలు కలిగిస్తాడని అభయమిచ్చిన మాత జగన్మాత. ధర్మంతో అర్థకామాల్ని అనుభవిస్తే, మోక్షం లభిస్తుందని గాయత్రీమాత విశేషాన్ని, ఆదిశంకరాచార్యులు, వేదమాత గాయత్రీ దేవిని స్తుతిస్తూ, ఆనందలహరిలో మనకందించిన శ్లోకం, గాయత్రీమాత పూజకు స్ఫూర్తినిస్తుంది. సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని, సత్సంతానాన్ని, గోసంపదను, కీర్తిప్రతిష్ఠలను, బ్రహ్మవర్చస్సును ప్రసాదించి, అంత్యమున మోక్షమును అనుగ్రహించే కరుణామయి- గాయత్రీమాత, అని అధర్వణవేదం చెపుతోంది.
‘‘నగాయత్త్వాః పరమం మంత్రం న మాతుః పరదైవతమ్’’ గాయత్రికి మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదనునది దివ్యసూక్తి. ‘‘గాయత్రీ ఛందసామహమ్’’ అని ఋక్కులలో గాయత్రీ మంత్రమును నేనని భగవద్గీతలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటంలో గాయత్రీ మంత్ర మహిమ విశేషంగా విశదమవుతుంది.
కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు- సూర్య భగవానుడు. చండ మార్తాండ మండల మధ్యలో, సూర్యునికి అధిష్ఠాత్రి అయి, సూర్యునికి కూడా సత్తాస్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి- గాయత్రి. సకల జగత్తును నియతగా నడిపేది ధర్మం. ధర్మదేవత గాయత్రి. ప్రత్యక్ష కర్మసాక్షి- సూర్యభగవానుడు. మనకంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే- ఆయన భర్గస్సు. ‘సవిత’అంటే మానవ బుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మస్వరూపం. చైతన్యవంతమైన నామరూపాది రుూ విశ్వమే భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తే- గాయత్రీమాత. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాది షట్చక్రములలో ఉంటుంది. ప్రాతఃకాలములో కుండలినీ శక్తితో సవితృ తేజస్సును ధ్యానించినా, జపించినా విశ్వకల్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీ మాత సర్వజనావళికి యిచ్చే రక్ష.
‘‘సవితుర్హిరణ్య గర్భస్యేయం శక్తిరితి’’ గాయత్రి హిరణ్యగర్భుడైన సూర్యుని శక్తియే. కనుక సూర్యశక్తిని, గాయత్రీ మంత్రం ద్వారా జపించి, ఆదిత్యుని, గాయత్రీ తత్త్వంలో ఆరాధిస్తే- ఆరోగ్యప్రదం, మోక్షప్రదం.
బాహ్యప్రపంచంలో వుండే పంచభూతములు (పృధ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము) మన శరీరంలో కూడా ఉన్నాయి. సూర్య తేజస్సు ఉంది. విద్యుత్ అయస్కాంత శక్తివున్నది. పంచభూతములలో సూర్యశక్తి ఉన్నది. అదే ప్రాణము. ప్రాణశక్తి నాడుల ద్వారా ప్రసరిస్తుంది. మన శరీరంలో ముఖ్యమైనవి- ముక్కుకు ఉన్న రంధ్రములు- ఇడాపింగళ నాడులు, వెనె్నముక వద్దనున్న సుషుమ్నానాడి, సూర్యభగవానుడు ప్రాణవాయు ప్రదాత. అందుకే, అగస్త్యమహర్షి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు, దగ్గరలో వున్నప్రాణశక్తి ప్రదాత సూర్యుడు కాబట్టి. అప్పుడే శ్రీరామచంద్రుడు, రావణాసురుణ్ణి సంహరించే శక్తిమంతుడవుతాడు. సూర్యునిలో ఉండే ప్రాణశక్తి- గాయత్రీమాత.
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లటానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో వున్నపుడు, కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంమీద, మనస్సుమీద ప్రభావం చూపుతాయి. అయితే, పుట్టినపుడు, ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో, అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం, మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన విష్ణుమూర్తి నాభి కమలంలోంచే జన్మించాడు. అలాగే గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు, ప్రాణశక్తినిచ్చేది. బయటకు వచ్చిన తరువాత వేరు చేస్తారు. వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీమాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే ప్రాణాయామ, కుండలనీ శక్తి గురించి చెప్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే, బుద్ది వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యాదేవతే గాయత్రీమాత.
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవములలో, శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ ముఖ్యంగా చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప, తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మొదటి చరణమైన ‘తత్సవితర్వరేణ్యం’ శ్రీ దుర్గా సప్తశతిలోని మొదటి భాగం. దానికి అధిష్ఠాన దేవత- మహాకాళి. కాళి- కాల స్వరూపం. అన్నీ ‘కాలం’లోంచి ప్రభవించి, ప్రళయకాలంలో లయమవుతాయి. గాయత్రీ మంత్రంలోని ప్రథమ పాదాన్ని సాధకుడు సంపూర్ణంగా తెలిసికొంటే, ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతిప్రభాతం ఒక సుప్రభావం అవుతుంది. గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం ‘్భర్గోదేవస్య ధీమహి’ అన్నదానికి, శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో వున్నది. దీనికి అధిష్ఠాన దేవత శ్రీమహాలక్ష్మి. స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకునికి పోషణా సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం, సత్వగుణ సంపత్తి ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినమవుతుంది.
గాయత్రీ మంత్రం యొక్క మూడవ చరణం ‘్ధయో యోనః ప్రచోదయాత్’- దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలోని మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. నేనెవరు? అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలిసికోగలుగుతాడు సాధకుడు. ఇక మరో సూర్యోదయం ఉండదు, ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు కనుక. ఇది మహోదాత్తమైన గాయత్రీ మంత్ర విశేషం, శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తిదాయకం. వినాయకచవితి మరుసటి రోజున పంచమి వస్తుంది. దీనిపేరే ‘ఋషిపంచమి’. ఆ రోజు గగనతలంలో తూర్పున సప్తఋషులు ఉదయిస్తారు. సప్తఋషుల కరుణా కటాక్ష కిరణములు భూతలంమీదున్న సాధకులపై ప్రసరిస్తాయి. ఇది బ్రహ్మ విద్యాసాధనకు, మనిషి మనిషిగా మానవత్వ విలువలను పొంపొందించుకొని, దైవీ సంపత్తిని పొందటానికి మార్గాన్ని చూపిస్తాయి. మన యోగ శరీరంలో ఆరు ఆధ్యాత్మిక కేంద్రములు, ఆ పైన సహస్రార చక్రమును వికసింపజేసే గాయత్రీ మంత్రానికి మూలపురుషులు సప్తమహర్షులు. ఋషిపంచమికి స్ఫూర్తి గాయత్రీ ఆరాధన.
ఈ భూమిమీద నివసించే మనకి, కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని జీవించడానికి ఆహారాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కనుకనే ఆదిత్యుణ్ణి అన్నదాత, ఆరోగ్యప్రదాత అన్నారు. తల్లి, తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. అలాగే సూర్యభగవానుడు సమస్త జీవరాశులు, వృక్షలతాదులకు ప్రకృతిలోని అన్నింటికి ఆయన పోషకుడు. పంచభూతములకు ఆయన స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి పూషణుడు అన్నారు. అంతేకాదు, కాలభేదములు ఏర్పడటానికి సూర్యభగవానుడే కారకుడు. ఒక్కక్షణం కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలను, ఋతువులను అనుసరించి సూర్యోదయ, సూర్యాస్తమయములు జరుగుతాయి. కాల నియమాన్ని పాటించాలంటే, సూర్యభగవానుడే ఆదర్శంగా నిలుస్తాడు. సూర్యభగవానుడు, రాకపోతే రోజు గడవదు. ఈ కారణములవలన సూర్యుణ్ణి మనం దైవంగా భావించి ఉపాసిస్తాం. కనుక, కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండమార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి సూర్యునికి కూడా సౌరశక్తిని అనుగ్రహించే జగన్మాత గాయత్రి. ప్రాణికోటికి అన్ని విధములా ఉపయోగపడేది సౌరశక్తి. సకల జగత్తును నియతగా నడిపేది, ధర్మం. ధర్మదేవత చిన్మయ చైతన్య స్వరూపిణి అయిన గాయత్రీమాత.
‘సవితృ’ అంటే ప్రసవించేది అని ఒక అర్థం. సూర్యుడు వర్షాన్ని ప్రసవిస్తున్నాడు. బుద్ధి అనేక విధములైన ఆలోచనా తరంగాలను ప్రసవిస్తుంది. పరమాత్మ తన చైతన్య వివర్తమైన ఈ నామ రూపాలన్నింటినీ ప్రసవిస్తున్నాడు. వర్షం కురవటానికి వెనుక వున్న శక్తి, బుద్ధి చేసే నానావిధములైన ఆలోచనా పరంపరా తరంగాలలోని శక్తి, సృష్టిలోని ప్రతి జీవిలోని శక్తి ఒక్కటే. ఆ శక్తి స్వరూపమే గాయత్రీదేవి. ఆ దేవిని మూడు సంధ్యలలో ప్రార్థిస్తే మంచి బుద్ధిని యిస్తుంది. సద్భుద్ధి ప్రదాయిని గాయత్రి. సూర్యభగవానునిపై ధ్యానము నిల్పి, అతనిలోనున్న చైతన్యశక్తిని ఉపాసించటానికి ఒక మంత్రాన్నిచ్చాడు విశ్వామిత్ర మహర్షి. ఆ మంత్రాన్ని మూడు సంధ్యలలో ఉపాసిస్తే, అనుష్ఠిస్తే, జపిస్తే మానవుని బుద్ధి వికసిస్తుంది, సక్రమమార్గంలో నడుస్తాడు. ఆ త్రిసంధ్యలలో ఉండే శక్తియే గాయత్రీమాత. ఓంకారంతో ఆరంభించబడి, భూః భువః సువః మహః జనః, తపః సత్యం అనే సప్త వ్యాహృతుల్లో వసించే గాయత్రీ మాత, సప్తలోకాలకు వెలుగునిస్తుంది. పగలు-రాత్రి, వెలుగు-చీకటి, జాగృతి-సుషుప్తి- వీటికి సంధికాలంలో, వాటి సంధ్యలో దేవతగా వెలుగొందే సంధ్యదేవత గాయత్రి. భక్తితో, సంపూర్ణ శరణాగతితో, ఆర్తితో ఆర్ద్రతతో గానంచేసేవారిని రక్షించే వేదమాత గాయత్రి. సాంధ్యరాగంలోని శివశక్తి సాయుజ్యం గోచరమవుతుంది. అదే గాయత్రీమాత.
జీవితంలో మర్త్యభాగాన్ని దాటి, అమరత్వాన్ని పొందాలంటే - విద్య, వివేకం, విజ్ఞానం కావాలి. వాటిని కటాక్షించే జ్ఞాన ప్రసూనాంబ గాయత్రి. గాయత్రీ మంత్రంలోని ఇరువది నాలుగు అక్షరాలను మూడు భాగాలుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు సృష్టి, స్థితి, లయలకు సూచితం. మొదటి ఖండం ఋగ్వేదం, రెండవ ఖండం సామవేదం, తృతీయఖండం యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత అయింది. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి, ఇరువది నాలుగువేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రీ మంత్రాక్షర ఘటితమయిన శ్రీమద్రామాయణం, సర్వశక్తి సమన్వితమయిత, కళ్యాణ ప్రదమయింది. అందుచేతనే ఇహపర సాధకమై, జీవన్ముక్తికి సోపానమయింది సీతారాముల కథ.
‘‘నైనం వైద్యు తోహి నస్తి..’’ అన్నది యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, అరుణ మంత్రం. ఎనిమిది విధములైన అగ్నులలో, ‘వైద్యుతాగ్ని’ ఒకటి. ఇది సూర్యతేజస్సు- గాలివానలను తెచ్చే సుడిగుండాలలోను, భూకంపములను తెచ్చు భూమిలోను, లావాజలమును వెదజల్లు అగ్నిపర్వతములలోనూ ఉంటుంది. కనుక, గాయత్రీ పూజతో, శుక్రమయిన సూర్యమండలమును త్రిసంధ్యాకాలంలో ధ్యానించినవారికి సద్బుద్ధినిచ్చి, ధైర్యవంతుల్నిగా చేసేది గాయత్రీమాత. అటువంటి వారి అనుష్ఠాన ప్రభావంతో ఉపద్రవములు తొలగి, లోకకల్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీమాత అనుగ్రహం, మంత్రానుష్ఠాన విశేషం. కాలమే కళ. సూర్యచంద్రులు కాలానికి సారథులు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సుకు అధిపతి. కాల కళాస్వరూపిణి జగన్మాత. ప్రపంచానికే ప్రాణమయిన కాలస్వరూపిణిగా వెలుగొందుతుంది, సంధ్యా దేవత గాయత్రి. చారురూపంలో చంద్రమండలంలో, భైరవాకారంలో సూర్యమండలంలో వుండి, ‘చంద్ర సూర్యాగ్ని సర్వాభా’గా వెలుగొందే తల్లి గాయత్రి.
ప్రాణవాయువు, అగ్ని సంయోగము చేత, ఇంద్రియాధిష్టాతలైన దేవతలచే వాక్కు, నాదముగా సృజింపబడింది. అది వ్యవహారయోగ్యమగునట్లు అకారాది స్వరూపమునొంది, ప్రణవనాదముగా ఉద్భవిస్తుంది. అకార, ఉకార, మకారములు మూడక్షరముల కలయికతో, ఓంకార ప్రణవ నాదము ఏర్పడుతుంది. ఆ ప్రణవ నాదమే వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. ‘అగ్ని’ అధిదేవత అయిన నాదం- వేదములకు ఆధారమయితే, శబ్దతః అర్థతః నిత్యములైనవి వేదములు- వేదమాత, గాయత్రి. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించేటప్పుడు నిశితంగా దర్శిస్తే, ఆ మంత్రంలో స, రి, గ, మ, ప, ద, ని సంగీత సప్తస్వర సుందరులు గోచరిస్తారని పేర్కొంటూ గాయత్రీ మంత్ర విశిష్టతను ‘నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున గాయత్రీ మంత్ర విశిష్టతను జగన్మోహినీ రాగ కీర్తనలో అద్భుతంగా వివరించారు నాదయోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.
ముక్తావిద్రుమ, హేమ, నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్ర్తిక్షణై
ర్యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్థ పర్ణత్మికామ్
గాయత్రీ వరదా భయాంకుశ కశాః శుభ్రం కపాలంగదాయ్
శంఖం చక్ర మదారవింద యుగళం హసె్తైర్వహం తీం భజే
గాయత్రీ దేవతను నేను భుజిస్తాను. ఎలాంటి గాయత్రి అంటే ‘యుక్తాం’ వీటన్నిటితో కూడుకొని ఉన్న మూర్తి. ఏమిటవి? ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖైః, అయిదు ముఖాలున్నాయి, ఆ మాతకు. ఒకటి ముత్యం, ఒకటి పగడం, ఒకటి బంగారం, మరొకటి నీలం (నల్లరాయి), ఇంకొకటి ధవళం - తెల్లరాయి అంటే వజ్రం. ఈ అయిదు రంగుల్లో ఉన్నాయి. ఈ ఐదూ పృధివ్యాది పంచభూతములకు సంకేతం. పంచభూతములే పంచముఖాలు. పంచభూతముల ద్వారా ఆ పరాశక్తి వైఖరీరూపంగా ప్రకటితమై కనిపిస్తుంది. కనుక వాటిని ఆమె ముఖములుగా భావించి వర్ణించాడు. ‘త్రీక్షణైః’మూడు నేత్రాలు తల్లికి. మనోబుద్ధి, అహంకారాలే నేత్రాలు. బాహ్యంగా కనిపించే అయిదు భూతమలు, అభ్యంతరంగా వాటిని కనే మూడు దృష్టులూ, అయిదూ మూడూ కలిసి ఎనిమిది. వాటినే అష్టమూర్తులన్నారు. అమ్మవారికి అష్టమూర్తి అనే నామము ఉన్నది. పరమశివుడూ అష్టమూర్తే. సద్యోజాత, ఈశాన, వామదేవ, అఘోర, తత్పురుష- అయిదు ముఖాలు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడూ- వెరసి ఎనిమిది అష్టమూర్తి. నాద తను మనిశం, నమామి యే మనసా శిరసా అన్నాడు త్యాగయ్య. అమ్మకు, అయ్యకు భేదం లేదు. ఈ విధమైన తత్త్వార్థాన్ని మనకు ఆ గాయమ్రంత్రార్థంలో వివరించబడినాయి. మంత్రం సూర్యపరంగా ఉంటుంది. దృష్టి నిలుపుకోవాలిసింది గాయత్రీమాత మీద. ఇదీ గాయత్రీ ఆరాధన, మంత్రానుష్టానములోని విశిష్టత. ఏ సమయంలో ఏ మంచి పని చేయాలో, ఆ సమయంలో ఆ పనిని బద్ధకించకుండా చేస్తే, మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల్ని జీవితకాలమంతా అనుభవించవచ్చు. అలా కాకుండా ఆ సమయంలో ఆ మంచి పనిని చేయకుండా, బద్ధకిస్తే, జీవితమంతా దుష్ఫలితాల్ని అనుభవించాల్సి వస్తుందని ‘యావై ప్రజాభ్రాగ్గే శ్యనే్త..’ అనే యజుర్వేద మంత్రంతో హెచ్చరిస్తోంది, సంధ్యాదేవత, కాలానికి రాణి గాయత్రీమాత.
సంధ్యాదేవీం సావిత్రీం వరగాయత్రీం సరస్వతీం భజేహం
సంధికాలములు మూడు. ప్రాతఃకాలము, మధ్యాహ్నకాలము, సాయంకాలము. ఇదే జీవితములో జన్మ మధ్య అస్తమయ కాలములు. సంధ్యా సమయంలో ప్రకృతిలో ఒక తెలియని అదృశ్యశక్తి అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో చేసిన జప ధ్యానాదులు విశేష ఫలితాల్నిస్తాయి. ఉదయం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయం సమయంలో సరస్వతీ రూపంలో ధ్యానిస్తారు అని సంధ్యాదేవత గాయత్రీమాతను గురించి, దేవక్రియా రాగంలో ముదావహంగా వర్ణించాడు- ముత్తుస్వామి దీక్షితులు. ఇది గాయత్రీ పూజకు దీప్తినిస్తుంది. కాలస్వరూపాన్ని, ప్రాముఖ్యాన్ని తెలిసికొని, సకాలంలో సత్కార్యాల్ని ఆచరించి సత్ఫలితాలు పొంది, ఫలసిద్ధిని లోకకల్యాణానికి ఉపకరించాలని హెచ్చరిస్తోంది సంధ్యాదేవత, సద్బుద్ధి ప్రదాయిని, గాయత్రీమాత.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464