మెయిన్ ఫీచర్

అఖిల భువనసాక్షి అన్నపూర్ణాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటిలో ‘వెలుగు’ ఉంది. నీటిలోనే ‘రసం’ ఉంది. అమృతము కూడా జలములలోనే వుంది. బ్రహ్మపదార్థం ఉంది. ఉదకములకు మూలమైన అగ్ని వెలుగునిస్తుంది. వెలుగుకు వెలుగయి, నెలవులకు నెలవైన పరంజ్యోతి ‘అన్నపూర్ణాదేవి’. మరోజన్మ లేకుండా, జన్మరాహిత్యాన్ని పొందించే జ్ఞానజ్యోతి- అన్నపూర్ణాదేవి. స్థూలంగా సేవిస్తే సాకారంలో, సూక్ష్మంగా భావించి ధ్యానించి ఆరాధిస్తే నిరాకారంగా సాక్షాత్కరిస్తుంది- జగన్మాత అన్నపూర్ణాదేవి. ధ్యాన, ఆవాహన, అర్ఘ్య, పాద్య, ధూప దీప నైవేద్యాది షోడసోపచారములు స్వీకరించి ఆనందిస్తుంది. దహరాకాశంలో ‘రస’ స్వరూపిణిగా ధ్యానం చేసే మానసిక పూజకు దరహాసం బంధిస్తుంది. ఎవరు ఎలా చిందిస్తే, స్మరిస్తే వారికి ఆ విధంగా సాక్షాత్కరిస్తుంది. ప్రాణికోటిలోని ప్రాణశక్తి ప్రదాయిని అన్నపూర్ణామాత.
జగన్మాత ఆత్మస్వరూపిణి. కనుక సాధనలో దృష్టిని అంతర్ముఖం చేస్తే, ధ్యానయోగం సిద్ధిస్తుంది. అపుడు ‘శక్తి’ సహస్రారాంతర్గత చంద్రమండలం చేరగానే ఆనందామృత వర్షిణి, అమృతధారలు వర్షింపచేస్తుంది. చిన్మయ చిచ్ఛక్తి రూపం దర్శనమవుతుంది. ఆ పరంజ్యోతి స్వరూపమే అన్నపూర్ణాదేవి. కనుకనే అన్ని దానములోకి అన్నదానం గొప్పదన్నారు. ప్రయాణ సౌకర్యములు అంతగాలేని రోజులో, ఎడ్లబళ్ళమీద ప్రయాణించేవారు. మధ్యాహ్న సమయం కాగానే ప్రక్క ఊళ్ళోవాళ్ళు ఎదురేగి వారిని సాదరంగా ఆహ్వానించి, ఆ పూట అన్నం పెట్టి పంపించేవారని పెద్దలు చెప్పారు. ఆ కుటుంబములన్నీ వంశపారంపర్యంగా, ఈనాటికి అన్నవస్త్రాలకు లోటులేకుండా జీవిస్తున్నారు. ఇది అన్నపూర్ణాదేవి కటాక్షం. కాశీక్షేత్రంలో అన్నదానం విశేషఫలాన్ని యిస్తుందని, వారణాశిలో అనేక ధర్మసత్రములు కట్టించి విశేషంగా అన్నదాన కార్యక్రమములను నిర్వహించటంలోగల ఆంతర్యమిదే.
శబ్దాత్మికే శశికలాభరణార్థ దేహే
శంభోరురుస్థ్సల నికేతన నిత్యవాసే
దారిద్య్ర దుఃఖ భయ హారిణి కాత్వదన్యా
భిక్షాం ప్రదేహి గిరిజేక్షుభితాయ మహ్యం
అన్నపూర్ణా స్తుతి- ఆదిశంకరాచార్యులు
నాదరూపమయిన శబ్దమే స్థూల శరీరం. చంద్రకళ ఆభరణంగాగల అర్థరూపుడైన దేవుని అర్థాంగి, స్వరలోకాత్ముడైన పరమశివుని వక్షస్థలమే అనగా అంతర్గత సూర్యమండలమే నిత్యనివాసంగా స్ఫురించు తేజోమయి, దారిద్య్రాన్ని, దానివలన కలిగే దుఃఖాన్ని తద్వారా కలిగే భయాందోళనల్ని పోగొట్టే అమృతవర్షిణి- అన్నపూర్ణాదేవి అని, శ్రీ శంకర భగవత్పదులు అన్నపూర్ణా స్తుతిలో ప్రస్తుతించారు. ఎవరి గృహంలో అన్నమును అందరూ తింటారో, ఎవరు ఇతరులకు తనకున్నదాంట్లో కొంత అన్నదానం చేస్తారో- వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వారి ఇళ్ళలో సుఖశాంతులు వెలసి, గృహం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంగా భాసిల్లుతుంది. వీటిని ప్రసాదించే జగన్మాత అన్నపూర్ణాదేవి అని శ్రుతి వివరించింది.
అన్నమస్మీత మృజ్మిత అహం వో జీవనప్రదః
- యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం.
ప్రకృతి స్వరూపం ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శరీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్భుద్ధి భిక్షనొసగి జ్ఞాన పుష్ఠివంతులుగా నొనర్చు కరుణామయి, శరదృతువులో విశేషంగా అర్చించబడుతున్న మూలాప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, భిక్షాందేహిచ పార్వతీ’’
జ్ఞానవైరాగ్య స్థితి ప్రదాత్రి అన్నపూర్ణాదేవి. ఎన్నికోట్లమంది జనించినా అందరికీ అన్నం పెడుతుంది, అయినా ఎల్లప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. ఆమెయే తల్లి, తండ్రి, దైవం అని చెప్తోంది అన్నపూర్ణాదేవి.
అహమన్న మహమన్న మహమన్నమ్
అహమన్నారో హమన్నారో హమన్నాదః
ఆదిత్యా జ్ఞాయతే వృష్టిః వృష్టేరాన్నః తతః ప్రజాః అని, స్మృతులు. సూర్యునివలన మంచి వర్షములు, వర్షములవలన మంచి అన్నము, అన్నమునుండి ప్రజలు పుడుతున్నారు అని, అన్నమును ముందు సూర్యునికి నివేదించి తర్వాత ఆరగించాలని భోధిస్తున్నాయి. సూర్యునిలోని శక్తియే అన్నపూర్ణాదేవి.
అన్నం వై ప్రజాపతి స్తతో హవై
తద్రేతస్త స్మాది మాః ప్రజాః ప్రజాయంత ఇతి- ప్రశ్నోపనిషత్
ఈ ప్రాణికోటులన్నీ ఎక్కడనుంచి పుడుతున్నాయి? అన్నది ప్రశ్న. దానికి బదులుగా మహర్షి సమాధానమిచ్చారు. పదార్థము, శక్తి అన్న రెండూ సృష్టికి మూలకారణం. తదుపరి, సృష్టియొక్క స్థితిక్రమంలో, పదార్థము శక్తుల అభివ్యక్తము, విధులను స్థూలంగా వివరిస్తూ- మరణానంతరం జీవుడు, తన కర్మ జ్ఞానాలను అనుసరించి రెండు మార్గాలను అనగా దేవయానం, పితృయానములగు, భౌతిక ఆధ్యాత్మిక మార్గములను వివరించారు. కాలాన్ని, కాలవిభాగాలైన రాత్రింబవళ్ళు, మాసములు, ఋతువులు, ఆయనములు, సంవత్సరములు మొదలగువాటిని వర్ణించి కాలంతో సహా అన్నీ పదార్థ శక్తుల ఫలాలేనని చెప్పారు. మరణానంతరం చంద్రలోకానికి పోయిన జీవులు, తమ పుణ్యఫలం తీరిపోగానే పరిశిష్టమైన కర్మతో, వర్షధారలు, చంద్ర కిరణముల ద్వారా, పంట పొలములందలి సస్యములలో ప్రవేశించి, అన్నరూపంగా జీవులలో ప్రవేశించి, స్ర్తిపురుషులలో శోణితము, శుక్లములుగా మారుతారు. అపుడు జీవోత్పత్తి జరుగుతుంది. ఇలా ప్రాణిజాలమంతా జన్మ ఎత్తుతున్నాయి. కనుక, జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.
ఈ విషయానే్న యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్య కోపనిషత్, భగవద్గీత మనకు అందజేస్తున్నాయి.
‘‘నాన్నోదక సమం దానం దీనేభ్యోదీయ తామన్నం యది ధర్మమభిష్యసి’’ దీనులకు అన్నము ఉదకము దానము చేయటం- ధర్మము. దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న ఉదక దానములకు మించిన దానము లేదని అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది, మహాభారతం.
యజ్ఞకృత్ యజ్ఞ గుహ్యమన్న మన్నాద ఏవచ- విష్ణు సహస్రనామం. సకాల వర్షమలకు, అన్నసమృద్ధికి, సర్వజన ఆరోగ్య భాగ్యాన్ని కాంక్షిస్తూ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. సృష్టి, లయలనే విశిష్టములైన యజ్ఞాలు నిర్వహించే స్వామి- యజ్ఞకృత్. యజ్ఞ్ఫలాన్ని ప్రసాదించే స్వామి- యజ్ఞాంతకృత్. యజ్ఞాలలో కెల్ల జ్ఞాన యజ్ఞ స్వరూపుడు స్వామి. యజ్ఞంలోని పరమార్థమైన పరబ్రహ్మతత్త్వం తానేయైన స్వామి, యజ్ఞగుహ్యుడు. సకల భూతరాశికి ఆహారము తానే అయిన పరమాత్మ ‘అన్నస్వరూపుడు’. ప్రాణికోటి రూపంతో ఆహారాన్ని స్వీకరించేది కూడా ఆ పరమాత్మే. అన్నము తానే, ఆహారాన్ని స్వీకరించేది, పరమాత్మే. జీవులకు అన్నం పెట్టడం, స్వామికి నివేదన చేయటమే, జీవులు పరమాత్మస్వరూపులు. ఆ పరమాత్మలోని మహాశక్తి- అన్నపూర్ణాదేవి. అనంత విశ్వంలోని ప్రతి పదార్థంలోనూ ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి- ఆదిపరాశక్తి మూలం. అనంతమైన ఆదిపరాశక్తి అన్ని పదార్థాలలో విభిన్న రూపాలలో, నామములతో ప్రతిఫలిస్తూ ఉంటుంది. పరాశక్తి ఎన్ని రూపాంతరాలు చెందినా, ఆమెకు మించిన శక్తిలేదు. ఆ శక్తిని కనీసం అర్థం చేసికోవాలంటే ‘శక్తి’ అనుగ్రహించాలి. దీనికి అకుంఠిత దీక్ష ఉండాలి. దక్షతతో తల్లిని అర్థం చేసికోవాలి. అర్థం చేసికొనే మార్గాన్ని చూపమని, ఆ తల్లినే ప్రార్థించాలి. దారి చూపించే మాత- అన్నపూర్ణాదేవి.
‘‘తస్మాద్యా ఏతస్మా దాత్మన ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యపృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్ అన్నాత్పురుష స వా ఏష పురుషోన్నరసమయః’’
పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము జలమునుండి భూమి, భూమినుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణికోటి పుడుతున్నాయి. కనుక ప్రాణికోటి అంతా అన్నరసమయమయి, అన్నరసము నిండియున్నది- అన్నపూర్ణ. సకల ప్రాణుల స్వరూపం, అన్నపూర్ణాదేవి.
‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్వముదశ్చతే
పూర్ణస్య పూర్ణామాదాయ పూర్ణమే వా వశిష్యతే’ కనిపించనవన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీ కూడా ఆ ‘శక్తి’చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచము ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా విశ్వమంతా దానినుండి వచ్చినా, ఇంకా ఆ శక్తి పూర్ణమే. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.
అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్ ప్రాణోవా అన్నమ్
శరీర మన్నాదమ్ ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్
శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేత దన్నమనే్న ప్రతిష్ఠితమ్
స య ఏతదన్నమనే్న ప్రతిష్ఠితం వేద పతితిష్ఠతి
అన్నవానన్నాదోభవతి, మహాన్ భవతి
ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చ సేన, మహాన్ కీర్త్యా’’
- భృగువల్లి
అన్నమును నిందించరాదు. అనగా భక్తితో గౌరవముతో ఆహారమును భుజించాలి. అంటే ఏమిటీ అర్థం? అన్నం నేపథ్యంలో ఎంతో దైవశక్తి ఉన్నది. కావలసినంత మాత్రమే వడ్డించుకొని, భుజించాలి. పారేయకూడదు. దీనిని ఒక వ్రతముగా ఆచరించాలి. ఎందుకంటే అన్నము వలననే ప్రాణము ఉత్పత్తి అగుట, పోషించబడటు జరుగుతుంది. శరీరమే అన్నాదము. అనగా శరీరము అన్నముపై ఆధారడి ఉన్నది. ప్రాణమునందు శరీరము, శరీరమునందు ప్రాణము ప్రతిష్ఠితమై ఉన్నాయి. కనుక, ప్రాణ శరీరములు రెండును ‘అన్నము’నందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అన్నము అంటే అన్నపూర్ణాదేవి శక్తి. తల్లి అనుగ్రహముతో పుత్ర పౌత్రాభివృద్ధి పశు సంపద, బ్రహ్మవర్చస్సు కలిగి, ఆరోగ్యాన్ని పొంది, కీర్తిప్రతిష్ఠలు పొందుతాడు. ‘‘అన్నం బహుకుద్వీత..’’ అన్నమును సమృద్ధిపరచుము. దీనిని వ్రతముగా పాటించాలి. అనగా ఆహారము ధ్యానములను ప్రజలకందరకు సరిపోయేటట్లు సమృద్ధిగా పండించుకోవాలి. ఈ కృషిలో అందరూ పాలు పంచుకోవాలి. భూమినుండి అన్నమునకు సంబంధించిన పంట పండుచున్నది. ఆకాశము భూమిపై గల జలమును సూర్యరశ్మిద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందిస్తోంది. ఇదంతా కరుణామయి అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ తల్లిని స్వార్థరహితంగా ప్రార్థిస్తే, సర్వసంపదలను ప్రసాదిస్తుంది.
లోకంలో చాతకపక్షి ఒకటి ఉంది. దానికి దాహం వేస్తుంది. భూమండలంలో జలాశయాలలో తియ్యని నీరు పుష్కలంగా ఉంటుంది. ఆ నీరు త్రాగితే దాహం తీరుతుంది. అయినా చాతకపక్షి ఆ నీటివైపు తొంగిచూడదు. వర్షాకాలం రావాలి, అప్పటి మేఘమే కురియాలి. అప్పుడది తన దాహం తీర్చుకుంటుంది. దాని దృష్టి మేఘంవైపు ఉన్నా, ఆ మేఘం కురుస్తుందా కురియదా, దాహం తీరేనా, అని దానికి శంక. దాని శంకతో నిమిత్తం లేకుండా, మేఘం మాత్రం తియ్యని జలాలను, లోకంలోనూ చాతకపక్షి నోట్లోనూ కురుస్తుంది. అలాగే భక్తుడు తనను తలిస్తే చాలు తనవైపు చూస్తే చాలు, జగన్మాత అన్నపూర్ణాదేవి దయామృతాన్ని వర్షిస్తుంది. చాతకం అమ్మ కృపకై తహతహలాడే భక్తునకు సంకేతం. మేఘం సముద్రంలోని ఉప్పునీరు తీసుకొని అమృత జలాన్ని ఇస్తుంది. అలాగే మేఘంలాగా అన్నపూర్ణాదేవి, భక్తుల కష్టాలను స్వీకరించి, సుఖ సంతోషామృతాలను పంచుతుంది. మేఘం మాతృత్వ వైభవానికి సంకేతం. అన్నపూర్ణాదేవి కృపాకటాక్షములను తెలియపరిచే ఈ విషయాలను ఆదిశంకరులు, అనందలహరిలో 9వ శోకంలోను, సౌందర్యలహరి 57వ శ్లోకంలోనూ అద్భుతంగా మనకు తెలియపరిచారు. అన్నపూర్ణాదేవి పూజకు, ఆదిశంకరాచార్యులవారి ఈ రెండు శ్లోకములు సంపూర్ణ స్ఫూర్తినిస్తాయి. దీపావళినాడు కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవిని, స్వర్ణ ఆభరణములతో అలంకరించి, దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే ‘వెలుగు’. అందుకే వారణాసికి ‘కాశీ’ అని పేరు వచ్చింది. అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసికొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని హెచ్చరిస్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464