మెయన్ ఫీచర్

‘ప్రాంతీయ నియంతలూ’.. తస్మాత్ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార పార్టీల్లో విధాన నిర్ణయాలపై అంతర్గత చర్చ లేకపోవడం, పార్టీ అధినేత ఏకపక్షంగా వివిధ అంశాలను ఆమోదించడం ప్రజాస్వామ్యానికి నష్టదాయకం. ఈ ప్రమాదకర ధోరణి పలు ప్రాంతీయ పార్టీల్లో బలంగా వేళ్లూనుకుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. నిన్న మొన్నటివరకూ తమది ప్రత్యేక మైన పార్టీ, తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే బీజేపీలో కూడా అధికారాలు కేంద్రీకృతమవుతున్నాయి. 2009 సంవత్సరానికి ముందు, ఆ తర్వాతి పరిస్థితులను పోల్చితే బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గుముఖం పడుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల్లో ప్రజాస్వామ్య పంథాకు తిలోదకాలివ్వడం వల్ల నియంతృత్వం రాజ్యమేలుతుంది. భజనపరులకు పెద్దపీట వేయడంతో సమర్థులు తెరమరగవుతారు. అధికారంలో ఉండే ముఖ్యనేత తన సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పెత్తందార్ల ఆధిపత్యం పెరుగుతుంది. ఈ తరహా అప్రజాస్వామిక ధోరణులు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల్లో పెచ్చుమీరాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్, ఒడిశాలో బీజేడీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, అన్నా డిఎంకే వంటి ద్రవిడ పార్టీలు, మహారాష్టల్రో శివసేన, బిహార్‌లో జేడీ యూ, ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఇవన్నీ కుటుంబ పార్టీలే. ఈ పార్టీలకు అధికారమే పరమావధి. ఈ పార్టీలకు ప్రత్యేకంగా ఒక సిద్ధాంతం ఉండదు. ఈ పార్టీల అధినేతలు చెప్పిందే రాజ్యాంగం. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనలకు పదును పెట్టి అమలు చేస్తారు. ప్రజాధనం దుర్వినియోగమవుతుందనే ధ్యాస ఉండదు. ప్రజల సెంటిమెంట్‌ను అవమానించిన వ్యక్తులను అందలమెక్కిస్తారు. ప్రభుత్వ ఖజానా నుంచి లక్షలాది రూపాయల సొమ్మును తమ అనుచరులకు జీతభత్యాల కింద చెల్లిస్తారు. అధికారంలో ఉన్న ఈ నియంతల చుట్టూ బలమైన కోటరీ ఉంటుంది. ఆ కోటరీలో సంబంధిత సామాజికవర్గ పెద్దలు, తానా అంటే తందానా అనే అధికారులు, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అధినేత మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తులు ఉంటారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటి 20 ఏళ్లు కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఎంతోకొంత ఉండేది. ఇందిరా గాంధీ కేంద్రంలో పగ్గాలు చేపట్టాక క్రమంగా అధికార పార్టీల్లో అధికార కేంద్రీకరణ, నియంతృత్వ ధోరణులు పెరిగాయి. ఈ జబ్బు అన్ని పార్టీలకూ స్వైన్‌ఫ్లూ తరహాలో వ్యాపించింది. పార్టీల వారీగా విశే్లషిస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పటికీ కుటుంబ పెత్తనంతో కొట్టుమిట్టాడుతూ, ఆ ఊబి నుంచి బయటకు రాలేకపోతోంది. ఎంత సేపూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నామ జపం తప్ప ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్లి పనిచేస్తున్నారా? గాంధీ యేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే పార్టీ బాగుపడుతుందని రాహుల్ మంచి మాట చెప్పినా కాంగ్రెస్‌లోని కోటరీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ కమల్‌నాథ్, పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌లు మాస్ లీడర్లుగా ఎదిగారు. వీరిని కదిపే సాహసం కాంగ్రెస్ అధినాయకత్వం చేయలేదు. బీజేపీని ప్రతి అంశంలో తప్పుబట్టడం వల్ల ప్రజలకు దూరమవుతామని కాంగ్రెస్‌లో చాలా మంది మేధావులు హైకమాండ్‌కు సూచించినా ప్రయోజనం లేదు. 370వ అధికరణ, త్రిపుల్ తలాక్ అంశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ వేసుకుంది. బీజేపీలో కూడా నియంతృత్వ ధోరణుల ప్రభావం కనపడుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం వచ్చేసరికి ప్రధానమంత్రి సుప్రీం. పార్టీ వ్యవహారాల్లో అమిత్ షా నెంబర్ వన్. ఈ తరహా సెటప్ అప్రజాస్వామికమే. పార్టీ వ్యవహారాల్లో అమిత్‌షా చెప్పింది మోదీ వినాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. ఈ కాలవ్యవధిలో జనం ఆశించినట్లుగానే ఆయన కొన్ని మంచి పనులు చేశారు. ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగా భావించి పెద్ద సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులు కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలకు కొదవలేదు. అధికార వ్యవస్థలో , పార్టీలో రాజ్యాధికారం కేంద్రీకృతం కావడం వల్ల నియంతృత్వం ప్రబలింది. తాత్కాలికంగా ఇది బాగుండవచ్చు. ఈ తరహా పాలన ప్రమాదకరమైనది. మంత్రివర్గంలో సామాజిక వర్గాల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో ఒక వర్గానికి అతిగా ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిన పక్క రాష్ట్రాల వారికి కీలక పోస్టులు అప్పగించడం కూడా చర్చనీయాంశమైంది. విద్యుత్, ఇసుక విషయంలో జగన్ తప్పటడుగులు వేసినట్లే కనపడుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నట్లుగా పెద్ద మెజారిటీతో ఎక్కువ సీట్లు జగన్‌కు రావచ్చు. తనకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరనుకుంటే భంగపాటు తప్పదని హెచ్చరించారు. 1994లో తెదేపా అధినేత ఎన్టీరామారావుకు రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. 9 నెలల్లో చంద్రబాబు మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టుకుని తిరుగుబాటు చేస్తే జనం ఆమోదించారు. ఎక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. 1984లో ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ దింపేస్తే జనం తిరగబడ్డారు. జనం ప్రతి రోజూ తమ అసంతృప్తిని, వ్యతిరేకతను వెళ్లగక్కరు. సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారు.
సీఎం జగన్ ఏపీకి ఎంతో చేస్తున్నట్టు చెబుతున్నా- రాజధాని అమరావతి భవిష్యత్తు, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమలో హైకోర్టు, 24 గంటల కరెంటు, అందుబాటులో ఇసుక వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనంత వరకు ఆయన ఇంకా మొదటి మెట్టుపై ఉన్నట్లే. ప్రభుత్వం బ్రాందీ షాపులను నిర్వహించినా, మద్య నిషేధాన్ని అమలు చేసినా జనం పట్టించుకోరు. అధికార పార్టీలో కుమ్ములాటలు పెరుగుతున్నా ఆయన నియంత్రించలేకపోతున్నారు. పా ర్టీకి, ప్రభుత్వానికి ఒకే అధినేత ఉంటే ప్రజాస్వామ్యం లోపించి, వ్యక్తిస్వామ్య వ్యవస్థ రాజ్యమేలడమే తప్పదు. టీడీపీ ఇదే దారిలో పయనించి కోలుకోలేని స్థితికి చేరుకుందనే సత్యాన్ని వైకాపా అధినాయకత్వం మరవరాదు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లు వచ్చినా, భూ సంస్కరణలు అమలు చేసిన పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేవరకూ పార్టీలో ఆయన వ్యతిరేకులు విశ్రమించలేదు.
ఇద్దరు సీఎంలు కలిస్తే వారి చర్చల సారాంశం తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజలకు సహజంగా ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ జరిపిన చర్చలపై తగిన సమాచారాన్ని మీడియాకు ఇస్తే సరిపోతుంది. భవిష్యత్తులో ఈ తరహా లోపాలు పునరావృతం కాకుండా సలహాదారులు చూసుకోవాలి. కేసీఆర్, జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఆ నాలుగు ముక్కలే నోట్ రూపంలో ఇస్తేసరిపోతుంది. ఈ మాత్రం దానికి భేషజాలు అక్కర్లేదు. కొన్ని విషయాలను జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ, ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రంలో ఉండే పార్టీలు తూట్లు పొడుస్తున్న తీరుపై వివరించారు. రాష్ట్రం నుంచి చెల్లించే పన్నులు ఎక్కువ, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం తక్కువ అంటూ ఆయన గణాంకాలతో పాటు వివరించారు. ప్రాంతీయ పార్టీల వల్లనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తన అభిప్రాయం చెప్పారు. కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఔదర్యంతో వ్యవహరించారు. తెలంగాణ బిడ్డలకు, ఉద్యమంలో పనిచేసిన వారికి మంచి పోస్టులు ఇచ్చి సత్కరించారు. పదవుల పందేరంలో అందరికీ న్యాయం చేయకపోవచ్చు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, సంప్రదాయాల పరిరక్షణ విషయంలో కేసీఆర్‌కు సాటి వచ్చే నాయకులు సమకాలీన చరిత్రలో ఎవరూ లేరని చెప్పవచ్చు. ఏపీకి కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితుల్లో బీజేపీపై దండయాత్ర చేసే స్థితిలో జగన్ లేరు. అదే కేసీఆర్ కేంద్రంతో అవసరమైతే వియ్యం లేదంటే కయ్యానికి సిద్ధంగా ఉంటారు.
వ్యక్తుల కంటే వ్యవస్థలు మిన్న. కాని దురదృష్టవశాత్తూ ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారాల చలాయించే నేతలు పెరిగారు. అధికారాలు కేంద్రీకృతం కావడంతో రాజకీయ పార్టీలకు దీర్ఘకాలంలో నష్టం ఎక్కువ. ఉదాహరణకు ఏపీకి సంబంధించి టీటీడీ బోర్డులో గతంలో కళంకితుడిగా ముద్రపడిన వ్యక్తికి మళ్లీ పదవిని కట్టబెట్టడాన్ని ప్రజలు గమనించారు. ఇటువంటి నియామకాలు జరగకుండా చూసుకుంటే మంచిది.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నియంతృత్వ వైఖరిని విడనాడి మునిగిపోయిన తన పార్టీకి చేపట్టాల్సిన మరమ్మతుల గురించి ఆలోచించడం లేదు. ముందుగా సొంత ఇంటిని బాగు చేసుకోవాలి. అక్రమ కట్టడమని చెబుతున్న కరకట్ట ఇంటిని ఖాళీ చేసి జనంలోకి వస్తే తప్ప చంద్రబాబుకు పూర్వపు వైభవం వచ్చే అవకాశం ఉండవచ్చు. కరకట్ట ఇల్లు చంద్రబాబు సొంతం కాదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు కొత్త ఇంటికి మారితే తప్పకుండా ఆత్మరక్షణ వైఖరి నుంచి బయటపడవచ్చు. కాగా, ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతే అవి ఎక్కువ కాలం మనుగడ సాధించలేవు. నేను అనే అహం వల్లనే ఒక్కోసారి నాయకులు, వారితో పాటు సంబంధిత రాజకీయ పార్టీలు దెబ్బతింటాయి. తమిళనాడులో అన్నాడీఎంకే, బిహార్‌లో ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీల పరిస్థితి ఏమిటి ? ప్రాంతీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ఆలోచనా విధానాలను మార్చుకోని పక్షంలో స్వీయ తప్పిదాలతో ఇబ్బంది పడక తప్పదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097