మెయిన్ ఫీచర్

జయజయహే మహిషాసురమర్దిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవునిలో తొమ్మిది విధములైన దుష్ట ప్రవృత్తులు ప్రవేశించినపుడు అతడు పశువుగా రాక్షతత్వంతో ప్రవర్తిస్తాడు. అపుడు అతని హృదయంలో మంచి చెడుల మధ్య పోరాటం సాగుతుంది. తామసిక రాజసిక ప్రవృత్తులు విలయతాండవం చేస్తాయి. తొమ్మిది మంది అసురులు తొమ్మిది రకాలైన దుష్ట ప్రవృత్తులకు ప్రతీకలు. ఈ అసుర ప్రవృత్తిని అణచివేసే మహాశక్తి మహిషాసురమర్దిని. జగన్మాతకు ఎవరిపైనా విపరీతమైన అనురాగంలేదు. అలా అని విరోధమూ లేదు. సాధకులు తనపై చూపే అనురాగాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలుగా మార్చి వారికే తిరిగి పంచిస్తుంది. జగన్మాతకు గర్వం లేదు, దిగులూ లేదు, అహంకారం లేదు, మోహంలేదు, మమకారం లేదు, పాపంలేదు, కోపం లేదు, లోభం లేదు, సందేహం లేదు. మానవునిలోని వికారాలన్నిటిని నశింపజేసే ఆకారం, సగుణ రూపం మహిషాసురమర్దిని స్వరూపం.
తల్లికి సంకల్పమేకాని వికల్పం లేదు. దేవి సంకల్పం నెరవేరుతుంది. ఆమెకు తనవాళ్లు, పరాయివాళ్ళు అనే భేదభావం లేదు. ఆమెకు నాశనం లేదు. తల్లి నిత్య సత్య స్వరూపిణి. మృత్యువును నశింపజేసిన ముక్తేశ్వరి- జగన్మాత. తాను చేసిన మేలుకు బదులు కోరదు. జగజ్జననికి సాటి ఎవరూ లేరు. ఆమెకు ఆమే సాటి. అన్ని మంత్రాలు, అన్ని యంత్రాలూ అన్ని తంత్రాలూ- మహాశక్తిని ఆశ్రయించే ఉంటాయి. సర్వవేదశాస్తమ్రుల సారము తల్లి తత్త్వము. తల్లి అనుగ్రహం లభిస్తే సాధనలన్నీ కరతాలమలకమే. ‘నదీనాం సాగరోగతిః’ అని, ఎక్కడినుండి ఎక్కడకు ప్రవహించినా, నదులన్నీ చివరకు సముద్రంలో చేరినట్లు, మంత్ర యంత్రతంత్రములన్నీ చివరకు జగన్మాతనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని.
మనస్సును లోకోత్తరమైన మహోన్నత స్థాయికి తీసుకొనిపోయే మనోన్మణికి, మంత్రాలతోనిమిత్తం లేదు. మంచి మనసుతో, సంపూర్ణ శరణాగతితో స్వార్థరహితంగా నలుగురికీ ఉపకరించేటట్లుగా చేసే ఏ పనికైనా తల్లి సహకరిస్తుంది, చేయూతనిస్తుంది, ఆశీస్సులందిస్తుంది. ఇదే నిజమైన శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, శ్రీసహస్రనామ పారాయణ. ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకొని, మనసును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, ధర్మమార్గంలో ఆనందానుభవాన్ని పొందాలే తప్ప, విశృంఖలంగా కామదాహాన్ని తీర్చుకుంటానికి ప్రయత్నిస్తే పతనమవుతారని హెచ్చరించే మహాశక్తిమహిషాసురమర్దిని.
ఈ విషయానే్న యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం పేర్కొన్నది. ‘‘పునర్మాయై త్విస్త్రాయం పునరాయః పునర్భాగః పునర్ర్బాహ్మణ మైతుమా పునర్ఘరణ మైతుమా యనే్మద్యారేతః పృథివీమస్కాన్ యదోషధీరస్య సపర్యదాపః ఇదం తత్పునరాదశీ దీర్ఘాయుష్యాయ వర్చసే, యనే్మరేతః ప్రసిచ్యాతే యన్మ ఆజాయతే పునః తేనమామమృం కురు తేన సుప్రజసం కురు’’- స్ర్తి, పురుషులిద్దరూ ధర్మబద్ధమై సంసారిక జీవనాన్ని గడిపి, సత్సంతానాన్ని, తేజస్సును, దీర్ఘాయుష్షును పొందమని హెచ్చరిక చేస్తోంది వేదమాత.
సృష్టికర్త బ్రహ్మదేవుడికి, పాలించే విష్ణువుకి, లయకారకుడైన మహారుద్రునికి, సమస్త విశ్వానికి తల్లి. కనుకనే ఆమె జగన్మాత. విశ్వపోషణభారం- తల్లిదే. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ఆర్తితో తల్లితో విన్నవించుకుంటే, వారి కష్టాల్ని కడతేర్చగల మహాశక్తి స్వరూపిణి జగజ్జనని. దయ, దర్పం, కరుణ, కాఠిన్యం, జగన్మాత సాకారంలోని నిరాకార తత్త్వాలు, విశాల కువలయాన్ని ఆలయంగా చేసికొని వెలుగొందే భువనేశ్వరీదేవి తత్త్వాన్ని అవగాహన చేసికోవటం అంత తేలికైన విషయం కాదు. నిశ్చలమైన చిత్తంతో స్మరిస్తే, ఏకాగ్రతతో దీక్షగా ఆరాధిస్తే, ఈ విశ్వమంతా ఆమె చిచ్ఛక్తి స్వరూపమేనని గోచరమవుతుంది. ఇదే భక్తులకు అమితానందాన్నిస్తుంది. ఆనందాన్ని పంచి యిచ్చే జగన్మాత- ఆనందదాయిని అయింది.
జగన్మాత తత్త్వాన్ని అవగాహన చేసికోవటానికి పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేద్రియ జంటలు, మనస్సు బుద్ధి, అహంకారము, మహత్తు అనే ఇరువది నాలుగు సోపానాలు. తల్లి తత్త్వాన్ని అర్థం ఆ తత్త్వాసని సమీపానికి చేరుకోగలుగుతారు. చివరకు ఆ తత్త్వ వెలుగును పొంది, సోహం భావంతో ‘తత్త్వమసి’ అయి, వెలుగు శక్తిలో లీనం అయిపోతారు. ఇదే శక్తి ఆరాధనలో సాధకుడు పొందే క్రమ ముక్తిమార్గం. ఈ మంచి మార్గాన్ని చూపించే జనని మహిషాసుర మర్దినీదేవి.
ఈ తత్త్వానే్న శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సములలో తొమ్మిదో రోజున పూజించే ‘మహిషాసుర మర్దిని’ విశదపరుస్తుంది. ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకొని, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ, ధర్మమార్గంలో సంచరించి మోక్షసిద్ధి పొందమని బోధిస్తోంది మహిషాసురమర్దిని.
రావణాసురుడు తత్త్వవేత్త, వేదాంత పరిజ్ఞాత ఉగ్రతపస్వి. అతని పేరు వింటేనే దేవేంద్రుడంతటివాడు భయపడేవాడు. యమధర్మరాజు గడగడలాడిపోయేవాడు. ముల్లోకాలను జయించిన ధీరుడు. దీనికి కారణం- రావణుడు అప్పుడు ఇంద్రియాల్ని జయించినవాడు. అయితే ఇంద్రియాలన్నీ, రావణాసురుని మీద అదనుచూచి, పగ తీర్చుకోవటానికి ప్రయత్నించాయి. రావణునిలోని ఇంద్రియాలకు అవకాశం రానే వచ్చింది. సీతామాత సౌందర్యాన్ని విని, చూచి- ఇంద్రియములకు వశమయినాడు రావణుడు- కామక్రోధాదులకు వశమయినాడు, ధర్మాన్ని తృణీకరించాడు, పతనం చెందాడు. జగన్మాత సీతాదేవి హితవు మాటలు చెప్పింది, రావణునికి చెవికెక్కలేదు. ‘శక్తి’తత్త్వాన్ని చెప్పక చెప్పింది, కామాంధునికి తలకెక్కలేదు. ఈ విషయాన్ని రావణుని భార్య మండోదరి, రణభూమిలో రావణాసురుని మృతదేహంవద్ద కూర్చుని చెప్పిన మాటలను తట్టిపోస్తాయి. ‘ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయాస్మరిద్భిరివత ద్వైవం ఇంద్రియై రేవ నిర్జితః’ ఇంద్రియాల్ని జయించిన రోజు నీవు ముల్లోకాలనూ జయించావనీ, ఆ ఇంద్రియాలకే వశమై ఇప్పుడు మరణించావని చెప్పింది మహాపతివ్రత మండోదరి. మండోదరి మాటలు రావణునికే కాదు ప్రతి మనిషికీ అన్వయిస్తాయి.
మనస్సును జయిస్తే మనిషి మహాత్ముడౌతాడు. మనస్సుకు వశమైతే పతనవౌతాడు. ఇది అధర్మ కాముకతకు జగన్మాత విధించిన శిక్ష. అధర్మాన్ని చూస్తూ ఊరుకోదు జగజ్జనని- మహిషాసురమర్దిని.
‘‘మహిషాసుర దోర్వర్య నిగ్రహయై నమః’’ అని, ‘‘తాపత్తయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా’’ లలితా నామములలోను కపర్దినీ కాలామాలా కామ ధునౌతమరూపిణీ’ అని, ‘జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుత’ అని స్తుతింపబడే మాత ‘మహిషాసురమర్దిని’.
మహిషాసురుడు అనగా వక్రబుద్ధి, క్రూరబుద్ధి కలవాడు నికృష్ణ కామాంధుడు అని అర్థమవుతుంది. అటువంటి దుష్టబుద్ధిగల వారి అజ్ఞానమును మర్దించి, మహిషబుద్ధిని నశింపజేసి, జ్ఞానమును వివేకమును కలిగించు జ్ఞానదేవత, వేదమాత మహిషాసురమర్దిని.
‘‘మహేం, మహేం, వాసీ దన్తీతి మహిషాః అసురాః రాక్షసాః తాన్ మర్ణయతీతి మహిషాసుర మర్దినీ’’- భూమినీ ప్రజలను హింసించేవారు, లోక కంటకులైన రాక్షసులు. దుర్మార్గంతో భూదేవికి కూడా భారమైన వాళ్ళు రాక్షసులు. అటువంటి దుష్టశక్తులను మట్టుపెట్టే మహాశక్తి గనుకనే జగన్మాతను ‘మహిషాసురమర్దిని’ అని అన్నారు.
‘కపర్ద’మంటే భాస్కరరాయ భాష్యము ఇలా వివరించింది. ‘కం’ అనగా జలము, బ్రహ్మ, సుఖము అను అర్థాలున్నాయి. దానిలో పూర్తిగా నిండియున్నది కపర్దము. అటువంటి రమణీయమయిన కపర్దమును ధరించిన జగదంబ, ‘రమ్యకపర్దినీ’ అని స్తుంపబడుతోంది. కపర్దమనగా జలాజూటము, వేదమంత్ర సమూహము. వైదిక జటలను అనగా ఘన, జట వేద మంత్రములు అని అర్థము. మరొకర్థం- జడలను ధరించిన శివుడు కపర్ది. పార్వతి- కపర్దినీ. ఇది రమ్యకపర్దినీ అంటే అర్థం. ‘‘కపర్దినీ కళామాలా కామధుక్కామరూపిణీ’ అన్నది లలితా సహస్రనామస్తోత్రం.
శ్రీచక్రార్చన, శ్రీవిద్యోపాసన మనబోటి సామాన్య మానవులకు సాధ్యం కాకపోవచ్చు. కాని అమ్మ నామాలను, భక్తిశ్రద్ధలతో అందరూ చదువుకోవచ్చు. జగన్మాతను ఎక్కడ ఏ రూపంలో భావిస్తే అక్కడ సాక్షాత్కరిస్తుంది. పంచభూతములలో, పంచతన్మాత్రలలో (శబ్ద స్పర్శ రూప రస గంధములు) పగటిలో, రాత్రిలో, సంధ్యలో, తిధులలో, నక్షత్రాలలో అంతా జగజ్జనని చిద్విలాసమే. పంచతన్మాత్రలలో, తల్లిఐశ్వర్యాన్ని భావిస్తే, మన నోట మంచి మాటలొస్తాయి, పరుషవాక్కులు రావు. శబ్దమంతా జగన్మాతదే. మనం అనుభవించే స్పర్శలో పరమేశ్వర భావన ఉంటే, మనస్సు నిర్మలమవుతుంది. కనిపించే రూపమంతా తల్లిదే. మనం ఆస్వాదించే రసమంతా మాతదే, తల్లిప్రసాదమే. ఆఘ్రాణించే సుగంధ పరిమళములో, తల్లి వసిస్తుంది. ఇలాంటి పవిత్ర భావనతో మనం చేసే ప్రతి కార్యం తల్లి ఆరాధనే అవుతుంది. ఏ పని చేస్తున్నా ‘ఇది నేను చేయటం లేదు, నాలోని పరమేశ్వరి చేయిస్తున్నది’ అనే నైవేద్యభావంతో చేస్తే, అది ఈశ్వరారాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. అందులో ఏ ఒక్కక్షణం మనది కాదు. దానిని వ్యర్థంచేసేందుకు మనకు అధికారం లేదు. విశిష్టమైన ఈ శారీరక యంత్రాన్ని మనకు కటాక్షించిన పరమేశ్వరిని స్మరిస్తూ, ఈ శరీరం ఉండగానే ఇందులో రహస్యంగా వున్న ఆనంద బిందువును, సంపూర్ణ శరణాగతితో అందుకోవాలి. అందుకు జగన్మాత అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహాన్ని కరుణించే జగజ్జనని మహిషాసురమర్దిని.
అసలు ఎవరీ మహిషాసురుడు? అతని వృత్తాంతమేమిటి?
ఆ విషయాలు ఇపుడు తెలిసికుందాం. ‘దనువు’ అనే రాక్షస రాజుకి రంభుడు, కరంభుడు అనే ఇద్దరు పుత్రులున్నారు. ఆ రాక్షస సోదరులిద్దరూ సంతానం కోసం తపస్సు చేశారు. కరంభుడు పంచనదమందున్న సరస్సులో దిగి, కంఠం లోతు నీళ్ళలో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు మకర రూపంలో వచ్చి కరంభుణ్ణి సంహరించాడు. ఇది న్యాయమా అని మనకనిపిస్తుంది. అది న్యాయమే. ఎందుకంటే అతని సంకల్పం దుష్టసంకల్పం. తను అమరుడై, ఎవరిచేతుల్లోనూ మరణం పొందకుండా, దేవతలను, ఋషులను, సాధువులను అందరినీ హింసపెట్టడానికి తపస్సు ప్రారంభించాడు. చెడు సంకల్పానికి దేవతలు చేయూతనివ్వరు, ఎందుచేతనంటే, వారి దుష్ట సంకల్పం నెరవేరితే అల్లకల్లోమవుతుంది. కనుక ఇంద్రుడు మకర రూపంలో వచ్చి సంహరించాడు. ఎదురుగా చెట్టుపైనుండి తపస్సు చేస్తున్న రంభుడు ఇది చూచి, సోదరుడు లేకుండా ఇంటికి వెళ్ళడానికి మనస్సు రాక బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవటానికి ఉద్యుక్తుడవుతాడు. ......... ప్రత్యక్షమయి, ఆత్మహత్య మహాపాపమని హితబోధ చేసి, రంభుడు చేసిన తపస్సుకు సంతసించి, కామరూపాన్ని ధరించేవాడు, ముల్లోకాలను జయించేవాడు అయిన పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాడు. అయితే, ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించమన్నాడు.
వరాన్ని పొంది, వరగర్వంతో ఉత్సాహాన్ని పొందుతూ వెడుతూ మార్గమధ్యంలో యక్షుల సంరక్షణలో వున్న ఒక మహిషమును చూచాడు. తదేకంగా దాన్ని చూచి, దానితో క్రీడించాలనే పశు రాక్షస నికృష్ట కోరిక కలిగింది. కామం ఎంత హేమయినదోగదా, ఎంత నీచమయినదోగదా. దాని ఫలితంగా, తాను మహిష రూపాన్ని దాల్చాడు. మహిషం గర్భం దాల్చింది. రంభుడు మహిషాన్ని తీసికొని, పాతాళ లోకానికి వెడుతుండగా, వేరొక మహిషము సహజసిద్ధంగానున్న పశుత్వంతో, గర్భం దాల్చిన మహిషాన్ని సంగమించటానికి వచ్చింది. రంభుడు అడ్డుకున్నాడు. మహిషములోని తీవ్ర కామము- క్రోధాన్ని ప్రేరేపించటంతో తన వాడి కొమ్ములతో రంభుణ్ణి సంహరించింది.
రంభునివలన గర్భం దాల్చిన మహిషి, పాతాళము నుండి బయల్పడి యక్షులున్నచోటికి వచ్చింది. యక్షులు బాణములతో మహిషాన్ని చంపి, రంభుని శరీరాన్ని, మహిష శరీరాన్ని దహనం చేశారు. ఆ మంటలయందు మరణిస్తున్న మహిషికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారే మహిషాసురుడు, రక్తబీజుడు.
కాలక్రమమున, బ్రహ్మచేత వరాన్ని పొంది, సాటిలేని మేటి పరాక్రమంతో మల్లోకాలను గడగడలాడిస్తూ ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు మహిషాసురుడు. పురుషుల చేతిలోకాక, స్ర్తిమూర్తి చేతనే మహిషాసురుడు సంహరింపబడతాడని తెలిసికొని, దేవతలందరూ, ఆర్తితో శ్రీ భువనేశ్వరీమాతను ప్రార్థించారు. తమ కష్టాలను జగన్మాతకు విన్నవించారు. త్రికాలాత్మకం, త్రిగుణాత్మకం అయి తేజ స్వరూపిణిగా, మహిషుని మంత్రులు, సైన్యాధిపతులు అయిన తామ్రుడు, బిడాలుడు, ధూమ్రాక్షుడు, చక్షుడు, అసిలోముడు మున్నగువారినందరినీ సంహరించింది.
‘‘సురవీరవర్షిణి దుర్ధరధర్షిణి, దుర్ముఖమర్షిణి హర్షరతే, దనుజ నిరోషిణి, దుర్మద శోషిణి, దుఃఖ నివారిణి, కిల్బిష మోషిణి మోహరతే, జయజయహే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే’’ అని దేవతలందరూ స్తోత్రం చేస్తుండగా, సింహవాహినియై మహోగ్రరూపంతో ‘కాళీ’ శక్తిగా రక్తబీజుణ్ణి, మహిషాసురుణ్ణి సంహరించింది జగన్మాత. మహిషాసురమర్దిని సార్థక నామధేయురాలైంది. విజయవాడ, ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసి, కనకదుర్గ నామంతో భక్తకోటి అభీష్టాలను నెరవేరుస్తూ వెలుగొందుతున్నది.
శక్తితత్త్వానికి పూర్ణముగా అభివ్యక్తమయినది కాళీమూర్తి. కాళీమాత- కాలతత్త్వానికి సూచితం. మానవుని జ్ఞాన విజ్ఞాన ప్రణాళిక అంతా కాల విశేషము ద్వారా నిర్మితమయి, కాళీదేవియందే అనగా కాల శక్తిలోనే లయమవుతుంది. రూపం అరూపమయితే అది నీలం. రూపరహితమై ఆకాశం- నీలం. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు, నీలమేఘశ్యాముడు. దుష్టశిక్షణ శిష్టరక్షణమునకు అవతరించిన యోగీశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు నీలవర్ణం. కాళీమాత నీలవర్ణం.
మహిషాసురమర్దిని వాహనం సింహము. శతృవులను సంహరించేది సింహము. శౌర్య, ధైర్య సాహములకు చిహ్నం సింహం. జగన్మాతకు వాహనమై, మంత్రమయమై శతృ సంహారాంత్మకై ప్రవర్తించున్నది సింహం. ‘మృగాణాంచ మృగేంద్రోహం’ అన్నారు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో. సంసార ఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి, మద మాత్సర్యాది మత్త్భాల్ని అణచే శక్తికి ప్రతీకయే జగన్మాత వాహనమైన సింహం.
సృష్టికి పూర్వం అంతా జలమయం, అంధకారమయం. ఆ మహాంధకారమే కాళీదేవి యదార్థరూపం నీలవర్ణం. జగత్తుకు ఆదిరూపం. సృష్టికి పూర్వం వున్నది పరాశక్తియే, కాళీదేవియే అని చెప్తుంది కాళీపురాణం. నీలవర్ణాంతర్గత మహా సౌందర్యమే మహాకాళి.
‘‘కాలానికి రాణి’’ సద్గుణ శీల కీరవాణి త్రిలోక జనని దేవి అన్న లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ కీర్తన ‘మహిషాసుర మర్దినీం నమామి మహనీయ కపర్దినీం, మహిష మస్తక నటన భేద వినోదినీం, మోదినీం, మాలినీం, ప్రణత జన సౌభాగ్యజననీం’ అన్న నారాయణి రాగ కీర్తనలో శంఖ చక్ర శూలాంకుశ పాణీం శక్తి సేనాం, మధురవాణీం, పంకజ శయన పన్నగవేణీం, పాలిత గురుగుహ పురాణీం, శంకరార్థ శరీరిణీం, సమస్త దేవతా రూపిణీం, కంకణాలంకృతాబ్జికరాం, కాత్యాయనీం, నారాయణీం’’ అంటూ మహిషాసుర మర్దినీ దేవి తత్త్వాన్ని స్వరూపాన్ని అద్భుతంగా అందించాడు ముత్తుస్వామి దీక్షితులు.
‘‘మహిషాసుర మర్దిని, మాంపాహి మధ దేశవాసిని, మహాదేవ మానసోల్లాసిని, మా, వాణి గురుగుహాది వేదిని, మారజనకపాలిని, సహస్రదళ సరసిజ మధ్యప్రకాశాని, సురుచిర నళిని, శుంభ నిశుంభాది భంజని, ఇతిహాస పురాణాది విశ్వాసిని, గౌరహాసిని’’ అని మధ్వదేశమున, మృత్యుదేశమున, సహస్రారకమల మధ్యమున ప్రకాశించు గురుగుహ జననీ, ఇతిహాసములు, పురాణములయందు తెలియజేయబడిన తల్లిని రక్షింపమని ప్రార్థిస్తూ, యోగశాస్త్ర రహ్యములను కూడా విశదపరుస్తూ దీక్షితార్ గౌళరాగంలో కీర్తించిన ఈ కీర్తన, మహిషాసుర మర్దిని పూజించే తొమ్మిదవ రోజు వ్రతానికి సంపూర్ణ స్ఫూర్తిదాయకం.
అమ్మ కృపాకటాక్ష వీక్షణాన్ని ‘మూకకవి’ కటాక్ష శతకంలో హృదయంగా వర్ణించాడు. జగదంబ కృపాకటాక్షం ఒక దివ్యౌషధం అన్నాడు కవి. మూకకవి రచించిన కటాక్ష శతకం, మహిషాసుర మర్దినీ పూజకు దీప్తినిస్తుంది.
ప్రాప్తించిన శక్తి సంపదను లోక కల్యాణానికి ఉపకరించి కమాన్ని ధర్మంతో అనుభవించి విశ్వహితాన్ని కాంక్షించే మోక్ష మార్గాన్ని పొందాలని మహిషాసుర మర్దినీ దేవి హెచ్చరిస్తోంది.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464