మెయిన్ ఫీచర్

స్థానం.. స్ర్తీ పాత్రలకు జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు దశాబ్దాలనాటి- 1920నాటి- మాట. బాపట్లలో ప్లీడరు గుమాస్తాల నాటక సంఘం ఉండేది. దానిలో శ్రీ కామరాజు వేంకట నారాయణగారు కూడా సభ్యులు. ఆయన మేనల్లుండ్లలో ఒకరు కళాభిరుచి కలవాడు; పందొమ్మిదేండ్ల ప్రాయంవాడు. ఆతడు మేనమామతోపాటు ఆ నాటక సంఘానికి వెళ్ళి, నటుల తరిఫీదులలో హార్మోనియం శ్రుతి వేసేవాడు. అందువల్ల ఆ నాటకాల పద్యాలు, పాటలు, సంభాషణ ఆ యువకునికి కొట్టినపిండి ఒకనాటి మధ్యాహ్నం ఆ యువకుడు యథాలాపంగా ఆ నాటకాల పద్యాలు, పాటలు పాడుకుంటున్నాడు. ఆ నాటక సంఘంలో హరిశ్చంద్ర పాత్ర ధరించే చోరగుడి హనుమంతరావుగారు ఆ పాడడం విన్నారు. ‘‘బాగుంది, బాగుంది, పాడవోయ్!’’ అని ప్రోత్సహించారు. కాని యువకుడు సిగ్గుపడ్డాడు; పాట పెగిలి రాలేదు.
తర్వాత రెండు నెలలకు తిరుపతి వేంకటకవులు బాపట్ల వచ్చి, అవధానాలు చేసి పౌరులను సంతోషపెట్టారు. వారి గౌరవార్థం హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించ దలచారు, ఆ నాటక సంఘంవారు. ప్రదర్శనం తీరా రెండుపూటలుందనగా చంద్రమతి పాత్రధారి జాడలేదు. నాటకం ఆగిపోయే దుస్థితి ఏర్పడింది. చోరగుడి హనుమంతరావుగారికి వెంటనే మన యువకుడు స్ఫురణకు వచ్చాడు. మరికొందరిని వెంట బెట్టుకొని, ఆ యువకుడు చదువుకుంటున్న ట్రెయినింగు స్కూలుకు వెళ్ళారు. మధ్యాహ్నం రెండు గంటల వేళ. యువకుని అతని ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా పుస్తకాలతో సహా తమ సంఘానికి పిలుచుకుని వెళ్ళి, ఆపత్తు వచ్చిందని, ఎలాగైనా ఆదుకోవాలని కోరారు. యువకుడు ఏదో మామూలు పాత్ర కాబోలునని కొంచెం మొగ్గుచూపగా, చంద్రమతి వేషం అన్నారు. యువకునికి ముచ్చెమటలు పోశాయి. ‘‘ఆడవేషమా? మామయ్య మళ్ళీ గడప తొక్కనిస్తాడా? వెయ్యనంటే వెయ్యను’’ అని భీష్మించుకున్నాడు. సంఘం వారంతా గంటసేపు బ్రతిమాలగా, నాటకం ఆగిపోయి తలవంపులవుతుందని ప్రాధేయపడగా, ఒప్పుకున్నాడు. అయినా, బెరుకుగానే ఉంది, మామయ్య ఏమంటాడో అని. మరుసటిరోజు పొద్దుగూకగానే, ఆ యువకుడు హరికథకు వెళ్ళుతున్నానని అమ్మతో అబద్ధమాడి నాటక సంఘానికి బయలుదేరాడు. నాటక సంఘం నేపథ్యశాలలో గ్యాసులైటు ముందుమూగి, నటులు వేషాలు వేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వేషం వేసుకోడానికి భయమయింది యువకునికి. మామయ్య వచ్చి చూస్తాడేమోనని. కనుక ప్రొప్రయిటరు ఇంట్లోనే వేషం వేసుకున్నాడు. ప్రొప్రయిటరు చెల్లెండ్రు వేషధారణలో తోడ్పడ్డారు. యువకుడు అదివరకే చిత్రలేఖనంలో కొంత కృషిచేసినవాడు. కనుక చంద్రమతి పాత్ర ఎలా ఉండాలో మననం చేసుకొని, తదనుగుణంగా సింగారించుకున్నాడు.
నాటకం ప్రారంభమయింది. హరిశ్చంద్ర పాత్రధారి హనుమంతరావుగారు ముందు రంగంలో అడుగుపెడుతూ, ‘‘దేవీ, ఇటురమ్ము’’ అన్నారు. కాని, ఆ దేవి సభాకంపంతో కంపించి పోతున్నది. ఎదుట మామయ్య. (ఆయన మాత్రం ‘చంద్రమతిగాడు రాలేదే? ఎవడురా ఈ కొత్తవాడు’ అని ఆలోచిస్తున్నాడు.) అడుగులు ముందుకు పడడం లేదు. ప్రొప్రయిటరు యవనిక అవతలినుంచి ఒక్క తోపు తోశాడు యువకుణ్ణి. దభీమని కుప్పగా కూలుతూ రంగంలో ప్రవేశించాడు యువకుడు. అడుగులోనే హంసపాదు! యువకుని గాభరాను కప్పిపుచ్చడానికి హరిశ్చంద్రుడు ‘‘దేవీ! ఇది మహారణ్య ప్రాంతమని తెలియదా? రాయి, రప్ప కాలికి తగలవా? ముందు దారి చూచి నడుపుము’’ అని అన్నారు. యువకుడు కొంచెం తేరుకున్నాడు. కాని, ఒక రాగం మొదలుపెడితే, మరొక రాగం పలుకుతున్నది గొంతు. కడపటి సీనులో భయం సహజతను చేకూర్చింది. ప్రేక్షకులు మెచ్చుకున్నారు. నాటకం సమాప్తమైంది. తిరుపతి వేంకట కవులు అనువుగా యువకుని ఆశీర్వదించారు.
‘‘తెల్లవారితే నాటకమనగా, తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో నారింజపండు రంగు గల ఒక పొగ దొర్లుతూ వచ్చి, స్ర్తి రూపం దాల్చింది. ఆ రూపం ఆ పొగనే వస్త్రంగా చుట్టుకుంది. నన్ను సమీపించింది. నా చేతులు పట్టుకుని, నన్ను వీపుమీద వేసుకుని, పైకి వెళ్ళిపోయింది. భయంతో కళ్లు తెరిచాను. రొమ్ముమీద దిండు ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే కల రాలేదు. అదేదో పరాశక్తి నన్నావేశించింది. ఇది నా శక్తికాదు. ఎన్ని జన్మల కృపో! ఆ శక్తి నా భవిష్యత్తును చూసినట్టుగా భావిస్తున్నాను’’ అన్నాడు నాటకం ముగిసిన తర్వాత యువకుడు. ఆనాటి ఆ యువకుడే, నాటినుంచి నేటిదాక స్ర్తి పాత్రలలో నాటక రంగానే్న ఏలి, నవనవోనే్మష నటన శబలతతో భరత శాస్త్రానికే మెరుగులు దిద్దిన స్థానం నరసింహారావుగారు.
స్థానం నరసింహారావుగారు 1902 సెప్టెంబరు 23వ తేదీన బాపట్లలో జన్మించారు. బాపట్లలోనే స్కూలు ఫైనలు దాక చదివారు. చిన్ననాటినుంచే వారికి సంగీతమన్నా, ప్రాచీన సాహిత్యమన్నా, చిత్రకళ అన్నా అభిరుచి వుండేది. ప్రబంధాలలోని పాత్రలను ఊహించుకొని, రంగురంగుల బొమ్మలు గీస్తూ సాధన చేసేవారు రహస్యంగా, 19 ఏళ్లు వచ్చేవరకు చిత్రకళలో, ముఖ్యంగా ‘‘ఇంటెరిమ్ పెయింటింగులోను (వర్తమాన చిత్రకళలోను), ఫొటోగ్రఫీలోను ఒక స్థాయిని సాధించారు. ఈ సాధన వారికి ఉత్తరోత్తరా పాత్ర కల్పనలో, పాత్రల అకల్పనలో ఎంతో ఉపకరించింది. పదహారవ ఏటనే తండ్రి హనుమంతరావుగారు పరమపదించడంవల్ల వారిని మేనమామ కామరాజు వేంకట నారాయణగారు ఆదుకున్నారు. తర్వాత ఆయనే మామగారూ అయ్యారు. వారు నాటక ప్రియులు, నటులూను. కనుక స్థానంవారి లలిత కళాభిరుచికి దోహదమిచ్చి, లలిత కళాభివ్యక్తికి రూపుతీర్చారు.
చంద్రమతి వేషధారణతో, తిరుపతి వేంకట కవుల ఆశీఃప్రభావంతో స్థానంవారి జీవితస్థాయే మారింది. బోధనాభ్యసన పాఠశాలలో చదివి, సామాన్యోపాధ్యాయులుగానో, చిత్రకళోపాధ్యాయులుగానో మనుగడ గడపదలచిన స్థానం వారికి చంద్రమతి తాము వర్ణరంజితులై, ఇతరుల హృదయాలనూ రంజింపజేయాలనే తీవ్ర కాంక్షను కలిగించి, జీవితానే్న చంద్రమయం చేసింది. వారి కాంక్ష ఫలించింది. తెనాలిలోని కృష్ణ హిందూ థియేటర్స్ అనే నాటక సంఘంలో 25 రూపాయల నెల జీతంపై స్ర్తి పాత్రధారి ఉద్యోగం దొరికింది. ఆ కాలంలో 25 రూపాయలు చిన్న జీతమేమీ కాదు. అక్కడ వారు ఆరు నెలలే పనిచేసినా, నిర్వహించిన యశోద, లీలావతి, మోహిని పాత్రలు వారికి ఎంతో కీర్తితెచ్చాయి. తర్వాత వారు తెనాలిలోని రామవిలాస సభలో చేరారు. కొంతకాలం పిదప దానికి నిర్వాహకులూ అయి, తమతోపాటే, ఆ సభ యశస్సునూ దిగంతాలకు విస్తరింపజేశారు. స్థానంవారు ఈ సభలో రోషనార, సత్యభామ, చిత్రాంగి, ముర, మధురవాణి, రాణి సంయుక్త, సుభద్ర పాత్రలు ధరించి, సభ విలాసానికే వనె్నలు తెచ్చారు.
సభ శిక్షణ ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించే ఆధునికంగా ఉండేది. నాట్య శాస్తక్రారులు నిర్వచించిన రసానుగుణమైన వాక్యాభినయం, భావానుగుణమైన శబ్దోచ్ఛారణ, తగినంత సంగీతం, పాత్రోచితమైన ఆహార్యాంగికాభినయం నిర్వహించి, సామాజికులను రంజింపజేయడం ఈ సభ ఆదర్శం. అందులోను వీరరాఘవస్వామిగారి శిక్షణ కత్తిమీది సాము. ప్రతి దానినీ వారు నిశితంగా చూచేవారు. గోవిందరాజుల సుబ్బారావు ఒకమారు గంతులు వేశాడు. ‘‘ఏమిటా కుప్పిగంతులు?’’ అని స్వామి గారు చీదరించుకున్నారు. ప్రతి నాటకం తర్వాత మరునాటి సాయంకాలం విమర్శ గోష్టి జరిగేది. నాటకంలో తప్పు చేసేవారికి జరిమానా వేసేవారు. సుబ్బారావు కూడా జరిమానా తప్పించుకోలేదు. నాకు ఎప్పుడూ ఫైన్ పడలేదు. అందరూ అసూయతో కాచుక్కూచున్నారు. ఒకమారు మూడు రాత్రులు వరుసగా నాటకాలు వేశాము. మూడో రోజు కృష్ణతులాభారం. నారదుడు సత్యభామతో సంభాషిస్తున్న ఘట్టం. అసలే అలసి ఉన్నాను. నారదుడు చెబుతుండగా ఆవులించాను. మరుసటి విమర్శ గోష్ఠిలో ‘అంతటి మహాముని చెబుతూంటే, అగౌరవంగా ఆవులిస్తావా? తప్పు’ అన్నారు అందరూ. సత్యభామ సౌభాగ్య గర్వం, అజాగ్రత్త చూపడం అవసరం గనుక ఒప్పేనని సమర్థించుకున్నాను. స్వామిగారూ అంగీకరించారు. నటుల సూచనలూ వారు తీసుకునేవారు. తర్వాత ఆంధ్రప్రభలో నేను ‘ఆనాటి నా ఆవలింత’ అనే వ్యాసం వ్రాశాను’’ అన్నారు స్థానంవారు.
స్థానంవారు వివిధ రాష్ట్రాలలోనే కాక, బర్మా మొదలయిన విదేశాలలోను తమ నాటక సంఘంతో పర్యటించి, తమ నటన నైపుణితో జనాన్ని ముగ్ధులను చేశాను. మగవారు ఆడవేషం వేయడమేమిటి ఖొజ్జావారిలాగ అని ఆక్షేపించిన వారినీ తలలూపేటట్టు చేశారు. నవ్వమని మూతి ముడుచుకొన్న వారిని విరగబడి నవ్వేట్టు చేశారు. ఏదో వంక దొరికేనా అని వేచి ఉన్నవారిని కలకాలం వేచి ఉండేట్టు చేశారు. అచ్చంగా ఆడదేనని ఆడవారే భ్రమిసేట్టు చేశారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తును ఒకమారు ప్రారంభించారు, ఒకమారు అధ్యక్షత వహించారు. నటకావతంస, ఆంధ్ర బాల గంధర్వ, నటశేఖర ఇత్యాద్యనేక బిరుదాలు పొందారు. అసంఖ్యాక స్వర్ణ రజత పతకాలతో, స్వర్ణ కిరీటాలతోను అలంకృతులయారు. సంగీత నాటక అకాడెమి వారిని కళాప్రపూర్ణులను చేసింది. భారత ప్రభుత్వం 1956లో ‘పద్మశ్రీ’తో భూషించి, హైదరాబాద్ రేడియో కేంద్రం నాటక ప్రయోక్తగా నియమించింది.
స్థానంవారు తమ 38 సంవత్సరాల నట జీవితంలో దాదాపు 16వందల ప్రదర్శనలు జరిపారు. ఏ పాత్రనైనా సాటిలేని రీతిగ చూపారు. ముఖ్యంగా చిత్రాంగి, మధురవాణి, సత్యభామ, సుభద్ర, ముర, రోషనార పాత్రలను ఎంతో అధ్యయనం చేసి ప్రదర్శించారు. సాహిత్య చరిత్రలను తిరగవేసి, ప్రాచీన శిల్పచిత్రాలను పరిశీలించి, గంటల తరబడి ఒంటరిగా మననం చేసుకొని, వేషం దిద్దుకొని కాని రంగం మీదికి వచ్చే వారు కాదు. ప్రతి పాత్రను వివిధ సన్నివేశాలలో ఊహించి, వివిధ స్ర్తి ప్రవృత్తులను ఆకళించుకొని నటించారు. వారి వేషం ప్రేక్షకులనేకాక సాటి నటులను, చిన్ననాటి మిత్రులను కూడా భ్రాంతి గొలిపిన ఘట్టాలు వందలు. ‘రుస్తుం’ అన్న నినాదం విన్న షోహరాబ్ దిగ్భ్రాంతుడయి అస్త్ర సన్యాసం చేసినట్టు రంగస్థలం మీద వారి నటనను చూచి పెదవి ఆడని, కాలు కదపని సాటి నటులను వారు సమయస్ఫూర్తితో లాలించి, ప్రోత్సహించిన సందర్భాలు అనేకం.
స్థానంవారిలోని మరొక శక్తివిశేషం తమ అనుభూతులను, అనుభవాలను వివరించగల, నటనను సమర్థించగల రచననూ స్వాధీనం చేసుకోవడం. వారు చక్కని శైలితో నాటకాలను గురించి, నటనను గురించి పెక్కు వ్యాసాలు వ్రాశారు. మోహినీ రుక్మాంగద, కృష్ణదేవరాయలు మొదలయిన నాటకాలూ రచించారు. 1953 నుంచి తెనాలిలో నాటక కళాస్థానం అనే సంస్థ నెలకొల్పి నిర్వహిస్తున్నారు. స్థానంవారు పురుష పాత్రలు కూడా ధరించే వారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మక తప్పదు మరి; కాని, వారు వేసింది ఒకే ఒక మగ వేషం- అదిన్నీ ఒకసారి- నారద వేషం, రాధాకృష్ణ నాటకంలో. వారి చిత్రాంగిని, మధురవాణిని, సత్యభామను చూచిన కండ్లతో గడ్డాలు, మీసాలు ఊగులాడుతూనో, గడ్డాలు మీసాలు లేక సిగకు, ముంజేతులకు, మణికట్టులకు మల్లెదండలు చుట్టుకుని తంబూరా మీటుతూనో వచ్చే నారద వేషం చూస్తే ఎలా ఉంటుంది?
సినిమాల వల్ల నాటకాల విలువ తగ్గుతుందేమో?- అని అనుమానించే ప్రాణులను చూస్తే వారు మధురవాణి లొట్టిపిట్ట నవ్వు నవ్వుతారు. విదేశాలలో ఉన్నట్టు నాటక సంఘాల ఉద్ధరణకు, నాటక కళావిస్తృతికి కళాశాలలు, మంచి జట్టు (ట్రూప్) ఉంటే నాటకాల విలువ ఎప్పుడూ తగ్గదని వారి నిశ్చయం.

(1975లో తిరుమల రామచంద్ర ‘మరపురాని మనీషి’ శీర్షికతో
29 మంది మహనీయుల పరిచయాత్మక వ్యాసాలు రచించారు. వాటిలోంచి సంగ్రహించినదే ఈ వ్యాసం.)

- తిరుమల రామచంద్ర