మెయిన్ ఫీచర్

నిజాయతీగా పెంచుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు మూడు, మూడున్నర సంవత్సరాలు వచ్చేటప్పటికి మాటలతో పాటు ప్రశ్నలనూ తల్లిదండ్రుల పైకి స్పందిస్తుంటారు. అదేమిటి? ఇదేమిటి? ఎందుకు? ఎలా?.. ఇలా ఆ బుజ్జి బుర్రలనిండా ఎన్నో సందేహాలు.. వీటిని తీర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. తెలిసో తెలియకో కన్నవారు విసుక్కుంటే ఆ వికాస ద్వారం మూసుకుపోయినట్టే. వీలైనంతగా పిల్లల ప్రశ్నల్ని స్వాగతించాలి. వీలైనంత ఎక్కువ సంభాషణను ప్రోత్సహించాలి. మనం ఏం చెప్పినా తలాడించే బుజ్జిశ్రోత దొరికాడని మురిసిపోకూడదు.. ఏకబిగిన ఉపన్యసించి మన నోటి దురదను తీర్చేసుకోకూడదు. సంభాషణ సంభాషణలాగే ఉండాలి. మనం తక్కువ మాట్లాడి వారిని ఎక్కువ మాట్లాడనివ్వాలి. మాటల వల్ల దగ్గరితనం పెరుగుతుంది. ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ అర్థం అవుతాయి. ఎదిగే క్రమంలో ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో చిన్న చిన్న తేడాలుంటే సరిదిద్దే వీలూ ఉంటుంది. అలాగే పిల్లల ముందు జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో సహోద్యోగితో సంభాషిస్తున్నప్పుడూ చాలా చాలా ఎరుకతో వ్యవహరించాలి. పిల్లల ముందు ఏం మాట్లాడాలి? వారికి ఇబ్బందులు తెలియకూడదు కాబట్టి అప్పుల గురించీ, ఆర్థిక సమస్యల గురించీ చర్చించకూడదు.. చావు తీవ్రమైన విషయం కాబట్టి మరణాల ప్రస్తావన వద్దు.. శరీర వ్యవస్థకు సంబంధించో, లైంగికతకు సంబంధించిన ప్రస్తావన వస్తే.. వెంటనే చర్చ ఆపేస్తాం.. ఇలా ఎంతకాలమని నిజాల్ని గుప్పిట్లో దాచి ఉంచుతాం? ఎన్ని రోజులని సమాజాన్ని చూడకుండా చుట్టూ తెరకట్టి కాపాలా కాస్తాం.. సిద్ధార్థుడి తండ్రిలా..! ఎప్పుడో ఒకప్పుడు వాళ్లు ఈ చేదు నిజాల్ని తెలుసుకోవాల్సిందే.. కఠిన వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిందే.. వయసును బట్టి, సందర్భాన్ని బట్టి, వారి మానసిక పరిణితిని బట్టి పెద్దలు, పిల్లలతో క్రమక్రమంగా చర్చించడంలో తప్పులేదు. కన్నవారు కొన్ని విషయాలను మాట్లాడటం మానేస్తే, పిల్లలూ కొన్ని విషయాలు చెప్పడం ఆపేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెబుతారు. డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారు. పెద్దయ్యాక కూడా ఆ డొంకతిరుగుడు తనమే కొనసాగుతుంది. సూటిగా మాట్లాడలేరు. స్పష్టంగా ఆలోచించలేరు. అమ్మానాన్నలు నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా నిజాయితీగా ఉంటారు. పెద్దలు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే పిల్లలు కూడా తప్పులను ఒప్పుకుంటారు.
పుస్తకం
నేటి తరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. పిల్లలకు చదివే అలవాటు ఎలా చేయాలన్నదే నేడు పెద్దలకు దిక్కుతోచని సమస్యగా మారింది. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. ఇలా జరగాలంటే వారితో పాటు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకం ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి పుస్తకాలను సమకూర్చాలి. పుస్తకాలు లేని ఇల్లు, కిటికీలు లేని గది ఒక్కటే.. పిల్లలందరూ కలిసి సరదాగా చదువుకున్నా, వారితో పాటు పెద్దలు కూడా కూర్చుని చదువుకున్నా ఆనందమే.. చదివేటప్పుడు అర్థం కాని విషయాల్ని, పదాల్ని పిల్లలు అడిగినప్పుడు విసుక్కోకుండా వివరించి చెప్పాలి. అలా పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచి-చెడులను తెలియజెప్పాలి. పత్రికలు చదివే అలవాటు చేయాలి. ఇప్పుడు దినపత్రికల్లో పిల్లలకోసం ప్రత్యే పేజీలు వస్తున్నాయి. చదువుకు సంబంధించినవీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కూడా.. అలాగే పజిల్స్ కూడా.. పిల్లలకు రోజుకో పజిల్‌ను ఇచ్చి చేయమనాలి. మనం కూడా వారితో పాటు కూర్చుని ఒక పజిల్‌ను చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి చురుకైన మెదడు సొంతం అవడంతో పాటు పాఠాల్లోని లెక్కలు కూడా త్వరగా చేయగలుగుతారు. మార్కెట్లో ఇలాంటి తరహా పజిల్స్ బోలెడన్ని ఉంటాయి. వాటిని కొని తెచ్చి పిల్లలకు అందివ్వాలి.
విజ్ఞానయాత్రలు
పిల్లలను విహార యాత్రలతో పాటు అప్పుడప్పుడూ విజ్ఞానయాత్రలకు కూడా తీసుకెళ్లాలి. అంటే జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలు, ప్లానిటోరియంలు ఇలాంటివి అన్నమాట.
స్మార్ట్ఫోన్‌లతో..
ఇటీవల ఎవరి ఇంట్లో చూసినా, ఏ పిల్లాడి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్‌లే దర్శనమిస్తున్నాయి. ఆటలు, వీడియోగేమ్స్, సినిమాలు, యూ ట్యూబులే వారి ప్రపంచాలయిపోయాయి. ఇది అంతర్జాల ప్రపంచం. మనం కోరుకున్నదాన్ని అరచేతిలో వీక్షించే సదుపాయం ఉంది. అలాంటి స్మార్ట్ఫోన్‌ను పిల్లలు ఆటలకు, సినిమాలకు ఉపయోగించకుండా చూడాలి. ‘మనం ఎప్పుడూ గాంధీజీ వంటి గొప్ప గొప్ప నాయకులను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కదా.. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా వారిని కలుసుకుందాం’ అంటూ వారి విజయగాథలు, స్ఫూర్తి నింపే మాటలు, డాక్యుమెంటరీలను వారితో కలిసి చూస్తూ, వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తుంటే మరింత సంతోషపడతారు పిల్లలు.
వంటింటి పాఠాలు
పిల్లలు వంటింట్లోకి వస్తే వారికి ఏమైపోతుందో అని తల్లిదండ్రులు భయపడే రోజులివి. అందుకే పెళ్లీడుకి వచ్చినా పిల్లలకు కనీసం టీ పెట్టుకోవడం, అన్నం వండుకోవడం కూడా తెలియడం లేదు. వంటనేది జీవన నైపుణ్యం. చదువులకోసం, ఉద్యోగాల కోసం ఇల్లు వదిలి వెళ్లినప్పుడు వంట రాని లోటు తెలిసొస్తుంది. అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఈ కష్టాలు రాకుండా ఉండాలంటే హైస్కూలు వయసులోనే పిల్లలకు వంటగదిని పరిచయం చేయాలి. కూరలు తరగడం, పాలు కాచడం, అన్నం వండడం, మ్యాగీ చేయడం, ఆమ్లెట్ వేయడం వంటి చిన్న చిన్న పనులతో ప్రారంభించి ఒక్కో కూరనూ రుచి, శుచిగా ఎలా చేయాలో చెప్పాలి. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకు ఆహారం విలువ, తల్లి శ్రమ పిల్లలకు తెలిసి వస్తుంది. పైపెచ్చు పిల్లలు జంక్‌ఫుడ్స్ జోలికి వెళ్లకుండా వారి కష్టపడి చేసుకున్న వంటకే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. అలాగే పిల్లలకు గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ పరికరాల వాడకంలోని జాగ్రత్తలను తెలియజేయాలి. వారు వంట చేస్తున్నా పెద్దవారు గమనిస్తూ ఉండాలి.
నీరు-మొక్కలు
వంటింటి పాఠాలతో పిల్లలకు నీటి విలువ కూడా తెలిసి వస్తుంది. ఎంత శ్రమపడితే ఇంటిలోకి నీళ్లు వస్తున్నాయో పిల్లలకు తెలియజేయాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ జలవనరులు అడుగంటిపోతున్నాయి. ప్రాణాధారమైన నీటి ప్రాధాన్యం గురించి ప్రతి పౌరుడికీ తెలియాలి. జలం ప్రకృతి ప్రసాదమని, లక్షలు ఖర్చుపెట్టినా మనిషి సృష్టించలేని అమూల్యవనరు అని పిల్లలకు తెలియజేయాలి. నీటితో పాటు పిల్లలకు చెట్ల గురించిన అవగాహన కలిగించాలి. మనిషి ప్రకృతికి దూరమైనకొద్దీ, పర్యావరణానికి హాని పెరిగిపోతోందని.. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణమే కాదు, అంతటా పరుచుకున్న పచ్చదనం కూడా అనే విషయాన్ని చిన్న చిన్న మాటలు, చేతల ద్వారా వారికి తెలియజేయాలి. ఇందుకోసం వారితో చిన్నచిన్న కుండీల్లో, తొట్లలో మొక్కలు నాటించడం, వాటిని జాగ్రత్తగా చూసుకునేలా చేయడం వంటివి పిల్లలతో చేయిస్తే వారికి బాధ్యత, శ్రద్ధ పెరుగుతుంది.
పెద్దలను గౌరవించాలి..
సెలవుల్లో పిల్లలను అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి పంపుతూ ఉండాలి. దీంతో పెద్దవారికి, పిల్లలకు మధ్య ఆత్మీయత పెరుగుతుంది. అలాగే పెద్దలు చెప్పే కథలు, గోరుముద్దలు.. పిల్లలకు ఎంతో నచ్చుతాయి. తాతయ్య, నానమ్మలు కనిపించగానే వారికి ఎలా నమస్కరించాలి, వారితో ఎలా మర్యాదగా నడుచుకోవాలి.. ఇలాంటివన్నీ మన ద్వారానే పిల్లలకు వస్తాయి. మనం పెద్దల విషయంలో కటువుగా ఉంటూ, పిల్లల ముందు పెద్దవారిని చులకన చేస్తే వారికీ ఆ అలవాట్లే అబ్బుతాయి. రేపు మన పరిస్థితి కూడా ఇంతకంటే దారుణమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అమ్మమ్మ, తాతయ్యలకు పిల్లల చేత అప్పుడప్పుడూ ఉత్తరాలు రాయించాలి. ఇప్పుడు ఈమెయిల్స్, వాట్సప్‌లు ఉత్తరాలను మింగేశాయి కానీ ఆత్మీయతను పంచడానికీ, పెద్దవాళ్లని పలకరించడానికి ఉత్తరాన్ని మించినది మరొకటి లేదు. అప్పుడప్పుడూ మనం పిల్లలకు సరదాగా ఉత్తరాలు రాసి సర్‌ప్రైజ్ చేస్తే వారికీ ఉత్తరాలు రాయడం అలవాటు అవుతుంది. ఉత్తరం అనేది ఒక సాహిత్య ప్రక్రియ. దీని ద్వారా మాతృభాష అభివృద్ధి చెందుతుంది.
అలవాట్లు
మనిషి అలవాటుకి బానిస. పాత అలవాట్లు ఒక పట్టాన మారవు. ఆలోచనలు పనులుగా, పనులు అలవాట్లుగా, అలవాట్లు వ్యక్తిత్వంగా రూపాంతరం చెందుతాయనేది శాస్త్రం. మంచి అలవాట్లు ఏర్పడాలంటే మంచి ఆలోచనల బీజాలు నాటాలి. ఒక అలవాటుని జీవితంలో భాగం చేసుకోవాలంటే ఎంత కష్టమైనా 21 రోజులపాటు అమలుచేసి తీరాలంటారు పెద్దలు. అప్పుడది మన వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. పిల్లలకూ, పిల్లల గురించి మనకూ అనేక ఆకాంక్షలు ఉంటాయి. పరిధులు, పరిమితులూ లేకుండా ఆలోచించడం పిల్లలకు అలవాటు. వయసు పెరిగే కొద్దీ వారి ఆలోచనలకు సంకెళ్లు పడతాయి. అందుకే చిన్నప్పటి నుంచీ కష్టమైనా మంచి అలవాట్లను పెద్దలు పిల్లలతో కలిసి ఆచరించడం వల్ల వారు ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారు. స్కూలు చదువు పూర్తయ్యేలోపు తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యులూ, ఉపాధ్యాయులూ కొన్ని వేలసార్లు వారి ఆలోచనలపై, ఆశలపై నీళ్లు చల్లుతారు. ‘నువ్వు చెయ్యలేవు, నీ వల్లకాదు, నీ మొహం.. నీకంత సీన్ లేదు’ వంటి మాటలు పిల్లల్ని కృంగదీస్తాయి. అలాకాకుండా ప్రేమతో వారిని లాలిస్తూ చెప్పడం వల్ల వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి, ముందుచూపు ఏర్పడుతుంది. ఫలితంగా సంకల్పం కలుగుతుంది.