మెయిన్ ఫీచర్

డిస్కౌంట్ డేంజర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లోబల్ ప్రపంచంలో షాపింగ్ చేయడానికి ఆడా, మగా అన్న తేడా లేదు. సంపాదన పెరగడం, ప్లాస్టిక్ మనీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వినియోగదారుల వస్తు కొనుగోలు సామర్థ్యం పెరగడం, సులభమవ్వడం కూడా జరిగింది. దీన్ని ఆసరా చేసుకుని మార్కెట్ మోసాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇటీవలి కాలంలో మార్కెట్‌లో ప్రతి ఒక్కరి నోటా వినే పదం ‘డిస్కౌంట్’. డిస్కొంట్ సేల్స్, ఒకటి కొంటే మరొకటి ఉచితమన్న ప్రకటనలతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇలాంటి ఆఫర్లతో వినియోగదార్లు ఆకర్షణకు గురవుతారని అమ్మకందార్లకు బాగా తెలుసు. అందుకే ఈ ఆఫర్లు పెట్టినషాపులు జనాలతో కిటకిటలాడుతుంటాయి చూడండి.
డిస్కౌంట్ సేల్స్‌లో కొనేటప్పుడు బాగానే ఉంటుంది. తరువాతే కొంప ముంచుతుందన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. నాణ్యత గురించి ఆలోచించకుండా వస్తువులు కొనడమే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు. తరువాత చూసుకుని బాధపడుతుంటారు. ఈమధ్య నెట్ సేల్స్‌కు కూడా బాగా ఆదరణ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని వస్తువులను కొనుగోలు చేసేయడం సుళువే. కానీ వాటి నాణ్యత, పనితీరు అందులో పేర్కొన్నట్టు ఉండదు, ఉండకపోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి.
డిస్కౌంట్‌లో ‘అప్ టు’ అనే చిన్న పదం వినియోగదారుల సొమ్ముతో ఆటలాడుతోంది. ఆ చిన్న పదమే కొనుగోలుదారుల్ని తప్పు పట్టిందని గుర్తెరగండి. కనిపించని డామేజీలు, సెకెండ్ సేల్ వస్తువుల్ని ఈ కోవలో అంటగట్టేస్తారన్నది నిజం. ప్రత్యేకంగా అద్దెహాళ్లలో పెట్టే డిస్కౌంట్ అమ్మకాలకు దూరంగా ఉండటమే మంచిది. కొన్న వస్తువులో ఏవైనా లోపాలుంటే అడగడానికి తర్వాత అక్కడ షాపుకూడా ఉండదు. ఒకవేళ అలాంటి చోట్ల కొనాల్సి వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రాండ్ నేమ్, ఉత్పత్తిదారుల చిరునామాలు సరిగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి. బిల్లు, క్యాష్‌మెమో లేకుండా కొనడం మంచి పద్ధతి కాదు. అవి లేకుండా కొనడం అంటే నాణ్యతమీద ఆశ వదులుకున్నట్లే. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు డిస్కౌంట్ సేల్ అని పెట్టి తీరా అక్కడికి వెళ్లిన తరువాత ఆ స్టాకు అయిపోయిందని, మరోరకం స్టాకు తీసుకోవచ్చని నేర్పరితనంతో అంటగడతారు.
ఒకవేళ మీరు ఇలాంటి మాయలో చిక్కుకుని మోసపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. 1986 వినియోగదారులచట్టం కింద పనిచేసే ఫోర్‌మ్‌లు దేశవ్యాప్తంగా 588 జిల్లాల్లో ఉన్నాయి. 34 మంది రాష్ట్ర కమిషనర్లు ఉన్నారు. ఇవేగాక నేషనల్ కమిషన్ ఒకటి ఢిల్లీలో పనిచేస్తుంటుంది. వినియోగదారులు మోసపోతే ఫోరంల ద్వారా నష్టాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేయొచ్చు.
సేల్స్ జిమ్మిక్స్‌లో మరోరకం ఏంటంటే, పాత వస్తువులు తెచ్చి కొత్త వస్తువు తీసుకెళ్ళమనేది. ఇలా ఇచ్చే వాటిలో ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, కప్‌బోర్డులు, టీవీలు ఉంటుంటాయి. అయితే పాత వస్తువు ధరను కొత్త వస్తువు ధరలో ఎంత మినహాయించారో గమనించుకోవాలి.
కొత్తగానే వస్తువు యొక్క నాణ్యత గుర్తించాలి. ఒక్కసారి మీ వస్తువులను కొనేవారు మీరు చెప్పిన ధరకే కొన్నప్పుడు, బదులుగా మరో వస్తువు తీసుకున్నపుడు ఆ మొత్తాన్ని మినహాయించారో లేదో చూసుకోవాలి. ఇలాంటిచోట్ల మీరు తీసుకున్న వస్తువుకు వారెంటీ ఉందో లేదో చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నింటికైతే కొంతకాలం ఫ్రీ సర్వీసు కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో కంప్యూటర్లు, లాప్‌టాప్, మొబైల్స్‌కు డిమాండ్ పెరగడంతో, కొన్ని రకాల మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. పాత వాటినే సర్వీసు చేసి కొన్ని భాగాలను మార్చేసి, పైకప్పు కొత్తది చేసి.. కొత్తగా అమ్ముతున్న సందర్భాలూ ఉన్నాయి. కంప్యూటర్ల, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలులో వాటి శక్తి సామర్థ్యాలను, వారెంటీలను, ఫ్రీ సర్వీసు, ట్రాన్స్‌పోర్ట్ డామేజీ ఇతర వివరాలను తెలుసుకుని కంపెనీలకు సంబంధించిన వాటినే కొనుక్కోవాలి. పూర్తి వివరాలు నేరుగా తెలుసుకోవాలి.
ఈమధ్య కొన్ని కంపెనీలు ఆన్‌లైన్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్‌లతోపాటు ఆన్‌లైన్ పేమెంట్ విషయంలో కొన్ని బ్యాంకులు, మొబైల్ యాప్స్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. నిజానికి ఈ ఆఫర్లు బ్యాంకులు ఇస్తున్నాయా లేక ఆయా వ్యాపార సంస్థలే ఇస్తున్నాయానేది పూర్తిగా తెలుసుకోవాలి. బిల్లులు క్యాష్‌మెమోలు లేకుండా వస్తువుల్ని కొనొద్దు. జియస్టీని బిల్లులో ప్రత్యేకంగా కనపరుస్తారు. అలా కాకుండా బిల్లులో కలిపి వేసామని చెప్పి పన్నుల పేరుతో అదనంగా నొక్కుతున్నారు. ఇలాంటివన్నీ తెలుసుకొన్నప్పుడే వినియోగదారుకు డిస్కౌంట్ డేంజర్స్ నుంచి బయటపడతారు. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో వస్తువు ధరకంటే తక్కువకు అమ్మకందారుడు ఎందుకు ఇస్తాడు. వ్యాపారం చేసేది నష్టాలు పోగేసుకోవడానికి కాదు కదా- అన్న స్పృహతో ఆలోచిస్తే మార్కెట్ మర్మం మీకే అర్థమవుతుంది.

-కంచర్ల సుబ్బానాయుడు