మెయిన్ ఫీచర్

గాయాల జీవనది.. నటాషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటాషా యోగా టీచర్. సోషల్
మీడియాలో ఇన్‌ఫ్లుయన్సర్ కూడా. మానసిక ఆరోగ్యం గురించి అనేక
మందికి అవగాహన కల్పిస్తుంటుంది. తనను తాను ప్రేమించుకోవడంతోనే తన ప్రయాణం ప్రారంభమైనదని చెబుతుంది నటాషా. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

‘బాధను స్వీకరించండి.. దానిని అర్థం చేసుకుని పోరాడండి.. దాన్ని మీ జీవితం నుంచి దూరంగా తరిమికొట్టండి.. దానే్న తలచుకుంటూ కూర్చుని జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి..’ అని చెబుతోంది నటాషా నోయల్.
ఈమె ఒక యోగా టీచర్, మోటివేషనల్ స్వీకర్. ‘100మంది శక్తివంతమైన మహిళలు’ పేరిట జరిగిన సదస్సు అక్టోబర్ 22న దిల్లీలో జరిగింది. ఇందులో ‘ఒకవేళ మహిళలు సారథ్యం వహిస్తే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?’ అన్న ప్రశ్నను సంధించారు. ఇలా జరిగితే పురుషాధిపత్యంగా సాగుతున్న ఈ ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎలా తీర్చిదిద్దాలి? అన్న ఫ్యూచరిజంతో సభ సాగింది. ఆ సందర్భంగా ఈ సభలో పాల్గొన్న నటాషా నోయల్.. విషాదమైన బాల్యం నుంచి యోగా నిపుణురాలిగా మారేంత వరకు తన ప్రయాణాన్ని వివరించింది. వివరాల్లోకి వెళితే..
నటాషా నోయెల్ మూడు సంవత్సరాల వయస్సులో ఉండగానే తన తల్లి ఆత్మహత్య కేసులో సాక్ష్యం చెప్పింది. ఏడు సంవత్సరాల వయస్సులో ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తరువాత లైంగిక వేధింపులు, మానసిక సమస్యలు ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని నిలబడిన ఆమె.. ప్రస్తుతం యోగా టీచర్‌గా ఎందరికో ఆదర్శంగా నిలబడింది. ముంబయిలో ప్రముఖ యోగా నిపుణురాలిగా పేరు తెచ్చుకున్న నటాషా ‘బాడీ పాజిటివిటీ’ అంశంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరు. నటాషాకు మూడున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దాన్ని నటాషా ప్రత్యక్షంగా చూసింది. దాని గురించి పోలీసులకు ఆమె సాక్ష్యం కూడా చెప్పింది. నటాషా తండ్రి స్కిజోఫ్రీనియా బాధితుడు. అలా అతన్ని పోలీసులు రిమాండుకు తరలించారు. దాంతో నటాషా అనాథగా మారింది. అప్పుడు ఒక జంట నటాషాను పెంచుకోవడానికి తీసుకెళ్లింది. ఏడు సంవత్సరాల వయస్సులో ఆమెపై లైంగిక దాడి జరిగింది. అయినా నటాషా ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరొకడు అనుచితంగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా నటాషా బాధను దిగమింగుకుంటూ వౌనంగా ఉండిపోయింది. అలా ఆమె బాల్యం అపరాధ భావం, తీవ్రమైన వేదనతో ప్రారంభమైంది. ఈ సంఘటనలతో ఆమె తీవ్రంగా చలించిపోయింది. చాలా సంవత్సరాల పాటు నటాషా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ గడిపింది. ఎన్ని పనులు చేసినా ఆమె మనసుకు అయిన గాయం నుంచి బయటపడలేకపోయింది. అలా ఒకరోజు ఆమె డాన్స్ క్లాస్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు కాస్త ఉపశమనం లభించింది. తనలోని నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచుకునేందుకు ఆమెకు నృత్యం ఒక మాద్యమంలా ఉపయోగపడింది. ముంబయిలోని ఓ శిక్షణా కేంద్రంలో జాజ్, నృత్య నాటికలతో పాటు, సమకాలీన డాన్సులను కూడా నేర్చుకుంది నటాషా. ఒకసారి డాన్స్ ప్రాక్టీసులో ఉండగానే ఆమె మోకాలికి గాయం అయింది. అలా ఆమె తన నృత్యాన్ని కొనసాగించలేకపోయింది. పాఠశాలలో వేధింపుల కారణంగా ఒక దశలో ఆమె తన చదువును కొంతకాలం మానేయాల్సి వచ్చింది. తరువాత కష్టపడి చదివి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తరువాత ఉపాధ్యాయ వృత్తినే కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తుకు కనీస భరోసా ఉంటుందని పెంపుడు తల్లి సూచించింది. కానీ నటాషా అందుకు అంగీకరించలేదు. పెంపుడు తల్లి కన్నతల్లిలా చూసుకున్నా కూడా ఆమె సలహాను నటాషా స్వీకరించలేకపోయింది. కారణం ఆమెకు టీచర్ వృత్తి ఇష్టం లేకపోవడమే..
ప్రేమ విఫలం..
యుక్తవయస్సు వచ్చేసరికి ఆమె జీవితంలోకి ప్రేమ వచ్చింది. ప్రేమ పేరుతో ఓ తోడు దొరికింది. అతనితో ఉంటే తన జీవితం మారిపోతుంది అనుకున్న నటాషాకు నిరాశే మిగిలింది. ఆ ప్రేమ విఫలమైంది. భవిష్యత్తు అంతా అతనే అనుకున్న నటాషాకు అతను బ్రేకప్ చెప్పాడు. మళ్లీ మానసిక క్షోభ. కొనే్నళ్ల పాటు తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది.
డిప్రెషన్ నుంచి..
ఆ సమయంలో ఒకరు ఆమెకు ఒక సలహా ఇచ్చారు. ‘నీ మానసిక ఆరోగ్యాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే నీకు ఎవ్వరూ సాయం చేయరు’ అని. ఆ సలహా ఆమెకు పాఠంలా మారింది. అలా ఒకరోజు కడుపునిండా తినేది. ఒకరోజు అసలు ఏమీ తినేది కాదు. ఒక్కో రోజు రోజంతా నిద్రపోయేది. మరోరోజు అస్సలు పడుకునేది కాదు. ఒకటే ఆలోచన.. శూన్యంలోకి చూపు.. ఇలా ఉండేది ఆమె మానసిక పరిస్థితి.. నెమ్మదిగా చిన్న చిన్న చిట్కాలతో డిప్రెషన్ నుండి ఎలా బయటపడాలో నేర్చుకుంది. ప్రతిరోజూ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకునేది. ఆ లక్ష్యాలను గురించి వింటే ఆమె మానసిక స్థితి ఎంత శిథిలావస్థలో ఉండేదో తెలుస్తుంది. ఇవాళ జుట్టు దువ్వుకోవాలి. ఏదైనా తినాలి.. ఐదు నిముషాల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.. ఇవీ ఆమె పెట్టుకునే లక్ష్యాలు. ఆ లక్ష్యాల్లో ఏదైనా ఒకటి పూర్తి చేయలేని రోజు.. ఆమె తన వైఫల్యాలను అద్దంలో చూస్తూ అంగీకరించేది. తరువాత విఫలమైనా ఫరవాలేదు. రేపు మళ్లీ ప్రయత్నించాలి అని తనకు తాను చెప్పుకోవడం నేర్చుకుంది. అలా తనను తాను ప్రేమించడం మొదలుపెట్టింది. అలాగే ఇతరులను కూడా ప్రేమగా పలకరించేందుకు ప్రయత్నించేది. దీనితో పాటు సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంది. ఎలా ఉన్నావు? అని డాక్టర్ అడిగితే బాగున్నాను.. మీరెలా ఉన్నారు? అని అడిగే స్థితికి చేరుకుంది అంటే అప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
యోగ
డిప్రెషన్, ఆందోళన నుంచి బయటపడేందుకు నటాషా చేసిన ప్రయాణంలో ధ్యానం కీలకంగా మారింది. ఆమె శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడింది. మోకాలికి గాయమై నృత్యాలు మానేసిన తర్వాత నటాషా శారీరక శ్రమతో కూడిన ఏ పనీ చేయలేకపోయేది. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు అద్భుతంగా యోగాసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో చూసి మోటివేట్ అయ్యింది. యోగా భలే ఉంది అనుకుంటూ యోగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. యోగాసనాలు వేయడమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం చేయడం కూడా మొదలుపెట్టింది. మానసిక స్థిరత్వాన్ని పెంచుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ప్రక్రియ నిదానంగానే ఉంటుంది. కానీ ఫలితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల్లో యోగాలో మంచి స్థాయికి చేరుకుంది. యోగా ఆమె ఒత్తిడిని దూరం చేసింది. తనను తాను ప్రేమించుకునేందుకు ఉపయోగపడింది. నటాషా యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని యోగా టీచర్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంది. 27 సంవత్సరాల నటాషా ఇప్పటికీ ఇంకా సమస్యలు ఎదుర్కొంటోంది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, మానసిక కుంగుబాటుకు లోనుకాకుండా ఎలా ముందుకు అడుగేయాలో ఆమె నేర్చుకుంది. ఇప్పుడు నటాషా యోగా టీచర్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయన్సర్ కూడా. మానసిక ఆరోగ్యం గురించి అనేకమందికి అవగాహన కల్పిస్తుంటుంది. తనను తాను ప్రేమించుకోవడంతోనే తన ప్రయాణం ప్రారంభమైనదని చెబుతుంది నటాషా. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యోగా చేసేందుకు వారిని ప్రోత్సహిస్తూ ‘బాడీ పాజిటివిటీ’ అంశంపై తన అభిప్రాయాలను వారితో పంచుకుంటుంది. తన అనుభవాలను, ఆలోచనలను వెల్లడిస్తుంది. విషాదమైన తన బాల్యం గురించి స్పందిస్తుంది. ‘ప్రపంచంలో ప్రతి మనిషీ సాధికారతతో బతకాలి అనేదే నా ఆశ. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా అవకాశాలు, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ స్థితిని, మేథోస్థితిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా ప్రతి మనిషి సంపూర్ణ చైతన్యంతో వ్యవహరించగలడు’ అని చెబుతుంది నటాషా. నేడు భారతదేశంలో చాలామంది మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తాము మానసిక రుగ్మతతో బాధపడుతున్న విషయం ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అన్న భావనే ఇందుకు కారణం. అజాగ్రత్త మరో కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. ప్రపంచ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక రుగ్మతలను ఎదుర్కొంటారు. జీవితంలో వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుని, వారిని వారు ప్రేమించుకుంటూ ముందుకు సాగితే.. విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. ఒకప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడిన నటాషా.. నేడు విజయవంతమైన వ్యక్తిగా ఎదిగి.. మోటివేషన్ క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగింది. ఇందుకోసం ఆమె చేసిన కృషి అనితరసాధ్యం. ఇలాంటివారిని చూసే కదా అనాలి.. నటాషా జయహో! అని.

-సన్నిధి