మెయిన్ ఫీచర్

తెల్లారుతోంది.. తెరపై దీపావళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే -దేదీప్యమానం. నిరంతర దీపాల వెల్తురులో చిత్రీకరించే అద్భుతం. చిన్నగా చెప్పుకుంటే సినిమా -ఓ దీపావళి. దీపం పరబ్రహ్మం అనుకునేవాళ్లూ అక్కడుంటారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టాలని ఆలోచించేవాళ్లూ ఉంటారు. అలాంటి నిత్యదీపాల మధ్య అసలు దీపావళిని తెరకెక్కించటం ఎప్పుడో మర్చిపోయాం అనిపిస్తుంది.
దీపావళి గురించి తెలుసుకోవాలంటే పురాణాలు చదవాలి. లేదంటే పాత సినిమాలు చూడాలి. ఒకప్పుడు -కథా సందర్భాన్ని బట్టి సన్నివేశంలోనో, ఎక్కువగా పాటలోనో ‘దీపావళి’ వినిపించేది, కనిపించేది.
**
చీకటి వెలుగుల రంగేళి/ జీవితమే ఒక దీపావళి -అని నిర్మాతలనేవారు. ఒక సినిమాలో లాభాల వెలుగులు కనిపిస్తాయి. మరో సినిమాలో నష్టాల చీకట్లు అలముకుంటాయి. రెండూ కలిస్తేనే -దీపావళి అన్న భావం వ్యక్తం చేసేవారు నిర్మాతలు. అలాంటి దీపావళిని మన నిర్మాతలు, దర్శకులు ఆన్ స్క్రీన్‌మీద ఎలా చూపించారో చూద్దాం.
దీపావళి అంటేనే అందరికీ ఆనందావళి. ఈ విషయాన్ని ఎన్నో తెలుగు చిత్రాల్లో అద్భుతంగా చిత్రీకరించారు. స్థాలీపులాకంగా అందులోంచి కొన్ని తీసుకుందాం.
హీరో హీరోయిన్లు తమ ప్రేమభావనలను దీపావళి సందర్భంగా దీపాల భాషలోనే మాట్లాడుకుంటూ ఆటాడుకునే ఓ పాట విచిత్ర బంధంలో ఉంటుంది. ‘అమ్మాయి పుట్టింది అమాసనాడు/ అసలైన గజదొంగ అవుతుంది చూడు’ అని అబ్బాయి అంటే, ‘పుట్టినరోజున దొరికాడు తోడు/ పున్నమినాటికి అవుతాడు జోడు’ అని నాయిక అంటుంది. దీపావళి నేపథ్యంగా సాగే అందమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించడంలో ముందుంటారు. విచిత్రబంధం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ అభినయించిన ‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దీపాలు వెలిగించింది ఈ పాట. పెద్దలే కాదు పిల్లలూ దీపాలవంటివారే. ఒక దీపం వెలిగింది, ఒక దీపం మలిగింది అంటూ ఓ చిత్రంలో పాట వినవస్తుంది. ఒక దీపం వెలిగింది అంటే ఒక మనస్సు ఆనందంగా ఉంది. మలిగింది అంటే బాధతో పక్కకు వెళ్లిందని. ఇలా మనసులోని భావాలను దీపాల సాక్షిగా సినీకవులు చక్కని పాటలను సృయించారు. పెళ్లికానుక చిత్రంలో బి సరోజాదేవి పాత్ర దీపావళి సందర్భంగా పాడిన అద్భుతమైన పాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తన అక్క కొడుకు తమ ఇంటికి దీపమని పాడే ఈ పాటలో దీపావళి ప్రత్యేకత కనిపిస్తుంది. ‘ఆడే పాడే పసివాడా/ ఆడేనోయి నీ తోడ/ ఆనందం తొంగి చూసే దీవాళి.. ఇంటింట వెలుగు/ దీపాల మెరుగు/ వెలలేని వేడుకరా’ అంటూ సాగే పాటలో దీపావళికి చిన్నపిల్లలు ఎంత ఆనందంగా గంతెలేస్తారో చెప్పే ప్రయత్నం చేశారు. ‘చిన్నారి జయమంచు మ్రోగే పటాసు/ చిటపటమని పూలు చిమ్మే మతాబు’ అని ఓవైపు బాణాసంచా గురించి చెబుతూ, అవే ఉపమానాలుగా చిన్నపిల్లలకూ అన్వయించారు. తెలుగు సినిమా తొలినాళ్లలో వచ్చిన ‘షావుకారు’ చిత్రంలో ఓ బృందగానం ఉంటుంది. అందరూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకుంటుంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శాంతకుమారి ఓ అద్భుతమైన పాట దీపావళిపై ఆలపిస్తారు. ‘దీపావళి దీపావళి ఇంటింటా ఆనందదీపావళి’ పాటలో తెలుగు పలుకుబడుల వయ్యారాలను మతాబుల మెరుపులతో చక్కగా గుదిగుచ్చి తెలుగు వెలుగులదండలా సినిమాకు వేశారు. అందులో చరణాల్లో వచ్చే ‘జిలుగుల వలువల అల్లుళ్ల తళుకు -కూతుళ్ల కులుకు, పలుకుల వయ్యరి వదినల వనె్నలు -మురిసిపోతూ చిన్నలు, దీపావళి ఇంటింటా ఆనంద దీపావళి, మా ఇంట ఆనంద కళికావళి’ అంటూ పండగలకు వచ్చే అల్లుళ్లు, కూతుళ్లను, ఇంటి వదినలు వయ్యారంగా వడ్డిస్తూ అదంతా చూస్తూ మురిసిపోయే చిన్నపిల్లల కాకరపువ్వొత్తులు ఇక్కడ మకు దృశ్యమానం చేశారు. ‘చిటపట రవ్వల ముత్యాల కురియ - రత్నాలు మెరయ, తొలకరి స్నేహాలు వలపుల వానగా -కురిసే సెలయేరుగా, పొంగే ప్రమోద తరంగావళి’ అంటూ ప్రేమలు, ఆనందాలు, స్నేహాలు తదితర మానవ ప్రమోదమైన భావాలను దీపాలు వరుసగా పాటల పేర్చారు అలనాటి దర్శక నిర్మాతలు, కవులు. చిటపట రవ్వలు, ముత్యాలు, రత్నాలు, వలపులు, వానలు, సెలయేరులు- ఇవన్నీ మనిషికి ఆనందానిచ్చే ప్రమోదాలే కదా!
రుణానుబంధం చిత్రంలో ఓ అద్భుతమైన దీపావళి గీతం చిత్రీకరించారు. కథానాయకుడు ఎఎన్నార్ అయినా, ఈ పాటలో ఆయన కనిపించరు. ‘ఓహో వయ్యారి లాహిరి/ రావే రంజైన రంగేళి జాగిరి/ వచ్చింది దీపాల పండగ/ ఉన్నోళ్ళ డబ్బంతా దండగ- దిగ్గు దిగ్గు దీపావళి, మళ్లీ వచ్చే నాగులచవితి’ అంటూ సాగే ఈ పాటలో దీపావళిని వయ్యారమైన నది అలలా, ఆనందాలనిచ్చే ఝాములా చిత్రీకరించారు. దీపాల పండగలో ఉన్నోళ్ల డబ్బంతా బాణాసంచా కాల్చడంతో వృధా అయిపోతుందని, పేదల పండుగలో దీపావళికి మతాబులు ఒక్కటే పూలవానను కురిపిస్తాయని ఈ పాటలో తెలిపారు. సంఘర్షణ చిత్రంలో విజయశాంతి, చిరంజీవిలపై చిత్రీకరించిన ఓ దీపావళి పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. ‘సంబరాలో సంబరాలో దీపాళి పండగ సంబరాలో’ అంటూ సాగే పాటలో పేదలకు, ధనికులకు దీపావళి పండుగ ఎంత ఆనందాన్ని ఇంటికి తెస్తుందో చిత్రీకరించారు. ఎన్టీ రామారావు, సావిత్రి, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా, అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకోవాలంటూ పురాణాల్లోవున్న కథనాన్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రం దీపావళి. ఇందులో ‘మూడు లోకాల నరకుడు బాధించగా, మది కరుణించి వెలుగును చూపించెను- శాంతి స్థాపించెను, హరి అనుమతిగా నరకుని స్మృతిగా హాయి ఈనాడు దీపావళి’ అంటూ సాగే గీతంలో నరకాసురుని కథనం వినిపించారు. భానుమతి, సుహాసిని, శరత్‌బాబు, జయసుధ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ముద్దుల మనవరాలు చిత్రంలో ఓ దీపావళి గీతాన్ని చిత్రీకరించారు. ‘ఇన్నాళ్లకు వచ్చింది దీపావళి, మమతల దీపావళి, దీపకళికావళి’ అంటూ సాగే పాటలో దూరమైన మనవరాలు ఇంటికొస్తే తన ఇంటికి దీపావళే వచ్చిందని ఆ అమ్మమ్మ సంతోషంలో పాడే ప్రతి పదం దీపావళిని స్మృతికి తెస్తుంది. ‘చిట్టి చిట్టి అలకలు చిటపటలు, చిలిపి చిలిపి అల్లరులు సీమ టపాకాయలు, వెలుగుల సురగోళాలు చిచ్చుబుడ్లు, చీకటికి చింతలకు జవాబులు మతాబులు’ అంటూ సీమ టపాకాయలను, చిటపటలాడే కాకరపువ్వొత్తులను, చిచ్చుబుడ్లను, మతాబులను పాటలో దీపావళి బాణసంచా ప్రయోగాలను చక్కగా ప్రయోగించారు. ఇలా చూసుకుంటూ వెళితే తెలుగు చిత్రాల్లో అనేక దీపావళి నేపథ్యంలో చిత్రీకరించిన పాటలున్నాయి. ఇవేకాకుండా దీపావళి అంటే ఆనందమని, సినిమాలో ఏ ఆనందకరమైన దృశ్యమొచ్చినా వెనుక నేపథ్యంలో దీపావళి బాణసంచాను మ్రోగిస్తూ సాగే అనేక పాటలున్నాయి. ఉదాహరణకు నాగార్జున, సిమ్రాన్ నటించిన ‘నువ్వు వస్తావని’ చిత్రంలో ‘పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి’ అన్న గీతం నేపథ్యంలో దీపావళి పండుగ వాతావరణాన్ని చిత్రీకరించారు. కృష్ణ, వాణిశ్రీ నటించిన చీకటి వెలుగులు చిత్రంలో వెనె్నల అంధకారంలా వెలుగు జిలుగుల సయ్యాటలను కథాపరంగా చిత్రీకరించారు. ‘చీకటి వెలుగుల కౌగిలిలోన పొంగే కుంకుమ వనె్నలు’ అన్నపాటను కృష్ణశాస్ర్తీ తప్ప మరెవరు రాయగలరు. దేవుడమ్మ చిత్రంలో ‘చిన్నారి చెల్లి మా బంగారు తల్లి’ అన్నపాటలో కోరస్ నేపథ్యంలో ‘దీపావళి వచ్చె దీపావళి’ అన్న పంక్తి వినిపిస్తుంది. ఎన్టీఆర్- కృష్ణకుమారి జంటగా నటించిన గుడిగంటలు చిత్రంలో ‘దీపాలు వెలిగే పరదాలు తొలగే’ అన్న పాటను కథానాయకుని చీకటి మనస్సుకు నాయిక వెలుగును ప్రసాదిస్తుందన్న భావనతో చిత్రీకరించారు. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన రెబెల్ చిత్రంలో దీపావళి నేపథ్యంలో ఓ పాట చిత్రీకరించారు.
తెలుగువారి పండుగల నేపథ్యంలో అనేక చిత్రాలలో పాటలు సందర్భానుసారంగా ఉండేవి. కానీ ఇప్పుడవన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రజలు పండుగలను అప్పటికన్నా ఇప్పుడు వేడుకగా జరుపుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడొస్తున్న చిత్రాల్లో అటువంటిపాటలను మాత్రం చూడలేకపోతున్నాం. ప్రజలు ఒకవైపువుంటే, సినిమాలు మరొకరకమైన కథలను చిత్రీకరించుకూ వెళ్తున్నాయి. ఈ సందర్భంగా పండుగలను ఎటువంటి సందర్భాలు ఆయా చిత్రాల్లో చిత్రీకరించలేకపోతున్నారు. పాటల్లోగాని, పల్లవుల్లోగాని ఎక్కడో ఒకచోట తెలుగు పండుగల గురించి చెప్పే దర్శక నిర్మాతలు కరువయ్యారు. అప్పటి పాటలలో ఏ పండుగకైనా ఓ సందర్భాన్ని సృష్టించి తెలుగు సంస్కృతిని కళ్లకు కట్టించేవారు. ఇప్పటి చిత్రాల్లో ఆ వాతవారణమంతా కలుషితమైపోయింది. వాటిస్థానంలో ఆధునిక పద్ధతులు వచ్చేసాయి. సస్పెన్స్, క్రైమ్, హారర్, రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్ వున్న చిత్రాల్లో ఇటువంటి గొప్ప పాటలు కరవవుతున్నాయి. వాటిస్థానంలో వాలెంటైన్స్ డే, డేటింగ్‌లు, సహజీవనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులపై దాడి చేస్తున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఇష్టపడే ఒకరో ఇద్దరో దర్శకులున్నా, వారిపై ఆయా చిత్ర నిర్మాతల ప్రభావం ఉండడంతో వారూ ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో పండుగ వాతావరణం చిత్రాల్లో కనిపించకుండా పోతోంది. తెలుగు లోగిళ్ళలో ముగ్గులుపెట్టి అట్లతద్దికి వాయనాలిచ్చి, ఉగాది పచ్చడి రసాస్వాదన చేసి సాయంత్రానికి వెలుగుల రవ్వలు చిందే మతాబుల పూలదండలు వృధా అయిపోతున్నాయి. ఎప్పటికి మళ్లీ స్వర్ణయుగ కాంతులు తెలుగు చిత్రాల్లో కనిపిస్తాయో?! ఆ యుగం తాలూకు రసాస్వాదన సినిమాల్లో కన్పిస్తుందా??

-జి రాజేశ్వరరావు