మెయన్ ఫీచర్

అవినీతీ.. నీ మరణం ఎప్పుడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇందు కలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే’’
ఇది అందరికీ తెలిసిన పద్యమే. ఇది బమ్మెర పోతన వ్రాసిన భాగవతం లోనిది. హిరణ్యకశ్యపుడు చిన్నవాడైన ప్రహ్లాదుడితో ‘ఎక్కడ మీ విష్ణువు? చూపించు’ అని అడిగినప్పుడు ఆ చిన్నారి పైవిధంగా జవాబిస్తాడు. విష్ణువు సర్వాంతర్యామి అని ఎక్కడైనా వుంటాడని దీని అర్థం. మరి మనకీనాడు ఆ సర్వాంతర్యామి అయిన శ్రీ విష్ణువు కనిపిస్తాడో లేదో కానీ మనకు ఎక్కడపడితే అక్కడ కన్పించేది మాత్రం ‘అవినీతి’. దేశదేశాల్లో ముఖ్యంగా మన దేశంలో విచ్చలవిడిగా కన్పించేది అవినీతే. మన ఆంధ్రప్రదేశ్‌లో మరీను. దీని నగ్నత్వాన్ని గూర్చి కాస్తా విశే్లషించుకొని విచారిద్దాం.
అన్ని జన్మలకన్నా మహత్తరమైనది మానవ జన్మ. మనిషిగా పుట్టిన ప్రతి వొక్కరూ మహోన్నతంగా జీవించి సంపూర్ణ మనిషిగా జీవితాన్ని ముగించాలి. స్వార్థం మనిషిని అధఃపాతాళానికి కూడా తీసుకెళ్తుంది. స్వార్థానికి పుట్టిన బిడ్డే ‘అవినీతి’. నీతి కానిదే అవినీతి. దీని పుట్టుక ఎప్పుడో నిర్దిష్టంగా చెప్పలేము. మన పాలకుల అవినీతి కారణంగానే బ్రిటీష్‌వారు మన దేశంలో అడుగుపెట్టారన్నది నిజం. ఆ అవినీతే మహావృక్షమై మన దేశంలో అంతెత్తుకు ఎదిగింది. అవినీతి విలయతాండవం చేస్తోంది. మనందరిలోను ఎంతోకొంతైనా దాగి వుంది.
ఇంకా డబ్బు సంపాదించాలన్న తృష్ణ, అధికారాన్ని చెలాయించాలన్న దుగ్ధ, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల పార్టిసిపేషన్ తక్కువ కావడం, పరిపాలనా విధానంలోని లోపాలు, పారదర్శకత లేకపోవడం, తక్కువ జీతాలు, బలహీనమైపోయిన పోలీసు వ్యవస్థ, చట్టాలు అవినీతిపరులకు చుట్టాలు కావడం, న్యాయవ్యవస్థకూడా బలహీనపడడం, నిరక్షరాస్యత, అన్ని రాజకీయ పార్టీలు కూడా అవినీతితో నిండిపోవడం.. ఇవి మన దేశంలోని అవినీతికి కొన్ని కారణాలు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణా రాష్ట్రాన్ని కుదిపేసే అతిపెద్ద అవినీతి అనకొండ బైట పడింది. ఆమే ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి. మందుల కొనుగోళ్ళలో ఈమె అవినీతి 14 రోజులపాటు ప్రతిరోజు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా మనం చూస్తూనే వున్నాం. ఈమెలోని అవినీతి ఆకాశాన్నంటుతున్నది. ఈ కుంభకోణం ఈ వ్యాసాన్ని రాసే సమయంలోనికి దాదాపు 500 కోట్లకు చేరుకొంది. ఈ మహా కుంభకోణంలో ఇప్పటివరకు 17 మంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్టుచేశారు. ఈ దోపిడీలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత.. వొకరేమిటి వొకర్నిమించి వొకరు పోటీలుపడి దోపిడీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఇచ్చిన ఏడాదికి ఏసిబి నిద్రలేచింది. కుంభకోణం మొత్తం బైటికి త్రవ్వారు. మన సమాజమంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది.
జూలై 10వ తారీఖున రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తాహశిల్‌దార్ లావణ్య ఇంటిపై ఏసిబివారు దాడిచేశారు. ఆశ్చర్యం కొలిపేలా ఆమె ఇంట క్యాష్ 93 లక్షలు దొరికింది. అంత డబ్బు ఆమెకెక్కడిది అని కూపీ లాగితే వేలాది మంది పేదల, రైతుల వ్యధలు ఒక్కొక్కటిగా బైటపడ్డాయి. అంత మందిని బాధపెట్టి, పీడించి సంపాదించిన కోట్లాది రూపాయలు, ఆస్తులు అన్నీ బైటపడ్డాయి. ఈ ఇద్దరు మహిళల్లో మానవత్వం పూర్తిగా అదృశ్యమై, రాక్షసత్వం చోటుచేసుకొంది. చివరికి పాపం పండి దొంగల్లా పట్టుపడ్డారు.
ఇంకొక్క వ్యక్తి గూర్చికూడా స్మరించుకొని చర్చించుకొందాం. నాకో స్నేహితుడు టౌన్‌ప్లానింగ్‌లో వుండేవాడు. 40 సంవత్సరాల క్రితం ఎక్కడో ట్రైనింగ్‌లో నాకు స్నేహితుడయ్యాడు. పదోన్నతి పొందుతూ 2017లో విజయవాడలో టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ అయ్యాడు. మనిషి చూడడానికి చాలా సింపుల్‌గా వుండేవాడు. 2017 సెప్టెంబర్ 24వ తారీఖున, అతనిపై ఏసిబి రైడ్స్ జరిగాయి. అతని ఆస్థి వివరాలు కళ్ళు బైర్లుకమ్మేలా దొరికాయి. 10 కేజీల బంగారం, డైమండ్స్, వజ్రాలు, 15 ఎకరాల స్థలం, 26 ఇళ్ళ స్థలాలు, 26 ఇళ్ళు, 25 ఫ్లాట్స్, షిర్డీలో ఓ లగ్జరీ లాడ్జి. చాలా ఆస్తులు ఒక స్ర్తిపై పెట్టడం, ఆమెతో అక్రమ సంబంధం కలిగి వుండడం కూడా వెలుగు చూశాయి. ఎంతమందిని పీడించి సంపాదించిన ఆస్తులివి? ఎన్నివేల అక్రమ నిర్మాణాలకు, లేఅవుట్‌లకు పర్మిషన్స్ ఇచ్చి ఉంటాడు! మనిషికి ఇంత ఆస్తులు అవసరమా? అందుకోసం అంత గడ్డి తినాలా?
ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అయనా దేవికారాణి ఉదంతం మరియు భారతదేశంలో ఒకప్పుడు ఫైనన్స్ మినిస్టర్‌గా ఒక్క వెలుగువెలిగిన చిదంబరంగారు జైలుకెళ్ళడం ముఖ్యంగా నన్నీ వ్యాసాన్ని వ్రాసేందుకు ప్రేరేపించాయి.
అవినీతి పర్‌సెప్షన్ ప్రకారం ఇండియా 78 ర్యాంకులో వుంది. అవినీతి నిర్మూలించేందుకు అనేక చట్టాలు - శిక్షలు కూడా వున్నాయి. ఐపిసి 1860, ప్రాసిక్యూషన్ సెక్షన్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ యాక్ట్ 1961, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎక్స్..వున్నాయి. 1964లో చీఫ్ విజిలెన్స్ కమిషన్ కూడా ఏర్పాటుచేశారు. అవినీతి నిరోధానికి లోక్‌పాల్ వ్యవస్థనుకూడా ఏర్పరిచారు. విజిలెన్స్ కమిషన్ 2016లో 2,088 కేసులు, 2018లో, 1,889 కేసులు కనుగొన్నాయి. శ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన నినాదంతో 1963 ఏప్రిల్ 1న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ అనే సంస్థను నెలకొల్పడం జరిగింది. ఇది కేంద్ర పరిధిలోనిది. అత్యున్నత ఏజెన్సీ ఇది. రాజకీయ నాయకులపై, కేంద్ర ప్రభుత్వ వుద్యోగులపై, ప్రభుత్వరంగ సంస్థలపై దర్యాప్తుచేస్తుంది. అన్ని రాష్ట్రాలు దీని పరిధి క్రిందే వస్తాయి. న్యాయస్థానాల ఆదేశాలపై కూడా ఇది దర్యాప్తు చేపడుతుంది.
ఇక రాష్ట్ర పరిధిలో అవినీతి నిరోధానికి ఏసిబి, విజిలెన్స్ కమిషన్‌లు పనిచేస్తుంటాయి. ఎంతో గొప్ప ఆశయంతో నెలకొల్పిన సిబిఐ కూడా ఇటీవల వివాదాల వలయంలో చుట్టుకొంది. రాజకీయ నాయకుల ముఖ్యంగా పాలకుల జోక్యం కూడా ఇందులో ఎక్కువైందని, ఇందులోకూడా అవినీతిపరులు అధికారులుగా వున్నారని దీనిపై ప్రధాన ఆరోపణలు. ఇంతేకాకుండా ప్రముఖ రాజకీయ నాయకులు కీ.శే. పి.వి.నరసింహారావు, జయలలిత, లాలూప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్, మాయావతి తదితరుల విషయంలో కూడా దర్యాప్తు నత్తనడకన సాగాయన్నది కూడా కొందరి విమర్శ. 2006లో బోఫోర్స్ స్కాం, 1991లో హవాలా స్కాం, 1999 ప్రియదర్శిని మట్టూ మర్డర్ కేసు, సొహరాబుద్దీన్ కేసు, 2002 మలంకర వర్గీస్ హత్య, 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, 2జి స్పెక్ట్రమ్ కేసు, బొగ్గుగనుల కుంభకోణం, 2008 నోయిడా జంట హత్యలు ఇవన్నీ సిబిఐ అనగానే మనకు స్మరణకు తెచ్చే స్కాంలు. దీని స్వతంత్ర ప్రతిపత్తిపై కూడా అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడుగారు సిబిఐ తమ రాష్ట్రంలో దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ పెద్ద కాంట్రావర్సీకి తెరలేపాడు. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా ఇదే నేత ప్రతి విషయానికి సిబిఐ దర్యాప్తుకోరడం చిత్రాతి చిత్రం.
భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే కొన్ని స్కాంలు గూర్చి తలచుకొందాం.
1. బొగ్గు గనుల కేటాయింపుల స్కాం- 18,600 కోట్ల రూ.లు
2. 2జి స్పెక్ట్రమ్ స్కాం- 1,76,000 కోట్ల రూ.లు
3. కామన్‌వెల్త్ గేమ్స్ స్కాం- 7000 కోట్ల రూ.లు
4. మెగా బ్లాక్ మనీలాండరింగ్ స్కాం- 7000 కోట్లు
5. ఆదర్శ హౌసింగ్ స్కాం- 18,978 కోట్ల రూ.లు
6. స్టాంప్ పేపర్ కేసు- 20,000 కోట్ల రూ.లు
7. బోఫోర్స్ స్కాం- 400 మిలియన్లు
8. ఫాడర్ స్కాం- 950 కోట్ల రూ.లు
9. హవాలా స్కాం- 8000 కోట్ల రూ.లు
10. సత్యం స్కాం- 14,000 కోట్ల రూ.లు
11. స్టాక్ మార్కెట్ స్కాం- 3,500 కోట్లు
12. మధుకోడ స్కాం- 4000 కోట్లు
ఇవన్నీ దాదాపు కాంగ్రెస్ కాలంలోనే జరిగాయన్నది ప్రజల్లో బలంగా నాటుకపోవడంతో 2014లో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి 282 ఎంపీల స్థానాల్ని గెలిపించారు.
తర్వాత 2018-19లో కూడా సీబీఐపై చాలా వివాదాలు తలెత్తాయి. రాజకీయ నాయకులు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడం మన దురదృష్టం. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారనుకొన్న నాయకులు అధికారంలోకి రాగానే డబ్బు సంపాదనలోపడి నానా గడ్డికరుస్తూ, అడ్డదార్లు త్రొక్కుతున్నారు. ఇలాంటి చీడపురుగులు అన్ని పార్టీల్లోనూ మనకు కన్పిస్తారు. దొరికినవాడే దొంగ. కాకుంటే దొర లాగా చెలామణి అవుతుంటారు. అలా దొరికేది ఏ లక్షకో వొక్కరు మాత్రమే. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా వున్నప్పుడు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్‌గా రెండవ స్థానంలో చక్రం తిప్పారు. అంతటి వ్యక్తి ఆగస్టు 22, 2019లో అరెస్ట్ కాబడ్డాడు. ఇన్ ఎక్స్‌మీడియా కరప్షన్ అండ్ మనీ లాండరింగ్‌లో ఈయన ముద్దాయి. ఇది 305 కోట్ల రూ.ల స్కాం. ఇన్‌ఎక్స్ మీడియాకు ఫారెన్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్‌లో క్లియరెన్స్ చేయించినందుకు ముడుపులు తీసుకొన్నారన్నదే ప్రధాన ఆరోపణ. లాలూప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్, జయలలిత, మాయావతి తదితరుల జాబితాలో క్రొత్తగా చేరారు చిదంబరం.
బ్యాంకుల్ని మోసం చేయడం, మొండి బకాయిలు రద్దుచేయించుకోవడం ఇటీవల భారతదేశంలో తలెత్తిన కొత్తమార్గం. విజయమాల్య, నీరబ్‌మోడీ మొదలగువారు ఈ కోవకు చెందిన వారు. ఇక వేల కోట్ల రూ. రుణాల్ని పొందడం, చివరికి మొండి బకాయిల పేర రద్దుచేయించుకోవడం క్రొత్త దుర్మార్గపు చర్య. గత 3 సం.కాలంలో 2 లక్షల 76 వేల కోట్ల రూ.లు మొండి బకాయిలు రద్దుచేయడం అత్యంత దుర్మార్గం. ఇందులో రూ. 100 కోట్లకు పైగా తీసుకొన్నవారు 416 మంది. బ్యాంకుల వైఖరి కూడా ధనికుల వైపుకో మాదిరి, పేదల పట్ల మరోవిధంగా వుండడం గర్హనీయం.
గత మూడేళ్ల కాలంలో దాదాపు 90 మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదుచేసింది. 45 ఏళ్ల వయసులో అత్యంత ధనవంతుడిగా పేరుమోసిన వ్యక్తి రాయపూర్‌లోని బాబూలాల్ అగర్వాల్. ఇతని ఆస్తులు దాదాపు 253 కోట్లు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నీతిపరులైన వ్యక్తులు చాలా తక్కువగా కన్పిస్తారు. పదేళ్ల క్రితం ఓ ఐఎఎస్ ఆఫీసరు రోజుకు కనీసం 10 లక్షలైనా చేతికి రానిదే ఇంటికెళ్లేవాడు కాడట! నీతి, నిజాయితీగల ఆఫీసర్లయితే రేయింబవళ్లు పనిచేస్తూ, వొకటో తారీఖున జీతంకోసం ఎదురుచూస్తుంటారు. నేటి అవినీతి సామ్రాజ్యంలో ఇంకా అలాంటి మంచి అధికారులు కొద్దిమంది ఉన్నందుకు గర్వపడుదాం. దేశంలో ప్రస్తుతం 4,926 మంది ఐఎఎస్‌ల, 3,894 మంది ఐపిఎస్‌లు పనిచేస్తున్నారు. ఇంకా 1400 మంది ఐఎఎస్‌లు, 900 మంది ఐపిఎస్‌లకు కొరత వుంది.
అవినీతి ఊడలు దేశదేశాలకు విస్తరించాయి. అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా దేశాల్లో కూడా వుంది. కాస్తా ఎక్కువ తక్కువ కావచ్చు. 2013లో చైనాలోని మాజీ రైల్వేశాఖ మంత్రి లియుజిహ్‌జున్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడగా మరణశిక్ష విధించారు. ఇతనికి 16 కార్లు, 350 ఫ్లాట్స్ ఉన్నాయి. 1970లో లోలెవల్‌గా వర్కర్‌గావున్న ఈ వ్యక్తి 1986-2011 కొచ్చేసరికి అత్యంత ధనవంతుడయ్యాడు. ఒక్క రైల్వే ప్రాజెక్టు మంజూరులో 6 మిలియన్లు లంచం తీసుకొంటూ దొరికిపోయాడు. అక్టోబర్ 2019లో చైనాలోని హైసన్ ప్రొవిన్స్‌లో అత్యున్నత అధికారిగా వున్న జాంగ్‌కీ అనే వ్యక్తి అడ్డంగా అవినీతి నిరోధక శాఖకే దొరికాడు. ఇతని దగ్గర 4,500 కోట్ల రూ. విలువైన 13.15 టన్నుల బంగారం, బ్యాంకు ఖాతాలో 2.65 లక్షల కోట్ల రూపాయలు దొరికాయి. రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ అంత డబ్బు అది. జాంగ్‌తోపాటు మరో 17మంది వలలో చిక్కారు.
2018 ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీస్’ అంచనా ప్రకారం అవినీతిని అరికట్టలేకపోయిన రాష్ట్రాలలో తెలంగాణ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానలో వున్నాయి. అవినీతిలో తమిళనాడు అగ్రస్థానంలో వుంది. 2017నుండి 2018లో అవినీతి గ్రోత్ రేటు 11%గా వుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఐఎఎస్‌లల్లో అవినీతి కాస్తా ఎక్కువపాలు వుంది. దేశంలో 56 శాతం ప్రజలు ఏదో ఒక రూపంలో తాము లంచాలిచ్చామని ప్రకటించారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అధ్యయనంలో అవినీతి అన్నది కస్టమ్స్‌లో, రెవెన్యూ కలెక్షన్స్‌లో, పబ్లిక్ వర్క్స్, లైసెన్సులు, పర్మిట్లు జారీచేసే సంస్థల్లోను ఎక్కువగా వున్నదని పేర్కొంది. దేశంలో పెచ్చుమీరిన అవినీతి మన దేశ ఆర్థికాభివృద్ధికి కూడా అడ్డంకిగా మారింది. 1992లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినా అవినీతి మాత్రం తగ్గలేదు. జీతాలు తీసుకొంటున్న మధ్య, చిన్నతరగతి ఉద్యోగులే నిజాయితీగా ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నారు. 90శాతం మంది వ్యాపారస్థులు, బడా కాంట్రాక్టర్లు, సినీ నటులు నిజాయితీగా తమ ఆదాయ వివరాలు ప్రకటించడం లేదన్నది తెలిసిందే. ఈ విషయంలో ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంటులో వుండాల్సినంత చురుకుదనం లేదు. దేశంలోని అవినీతి దర్యాప్తు సంస్థలన్నీ చిత్తశుద్ధితో చురుగ్గా వ్యవహరిస్తే లక్షల కోట్ల రూ.లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ప్రధానిగా వున్న సమయంలో రాజీవ్‌గాంధీ ఓ విలువైన వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం పేదలకోసం ఖర్చుచేస్తున్న ప్రతి వెయ్యి రూపాయలలో పేదలకు అందుతున్నది కేవలం రూ. 100 మాత్రమే. ఈ ప్రకటన ఆనాడు ఎంతో సంచలనం అయింది.
మన దేశంలో నిరక్షరాస్యత కూడా అవినీతికి దోహదపడుతున్నది. 1947లో అక్షరాస్యత 12 శాతం కాగా 2018కి ఇది 74.04% శాతానికి పెరిగింది. ఇది శుభపరిణామమే అయినా ఇది చాలదు. ప్రజలందరూ అక్షరాస్యులైతే వాళ్ళలో చైతన్యం వెల్లివిరుస్తుంది. ప్రశ్నించే హక్కు ఏర్పడుతుంది. ఎవరు లంచమడిగినా ప్రజలే ఎదురుతిరుగుతారు. అధికార్లుకూడా అడగడానికి భయపడతారు.
ప్రభుత్వ విధానాలలో సంస్కరణలు తీసుకురావడం కూడా అత్యవసరం. ఓ ఇంటి ప్లాన్ అనుమతికో, ఓ పరిశ్రమ స్థాపనకో, ట్రేడ్ లైసెన్సు పొందేందుకో... ఇలా ఏ పనికావాలన్నా ఫైలు అనేక దశలు దాటుకొంటూ వెళ్ళాలి... కింది స్థాయి నుండి లంచం ఇచ్చుకొంటూ వెళ్తేగాని పనులు జరగడం లేదు. ఈ విధానాలు మారాలి. ఫైల్స్ పెండింగ్‌లో వుంచినా అధికార్ల సంతకం అయ్యాక ఆలస్యమైనా సంబంధిత అధికార్లపై చర్యలు తీసుకోవాలి.

- సమ్మెట 9390745775