మెయన్ ఫీచర్

కశ్మీర్‌లో కొత్త శకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశచరిత్రలో అక్టోబర్ 31 చారిత్రాత్మకమైన రోజు.. అది నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. 72 ఏళ్లుగా కశ్మీర్ సమస్యకు అవరోధంగా ఉన్న 370వ అధికరణను ఈ ఏడాది ఆగస్టు 5న రాజ్యసభలో, 6న లోక్‌సభలో రద్దు చేసి నరేం ద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాష్టప్రతి ఈ అధికరణం రద్దుకు ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. ఫలితంగా ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019’ ఈనెల 31 నుంచి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత రాష్ట్రంగా, లడక్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరిస్తాయి. పార్లమెంటులో చేసిన చట్టానికి అనుగుణంగా జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. చరిత్రలో అరుదుగా ఇటువంటి ముఖ్యమైన రోజును మనం చూసే అవకాశం కలుగుతుంది.
370వ అధికరణం రద్దుతో జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్‌తో చర్చించేందుకు ప్రస్తుత ప్రభుత్వం లేదా భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలూ చర్చించడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోవాలి. 1947 ఆగస్టు 14న భారతదేశ విభజన జరిగింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఏదో విధంగా కశ్మీర్‌ను కబళించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కశ్మీర్ దురాక్రమణకు 1948, 1965, 1971, 1999లో భారత్‌తో చేసిన యుద్ధాల వల్ల పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఇంత జరిగినా, కశ్మీర్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తుందనేది వాస్తవం. 370వ అధికరణం రద్దు అనేది భారత సార్వభౌమాధికారాన్ని ఇనుమడింప చేసింది. కానీ పాకిస్తాన్ ఇలాంటి విషయాలను ఖాతరు చేయదు. రెండు దేశాల మధ్య మరో యుద్ధం జరిగినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదు.
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నిరంతరం ప్రోత్సహిస్తుందనేది నగ్నసత్యం. కశ్మీర్ అనేది అంతర్జాతీయ సమస్య లేదా ద్వైపాక్షిక అంశం కానే కాదు. 370 అధికరణం రద్దుతో భౌగోళిక ప్రాదేశిక సమగ్రత విషయంలో సాంకేతికపరమైన అవరోధాలను భారత్ అధిగమించింది. ఇంకా ఎవరైనా కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని భావిస్తే అంతకంటే మించిన ఆత్మవంచన ఉండదు. పాకిస్తాన్ ఎటూ తన అధీనంలో ఉన్న భూభాగాన్ని ‘ఆజాద్ కశ్మీర్’ అని పేర్కొంటూనే ఉంటుంది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య జరిగే ఎటువంటి చర్చల్లోనూ కశ్మీర్ అంశం ఉండదు. భూభాగాల మార్పిడి జరిగే ప్రసక్తి తలెత్తదు.
1971లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో భారత్‌పై వెయ్యి సంవత్సరాల యుద్ధం చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 47 ఏళ్లయింది. రెండు దేశాలు అణ్వాయుధాలతో యుద్ధానికి దిగినా, కశ్మీర్ భూభాగం విషయంలో మార్పు ఉండదు. పాకిస్తాన్‌లో ఇప్పటికీ ఊహా ప్రపంచంలో విహరించే వ్యక్తులున్నారు. ఈ తరహా వ్యక్తులు భారత్‌లో కూడా ఉన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే గజ్వా -ఈ-హింద్‌కు చెందిన మతశక్తులు భారత్‌ను జిహాదీ యుద్ధం ద్వారా ఏదో ఒక రోజు విచ్ఛిన్నం చేస్తామని, ఈ దేశం ముక్కలవుతుందనే భ్రమలో ఉంటారు. అభూతకల్పనలతో భారత్‌కు వ్యతిరేకంగా ఈ సంస్థకు చెందిన వ్యక్తులు ప్రతి నిత్యం ప్రచారం చేస్తుంటారు. ఇది ఒక ఫాంటసీ అని చెప్పవచ్చు. ‘్భరత్ ముక్కలవుతుంది.. మనదే భారత్..’ అనే భ్రాంతిలో వారు ఉంటారు. కాని భారత్ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు, కశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుంది. ఈ రోజు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ క్లైమ్ చేసుకునేందుకు ఏమీ లేదు. ఏనాటికైనా మళ్లీ అఖండ భారత్ అవతరిస్తుందని, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు భారత్‌లో అంతర్భాగమవుతాయనే భ్రమలో ఉండే శక్తులు మన దేశంలో ఉన్నాయి. ఈ భ్రమలు నిజం కావు. గతంలో ఈ దేశాలన్నీ భారత్‌లో భాగంగా ఉండేవి. బౌద్ధం, జైనం,వైదిక మతాలను ఆచరించే ప్రజలతో అఖండ భారతం విలసిల్లింది. 7వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు వెయ్యేళ్ల చరిత్రలో చోటు చేసుకున్న విషయం విదితమే. ఒక్క కశ్మీర్ అంశాన్ని కదిపితే దక్షిణాసియా దేశాల చరిత్రను అంతటినీ చర్చించాల్సి వస్తుంది.
ఇక, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అక్టోబర్ 31న కొత్త భౌగోళిక సరిహద్దులతో జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడుతాయి. దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కు తగ్గుతుండగా, కేంద్రపాలిత ప్రాం తాల సంఖ్య 7 నుంచి 9కు పెరుగుతుంది. జమ్మూ కశ్మీర్‌లో మూడు ప్రాంతాలూ విశిష్టతతో కూడుకున్నాయి. జమ్మూలో హిందువుల, కశ్మీర్‌లో ముస్లింల, లడక్‌లో బౌద్ధుల ఆధిపత్యం ఎక్కువ. రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్స్‌ను నియమించారు. లడక్ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మూ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి రెండు రాజధానులు ఉన్నాయి. శ్రీనగర్ వేసవి కాలం రాజధానిగా, జమ్మూ శీతాకాలం రాజధానిగా గుర్తింపు పొందాయి. కొత్త చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు కేంద్రానికి ఉంటాయి. 2000 సంవత్సరం తర్వాత దేశంలో రెండు రాష్ట్రాల విభజన జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో జరిగింది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఐదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత రాష్ట్రంగా, లడక్ కేంద్రపాలిత ప్రాం తంగా ఏర్పాటవుతున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు, ఈ ఏడాది జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు ప్రజల నిరసన మధ్యనే పార్లమెంటులో ఆమో దం పొందాయి. రాష్ట్ర విభజనను ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించగా, తమకు స్వాతంత్య్రం లభించిందని తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి 370వ అధికరణం రద్దును, రాష్ట్ర విభజనను ప్రతిపక్ష పార్టీలు సహా స్థానికంగా కొంతమంది ప్రజలు వ్యతిరేకించారు. ఈ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా దౌత్యవేత్తలంతా చర్చించి తమ అభిప్రాయాలు తెలిపారు. సరిహద్దు రాష్ట్రం, సున్నితమైన సమస్యలు, జవాన్ల త్యాగనిరతి సాహసోపేతమైన పోరాటాలతో ముడిపడి ఉన్నందున దక్షిణాది, ఉత్తరాది పార్టీలు ఈ అంశంపై చర్చించకుండానే పార్లమెంటులో మద్దతు ఇచ్చాయి. 1980 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్‌లో చెలరేగిన హింస వల్ల సుమారు 42వేల మంది మరణించారు
పార్లమెంటు చట్టం ప్రకారం శ్రీనగర్ కేంద్రంగా జమ్మూ కశ్మీర్, లడక్‌లకు ఒకటే హైకోర్టు పనిచేస్తుంది. జమ్మూ కశ్మీర్ పాలన రాజ్యాంగంలోని 239వ అధికరణకు లోబడి జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కేంద్రపాలిత రాష్ట్రం హోదా పుదుచ్చేరితో పాటు ఢిల్లీకి ఉంది. ఈ రాష్ట్రాల సరసన ఇపుడు జమ్మూ కశ్మీర్‌ను చేర్చారు. 239ఏ అధికరణం కింద కశ్మీర్‌లో పరిపాలన కొనసాగుతుంది. కశ్మీర్‌లో అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను 107 నుంచి 114 వరకు పెంచనున్నారు. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం ఐదేళ్లే. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా కేంద్రపాలిత రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు ఉంటాయి. దశాబ్దాల తరబడి భారత ఉపఖండంలో హింసకు కేంద్రబిందువుగా మారిన జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న లక్ష్యంతో 370వ అధికరణం రద్దు బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో ఆగస్టు 5న, లోక్‌సభలో ఆగస్టు 6న ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
జమ్మూ కశ్మీర్‌లో ఇపుడు కొత్త చరిత్ర ప్రారంభమైంది. గతంలో కంటే భిన్నంగా జనజీనవ స్రవంతిలో కశ్మీరీలను చేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. 370వ అధికరణం రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన వల్ల ఉగ్రవాదం అదృశ్యం కావడం అసాధ్యమే. కశ్మీర్‌లోకి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనునిత్యం ప్రవేశిస్తూ రక్తపాతం సృష్టించకుండా ఉండరు. తాజాగా దక్షిణ కశ్మీర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఐదుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, పుల్వామా ఘటనలతో దేశ ప్రజలు కశ్మీర్ సమస్యకు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం లభించాలని కోరుకున్నారు. అందుకే 370 అధికరణం రద్దు ద్వారా కశ్మీర్‌కు సంబంధించిన అనేక చిక్కుముడులను బీజేపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు పార్లమెంటు నిర్ణయానికి హర్షాతిరేకాలతో ఆమోదం తెలిపారు.
‘న్యూయార్క్ టైమ్స్’కు చెందిన ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ కింజర్ కశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రజల ఆలోచనల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ నాయకులు సంకుచితంగా ఆలోచిస్తుంటారు. వారు జీవితంలో చాలాభాగం భారత్‌ను ఎలాగైనా జయించి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేదానిపైనే చర్చోపచర్చలు చేస్తుంటారు. భారత్‌తో యుద్ధం చేసి కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలంటుంటారు. ఆఫ్ఘనిస్తాన్ తాము చెప్పినట్లు నడుచుకోవాలంటారు. అదే సమయంలో అమెరికా చేసిన పాపాలకు శిక్షలు పడాలంటారు..’ అని ఆయన పేర్కొన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ- 370వ అధికరణం రద్దు, కశ్మీర్ విభజనతో కొత్త శకం ఆరంభమైంది. వేర్పాటువాదం, ఆశ్రీత పక్షపాతం, అవినీతికి 370, 35ఏ అధికరణలు పునాది వేశాయి. అందుకే వీటిని రద్దు చేశాం. జమ్మూ కశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈబీసీలతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలి’ అని ఆయన పేర్కొనడం జాతీయవాదానికి నిదర్శనం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097