మెయిన్ ఫీచర్

తెలుగు కృషీవలుడు ఖండవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య సార్థవాహులు కొందరు పట్ట్భాషిక్తులకు, బరాయ్యెం నవాబులకు బరాబరులుచేస్తూ, పొగడితల రగడలు రచిస్తూ, నిజాం ప్రభుత్వంలో పదవులు పట్టుకుని, ఎంతో అధికారం ఉన్నా ఇరుగుపొరుగులకు ఇంతైనా ఉపకారం చేయకపోగా, ఏవిటో తవ్వి తలకెత్తినట్టు మేకపోతు గాంభీర్యంతో మసలుతూ, పరివారగణంతో నవ్యరీతులకు నారులు పోసినవారని, సాహిత్యానికి కొత్త సొబగులు సమకూర్చినవారని, చరిత్రకు చరిత్ర యిచ్చినవారని కైవారాలు చేయించుకుంటున్న సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్దంలో కొండలాగ, నివురులో నిప్పులాగా, కుండలో దీపంలాగ ఉంటూ న్యాయానికి, ధర్మానికి పట్టుగొమ్మగా ఉన్న యిద్దరు ముగ్గురు ఆచార్యులలో ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ఒకరు.
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు అనువుకానిచోట మాత్రమేకాదు, అనువైన చోటకూడా అధికుణ్నని చెప్పుకోలేదు. పై అధికారులు రికార్డులలో ఎన్ని అవకతవక ఎంట్రీలు చేసినా, వారు విద్యార్థుల సహృదయాలు, విద్వాంసుల మన్ననలు చూరగొన్నవారు గనుక తొణకలేదు బెణకలేదు; మనసు చీకాకు పరచుకొని తగాదాలకు దిగలేదు. కర్తవ్య నిర్వహణలో ఏమరుపాటు చూపలేదు; ఆత్మవిశ్వాసం కోల్పోయి అధికారుల ఆదర కటాక్షానికి అంగలార్చలేదు. ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుకు ఇంతటి స్థానం లభించేది కాదు. తెనుగు భాషపై కూరిమే వారి ఓరిమికి కారణం.
ఇంతటి అభిమానధనులు, విద్యార్థి వత్సలులు అయిన ఖండవల్లివారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకా బెల్లంపూడి గ్రామంలో 1908లో జన్మించారు. బెల్లంపూడి సమీపంలోని ఉడుమూడిలో ప్రాథమిక విద్య, అమలాపురంలో రెండవ ఫారం ముగించారు. వారి జనకులు సూర్యనారాయణశాస్ర్తీగారు అప్పుడు వరంగల్లు మఠ్ఠెవాడలోని త్రిలింగాంధ్రాయుర్వేద కళాశాలలో సంస్కృత పండితులు కావడంవల్ల ఖండవల్లివారూ వరంగల్లుకు వచ్చి, హనుమకొండ హైస్కూలులో మూడవ ఫారంలో చేరి మెట్రిక్ ముగించి, 1924లో రాజధానిలోని నిజాం కాలేజిలో ప్రవేశించి బి.ఏ.లో సంస్కృతంలో విశ్వవిద్యాలయం ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత సిటీ కాలేజిలో ఇంగ్లీషు టీచరుగా పనిచేయసాగారు. 1936లో తెనుగు-సంస్కృతం ఎం.ఏ.లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో లెక్చరరుగా చేరారు. రాయప్రోలు సుబ్బారావుగారి పదవీ విరమణ తర్వాత ఆచార్య (ప్రొఫెసర్) పీఠం అధిష్ఠించారు.
వారికి విద్యార్థి దశనుంచే ఆదిరాజు వీరభద్రరావుగారి వంటి పరిశోధకులతోను, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డిగారి వంటి ప్రజాసాహిత్య సేవకులతోను, లోకనంది నారాయణగారి వంటి సాహిత్య పోషకులతోను పరిచయం కలిగింది. విశ్వవిద్యాలయంలో రెక్టార్ కిషన్‌చంద్ వంటి ధర్మపరాయణుల బలం చేకూరింది. లక్ష్మణరాయ గ్రంథాలు వారిని విశేషంగా ప్రోత్సహించాయి. 1936 నుంచే సాహిత్య సేవ ప్రారంభించారు. ‘‘తెలుగుదుక్కి’’ శీర్షిక క్రింద వ్యాసాలు వ్రాశారు. ఆధునిక కవితను గురించి త్రివేణి మొదలయిన ఆంగ్ల పత్రికలలో పెక్కు వ్యాసాలు ప్రకటించారు. కొన్నాళ్ళు కవితా చెప్పారు.
తెలంగాణాలో సారస్వత సేవకు ఆలవాలమయిన కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వారి కృషిని ఉద్దీపితం చేసింది. రెండు సంవత్సరాలపాటు (1936-37) ఆ భాషా నిలయానికి కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత కూడా పుస్తకాల సేకరణకోసం, చందాలకోసం తెలంగాణ అంతటా పర్యటించారు. వర్ధంతులు, జయంతులు ఎన్నో జరిపారు. సారస్వత పరిషత్తుకు సభ్యులుగా ఉండి దాని విస్తృతికి కృషిచేశారు. నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘం కార్యదర్శిగా ఉన్నారు. సర్కార్ నౌకరీ మినహాగా ఏమిచేసినా అనుమానించే పోలీసుల నిఘా ఎక్కువ కావడంవల్ల ఈ కార్యకలాపం కొంత కట్టిపెట్టవలసి వచ్చింది.
ఇలాటి నిగాలు, గుమానులు పడే పనులకంటె శాశ్వత ప్రయోజనం గల కృషికి పూనుకోవడం మేలని వారికి తోచింది. కొమర్రాజువారు వదలిపెట్టిన విజ్ఞాన సర్వస్వం పూర్తిచేయాలనే కోరిక కలిగింది. ఇద్దరు ముగ్గురు ఆప్తమిత్రులతో కలిసి గ్రంథావలోకనం, విషయ సంగ్రహణం ప్రారంభించారు. 1940 ప్రాంతంలో యుద్ధం మూలంగా విద్యుద్దీపాలు లేనందున ఆముదం దీపాల వెలుగులోనే చదువు, వ్రాత కొనసాగించారు. 1944 నాటికే విజ్ఞాన సర్వస్వం పూర్తిచేద్దామనుకున్నారు. మహారాష్ట్ర జ్ఞానకోశ్ ఉండనే ఉంది. దానిని ఆదర్శంగా పెట్టుకొన్నారు. నాలుగైదు సంపుటాల విషయం ఐదారు నెలలలో సిద్ధమయింది. దానిని ముద్రణకు ఇద్దామని సైకిలు కొరియర్‌కు కట్టి బయలుదేరారు. దారిలో పనిబడి ఒక దుకాణం వాకిట్లో సైకిలు ఆపి లోపలికి వెళ్ళారు. తిరిగి వచ్చి చూస్తే సైకిలు, విజ్ఞాన సర్వస్వం, సర్వస్వం పోయాయి. ఏ సాహిత్య ప్రేమియో, సైకిల్ ప్రేమియో కొట్టుకుపోయాడు. ఆ ప్రయత్నం అంతటితో ఆగింది.
ఇంతలో రాయప్రోలు సుబ్బారావుగారు పదవీ విరమణ చేయడంవల్ల ఖండవల్లివారు ఆచార్య పదవి అధిష్ఠించవలసి వచ్చింది. విశ్వవిద్యాలయంలో సంస్కృతిని గురించి పాఠాలు చెప్పవలసి వచ్చింది. దానికోసం చేసిన అధ్యయన ఫలితమే ‘ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి’, ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం’ వంటి ఉద్గ్రంథాలు. కొన్నాళ్ళకు దేశం స్వతంత్రమైంది. తమను అభిమానించిన వారు మంత్రులు, మహామంత్రులు అయ్యారు. దానితో ఖండవల్లి వారికి విజ్ఞాన సర్వస్వం పునరారంభవాంఛ రేకెత్తింది.
‘‘బిరుదు వేంకట శేషయ్యగారు, లోకనంది నారాయణగారు, రావాణవారు విజ్ఞాన సర్వస్వంకోసం మాలాగే అదివరకే ప్రయత్నించి విఫలులయ్యారు. మా మిత్రులు, అభిమానులు తోడ్పడుతారనే నమ్మకంతో 1953లో చేతనభట్ల విశ్వనాథంగారూ, నేనూ కలిసి వర్ణక్రమానుసారంగా విజ్ఞాన సర్వస్వం తయారుచేద్దామని మరల పూనుకున్నాము. ఒక సంఘం నియమించుకొని మామిడిపూడి వెంకట రంగయ్యగారిని చైర్మన్‌గా పెట్టుకొన్నాము. చందాలు పోగుచేశాము. ప్రభుత్వం పదివేల రూపాయలు మంజూరుచేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయలు విరాళమిచ్చింది. మద్రాసులోని తెలుగు భాషా సమితివారు చేస్తున్న కృషి అప్పటికి గాని మాకు స్పష్టంగా తెలియలేదు. కనుక మా సంఘం పేరు ‘‘సంగ్రహ విజ్ఞానకోశ సమితి’’ అని మార్చుకొన్నాము. ఇప్పటికి మూడు సంపుటాలు వచ్చాయి. నాలుగవది ముద్రణలో ఉంది’’- అన్నారు ఖండవల్లివారు.
వారు ఆంధ్ర రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ, దాని పక్షాన సిద్ధేశ్వర చరిత్ర, ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం సంస్కృత లిపిలో అహోబల పండితీయం (ఆంధ్ర వ్యాఖ్యా సహితం) ప్రచురించారు. ఓరియంటల్ కాలేజి స్థాపించి, 1958లో బి.ఓ.ఎల్., డి.ఓ.ఎల్. వంటి ప్రాచ్య పట్టాలు విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. స్వామి వివేకానంద కమిటీ హైస్కూలుకు కార్యదర్శిగా ఉండి, దానికి భవనం కట్టిస్తున్నారు.
ఖండవల్లివారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేసిన సేవ తెనుగుకు, తెనుగు వారికి బహుకాల బహుఫలాలు కలిగించే నిరుపమసేవ. వారు ఆచార్య పదవి ఆధిష్ఠించిన తర్వాత తెనుగుకు స్థాయి, హాయి ఏర్పడ్డాయి. తెలుగు విద్యార్థి తల ఎత్తుకొని తిరుగసాగాడు. ఎం.ఏ. తరగతిలో సంస్కృతం, ద్రావిడ భాషల్లో ఏదో ఒకటి తప్పక తీసుకొనే ఏర్పాటుచేశారు. తెనుగును ‘సెకండ్ లాంగ్వేజ్’ చేయడంకోసం అకడమిక్ కౌన్సిల్‌లో పోరాడి గెలిచారు. పి.హెచ్.డి. పెట్టించారు. విద్యార్థులకు తెలుగంటె మన మాతృభాష అనే ఆదరం కలిగించారు. విద్యార్థులతో పలువురు కవులపై చర్చాగోష్ఠులు జరిపించి, వారికి పరిశోధనాభిరుచి పుట్టించారు. మహాభారతంపైన, నాటకాలపైన, శ్రీనాథునిపైన సదస్సులు జరిపించి వాటిని గ్రంథ రూపంగా ముద్రించడానికి ఏర్పాట్లుచేశారు. శ్రీనాథ పదప్రయోగ సూచిక తయారుచేయించి ముద్రిస్తున్నారు.
ఖండవల్లివారు అత్యంత నిరాడంబరులు. రాత్రి తొమ్మిది గంటలకు పడుకొని, రెండు గంటలకు లేచి వ్రాసుకుని, ఉదయం మరల కొంతసేపు పడుకోవడం వారి అలవాటు. సంగ్రహ విజ్ఞానకోశానికి వారు ప్రధాన సంపాదకులు. దాని పనితోను, థీసిస్‌ల పర్యవేక్షణతోను వారికి వ్యవధే ఉండదు. చిన్నప్పుడు హాకీ, ఫుట్‌బాల్ ఆడేవారు. ఈత వారికి చాలా యిష్టం. ‘‘1929లో స్కౌట్ మాస్టర్‌గా గద్వాలకు వెళ్లాము, నా వెంట నా తమ్ముడు బాలేందు శేఖరం వచ్చాడు. కృష్ణకు వెళ్లాము. నా తమ్ముడు గట్టుసరిగా చూడక నీళ్ళలో దిగాడు. కొట్టుకుపోయాడు. నేను వెంటనే దూకి, అతన్ని రక్షించాను. ఎన్నోసార్లు ఈతలోను, బోట్ రేస్‌లోను ఫస్ట్‌గా వచ్చాను’’ అంటూ వారు చిన్ననాటి ముచ్చట్లను ముక్తసరిగా చెబుతారు.
విశ్వవిద్యాలయం పక్షాన మరి మూడు గొప్ప పనులు ప్రారంభించారు.
(1) విశ్వవిద్యాలయం పక్షాన ఆంధ్ర మహాభారతం పునర్ముద్రణ చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రాథమిక చర్యలు పూర్తయ్యాయి. పాఠాంతరాలను సేకరించే పని సాగుతున్నది. ఈ ప్రణాళికను విశ్వవిద్యాలయోపాధ్యక్షులు డాక్టర్ డి.ఎస్.రెడ్డి ఆశీర్వదించారు. విశ్వవిద్యాలయార్థిక సహాయ సంఘాధ్యక్షుడు డాక్టర్ కొఠారీ ప్రశంసించారు.
(2) తెలంగాణలోని మాండలికాల అధ్యయనానికి పథకం సిద్ధపరచారు.
(3) ఆంధ్ర దేశపు చారిత్రక భూగోళం (ది హిస్టారికల్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్ర) రచించాలని ప్రయత్నిస్తున్నారు. శాసనాలను, సారస్వతంలోను ఉన్న స్థలాల పేర్లు సేకరిస్తున్నాము. ఇవన్నీ ఎలా ఉన్నా మహాభారత ప్రకటన కొనసాగితే చాలు’’ అన్నారు వారు.
అమృతహస్తులైన ఖండవల్లివారు ఆరంభించినదేదీ విఫలం కాలేదు. ‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’’ అన్నది వారు ఏనాడో జీర్ణించుకొన్న నీతివాక్యం. అదే వారి అఖండ విజయానికి నాందీ వాక్యం.
*
- తిరుమల రామచంద్ర
(1975లో తిరుమల రామచంద్ర
‘మరపురాని మనీషి’ శీర్షికతో 29 మంది మహనీయుల పరిచయాత్మక వ్యాసాలు రచించారు. వాటిలోంచి సంగ్రహించినదే ఈ వ్యాసం.)