మెయిన్ ఫీచర్

హీరో చెప్తే సరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాను సినిమాగానే ప్రేక్షకులు చూస్తున్నారా? అని ప్రశ్నిస్తే అన్ని సినిమాలూ అలాగే చూస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ చిత్రాల్లో చర్చించిన అంశాలు అలాంటివి. మామూలుగా సినిమా అంటే ఓ ప్రేమ.. నాలుగు ఫైట్లు.. ఆరు డ్యూయెట్లు.. కాసిని కామెడీ సీన్లు అల్లుకుంటూ వెళ్తే చాలు. కానీ ఎప్పుడూ అదే మూస చెల్లడం లేదు. అందుకనే దర్శక రచయితలు కొత్త అంశాలు వెతుకుతున్నారు. అప్పుడప్పుడు వజ్రాల్లాంటి కథలకు సానబడుతున్నారు. అలాంటి చిత్రాలనూ ప్రేక్షకుడూ వినోదిస్తున్నాడు. ఏంటి అలాంటి.... సినిమాల స్పెషల్ అని తడిమిచూస్తే -ఒకటో రెండో కొత్త అంశాలు రొటీన్‌కి భిన్నంగా కళ్లకు తగులుతాయి. అవి నిజ జీవితానికి సంబంధించి బోర్‌కొట్టని విషయాలైవుంటాయి. ప్రేమ పెళ్లిలాంటి రోటీన్ కథనాలను పెనవేసుకుంటూనే.. ప్రతివాడి జీవితంలో ఒక్కసారైనా ఎదురయ్యే సన్నివేశాలు ఒకింత ప్రత్యేకంగా పలకరిస్తాయి. అన్ని చిత్రాలు ఒకలా ఉండవన్నట్టే.. ఈ చిత్రాలూ కాస్త భిన్నంగానే ఉన్నాయన్న సంతృప్తి మిగులుస్తాయి.

సినిమా చూసి ప్రేక్షకుడు ఆలోచనా దృక్ఫథాన్ని మార్చుకుంటాడా? -లాంటి ప్రశ్నలు ఇక్కడా ఉద్భవిస్తాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలు పరిశ్రమకు కొత్త కాదు. ఒక్కో సినిమాకు, ఒక్కో సందర్భంలో ఒక్కోలా.. ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొంటూనే వచ్చింది, వస్తోంది. నిజానికి టీవీల్లో, సినిమాల్లో యాడ్స్ చూపిస్తూ -సిగరెట్ తాగొద్దు. మద్యం సేవించొద్దు. లేదంటే బతుకు బస్టాండ్ అయిపోద్ది.. అంటూ భయంకరమైన సీన్లు చూపిస్తే మాత్రం మానుకుంటున్నారా? కానీ ప్రభుత్వాలు ప్రేక్షకుడి పట్ల జాగరూకత వహించడం కోసం అలాంటి ప్రకటన చూపించాలంటూ నిబంధన పెడుతూనే ఉంది. సినిమాలోనూ సందర్భానుసారం పాత్రలు ఎక్కడైనా ధూమపానం చేసినా, మద్యం సేవించినా కింద చట్టబద్ధమైన హెచ్చరిక చూపించాలని చట్ట నిబంధన పెడుతూనే ఉంది. అంతమాత్రం చేత ప్రేక్షకుడు వాటిని వదిలేస్తున్నాడా? అంటే కచ్చితమైన సమాధానం ఇవ్వలేం. కానీ, అలాంటి ప్రకటనలు చూసి ఒక్కరో ఇద్దరో ఆ అలవాట్లకు దూరం కాకపోతారా? అన్న చిన్న ఆశ.
సో.. సినిమా కథల్లోనూ కొన్ని మంచి విషయాలను స్టార్ హీరోలతోనో, ఉదాత్తమైన అంశాలను స్టార్ హీరోయిన్లతోనో చెప్పిస్తే, చూపిస్తే ఆడియన్స్‌పై ప్రభావం ఉంటుందన్న అంశాన్ని నమ్మే రోజులొచ్చాయి. గతంలో హీరోకి ఏదైనా దురలవాటుంటే -దాన్ని స్టయిల్ పేరిట అభిమానులు అనుకరిస్తున్నారన్న వాదనలు వినిపించేవి. అలాంటి సందర్భాల్లో దర్శకుడో, నిర్మాతో -ప్రేక్షకుడికి వినోదం పంచడానికి తప్ప వాళ్ల జీవితాలపై ప్రభావం చూపించవన్న వాదన వినిపించేవారు. అది నిజమే కావొచ్చు. కానీ, మంచి విషయాలను మంచోచెడో అనుకరిస్తున్నారని తెలిసినపుడు -అలాంటి అంశాలు కథలో ఉండేలా చూసుకోవడం గగనమేమీ కాదు. హృదయాన్ని కట్టిపడేసే కథనంతో -సామాజిక బాధ్యతను చూపించగలిగితే కచ్చితంగా వాటిని అనుసరిస్తాడని ఇటీవల కొన్ని చిత్రాలు నిరూపించాయి. గతంలో శారద నటించిన -మనుషులు మారాలి చిత్రంలో అనాథలు, ఆర్తులపట్ల సానుభూతి, దయ చూపించాలని చెబితే ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేశారు. అందుకు తగ్గట్లుగా అప్పట్లో సంఘంలో సానుభూతి, దయలాంటి అంశాలను బాధాతప్తులపై చూపారు. అదొక సంచలనం. తర్వాత కమర్షియల్ పంథాలో పడిపోయిన తెలుగు సినిమా ప్రేక్షకుడి హృదయాన్ని తట్టిలేపే కథనాలను వినిపించలేకపోయింది. చాలాకాలం తరువాత -అటువంటి వాతావరణం తెలుగు పరిశ్రమలో మళ్లీ కనిపిస్తోంది. ఆడియన్స్‌లో ఆలోచనలు రేకెత్తించే సినిమాల్లో స్టార్లు నటిస్తుండటంతో -వీటి ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ఉదాహరణకు కొద్దిరోజుల క్రితం వచ్చిన గోపాల గోపాల చిత్రాన్ని ప్రస్తావించొచ్చు. కథనంలోని వినోదంతోపాటు, ఆలోచనలు రేకెత్తించే సంభాషణా బాణాల్ని జనం మీదకు వదలటంతో -దొంగ బాబాల బాగోతాలు జనానికి అర్థమయ్యాయి. ఆధ్యాత్మిక భావన ముసుగులో కొందరు చేస్తున్న మోసాలకు తెరపడింది. ఇందుకు కారణం కథ, కథనం మాత్రమే కాదు, ఆయా పాత్రల్లో స్టార్ హీరోలు కనిపించడం కూడా ఒక కారణం. పవన్‌కళ్యాణ్, వెంకటేష్‌లు కాకుండా, మరెవరైనా కొత్త నటులు ఆయా పాత్రల్లో కనిపించివుంటే ఆడియన్స్‌పై సినిమా ప్రభావం చూపించేదా? అంటే దానికి సమాధానం మాత్రం కచ్చితంగా ఇలా ఉండదు. టాప్ హీరోలు నటించడంవల్ల కొన్ని కథలకు గ్లామరొస్తుంది. సంఘంలో అవి నిత్యసత్యాలుగా నిలుస్తాయని ప్రేక్షకులే రుజువు చేస్తున్నారు. అంతకుముందు -ఆ నలుగురు చిత్రం చూసి నలుగురు స్నేహితులను జీవితంలో సంపాదించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినవాళ్లున్నారు. వీళ్ల సంఖ్య వేల సంఖ్యలో ఉండకపోవచ్చు. కానీ, అదే సంఖ్య పదో పరకో ఉన్నా సినిమాకు సార్థకత చేకూరినట్టే. మరికొంచెం ముందుకెళ్తే దర్శకుడు క్రిష్ ప్రయోగించిన -వేదం చిత్రం చూశాక నైతిక విలువల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నవాళ్లు లేకపోలేదు. శర్వానంద్ నటించిన ‘అందరి బంధువయ’ చిత్రంలో చర్చించిన అంశాలూ ప్రేక్షకులను ఆలోచింపచేశాయి. మొన్నీమధ్య వచ్చిన ‘బంగారు తల్లి’ చిత్రం -సామాజికంగా ఎంత చర్చకు వచ్చిందో తెలిసిందే.
అత్తారింటికిదారేది అంటూ పవన్‌కళ్యాణ్ వస్తే అందరూ అత్తమ్మ మానియాలో పడ్డారు. అంతకుముందు వరకూ ఇదే సినిమా స్క్రీన్‌పై అత్తతో హీరో సరసాలు చూసి -‘ఆంటీ’ని అదోలా చూసినా ఆడియనే్స -ఇప్పుడు అదే అత్తమ్మను అమ్మలానూ చూస్తున్నారు. ఈ మార్పు నిజమని చెప్పడానికి ఏదీ ప్రామాణికత? అంటే భౌతికంగా చూపించలేకపోవచ్చు. కానీ -ప్రవర్తనలో మార్పు వస్తోందని చెప్పడానికి చెడును చూపిస్తే తిప్పికొడుతున్న ప్రేక్షకుడే ఉదాహరణ. అందుకే -తర్వాత వస్తున్న చిత్రాల్లో అత్తను సెక్సీ సింబల్‌గా చూపించే సన్నివేశాలకు తెరపడింది.
శ్రీమంతుడు చిత్రంలో పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి అన్న సంకల్పంతో వచ్చిన మహేష్‌బాబును ప్రేక్షకుడు ఆదరించాడు. ఊరినుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అన్న డైలాగ్ ప్రేక్షకుడిమీద భయంకంగా పని చేసింది. దీనికితోడు డైలాగ్ చెప్పింది స్టార్ హీరో మహేష్‌బాబు కావడంతో అది జనంలోకి సులువుగా వెళ్లిపోయింది. గతంలో పల్లెలు ఒదిలి పట్టణాలకు వెళ్లిన కథలు తెలుగు చిత్రాల్లో అనేకం వచ్చాయి. ఈ చిత్రంలోనూ అదే కథనం ఉన్నా కానీ, అగ్ర కథానాయకుడు చెప్పడంతో ఆ సందేశానికి గ్లామర్ వచ్చింది. తర్వాత అనేకమంది సొంతూరు ప్రయోజనాల కోసం కొద్దోగొప్పో ఆలోచించారు. మరికొంతమంది తమకు చేతనైనంత చేసి తమ ఊరిని అభివృద్ధి పథాన నడిపించాలన్న ఆలోచనలో పడ్డారు. గతంలో ఎన్నారైలు తమ పుట్టిన ఊరి బాగుకోసం ఎన్నో చేస్తున్నట్టుగా వార్తలు చదివాం. కానీ ఆ వార్తలకు రాని గ్లామర్, ఈ సినిమాతో వందశాతం వచ్చింది. అందుకే ప్రేక్షకులలో మార్పు గోచరిస్తోంది. సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో తండ్రి విలువ, అనుబంధాల చిత్రీకరణ అద్భుతంగా చూపించారు. నాన్న విలువను సమాజానికి తెలియజెప్పి, ఆయన నమ్మిన మార్గాన నడిచి విజయం సాధించిన కొడుకు కథ బన్నీదైతే, నాన్నకోసమే జీవితాన్ని పణంగా పెట్టిన హీరో కథ ఎన్టీఆర్‌ది. ఇద్దరూ స్టార్ హీరోలే. ఇద్దరూ తండ్రి విలువను తెలియజెప్పిన కథా పాత్రలు చేసినవాళ్లే. ఈ చిత్రాలు చూశాక చాలామంది ఆలోచనలో పడ్డారు. సినిమాచూసి బయటికి వచ్చిన కొడుకులు అనేక మంది -తమ తండ్రులకు ఫోన్‌చేసి ‘ఎలావున్నావ్ నాన్నా’ అని పలకరించిన వాళ్లూ ఉన్నారు. ఇవే ఆ చిత్రాల విజయాలు. తండ్రి తనకోసం ఎంత కష్టపడతాడు? ఆ కష్టం తెలియని కొడుకు తండ్రిని ఎంత నిర్లక్ష్యం చేస్తాడు? ఇవన్నీ సమాజంలో ఉన్న పెడ ధోరణులే. కానీ ఇటువంటి వాటికి సమాధానం చెప్పాయి, ఈ చిత్రాలు. ఇక్కడా -స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాకుండా కొత్త నటులు చేసివుంటే -ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకుంటారా? అంటే డౌటే. ప్రేక్షకులందరికీ దాదాపు సినిమాలో ఉన్న అంశం చేరింది. గతంలో చిరంజీవి కూడా మీరు ముగ్గురికి సహాయం చేయండి. వారు కూడా మరో ముగ్గురికి సాయం చేస్తారంటూ స్టాలిన్‌తో విశ్వరూపం చూపించాడు. అప్పుడూ ఆ విషయంపై సమాజంలో కొంతవరకూ చర్చ నడిచింది.
చివరికి చెప్పొచ్చేదేమంటే సంఘంలో ఉన్న వికృతులపై యుద్ధంచేసే అవకాశం, నాలుగు మంచి విషయాలు అభిమానులను చెప్పగల అదృష్టం టాప్ హీరోలకు ఉంది. వీళ్లు చెప్పడంవల్ల, అటువంటి చిత్రాల్లో నటించడంవల్ల ఆయా మంచి మాటల ప్రభావం ఆడియన్స్‌పై కచ్చితంగా కనిపిస్తుంది. టాప్ హీరోలైనా పబ్లిక్‌పై బాధ్యత ఉంది కనుక -మంచి విషయాలను అభిమానులకు చెప్పే కథలను అప్పుడప్పుడైనా ఎంచుకోవాలి. వ్యాపారాత్మకంగా ప్రతి చిత్రంలో కమర్షియాలిటీకి ప్రాథాన్యత ఇచ్చినా, సమాజానికి, మనిషికి మంచి చేసే అంశాలనూ అందులో చేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఓ కథను ఒప్పుకుని చిత్రంగా చేయడానికి ముందుకెళ్లినపుడు, ఈ సినిమాతో సంఘానికి నేనేం చెబుతున్నాను అని ఒక్కసారి ఆలోచించాలి. ఆ బాధ్యత టాప్‌స్టార్లదే.

-సరయు శేఖర్