మెయిన్ ఫీచర్

బలవన్మరణం పరిష్కారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూపుని బట్టి ప్రపంచం కనిపిస్తుంది. పలకరింపుని బట్టి పరిచయాలు పెరిగి స్నేహాలుగా మారడం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకొచ్చే విషయాలే. పిల్లలు తల్లిదండ్రుల కలల పంట. విద్యాబుద్ధులుగా పెరిగిన పిల్లలు తల్లిదండ్రుల ఆనందాన్ని పెంచిన వారవుతారు. క్రమశిక్షణతో ప్రయోజనకారులుగా పెరిగిన వారెవరైనా విలువైన జాతి సంపద. చిత్రంగా జీవితంలో ఆశ మూడడుగులు వేసేలోపు నిరాశా నిస్పృహలు ముప్పై అడుగులు ముందుకెళుతుంటాయి. మానవ సహజమైన ప్రేమాభిమానాలు, జాలి, కరుణ, సానుభూతి వంటి మానవీయ విలువలు కలిగినవారు నిత్య జీవితంలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటిని అనుకూలంగా మార్చుకునేందుకు అహరహం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంటారు. అనుకున్నది సాధించడంలో కొంత ఆలస్యం అనివార్యమైనా సానుకూల దృక్పథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడరు. అసహనం, చికాకు, లెక్కలేనితనం ముందు పుట్టి తర్వాతనే వీరు పుట్టారా అన్నట్లు కన్పించేవారు తామనుకున్నది అనుకున్నట్లు జరగాలని కోరుకునే తీరు పలు అనర్థాలకు దారితీస్తుంది. ఇంటా బయటా వీరికి ప్రతిదీ సమస్యే. ప్రతిదీ ఒక్క చిక్కుముడే. తెలిసీ తెలియని వయస్సులో ఈ తీవ్రత మరింత ఎక్కువేనని చెప్పక తప్పదు.
తమ తల్లిదండ్రులు తమమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నది, తమ కుటుంబం తమ బంగారు భవితనెంతగా కోరుకుంటుంది వీరికి అర్థమవదు. చీటికిమాటికి విసుక్కోవడం, ఆ కుటుంబంలో పుట్టడమే శాపంగా, పాపంగా భావించేవారు లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తుంటారు. స్నేహితులతో, బంధువులతో మర్యాదగా నడుచుకునే తీరుని తల్లిదండ్రులు వివరించే తీరు సైతం వీళ్లెంతమాత్రం ఇష్టపడరు.
తనకిష్టమైన తీరులో తనను వుండనివ్వమని, ఎవరికోసమో తను మారవలసిన అవసరం కాని, తనను తాను మార్చుకోవలసిన అవసరం కాని లేదన్నట్లు ముఖమీదే చెబుతుంటారు. తల్లిదండ్రుల హితవచనాలే పట్టించుకోనివాళ్లు, హితాన్ని మరెక్కడ వంటబట్టించుకుంటారనుకోవడం నిస్సందేహంగా అత్యాశే అవుతుంది. చదువుకునే వయసులో చదువు తప్ప మరొక విషయంపై దృష్టి వండకూడదు. చదువులో ఎంతగా రాణించినా చదువరుల సంఖ్య ఎక్కువగా వున్నపుడు పోటీ పరీక్షల్లో నెగ్గి, తగిన ఉద్యోగం రావడం తేలికైన విషయం కాదు. చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు, ఎన్నో రకాల కోర్సులున్నాయి. తక్కువ శ్రద్ధతో తక్కువ మార్కులతో ఏదో ఒక దారిలో వాటిలో ప్రవేశించి రాణించాలనుకోవడం దురాశే అవుతుంది.
జీవితం అందమైనది, అద్భుతమైనదనుకొనేందుకు సిరిసంపదలో, పలుకుబడులో ప్రాపకాలో అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదు. తెలిసీ తెలియని వయసులో ఇవన్నీ వున్నవారు సమాజంలో తమకెదురులేదనుకున్నా ఇవేవీ లేని తమ తల్లిదండ్రులవల్ల తమకేమిటి లాభం అనుకున్నా మూర్ఖత్వమే. స్వశక్తితో నడక ప్రారంభించి కావలసిన మెళకువలతో పరుగు కొనసాగించడం ఆరోగ్యకరమైన పరిణామం. తమకు చదువున్నా లేకున్నా తమ పిల్లలు చదివి జీవితంలో రాణించాలనుకోవడం, తమ కన్నా మెరుగైన జీవితం అనుభవంలోనికి తెచ్చుకోవాలని ఆశించడం సహేతుకమే. ప్రతిక్షణం పిల్లల భవిత కోసం తపించే తల్లిదండ్రుల్ని ఎవరూ తప్పు పట్టవలసిన అవసరం లేదు. నిజమే, జీవితమంటే ఒక మంచి విద్యాలయంలో సీటు దక్కించుకోవడమో, ఒక హోదా కలిగిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడమో, చేపట్టిన వృత్తిలో అత్యుత్తమంగా రాణించడమో మాత్రమే కాదు. ఇంటా బయటా పదిమందికి కావలసినవాడుగా, అవసరమైతే ఆ పదిమందిలో నలుగురూ తనకోసం వున్నారన్న నమ్మకంతో జీవించగలగడం కూడా!
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాని వయసులో యువత తల్లిదండ్రుల మాటను గౌరవించాలి. ప్రాణప్రదంగా వారు తమను చూసుకుంటున్నారు గనుకనే ఎవరితో ఎలా వుండాలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు చెబుతున్నారన్నది గుర్తెరగాలి. అది లేనపుడు అనవసరమైన ఆవేశాలతో అపోహలతో వూగిపోతుంటారు. పదిమందిలో వుంటున్నామనుకుంటూనే ఒంటరిగా మిగిలిపోతుంటారు. ఫలితంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఫలితంగా తరగతి గదిలో తననంతా చిన్నచూపు చూస్తున్నట్లు, పెళ్లైనవారైతే జీవిత భాగస్వామి తనను సరిగా చూసుకోవడంలేదని, లేదంటే అత్తమామలే తనతో సరిగా వుండటంలేదని, తన చుట్టూ వున్నవారు తనకి తగిన విలువ ఇవ్వడంలేదని, తాను మెచ్చిన వ్యక్తి తననంతగా మెచ్చడంలేదని, కాదంటే ఇంకొకటి మరొకటి సాకుగా బలవన్మరణాలకు పాల్పడటం ఎంత బాధాకరం!
జీవితం విలువ కాని, తల్లిదండ్రుల లేదంటే సంరక్షకుల ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకున్నవారు కాని ఇంతటి దురాగతానికి పాల్పడరు. తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆరని తీరని శోకాన్ని శిక్షగా విధించరు. సహజంగానో, నయంకాని వ్యాధులతో అనుకోకుండా జరిగే వియోగాలను తట్టుకొని కోలుకోవడమే కష్టమనుకుంటే ఇటువంటి సందర్భాలు ఎదురైనపుడు ఎవరి ఓదార్పులైనా తాత్కాలిక ఉపశమనలే!
ఒక లక్ష్యంతో ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నవారికి జీవితం పూలబాట ఎంత మాత్రం కాదు. సాధిచవలసి వున్న లక్ష్యాలముందు, అధిరోహించవలసిన శిఖరాల ముందు అసూయాపరులు, గిట్టనివాళ్లు చేసే దుశ్చర్యలైనా, వ్యాఖ్యలైనా ప్రాధాన్యత లేని అంశాలుగానే పరిగణించాలి. స్వశక్తిపట్ల నమ్మకం కలిగినవారు చిత్తశుద్ధితో కార్యాచరణకు పూనుకుంటారే తప్ప ఎవరి తీరో ఎవరి వ్యాఖ్యలనో ఆలోచిస్తూ వుండరు.
నిజమే, మన చుట్టూ కనిపించే సమాజం మేడిపండువంటిదే. మంచి కోరి ఒకే ఒక్క సలహా చెప్పేవారికన్నా లేనిది వున్నట్లు, జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేసేవారికి లోటుండదు. కంటికి తగిలే ముల్లుని కనిపెట్టుకు తిరగాలన్న సామెతకు అనుకూలంగా, వున్నంతలో తాము ఎవరి దృష్టిలో పడకూడదని ఆశించడం తల్లిదండ్రుల పొరపాటు కాదన్నది పిల్లలు గుర్తించాలి.
యువతీ యువకులెవరైనా చదువుని ఒక తపస్సులా భావించాలి. విద్యాబోధనలో, పరిసరాల్లో లోటుపాట్లని సైతం అధిగమించే శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి తప్ప తమ చుట్టూ వున్న ఆకర్షణలకు ప్రలోభాలకు లొంగరాదు. విద్యార్థి జీవితం తిరిగిరానిదని సరదాలని, కాలక్షేపాలని విలువైన సమయాన్ని వృధా చేసుకొని ఆ తర్వాత ఎంతగా బాధపడినా ఎందరితో చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం.
చదువు అందరికీ పెద్ద ఉద్యోగాలివ్వలేకపోవచ్చు కాని ఉద్యోగానికి కావలసిన ప్రాథమిక అర్హత చదువే. ఒక్క ఉద్యోగానికి వేలమంది పోటీపడినా అందులో కొన్ని వందలమంది సమవుజ్జీలున్నా ఎన్నికయ్యేది ఒక్కరే. అలాగని మిగతావారు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రయత్నాల కొనసాగింపు ప్రతిభకు తగిన ఉద్యోగాన్ని ఆలస్యంగానైనా అందజేస్తుందన్నది విస్మరించరాదు. ఇక్కడ మరొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రావలసిన ఒక అవకాశం అందినట్లే అంది జారిపోయిందంటే మరేదో అంతకుమించిన అవకాశం అందబోతుందన్న విషయం ఎందరికో నిజమవుతుంది. అడుగడుగునా లాభనష్టాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు, ఆదరింపులు, చీదరింపులు పక్కపక్కనే వుంటాయి. అకారణంగా వెక్కిరించేవారే కాదు అపరిచితులైనా ఆత్మీయంగా పలకరించేవారూ వుంటారు.
మనకి తెలిసిన నలుగురో పదిమందో మాత్రమే ప్రపంచం కాదు. సువిశాలమైన ప్రపంచంలో అయోమయానికో గందరగోళానికో గురికాకూడదు. ఒకవంక పెరుగుతున్న విద్యావకాశాలు మనిషిని మరింత ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఉపకరించాలి తప్ప తెలివిలేకపోయినా, నైపుణ్యాలలో వెనుకబడినా డబ్బు, పలుకుబడితో అన్నీ సాధ్యమన్న ప్రచారాలు యువతలో విషబీజాలే నాటుతున్నాయి.
తలచుకుంటే మనిషికి సాధ్యంకానిదేదీ లేదు. తానొక్కడే వుంటే ఎన్ని గంటలు ఎన్నిరోజులు ప్రపంచంలో ఆనందంగా ఉండగలడు? అడుగడుగునా పోటీ అనివార్యమైనా జీవితంలో ఎవరు తాము ఆనందంగా వుండాలనుకుంటారో పరుల ఆనందాన్ని మనసారా కోరుకోగలగాలి. అప్పుడు ఎటు చూసినా ఆనందమే.

- కె. రామసీత