మెయన్ ఫీచర్

పర్యావరణ పరిరక్షణకూ నియమావళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్‌ను వాడరాదంటూ నేడు ఎక్కడ చూసినా ప్రకటనలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించారు, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే జరిమానాలు విధిస్తున్నారు. కానీ, మనం నిత్యం ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేం. ప్లాస్టిక్ సంచులను వద్దంటున్నా మిగిలిన ప్లాస్టిక్ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ సంచులతో వచ్చే సమస్యలు ఏమిటి? సాధారణ ప్రజల్లో ఇవి జవాబు లేని ప్రశ్నలుగా ఉంటున్నాయి. తగినంత అవగాహన కల్పించకుండా అకస్మాత్తుగా ప్లాస్టిక్‌ను నిషేధించాలనే ప్రభుత్వ సూచనలు ఎవరి బుర్రకూ ఎక్కడం లేదు. మనం ఉదయం లేచింది మొదలు టూత్‌బ్రష్,మగ్, బకెట్లు, ప్లేట్లు, చివరికి మన వాహనాల్లో సీట్ల కవర్ల వరకూ ప్లాస్టిక్ వాడుతునే ఉంటాం. ఆస్పత్రుల్లో ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ ఆధారిత సిరంజ్‌లు, ల్యాబ్‌ల్లో వాడే ప్లాస్టిక్ ఇంతా అంతా కాదు. పిల్లల బొమ్మలన్నీ దాదాపు ప్లాస్టిక్ ఆధారితమే. మరి ప్లాస్టిక్‌ను ఎందుకు నివారించాలి? ఒక పక్క ప్లాస్టిక్ టెక్నాలజీలో కొత్త కొత్త కోర్సులు యూనివర్శిటీల్లో పెరుగుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిందని అంటున్నారు. మిగిలిన పదార్థాలేవీ ముప్పు కాదా? ఇవన్నీ సామాన్యుడి మదిలో మెదిలే అనేక అనుమానాలు. వీటిని వివరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో ప్రచారాలు జనానికి ఎక్కడం లేదు. ప్లాస్టిక్‌ను నివారిస్తే- దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయా? దుకాణాల్లో ఒక వస్తువు తీసుకువెళ్లాలంటే ప్లాస్టిక్ సంచులు ఇచ్చేది లేదని అంటున్నారు. మరో వస్తువు ప్లాస్టిక్‌దైనా ప్యాకింగ్ రూపంలో ఇస్తున్నారు. వీటన్నింటిపై చైతన్యం కల్పించనంత వరకూ ప్లాస్టిక్ ముప్పు ఏమిటో సామాన్యుడికి అర్థం కాదు. ప్లాస్టిక్ ముప్పు గాలి రూపంలోనూ, నీటి రూపంలోనూ సవాలు విసురుతోంది.
పర్యావరణ పరిరక్షణకు అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో కాలుష్య నివారణ ఒక అంశం మాత్రమే. పర్యావరణ పరిరక్షణలో ఉష్ణోగ్రతల సమతుల్యత పాటించడం ప్రకృతి వనరుల పరిరక్షణ, సకల జీవజాలం పరిరక్షణ, నిర్జీవాలను సైతం రక్షించుకోవడంతో పాటు అన్ని రకాల కాలుష్య కారకాలను నిరోధించడం అతి ముఖ్యం. ప్రకృతి పరిరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, భూమి సహజ వనరుల హక్కు చట్టాలు, అడవుల సంరక్షణ చట్టం, జీవవైవిధ్య చట్టంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దాదాపు వందకు పైగా చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ చట్టాల ఉల్లంఘనులను శిక్షించేందుకు న్యాయస్థానాలతో పాటు ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. ప్రకృతి పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. బిష్ణోయి ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం, జంగిల్ బచావో ఆందోళన్ , చిప్కో ఉద్యమం, నవధాన్య ఉద్యమం, అప్పికో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, గంగా పరిరక్షణ ఉద్యమం వంటివి ప్రముఖమైనవిగా చెప్పవచ్చు.
1972లో జరిగిన స్టాక్‌హోం సదస్సును ఈ సందర్భంగా ప్రస్తావించాలి. మానవ మనుగడకు మూలాధారంగా ఉంటూ, మానవ భౌతికావసరాలను తీరుస్తూ మనో వికాసానికి దోహదం చేస్తూ, మన వెంట ఉంటూ మనల్ని నడిపించేదే ప్రకృతి. ప్రకృతిని మనిషి తన అవసరాలకు నాశనం చేస్తున్నాడని తద్వారా వాతావరణ మార్పులకు గురై భూగోళం వేడెక్కుతోందని ఫోరీర్ అనే శాస్తవ్రేత్త 1827లోనే గుర్తించాడు. 1972 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్టాక్‌హోం సదస్సు జరిగింది. 26 సూత్రాలతో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమాన్ని ఈ సదస్సులోనే రూపొందించింది.
భూగోళం వేడెక్కడం, కార్బన్ డయాక్సైడ్ కారణంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు వేడెక్కి అనేక అనర్థాలు జరుగుతున్నాయని దానిని ఎదుర్కొనేందుకు 1977 డిసెంబర్ 11న జపాన్‌లోని క్యూటోలో నిర్వహించిన సదస్సులో జరిగిన ఒడంబడికపై భారత్ కూడా సంతకాలు చేసింది. 192 దేశాలు ఈ ఒడంబడికను అంగీకరించగా, గ్రీన్‌హౌస్ ఉద్గారాలను బాగా తగ్గించాలని నిర్ణయించాయి. జీవరాశుల భద్రతకై 1999లో కొలంబియాలో కార్టీజిన ఒప్పందం కుదిరింది. 2003లో ఈ ఒప్పందం అమలులోకి రాగా ఇంత వరకూ 172 దేశాలు దీనిని ఆమోదించాయి. దీనినే ‘కార్టీజినా ప్రొటోకాల్’ అని వ్యవహరిస్తున్నాం. 1999లో అమెరికా మిస్సోరిలో సెయిం ట్ లూయిస్ నగరంలో మొక్కల సంరక్షణకు జీవవైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో అంతరించిపోతున్న మొక్కలను రక్షించుకోవాలని నిర్ణయించారు. 1992 జూన్ 5న బ్రెజిల్ రియోడిజెనీరోలో జరిగిన జీవవైవిధ్య సదస్సు కేవలం మొక్కల పరిరక్షణకే గాక, ప్రకృతి వనరులను రక్షించుకోవాలని, ప్రధానంగా జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించింది.సుస్థిరాభివృద్ధి అజెండాను, ఏడారీకరణ నివారణ చర్యలను ఇక్కడే తీసుకున్నారు.
1987 సెప్టెంబర్ 17న కెనడాలోని మాంట్రియల్‌లో ఓజోన్ పొర పరిరక్షణపై సదస్సు జరిగింది. సూర్యుడి నుండి వస్తున్న అతినీలలోహిత కిరణాల వల్ల ఓజోన్ పొర దెబ్బతినకుండా కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఓజోను పొరకు నష్టం కలిగించే ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం 1989 జనవరి నుండి అమలులోకి వచ్చింది. తర్వాత చెప్పుకోదగ్గది హైదరాబాద్ కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) సదస్సు . 2012 అక్టోబర్‌లో జరిగిన ఈ సదస్సులో జీవవైవిధ్యంతో పాటు జీవరాశి సంరక్షణ, ప్రకృతి వనరులకు పెద్దపీట వేశారు. కాప్ -25వ సదస్సు ఈ నెల 11వ తేదీ నుండి 22 వరకూ చిలీలో జరగనుంది. వాస్తవానికి ఈ సదస్సు బ్రెజిల్‌లో జరగాల్సి ఉన్నా అక్కడ ఎన్నికల దృష్ట్యా వేదికను మార్చారు. భూమిపై శిలాజ ఇంధన వనరులను తగ్గిస్తూ శిలాజేతర వనరులను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి అంతర్జాతీయ సౌరకూటమిగా ఏర్పాటయ్యాయి. కాప్-21 పారిస్ సదస్సులో దీనికి బీజం పడింది. ఇందులో కూడా భారత్ సభ్యదేశంగా ఉంది.
వాస్తవానికి భారత్‌లో 1947కు ముందు పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చట్టాలూ లేవు. ఐపీసీ, సీపీసీలోని నిబంధల ఆధారంగానే పర్యావరణ కేసులకు సంబంధించి శిక్షలు పడేవి. 1972 నాటికి దాదాపు 32 చట్టాలు రూపొందాయి. ఇవన్నీ నేరుగా పర్యావరణ చట్టాలు కా కున్నా, పర్యావరణాంశాలకు సంబంధించినవే. ఆరో పంచవర్ష ప్రణాళికలో పర్యావరణ పరిరక్షణ చట్టాలను రూపొందించడం మొదలైంది. దాని ఫలితంగానే 1974లో నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని అమలుచేసేందుకు 1974లో కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటయ్యాయి. 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం అమలులోకి వచ్చింది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలులో భాగంగా వన్యప్రాణులతో పాటు అడవులనూ కాపాడాలని మార్పు చేసింది. ఎన్ని చట్టాలను తెచ్చినా 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ దుర్ఘటన వరకూ రాజకీయ వ్యవస్థకు వాయుకాలుష్యం పట్టలేదు. ఈ దుర్ఘటనకు 3787 మంది చనిపోగా, 5,58,127 మంది ప్రభావితులయ్యారు. ప్రకృతి సహజ పర్యావరణాన్ని నాశనం చేసే ఎన్నో సంఘటనలు తర్వాత జరిగాయి. వాయు కాలుష్యంతోస్ట్రాటో ఆవరణలో ఓజోన్ తగ్గుదల మనిషి ఆరోగ్యానికే గాక, భూమి సమతుల్య జీవావరణ క్రమానికి కూడా హాని చేస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల భూమిపొరలు కలుషితం కావడం తద్వారా తాగునీరు, సాగునీరు కాలుష్యం అవుతోంది.
సమద్ర తీరాల్లో ప్లాస్టిక్ కారణంగా కోటానుకోట్ల జం తుజాలం మరణానికి కారణమవుతోంది. పాలిమర్లు, మోనోమర్ల అణువులే ప్లాస్టిక్. ప్లాస్టిక్ సంచుల విషయంలో పునరుక్తమయ్యే ఎథిలిన్, పోలీ ఎథిలిన్ ఏర్పడటానికి ఎథిలిన్ బహురూపం చెందినపుడు పొడవైన కర్బన అణువుల గొలుసులను ఎర్పరుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పదార్ధ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారుచేసే అణుపుంజాలతో (పాలిమర్స్) తో రూపొందే పదార్ధమే ప్లాస్టిక్. ఏటా దాదాపు 150 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కరగడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. సేంద్రీయ , రసాయన రంగులు, పిగ్‌మెంట్లు, ప్లాస్టనైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు , ధాతువుల వంటి ఎడిటిన్లతో తయారుచేస్తున్న ప్లాస్టిక్ సంచుల్లో ఆహారపదార్థాలు నిల్వ కూడా ప్రమాదకరమే. దీనిపై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఇప్పటికైనా ముప్పును అర్ధం చేసుకుని ప్లాస్టిక్ బదులు ప్రకృతి సహజమైన వనరులతో కూడిన ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. జనపనార లేదా వస్త్ర సంచులను వినియోగించాలి. జీవశైథిల్య ప్లాస్టిక్‌ను వాడుకోవాలి. వెంటనే భూమిలో కరిగిపోయే ముప్పులేని ప్లాస్టిక్‌ను వాడాలి. ప్లాస్టిక్ వాడొద్దని స్థానిక సంస్థలు చెప్పడం మినహా దీనిపై జాతీయస్థాయి సమగ్ర చట్టం ఏదీ ఇంత వరకూ రూపొందలేదు. ఆ మాటకొస్తే నేటికీ భారతదేశంలో పటిష్టమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలు లేవనేది నిర్వివాదాంశం. సరికొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణకు ఓ నియమావళి (కోడ్) అమలులోకి రావాలి.

-బీవీ ప్రసాద్ 99633 45056