మెయిన్ ఫీచర్

పరిష్కారం మన చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి చెందామని గొప్ప సంతోషంతో చెప్పుకుంటాము కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అమానవీయ దుశ్చర్యలని చూడలేకపోతున్నాము. తరాలు మధ్య అంతరంగం పెరిగిపోయి చివరికి నిన్నటి యువతరం నేటి వృద్ధులై కొడుకులు చేతా, కోడళ్ళ చేతా, బిడ్డల చేతా ఛీత్కరించబడి బతుకు ఈడుస్తున్నారు. తమ బిడ్డల సుఖంకోసం అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు కట్టుకొని కూడబెడితే, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు మాత్రం తమ స్వార్థం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను, అత్తమామలను వృద్ధాశ్రమాలలో, నడివీధిలో పడేసి వెళ్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించే ధైర్యం లేకపోవడం, పేగుబంధం అడ్డుపడుతుంది.
ఈమధ్య ఎక్కడ చూసినా వృద్ధ జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. ఇది ఎంతో కలచివేసే విషయం. కొడుకులు వుండి కూడా దిక్కూ మొక్కూ లేక ఆత్మాభిమానాన్ని చంపుకొని అడుక్కుతింటున్నారు. అది చేయలేనివాళ్ళు చావుని ఆశ్రయిస్తున్నారు. అసలు మనుషులు ఇలా ఎందుకు తయారయ్యారు.. డబ్బే మనిషిని శాసిస్తోంది. జీవితకాలం కష్టపడి పిల్లల్ని నిస్వార్థరహితంగా వారి ఉన్నతికి తోడ్పడితే కొడుకులు కూతుళ్ళు మానవత్వం లేకుండా తల్లిదండ్రులను ఆస్తి పంచుకున్నట్టుగా నెలల వారీగా వంతులు వేసుకొని ఉంచుకుంటున్నారు. తండ్రి అవసరం కంటే తల్లిని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇంట్లో బండెడు చాకిరీకి, బట్టలు, అంట్లు తోమడానికి ఉపయోగపడుతుందని.
కొడుకులు ఎంతసేపు భార్య మాట విని తమ కన్న తల్లిదండ్రులను వేధిస్తారు. తమ ఆనందాలకు అడ్డు వస్తున్నారని విసుక్కుంటారు. ఇంట్లో ఒక అనవసర వస్తువైపోతారు. ఏదైనా సమస్య వచ్చినపుడో, లేదు మరేదైనా చిక్కు వచ్చినప్పుడు పెద్దలు చెప్పే సలహాలను తీసిపడేస్తారు. అంతేగాని వారు అలాంటి ఎన్నో చిక్కుముడులను విప్పి ఈ స్థాయికి వచ్చారు అని మరిచిపోతారు. పైగా ఏదైనా సలహా చెప్తే చాదస్తంమాటలు, మాకు తెలుసు అని మొహంమీద చాలా తీవ్రంగా గాయపడేలా మాట్లాడుతారు.
వృద్ధులమీద హింస మన దేశంలో ఎక్కువగానే ఉంటోంది. కట్నం తేలేదేని హింసించడం గృహహింసకింది ఎలా వస్తుందో, వృద్ధులను, తల్లిదండ్రులను వేధించడం కూడా గృహహింస కిందకే వస్తుంది. నిజానికి తల్లిదండ్రులను వేధిస్తే పోలీసు కేసు పెట్టవచ్చుకాని పరువుకోసం చాలామంది వెనుకాడుతారు.
వృద్ధులను నానా రకాలుగా హింసకి గురిచేస్తుంటారు. మాటలతో మానసికంగా హింసించడం, ఆర్థిక హింస, ఆహారం, దుస్తులు మొదలైనవి అందించకపోవడం. చాలామంది వృద్ధులకు వచ్చే పెన్షన్‌ను తీసుకుని కనీసం తిండి కూడా పెట్టరు. వైద్యం చేయించరు. ఖర్మకాలి మంచాన పడితే ఇక అంతే సంగతులు. ఏ ఆనాధ ఆశ్రమంలోనో పడేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
భారతీయుల్లో ప్రతి పదిమందిలో ఒకరు 60 ఏళ్ళకుపైబడిన వయస్సులో ఉన్నారు. వృద్ధాప్యం వృద్ధులకు మాత్రమే ప్రభావితం చేయదు. అది సమాజంలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. దానిని ప్రభుత్వ విధానాలు నిర్లక్ష్యం చేస్తున్నవి.
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వృద్ధాప్యపు పెన్షన్ క్రింద నెలకు 500 ఇస్తున్నారు. ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రరేఖ దిగువ వున్నవారి నెలసరి ఆదాయంలో సగంగా వుంది. భారతదేశంలో 100 మిలియన్ వృద్ధులు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 9 శాతంమంది 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సుగలవారు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 శాతంమంది ఉన్నారు. 2050 నాటికి 60 ఏళ్ళ వయసున్నవారు భారతదేశ జనాభాలో 19 శాతం ఉంటారని భావిస్తున్నారు. కేరళ, గోవా, తమిళనాడు, పంజాబ్, హర్యానా, గోవా, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల జనాభాలో 10 శాతం వృద్ధుల జనాభా కలిగి దేశంలో ముందున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అస్సాం వంటి రాష్ట్రాలు వృద్ధుల జనాభా తక్కువ శాతం కలిగివున్నవి. వృద్ధుల సంరక్షణ అనేది రాజ్యాంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 41 ప్రకారం ఉంది.
రాజ్యాంగంలో వృద్ధుల సంరక్షం చేయాలని చెప్పబడినా ఆచరణలో మాత్రం శూన్యమే. అటు ప్రభుత్వం ఆదుకోక, ఇటు కన్నవాళ్ళు ఆదుకోక చాలావరకు చావునే ఆశ్రయిస్తున్నారు. నిన్నటి యువతరం నేడు వృద్ధులు అయినంత మాత్రాన వారు దేనికీ తీసిపోరా? వారిలో అమోఘమైన తెలివితేటలు, అనుభవసారాన్ని నేటి యువత ఎందుకు ఉపయోగించుకోవడంలేదు. ఇప్పటి తరానికి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవడం చేతకాక ఆత్మహత్యకి పాల్పడటం, లేదంటే హత్యకి తెగబడటం చూస్తున్నాము. ఈ లోపాలు నిన్నటి తరపు అనుభవసారాన్ని ఉపయోగించుకోకపోవడం మూలానే జరుగుతోంది. ప్రపంచంలో జపాన్‌లో వృద్ధ జనానా ఎక్కువగా వుంది. అయితే అక్కడివాళ్ళు వృద్ధులు కదా అని చెత్తబుట్టలో పారెయ్యలేదు. కొడుకులు, కూతుళ్ళు నిరాదరణకి గురిచెయ్యలేదు. ప్రభుత్వం వారికోసం ప్రత్యేక ఇళ్లు నిర్మించి ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడి యువతరం పెద్దవారిపట్ల ప్రేమని భక్తిని చాటుతూ తమ ఇంటిలోనే ఉంచుకుంటారు. నిన్నటి యువతే నేటి వృద్ధులు. అలాగే నేటి యువత రేపటి వృద్ధులు. ఈ నిజాన్ని ఇప్పటికాలపు కొడుకులు / కూతుర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదంటే తాము ఎలా అయితే తమ తల్లిదండ్రులని గెంటిశారో రేపు వారి కొడుకులు, కూతుర్లు కూడా అలానే చేస్తారు. ఎందుకంటే మన పిల్లలకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. నిన్నటి తరపు ఘోషని వినండి.. ఇప్పటికైనా మించినది లేదు. వారిని గౌరవించి సమున్నత స్థానాన్ని ఇద్దాం. మనమూ మనుషులని నిరూపించుకుందాం.

- పుష్యమీ సాగర్ 9010350317