మెయన్ ఫీచర్

పల్లెసీమ గుండె ఘోష వినేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాలకు, గ్రామాలకు మధ్య దూరమెంత?- అనే పాత ప్రశ్న ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న దానిని బట్టి మరొక మారు ముందుకు వస్తున్నది. గత రెండేళ్లుగా ముఖ్యంగా ఇటీవలి మాసాలలో- నగరాలలో వినవస్తున్న మాటలు ఏమిటో తెలిసిందే. కానీ, గ్రామీణ ప్రజానీకం ఏమనుకుంటున్నదీ తెలియటం లేదు. బహుశా దినపత్రికల జిల్లా టాబ్లాయిడ్లలో అవి రిపోర్టు అవుతుండవచ్చు. అవి నగరాలలో అందుబాటులో ఉండవు గనుక విషయం తెలిసే అవకాశం లేదు. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న మంచి, చెడుల గురించి నగరవాసులు మాట్లాడే దానికి, గ్రామ ప్రజల అభిప్రాయాలకు చాలా తేడా కనిపిస్తున్నది.
నగరాలలో నివసించేది ఎవరు? ధనవంతులు, మధ్యతరగతి వారు, పేదలు, రాజకీయ నాయకులు, మేధావులు, మీడియావారు. ఈ ఆరు విధాలైన వారిలో పేదలు మినహా తక్కిన వారంతా మాట్లాడేవారే. వీరందరికీ స్వంత అభిప్రాయాలు ఉంటాయి, స్వంత ప్రయోజనాలుంటాయి. పత్రికల్లో, టీవీ చానళ్లలో చూసి మరికొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఇవన్నీ అంతిమంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా రూపుతీసుకుంటాయి. అదిగాక మరొకటి ఉంది. తాము మాట్లాడే విషయం గురించి వీరిలో సరైన సమాచారం ఉండి మాట్లాడేవారు తక్కువ. తమ ప్రయోజనాలు, సిద్ధాంతాలు, ముందుగానే ఏర్పరచుకున్న సదభిప్రాయాలు లేదా దురభిప్రాయాలు, మీడియా తన తరహాలో చెప్పే విషయాలూ, వ్యాఖ్యల ప్రభావాలు వీరిపై ఉంటాయి. తమ నగర ప్రపంచమే ఏకైక ప్రపంచమని నమ్ముతారు వీరు. తమ నగరానికి బయట గ్రామాలు అనేవి ఉన్నాయని, అక్కడ నివసించేవారు కూడా ప్రజలేనని, వారికీ అభిప్రాయాలుంటాయని, వాటితో అంగీకరించినా, అంగీకరించకపోయినా కనీసం తెలుసుకుని పరిగణించాలని వీరికి తట్టదు. అంతకన్నా విశేషం ఒకటుంది. నగర వ్యవహారాలు, తమ విషయాల గురించి తాము మాత్రమే మాట్లాడితే అందుకు అర్థం ఉంటుంది. కానీ, గ్రామాల గురించిన విషయాలు కూడా, గ్రామస్థుల పక్షాన, వారి ఆలోచనలు ఏమిటో తెలియనైనా తెలియకుండా తామే ఒక నిర్థారణకు వచ్చి మాట్లడి తీర్పులు చెప్తారు.
తెలంగాణలో ఇపుడిది బాగా కన్పిస్తున్నది. నగరాలకు, గ్రామాలకు మధ్య తగినంత అంతరం ఏర్పడింది. పలుచోట్ల గ్రామాలలో తిరిగి, ఇతరత్రా కూడా ఆయా సందర్భాలలో గ్రామస్తులతో మాట్లాడిన ఈ రచయితకు అర్థమవుతున్న విషయమిది. ఇందుకు రెండు కారణాలు కన్పిస్తున్నాయి. యథాతథంగానే నగరవాసుల ప్రపంచం భిన్నంగా ఉంటుంది. సమాచారం, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అది అంతటా కనిపించేదే. అందుకు కారణమేమిటన్నది సుదీర్ఘ చర్చ. ఇక్కడ అప్రస్తుతం. అదట్లుండగా, తెలంగాణకు సంబంధించినంతవరకు కొన్ని అదనపు కారణాలున్నాయి. ఇవి ప్రధానంగా రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, మేధావి వర్గాలు, ఉద్యమాల వారికి సంబంధించినవి. ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించినవి రొటీన్ కారణాలు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, చివరకు కమ్యూనిస్టులు ఎవరైనా సరే సీట్లు, అధికార ప్రయోజనాలు పనిచేస్తాయి. చెడును ఎత్తిచూపటంలోనే ఆ ప్రయోజనాలు ఉన్నట్లు వారు నమ్ముతారు. ఆ తర్కానికి పొడిగింపుగా లేని చెడును కూడా చూపుతారు. మంచిని చెడుగా చిత్రీకరిస్తారు. మంచిని గుర్తించ నిరాకరిస్తారు. ఒకవేళ గుర్తించక తప్పని స్థితి ఎదురైతే అర్ధోక్తులతో సరిపుచ్చటం, ‘కానీ..’ అంటూ షరతులు విధించటం వంటివి చేస్తారు. ఇదంతా ఒక ‘డైనమిక్స్’. దీనికి గ్రామాలలో పరిస్థితికి, ప్రజాభిప్రాయానికి సరిపడదు. ఎందుకంటే గ్రామ ప్రజలు మంచిని, చెడును యథాతథంగా గుర్తించి మాట్లాడతారు. ఇదంతా తెలంగాణ రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనది వివిధ సంస్థలు, ఉద్యమాలు, మేధావి వర్గాలు. ఈ మూడింటినీ కలిపి ‘సివిల్ సొసైటీ’ అనవచ్చు. తెలంగాణలో ఈ వర్గాలు, వాటితో కూడిన సొసైటీ ఏర్పడటానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి వెనుకబాటుతనం, దోపిడీ, ఉద్యమాలతో ఏర్పడిన చారిత్రక నేపథ్యం. రెండవది సిద్ధాంతాలు, ఉద్యమాలు, భవిష్యత్తు గురించిన ఊహలతో ఏర్పరచుకున్న అంచనాలు. మూడవది పాలకులంతా ఒకటేననే నిశ్చితాభిప్రాయం. నాల్గవది ఎప్పుడూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉద్యమిస్తూ వత్తిడి చేస్తేనే తప్ప పనులు జరగవనే అంచనా. ఇటువంటి కారణాల మూలంగా ‘సివిల్ సొసైటీ’ అన్నది అదే ధోరణితో వ్యవహరిస్తూ తన ప్రపంచంలో తానుంటుంది. అటువంటి నమ్మకాలకు, అంచనాలకు భిన్నమైన వాటిని చూసేందుకు నిరాకరిస్తుంది. అవి వాస్తవాలు అయినా సరే. ఇదొక తరహా డైనమిక్స్. దీనికి పొడిగింపు గ్రామాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూడ నిరాకరించటం. మంచి, చెడులను గ్రామీణుల తరహాలో యథాతథమైన పద్ధతిలో గుర్తించకపోవటం. దృష్టికి వచ్చినా విస్మరించటం.
ఈ రెండవ భాగానికి సంబంధించి సాధారణ అధికార రాజకీయ పార్టీలకు, వీరికి మధ్య సారాంశంలో తేడా లేకుండాపోతున్నది. ఇరువురి ఉద్దేశాలు ఒకటేనని ఎంతమాత్రం అనలేము. ప్రయోజనాలు కూడా వేరువేరు అనటంలో సందేహం లేదు. కాని వ్యవహరణలో మాత్రం వ్యత్యాసం ఉండటం లేదు. ఆ విధంగా నగర ప్రపంచంలోని రాజకీయ పార్టీలకు, గ్రామస్తుల ఆలోచనలకు మధ్య ఎటువంటి తేడా ఉంటున్నదో అదే నగర ప్రపంచంలోని సివిల్ సొసైటీకి, గ్రామస్తుల అభిప్రాయాలకు మధ్య అటువంటి వ్యత్యాసమే కనిపిస్తున్నది.
ఇపుడు కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలను చూద్దాము. ఇవన్నీ పైన చెప్పినట్లు గ్రామీణ ప్రాంతాల పర్యటనలో, ఇతరత్రా గ్రామీణులతో మాటల సందర్భంగా ఈ రచయిత దృష్టికి వచ్చినటువంటివి. గత రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రజలు ఆసరా పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి ప్రాజెక్టులు, రేషన్ బియ్యం పెంపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పిల్లలకు హాస్టళ్లలో సన్నబియ్యపు భోజనం, మెరుగుపడుతున్న రోడ్లు.. మొదలైన అంశాల గురించి ఏదో ఒక సందర్భంలో నిరంతరం మాట్లాడుకుంటున్నారన్నది మనకు అర్థమయ్యే విషయం. వీటిలో కొన్ని సంక్షేమానికి, కొన్ని దీర్ఘకాలిక అభివృద్ధికి సంబంధించినవి. వాటి ప్రభావాలు కొన్నిచోట్ల నీటి పథకాలతో కలుపుకొని అనుభవంలోకి రావటం మొదలైంది. ఆ విధంగా జీవితాలు మెరుగుపడుతున్నాయి. ఇటువంటివి చేస్తున్న ప్రభుత్వం కొంత అటు, ఇటుగా తక్కినవి కూడా చేయగలదన్న నమ్మకం గ్రామీణులలో కనిపిస్తున్నది. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు లేకపోలేదు. కాని వాటిని ఒకవైపు ఎత్తిచూపుతూనే, మంచి గురించి మాట్లాడటం ఎక్కువగా కన్పిస్తున్నది. గత ప్రభుత్వాలతో, ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ఆశాభావాలు గణనీయంగా ఉన్నాయి.
కానీ, నగర ప్రపంచపు మాటలలో ఇవేవీ వినిపించటం లేదు. అవి రాజకీయ పార్టీలైనా కావచ్చు, పైన అనుకున్న సివిల్ సొసైటీ అయినా కావచ్చు. పైన పేర్కొన్న వాటిలో దేని ప్రస్తావన వచ్చినా అందులో అక్రమాలు, అవినీతి అని వాదనలు ఆరంభిస్తారు. ఆ పనులను మొత్తంగా కొట్టివేస్తారు. అయితే ఆయా కార్యక్రమాల గురించి గ్రామస్తుల అభిప్రాయాలేమిటి? తామంటున్న అక్రమాలు, అవినీతి గురించి వారేమంటారు? అనేవి తెలుసుకునేందుకు మాత్రం ప్రయత్నించరు. వారి దృష్టిలో గ్రామస్తులకు ఒక స్వతంత్రమైన ఉనికి అంటూ లేదు. వారి అభిప్రాయాలు విలువ ఇవ్వదగినవి కాదు. వారి ఆలోచనలు తమ ఆలోచనలకు లోబడినవై ఉంటాయి. తమ ప్రయోజనాలకు గల ప్రాముఖ్యత గ్రామస్తుల ప్రయోజనాలకు ఉండదు.
విషయాలు ఏవైనా సరే గ్రామస్తులు, ఇతర ప్రజల చుట్టూగాక తమ చుట్టు, తమ సిద్ధాంతాల చుట్టు, తాము మంచిచెడులంటూ నిర్ధారించే వాటి చుట్టూ, తాము నిర్ణయించే ప్రాధాన్యతల చుట్టూ, తమ మేధావిత్వాల చుట్టూ మాత్రమే తిరుగుతాయి. ఆ ప్రజల పేరిట తాము ఏదైనా మాట్లాడవచ్చు. అదే ప్రజలు తమ గురించి తాము మాట్లాడేవాటికి ఎటువంటి పరిగణన ఉండదు. ఆ విధంగా ప్రజలకు తాము అనుబంధమని భావించటానికి బదులు, తమకు ప్రజలు అనుబంధమని భావించే స్థితిని సృష్టించుకుని ప్రవర్తిస్తున్నారు.
నగరాలకు గ్రామాలు ఎంత దూరమనే ప్రశ్న ఉత్పన్నం కావటం ఇటువంటి పరిస్థితుల వల్లనే. అటువంటి దూరం రాజకీయ పార్టీలకు కూడా ఏర్పడకూడదు. ఏర్పడకపోయినట్లయితే ఆ పార్టీలకు, ప్రజలకు మేలు కలుగుతుంది. ఒకవేళ ఏర్పడితే అర్థం చేసుకోవచ్చు. మన ప్రజాస్వామ్యంలో పార్టీలు ఇంకా ఆ స్థాయికి పరిణతి చెందలేదు గనుక. కాని సివిల్ సొసైటీ గురించి, ముఖ్యంగా తెలంగాణ సొసైటీ గురించి, ఆ విధంగా భావించలేము. ఇందులో దూరం ఏర్పడక పోవటమన్నది ప్రధానమైనది. దూరం లేకుండా వ్యవహరించినపుడు ఆ తర్వాత ఎటువంటి అభిప్రాయాలకు రాగలరన్నది ఎవరి స్వేచ్ఛ వారిది. ప్రజల అభిప్రాయంతో ఏకీభవించటం, విభేదించటం, ప్రజల అభిప్రాయాలు పొరపాటని భావిస్తే వారికి వివరించి ఒప్పించటం, తాము సరైనదనుకునే పద్ధతిలో నడిపించటం వంటివి ఏవైనా చేయవచ్చు. అది సివిల్ సొసైటీ స్వేచ్ఛ. కాని గ్రామీణ ప్రజల ఆలోచనలను తాము ముందే ఏర్పరచుకున్న భావనలకు అతీతంగా తెలుసుకోకుండా, వారి పక్షాన తామే మాట్లాడే స్వేచ్ఛ మాత్రం ఎవరికీ ఉండదు. మంచిని మంచి అని, చెడును చెడు అని ప్రజల పద్ధతిలో మాట్లాడినపుడు మాత్రమే వారి నగర ప్రపంచానికి, గ్రామ ప్రపంచానికి మధ్య దూరం తగ్గుతుంది.
*

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)