మెయిన్ ఫీచర్

తెలంగాణ కథ.. జాతీయ భావధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తి, మాతృభూమి పట్ల ప్రేమాభిమానము, జాతీయ సంస్కృతి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని కథలు రాయడమంటే ప్రేమ, పెళ్లిళ్లు, విడాకులు, స్వేచ్ఛా శృంగారం, నేరాలు, ఘోరాలు అంశాలతో రాయడమంత సులువుకాదు. అయితే కథ షుగర్ కోటెడ్ మెడిసిన్‌లాగుండాలి’’... సాహిత్యాంబరములో ధృవతారగా నిలిచిన టాల్‌స్టాయ్ అభిప్రాయమది. ఆయన రాసిన కథలు విశ్వవిఖ్యాతమైనవి.
‘‘ప్రపంచములో ఏ రచయితకైనా దేశభక్తి మొదటి కర్తవ్యం. తనను పెంచి, పెద్దచేసిన సమాజానికి కృతజ్ఞత చూపడం సుకవి లక్షణం.’’ అంటారు ప్రముఖ తెలుగు కథారచయిత చివుకుల పురుషోత్తం. జన్మనిచ్చి, పెంచి, పెద్దచేసిన మాతృభూమి ఋణం తీర్చుకోవడం, దేశ సరిహద్దుల్ని, సంస్కృతిని కాపాడుకోవడం లాంటి ఇతివృత్తాలను కథలు రాయడం జాతీయ భావన. అది కత్తిమీద సాము, అయినా రచయిత కర్తవ్యం.
భారత స్వాతంత్య్రానికి పూర్వము, తెలంగాణ విముక్తి పోరాట సమయములో జాతీయ భావాలతో చాలా కథలొచ్చాయి. తొలి తరం తెలంగాణ రచయితల కథలే అందుకు నిదర్శనము. ఆ తర్వాత గూడా జాతీయ భావాలను ప్రేరేపిస్తూ ఎన్నో కథలొచ్చాయి.
తెలంగాణలో మొదటి కథానిక, గుణముయగు స్ర్తి బండారు అచ్చమాంబ కలం నుండి జాలువారి ‘‘తెలుగు జనానా’’ పత్రిక మే 1901 సంచికలో అచ్చైంది. కుటుంబ ఖర్చుల్ని పొదుపుచెయ్యడం ఇతివృత్తం. ఈమె 12 కథలు రాసింది. మాడపాటి హన్మంతరావు ఊహల్లో 1910లో ఉయ్యాలలూగి వచ్చిన ‘హృదయ శల్యము’ కథ 1912లో అచ్చయంది. రాణి రుద్రమ మారువేషములో ప్రజాసంక్షేమాన్ని పర్యవేక్షించడం ఇందులో అంశము. గురజాడ 1912లో రాసిన దిద్దుబాటు కథనే తెలుగులో మొదటి కథ అన్నారు. అయితే అదే 1912లో హృదయ శల్యము, దిద్దుబాటు అచ్చయన పత్రికలోనే ప్రచురితమైంది. పై మూడు కథల్లో విశ్వవిఖ్యాతమైన భారతీయ కుటుంబంలోని ఒడిదుడుకులే ఇతివృత్తమై కుటుంబాలు విచ్ఛిన్నము కానివ్వవు. కుటుంబాలు బాగుంటే ఊరు, ఊర్లు బాగుంటే దేశము బాగుంటుందని దేశ క్షేమాన్ని కోరుకుంటుంది జాతీయ వాదం.
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘‘గ్యారాకద్దూ బారాకొత్వాల్’’ (1930) ఆనాటి నైజాం పాలకుడి అండదండలతో గ్రామాధికారులు, జమీందార్లు, దేశముఖ్‌లు ప్రజల్ని అణచివేసిన విధానానికి అద్దంపట్టి ప్రజల్లో చైతన్యం రగిలించింది. సురవరంవారి మరో కథ ‘సంఘాల పంతులు’ తెలంగాణ పటేలు, పట్వారీల సతాయింపుల నేపథ్యంలో రాసింది. దళితులను, అగ్రవర్ణాల వారిని కూడగట్టిన పంతులు వెట్టిచాకిరి నిర్మూలనకుద్యమించాడు. అలాగే పటేలుగారి ప్రతాపము కథ అజ్ఞాతవాసి భాగ్యరెడ్డి వర్మది గూడా ఆ కోవకు చెందినదే. నందగిరి ఇందిరాదేవి, పందెం, వెట్టిమాదిగ, కథలు ఇతివృత్తాలు గూడా అలాంటివే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు నైజాం రాజు దుష్టపాలన పదఘట్టనలో నలుగుతూ స్వాతంత్య్రానికి నోచుకోలేదు. పాలకుల అండతో రజాకార్లు, జమీందార్లు సాగించిన దుర్మార్గాలు, అత్యాచారాలనెదిరిస్తూ, స్వాతంత్య్రకాంక్షతో కథలు వెలువడ్డాయి. నల్ల-తెల్ల రెండు ఎద్దుల సంభాషణను ప్రతీకాత్మకంగా తీసుకుని కాళోజి నారాయణరావు రాసిన, ‘మనమే నయం’ కథ సామాన్యులను ఆలోచింపజేసింది. తెలంగాణ విముక్తి పోరాటములో సైనిక చర్య ఇతివృత్తింగా నెల్లూరి కేశవస్వామి రాసిన ‘‘యుగాంతం’’ కథ తెలంగాణ ప్రజల స్వాతంత్య్రేచ్ఛకు అద్దం పట్టింది.
ఆరోజుల్లో ఉర్దూ అధికార భాష. పాలకులు, ‘‘తెలంగీ-బేఢంగీ’’ అంటూ తెలుగును ఎద్దేవాచేశారు. దాన్ని తెలంగాణ యోధులు నిరసించారు. అపర యుగంధరులుగా, దేశప్రధానిగా, సాహితీవేత్తగా పేరొందిన పి.వి.నరసింహారావు ముస్లింల హింసాకాండను నిరసిస్తూ రాసిన ఆంగ్ల కథ బ్లూసిల్క్‌సారీ జాతీయ భావప్రోతమైనది. విముక్తి పోరాటంలోని ఓ సంఘటనను ఊహించి ఆయన రాసిన ‘గొల్లరామవ్వ.. కథ’ కాకతీయ పత్రికలో అచ్చైంది.
ప్రజల పక్షాననున్న వారిని రజాకార్లు ద్రోహులుగా భావించారు. వారికి వ్యతిరేకంగా పోరాడుతూ గాయాలపాలై తమ గుడిసెలోకొచ్చిన యువకునికి గొల్ల (ముసలి) రామవ్వ గొల్ల వేషమువేయించి, తన మనవరాలు పక్కన మంచములో పడుకోబెట్టింది. రజాకార్ల పోలీసులొచ్చి యువకున్ని వెతుకుతూ ఆ మంచమీదున్నదెవరు? అని అడగ్గా, అది నా మనవరాలు, అతడు నా మొగుడు... అనగానే పోలీసులు వెళ్లిపోతారు. రామవ్వ అతని గాయాలకు మందు రాస్తుంది. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటములలో తనవంతు పాత్రను నిర్వహించిన రామవ్వ అందరికీ ఆదర్శమైంది. యువకుడు ఆరోగ్యంగా తిరిగి వెళ్తూ ‘‘అవ్వా! నీవు సామాన్యురాలివి కాదు, సాక్షాత్తు భారతమాతవే!’’ అంటాడు. ఒద్దిరాజు సోదరులు 1918లో విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను స్థాపించి, కథలు రాసి, పుస్తకాలను ప్రచురించి తెలంగాణలో దేశభక్తిని ప్రబోధించారు. నందగిరి వెంకట్రావు ‘ప్రతిఫలం’ కథలో గోలకొండ (నైజాం) రాజువద్ద మంత్రులైన అక్కన్న, మాదన్నలను ఔరంగజేబు హత్యగావించిన ఉదంతం గుండెల్ని కరిగిస్తుంది. ఔరంగజేబు, నిజాం రాజుల మతవ్ఢ్యౌనికిది నిదర్శనము.
కాంచనపల్లి చిన రామారావు, చెరువొడ్డున కథలో దొరలు, జాగీర్దార్లు మతాన్ని స్వార్థానికెలా ఉపయోగించుకున్నారో, ప్రజలు ఎలా తిరగబడ్డారో యదార్ధంగా చిత్రించాడు.. మెదడుకు మేత, కథలో వట్టికోట ఆళ్వారుస్వామి హిందూ-ముస్లింల కొట్లాటలకు ఆంగ్లేయుల రాజకీయమేననే నిజాన్ని చూపించాడు.
భారతీయ సంస్కృతిలో భార్యాభర్తల పవిత్రబంధం గొప్పతనాన్ని వెల్దుర్తి మాణిక్యరావు ‘‘ఎయిర్‌మేల్’’ కథలో సున్నితంగా చిత్రించాడు. డి.రామలింగం రచించిన ‘‘సిపాయి రాముడు’’ కథలో సిపాయి రాముని దేశాభిమానము ఆదర్శమైందని బోధించాడు. ఇల్లందుల సరస్వతీదేవి రాసిన ‘‘కానికాలం వస్తే’’ స్ర్తి చైతన్యానికద్దం పట్టింది. నెల్లూరి కేశవస్వామి, యుగాంతం కథ (చార్మినార్ సంపుటిలోనిది) తెలంగాణ విముక్తికోసం సైనిక చర్యతో నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన ఘట్టాన్ని నైజాం రాజు మత వివక్షను కళ్లకు కట్టించాడు.
భారతీయ ధర్మం ఆద్యంతాలు లేనిది. మట్టికి-మనిషికి, సంస్కృతికి సమాన విలువలున్నాయి. ఆధునిక కాలములో జాతీయవాద కథలు రాసిన వారిలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారిది ప్రముఖ పాత్ర. ఆయన కొన్ని కథలు కస్తూరి కలం పేర రాశారు. ఆయన రాసిన ‘‘వంద చిన్న కథలు’’ సంపుటి అందుకు నిదర్శనం. వారు గాధా సప్తశతిలోని కొన్ని కథలను తెలుగులోకనువదించగా అవి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాయి. పాకాల యశోదాదేవి ‘అచ్చమ్మ ముచ్చట్లు’తో పాటు మరెన్నో కథలు భారతీయ జీవన విధానానికి, మహిళల ఔన్నత్యానికి అద్దంపట్టాయి. వేంపల్లి గంగాధర్ కథ, వానరాముడు, ప్రతీకాత్మకంగా... ధర్మచ్యుతి వల్ల అనర్థాలు జరుగుతాయని, ధర్మాచారణంవల్ల దేశం సుభిక్షంగా ఉంటుందనే నీతి వుంది. ఏడోందల కథలు రాసిన ఐతా చంద్రయ్య రాసిన కథ ‘‘యజ్ఞసమిధ, మరియు ‘విజయదశమి’లాంటి మరెన్నో కథలు ప్రజలంతా కుల- మత - లింగ వర్ణ వర్గ భేదాలు మరిచి మాతృదేశ రక్షణకోసం త్యాగాలు చెయ్యాలంటాయి. నిఖిలేశ్వర్ రాసిన ‘మనిషి- మట్టి’ కథలో మతం, రాజకీయం, మనిషికీ వున్న అనుబంధాన్ని వర్ణించాడు.
కస్తూరి మురళీకృష్ణ రాసిన వందల కథల్లోని ‘‘స్వధర్మే విధనం శ్రేయం’లో సమాజములో మార్పు ఆత్మీయతానురాగాలతో వస్తుందని, ద్వేషంతోకాదని చెబుతుంది. తాడి నాగమ్మ ‘ఒక ముద్దు’ కథ సామాన్య మహిళ దేశ దాస్య విముక్తికోసం చేసిన పోరాటాన్ని వివరిస్తుంది. ఎన్నో కథలు రాసిన రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ‘చీకటినుండి వెలుగువైపు’ కథ అసలైన దేశభక్తియే మానవత్వమంటుంది. వీరే కాకుండా మరెందరో జాతీయ భావకథలు రాశారు. శిరంశెట్టి కాంతారావు, కడియాల మధుసూదన్‌రావు, దొరవేటి, చొప్పదండి సుధాకర్ మొదలైన రచయితల కథల్లో, నాయని సుజనాదేవి, నెల్లుట్ల రమాదేవి లాంటి రచయిత్రుల కథల్లో భారతీయ దేశభక్తి, భారతీయ ధర్మజీవన విధానాలు కనబడ్తాయి.

- ఐతా చంద్రయ్య