మెయిన్ ఫీచర్

పెద్దల జాగ్రత్తలే పిల్లలకు శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా గెంతులు వేస్తుంటే, కొందరేమో నీరసంగా, నిరుత్సాహంగా డల్‌గా ఉంటారు. దీనికి కారణం కొంతవరకూ పెద్దల పెంపకంలో తేడా కావచ్చు. పిల్లల్ని ఒక వయసు వరకూ ప్రేమగా దగ్గరకు తీసుకుని స్పృశిస్తూ ఉంటే పిల్లలకి ఆప్యాయత, రక్షణ, భద్రత ఉండే ఫిలింగ్స్ కలుగుతాయి. దీనివల్ల వారిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. పిల్లల్ని ఎప్పుడూ ఒకేరకం వస్తువులమధ్య, ఒకే పరిసరాల్లో, ఒకే వాతావరణంలో ఉంచితే నిరుత్సాహం ఏర్పడుతుంది. కొత్త కొత్త వస్తువులను పిల్లలకి చూపుతూ, వాటిమధ్య గడిపేలా చేయండి. అప్పుడప్పుడు బయట ఎగ్జిబిషన్లు, పార్కులు, మ్యూజియమ్స్, పిక్నిక్‌లాంటి వాటికి తీసుకెళుతుంటే వారిలో ఉత్సాహం మొదలవుతుంది.
పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామనేది తల్లిదండ్రుల ఫిర్యాదు. వాళ్ళ సందేహాలు, సమస్యలూ, అవసరాలూ, అల్లర్లూ, ముద్దు ముచ్చట్లూ ఒకటా రెండా, తీర్చేకొద్దీ ఇంకా పుట్టుకొస్తుంటాయి. ఆట వస్తువులతో ఆడుకునే వయసు దాటిన తర్వాత పిల్లలకు తమ చుట్టూ వున్న ఇతర వస్తువులమీదికి దృష్టి పోతుంటుంది. ఇంట్లో వుండే టీవీ, డివిడి ప్లేయర్లు, వాల్‌క్లాక్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపరేట్ చేయాలన్న ఆసక్తి పెరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలమీద కోప్పడి ప్రయోజనం లేదు. అలా చేస్తే పేరెంట్స్ ఇంట్లో లేనపుడు పిల్లలు మళ్లీ ఆ పనే చేస్తారు. కాబట్టి వారి ఆసక్తిని గమనించి పనికిరాని, పాడైపోయిన, పక్కన పడేసిన కొన్ని వస్తువులను వారిముందు ఉంచి ఆ భాగాలను సరిగా అమర్చే పనిని పిల్లలకు అప్పగించండి.
పిల్లల్ని స్కూల్లో చేర్పించి బుక్స్ కొనిచ్చి, ఫీజులు కట్టేయడంతో పేరెంట్స్ పని అయిపోయినట్లు కాదు. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా తెలుసుకుంటూ ఉండాలి. రోజూ ఓ గంటసేపైనా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించడం అవసరం. కొంతమంది తల్లిదండ్రుల మీద భయంతో ఎప్పుడూ బుక్స్ ముందు పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకుని చదివించాలి.
ఒక వయసు వచ్చేవరకు పిల్లలకోసం స్నేహితులను పెద్దలే ఎంపిక చేయడం మంచిది. ఏ ఆకతాయిలతోనో స్నేహం పెంచుకునే ప్రమాదం వుంది. పిల్లలకు ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వాయిద్య కళలు లాంటివి ఏదో ఒక లలిత కళల్లో ప్రవేశం కల్పించండి. స్నేహితుల విషయంలో పిల్లలకు కొంతవరకైనా స్వేచ్ఛ ఇవ్వండి. లేదంటే వాళ్ళకి అసలు స్నేహితులే లేకుండా పోయే ప్రమాదం ఉంది. పిల్లలు మంచివాళ్ళు, బుద్ధిమంతులు అయినా వాళ్ళ ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు అయితే ఇబ్బంది. బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన కుటుంబాల్లోని పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేసుకునేలా చూడండి.
పిల్లలు కన్న తల్లిదండ్రుల కంటే తాతయ్య, బామ్మలతో కలిసి ఉండటంవల్ల మనోవికాసాన్ని పొందగలుగుతారు. నలుగురితో కలిసి వుంటే మంచి చెడు మధ్య వ్యత్యాసం, తప్పు ఒప్పులంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు. కుటుంబం అంటేనే అందరూ కలిసి ఉండటం. నేటి తరంలో విడిపోయేందుకు చూపించేంత మక్కువ కలిసి ఉండటానికి చూపించటంలేదు. అందుకు కారణాలేవైనా కావచ్చు. ఉమ్మడిగా కలిసి వుంటే ఎన్నో ఆనందాలు, సమస్యలను ఎదుర్కొనే మానసిక ధైర్యం సొంతమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇరువురు బిజీగా ఉండటం, పిల్లల్లో విలువలు, మానసిక ధైర్యం అందించేవారు కరువయ్యారు.
చాలామంది పిల్లలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రుల దగ్గర నోరు విప్పరు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో, ఏమంటారో తెలియక ఇలాంటి సమస్యల్ని వౌనంగా భరిస్తారు. పక్కింటివారు, దగ్గరి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు, తెలిసినవారినుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారు పిల్లలు. ఈ సమస్య చాలా సున్నితమైనది. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఇలాంటి సమస్యల గురించి చర్చించరు. అందుకని పిల్లల్లో వున్నటుండి అనుకోని మార్పులు సంభవిస్తే వారి ప్రవర్తన గమనిస్తూ ఉండాలి.
ఆటలు పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడంలోనూ, బుద్ధి వికాసం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి. బడిలో ఆటలవల్ల పిల్లల్లో చక్కని క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడంవల్ల ఎలాంటి వ్యాయామాలు చేయడంలేదు. ఫలితంగా భవిష్యత్తులో చాలా అనారోగ్యాలు కలిగే అవకాశం వుంది. నేటి పాఠశాలలు కూడా చదువు నేర్పడానికే పరిమితమవుతున్నాయి. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉండాలి. విద్యకు సంబంధించిన పరికరాలతోపాటు, క్రీడల సామగ్రి కూడా ఉంచడం అవసరం. ఆటలవల్ల పిల్లల్లో ఆశావహ దృక్పథం అలవడుతుంది. మెదడులో ప్రతిస్పందనల వేగం కూడా ఎక్కువగా వుంటుంది. ఆటలు జీర్ణశక్తిని పెంచుతాయి. అప్పుడప్పుడు పెద్దలు కూడా పిల్లలతో కలిసి ఆడటంవల్ల పిల్లలకు పెద్దలు మరింత దగ్గరవుతారు.
పిల్లల చేతికి స్మార్ట్ఫోన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చినట్లే అంటున్నారు నిపుణులు. వారిని మొబల్ నుంచి దూరంగా ఉంచడానికి నానా యాతనలు పడుతున్నరు పేరెంట్స్. పిల్లల శారరీక, మానసిక ఎదుగులకు మొబైల్‌ఫోన్లు అడ్డంకిగా మారుతున్నాయి అంటున్నారు నిపుణులు. ఇంటర్‌నెట్‌లోని అశ్లీల సాహిత్యం, అశ్లీల చిత్రాలు, వీడియోలను పరస్పరం స్మార్ట్ఫోన్ల ద్వారా షేర్ చేసుకోవడం ప్రైమరీ స్కూల్ పిల్లల్లో కూడా పెరుగుతోంది. ఈ విషయంమై ఎంతోమంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆన్‌లైన్ ఉపద్రవాల గురించి సరైన అవగాహన కలిగించాలన్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాలు అందిస్తున్న సౌకర్యాలను పిల్లలు తమ విద్యాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా చదువుకోవడానికి సరికొత్త పద్ధతిలో ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఇంటర్నెట్‌లో సెర్చింగ్ బాగా ఇష్టపడతారు. దీన్ని అలుసుగా తీసుకొని కౌమార దశలో వున్న పిల్లలుల చెడు మార్గాల వైపు వెతుకులాట మొదలుపెడుతున్నారు.
బెర్నాడోస్ చిల్డ్రన్ ఛారిటీ అన్నది 1866లో ఇంగ్లాండ్‌లో స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రాథమిక విద్య స్థాయిలో తరగతి పిల్లల స్మార్ట్ఫోన్ల వ్యవహారం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. వాస్తవ ప్రపంచంలో ఆరోగ్యకరమైన మానవ సంబంధాల ఆవశ్యకతను గురించి ఆ వయసు పిల్లలనుంచి చక్కటి అవగాహన కలిగించేందుకు మనం కృషి చేయాలి. లేకపోతే ఇంటర్నెట్ వైపరీత్యాలకు రాబోయే తరం బలయ్యే ప్రమాదం ఉంది అని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
నిరంతరం సోషల్ మీడియాలో మునిగితేలటం, ఆన్‌లైన్ పోర్నోగ్రఫి వంటి ఇంటర్నెట్‌లో గల అభ్యంతర విషయాలు పిల్లల దృష్టి మళ్లించి వారిలో తమపట్ల, ఇతరులపట్ల అవాంఛనీయ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. చిన్నపిల్లలు, కళాశాల విద్యార్థులు ఈ ఫోన్లలో తమ నగ్న చిత్రాలను పరస్పరం షేర్ చేసుకునే స్థాయికి ఈ వ్యవహారం వెళ్తోంది కూడా. తరగతి గదులలో పిల్లలు నడిపే సెక్స్టింగ్ వ్యవహారం టీచర్లకు పెద్ద తలనొప్పి అయిందని 3ది నేషనల్ అసోసయేషన్ ఆఫ్ ఉమెన్ టీచర్స్2 అనే టీచింగ్ యూనియన్ అంటోంది.
ఆన్‌లైన్ గేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అవి లేకుంటే జీవితం లేదనే భావనలోకి వెళ్లిపోతున్నారు. బ్లూవేల్ ఛాలెంజ్, పోకెమాన్ గో పబ్‌జీ ఇవన్నీ పేరకు ఆన్‌లైన్ గేమ్సే. కాని మనుషుల ప్రాణాలు తీస్తున్న గేమ్స్ అని గ్రహించలేకపోతున్నారు. తను బతకాలంటే ఇతరులు చావాలనే సిద్ధాంతమే అత్యంత ప్రమాదకరమైనది. పబ్‌జీ క్రీడను గేమింగ్ డిజార్డర్‌గా గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 60 శాతం యువత ఈ పబ్‌జీ గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ ఆడే పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం, వారిలో హింసా ప్రవృత్తి పెరుగుతుండటంతోపాటు విద్యార్థుల చదువు కూడా నాశనం అవుతుండడంతో చాలా ప్రభుత్వాలు ఈ గేమ్‌ను ఆడవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
మనకు అవసరంలేని సైట్స్‌ను బ్లాక్ చేయడానికి మార్కెట్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో వున్నాయి. నెట్‌గేర్ రౌటర్‌లో పేరెంటల్ కంట్రోల్ లాక్ వంటి చాలా సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో వుంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లు యాంటీ వైరస్‌లా పనిచేస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్ కేవలం సైట్లను బ్లాక్ చేయడమే కాదు ఇంటర్నెట్‌లో ఏం చూశారు, ఏం చేశారు అన్న విషయాలన్నింటినీ సేవ్ చేసి పెడుతుంది.
టీచర్లు - విద్యార్థులమధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు వికాసం పొందడానికి చర్యలు చేపట్టాలి. ఇతరులతో పోల్చడం, వెక్కిరింపులకు గురిచేయడం, పేర్లుపెట్టడం, నలుగురిలో చులకన చేసి మాట్లాడటంతో వారు మరింత కృంగిపోయే ప్రమాదం ఉంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి