మెయిన్ ఫీచర్

పచ్చ ‘ధనం’తో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారంలో ఆకుకూరల స్థానం ప్రత్యేకం. తరచుగా దొరికే ఆకుకూరలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆకు కూరల్లో ఉండే విటమిన్ బి పాలెట్స్ జ్ఞాపకశక్తితోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలను నియంత్రించడానికి సహకరిస్తాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర, మునగ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, బ్లాక్ బీన్స్, సోయాబీన్స్, గ్రీన్‌పీస్ తదితర వాటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం, కాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో ఎముకలు, దంతాలు గట్టితనానికి, కండరాలు మరియు గుండె సంకోచానికి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం అవిశ, తోటకూర, కరివేపాకు, మునగాకు, మెంతికూరలో ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు, యుక్తవయస్కులకు ఎంతో అవసరం. ఆకుకూరల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. రక్తపుష్టికి ఇనుము చాలా అవసరం. తోటకూర, శెనగ కూర, బొబ్బెర్లఆకులు, బచ్చలి, ఆకులు, పొనగంటి మొదలైన వాటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది.
ఆకుకూరలలో కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు రేచీకటి రాకుండా కాపాడుతుంది. మన దేశంలో చాలామంది ప్రతి సంవత్సరం విటమిన్ ఎ లోపానికి గురవుతున్నారు. వీరిలో ముఖ్యంగా 5 సం.లలోపు పిల్లలు ఎక్కువగా ఉండటం గమనార్హం. విటమిన్ ఎ అవిశ, మునగ, పాలకూర, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర మొదలైనవి ఆకుకూరలలో సమృద్ధిగా లభిస్తుంది.
బి విటమిన్‌లు ఆకుకూరల్లో ఒక మోస్తరుగా వుంటుంది. రైబోఫ్లేవిన్ లోపంవలన నోటిపూత, పెదాల చివరిలో పగుళ్ళు, కళ్ళు ఎరుపుగా మారడం వంటి సమస్యలను తాజా ఆకుకూరలను మన ఆహారంలో చేర్చుకోవడంవలన నిర్మూలించవచ్చు.
ఆకుకూరల్లో పంటి చిగుళ్ళ ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. అనారోగ్యానికి త్వరగా లోనవ్వకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అవిశ, తోటకూర, క్యాబేజీ, కొత్తిమీర, మునగ మొదలైన తాజా ఆకుకూరలలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఆకుకూరలలో పీచుశాతం కూడా ఎక్కువ. పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఆకు కూరలను వివిధ వంట పద్ధతుల ద్వారా వండేటప్పుడు పోషకాలను నష్టపోయే అవకాశం వుంటుంది. వేపుళ్లు, ఎక్కువ ఉష్ణోగ్రతలో వండడం, ఎక్కువ నీటిలో వండడంవలన పోషకాలను నష్టపోయే అవకాశం ఎక్కువ.
ఆకుకూరలను తాజాగా వాడటం, కుక్కర్ లేక తగినన్ని నీటిలో ఉడికించడంవల్ల పోషకాలు తక్కువ కోల్పోతాయి. ఆకుకూరను వండేటప్పుడు మొదటి 2-5 నిముషాలు మూత వారగా బెట్టి ఆ తరువాత పూర్తిగా మూతపెట్టాలి. దీనివల్ల ఘాటు వాసన తొలగిపోతుంది. ఆకు కూరలను స్టీల్ లేదా మట్టి పాత్రలో వండడం మంచిది. ఆకుకూరలు మన శరీరానికి అనేక సూక్ష్మ పోషకాలను అందించి, ఆయా వ్యాధుల బారినుండి కాపాడి ఆరోగ్యవంతులను చేస్తుంది.
నార లేదా పీచుతో కూడిన స్వాభావిక ఆహార పదార్థాలు మనం తీసుకునే భోజనంలో 50 శాతం దాకా తప్పనిసరిగా ఉండాలి. కండరాల కదలికలకు నార లేదా పీచుతోకూడిన ఆహార పదార్థం సహాయపడుతుంది. తాజా కూరగాయలతో కూడిన సలాడ్‌లు, బచ్చలి కూర జీర్ణశక్తిని పెంచుతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు అవసరమైన పీచు పదార్థం ఆకుకూరల్లో అధికంగా వుంటుంది. శరీరంలోని, పేగుల్లోని బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఆకుకూరల్లోని పత్రహరితాలకు ఉంది. ఆకుకూరలను పచ్చిగానే నమలటంవల్ల పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాల ముక్కలను బయటికి తీస్తాయి. అలాగే పళ్లకు హానిచేసే క్రిములను నాశనం చేస్తాయి.తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పీచు సమపాళల్లో వుంటే అన్ని పోషకాలు అందుతాయి. కానీ ఏ ఒక్క ఆహార పదార్థంలోనూ ఇవి నాలుగూ ఒకేసారి లభించవు. అందుకే సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకుకూరలు యాంటీ ఆక్సిడెంట్లను కలిగివుంటాయి. గుండె జబ్బులు, కొన్నిరకాల కాన్సర్లనుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. రోజూ ఆహారంలో కనీసం 10 గ్రాముల తాజా ఆకుకూరలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆకుకూరలను శుభ్రం చేయడానికి మంచినీరు వాడాలి. లేదంటే వాటిని ఉప్పు వేసిన వేడినీటిలో శుభ్రం చేయాలి. అప్పుడు మాత్రమే వాటిపై వున్న క్రిములు, వాటి గుడ్లు పూర్తిగా నశిస్తాయి. ఆకుకూరల్లో వుండే పోషకాలను పూర్తిగా పొందాలంటే వాటిని సన్నగా తరగాలి, వీలైతే పచ్చివిగానే తినాలి.
చాలా రకాల మొక్కలను ఆకుకూరలుగా వాడే అవకాశం వున్నా వాటి గురించి పెద్దగా తెలియకపోవడంతో అధిక శాతం ప్రజలు వాటిని పిచ్చిమొక్కలుగానే భావించి పీకిపడేస్తున్నారు. ప్రకృతిపరంగా ఎవరి ప్రమేయం లేకుండానే ముల్లతోటకూర, ఇసుక దొగ్గలికూర, ఎర్రగింజెలకూర, గొరిమెడ, తగిరంచ, తెల్లపప్పుకూర, అడవి మెంతెంకూర, అడవి సోయకూర, ఎర్ర, నల్ల కాశిపండ్ల కూర, తడకదొబ్బుడు కూర, చెన్నంగి, అంగిబింగి, చిలుకకూర, పుల్లకూర, నల్లపప్పుకూర, నాగలిచెవికూర, ముద్దకూర, తగిలంచెకూర, బంకంటి, పల్లేరుకూర, పిట్టకూర, చెన్నంగి, ఎన్నాద్రీకూర, తురాయి, గోరుముడి, అడవిపుల్లకూర, బుడ్డకాశ, నల్లనేలుసిరి, అత్తిపత్తి - ఇలా ఎన్నో ఆకుకూరలను ప్రకృతి మనకు ప్రసాదించింది. ఆకుకూరలతోపాటు సహజంగా పండే అడవి కాకర (ఆకాకర), అడవిదొండ, దొండ, కాశ, పండ్లు, తెల్లవార్జం కాయలు, మేడికాయలు, పుల్‌చరిపండ్లు, కాకిపండ్లు, ఈతపండ్లు, మొర్రిపండ్లు, బొంతపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. జొన్నరొట్టెలతో పొన్నగంటి, జొన్నచెంచలి, దొగ్గలికూర, ఉత్తరేణి, బంకటి కూరలను తీసుకుంటే పేగులలో వుండే మలినాలు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య అసలే ఉండదు. రక్తం శుద్ధి అవుతుంది.
ప్రకృతిసిద్ధంగా దొరికే ఆకుకూర్లో ఎన్నో ఔషధగుణాలు, పోషకాలున్నాయి. వీటిని వండుకోవడం తేలిక. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆకుకూరలు, కూరగాయలకంటే వీటిలో ఎన్నో రెట్లు మెరుగైన గుణాలున్నాయి.

- మైత్రేయ