మెయన్ ఫీచర్

విదేశీయ ఆయుధాలకు విక్రయ కేంద్రం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురాక్రమించిన విదేశీయ మూకలపై ఒకప్పుడు అగ్నివర్షం కురిపించిన ‘అజనాభం’ ఇప్పుడు విదేశాల నుంచి ఆయుధాలను కొంటోంది. పిడుగుల జడి వంటి అస్తశ్రస్త్రాలను సంధించిన ఈ సనాతన భూమి ‘బడుగు’ రూపం ధరించి ఇతర దేశాల వద్ద తూటాలను, తుపాకులను అభ్యర్థిస్తోంది! మన దేశం ‘అజనాభం’.. అంటే సృష్టికి జన్మస్థానం. తొలి మానవులు భారతదేశంలో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించారు. అలా వ్యాపించినవారు వేల, లక్షల ఏళ్ల తరువాత మళ్లీ మన దేశం మీదికి దండెత్తారు. సకల విధ విజ్ఞానాలు, విద్యలు మొదట ఇక్కడ పుట్టాయి. ఈ మానవీయ సంస్కారాలు క్రమంగా ప్రపంచవ్యాప్తమయ్యాయి. సంస్కారాలు మరచిన పూర్వ భారతీయులు విదేశాలలో నిలబడి మళ్లీ భారత్‌కు విద్యల సంస్కారాలు నేర్పించారు! సకల అస్తశ్రస్త్రాలకు నిలయమై ఉండిన ఈ దేశం ఇప్పుడు విదేశాల నుంచి అస్తశ్రస్త్రాలను కొనడం చారిత్రక విపరిమాణ వైచిత్రి!!
అణ్వస్త్రాలను రూపొందించిన మన దేశం ‘అగస్టా’- విదేశీయ సంస్థ నుంచి ‘గగన శకటాల’ను కొనుగోలు చేసింది. సుదూర గతానికీ, వర్తమాన ‘పతన’ స్థితికీ మధ్య అంతరం ఉండవచ్చు! వర్తమాన అణుపాటవానికీ, వర్తమానపు క్షిపణుల దిగుమతికీ మధ్య కూడ విపరీతమైన ‘బారడి’ కనిపిస్తుండడమే సామాన్యులకు అంతుపట్టని వ్యవహారం! గగన యుద్ధ శకటాలను, విమాన వాహక యుద్ధనౌకలను విదేశాల నుంచి కొంటున్నాము. సైనికులు ప్రయాణిస్తున్న, ‘సరఫరాలో’ రవాణా అవుతున్న బస్సులు, ట్రక్కులు, జీపులు, లారీలు కూడా విదేశాల నుంచి తరలి వస్తున్నాయి. ఇక్కడ తయారుకావడం లేదు! ఇది అర్థం కాని ‘అంతరం’.. స్వతంత్ర భారత స్వయం సమృద్ధి సిద్ధాంతానికి ఏడు దశాబ్దులుగా రక్షణోత్పత్తుల రంగం ‘అపవాదం’.. మన దేశంలో తయారైన ‘సైనిక వాహనం’- నాలుగు చక్రాల సంచార వేదిక విలువ పద్దెనిమిది లక్షల రూపాయలు కాగా, ఐరోపా- చెక్ రిపబ్లిక్- నుంచి దిగబడిన ‘తాతరా’ వాహనాన్ని ఎనబయి లక్షల రూపాయలకు కొన్నారు. క్రీస్తుశకం 2012వ సంవత్సరానికి పూర్వం జరిగిన దోపిడీ తీరు ఇది. వేలాది ‘తాతరా’ ట్రక్కులను మన ప్రభుత్వం అప్పటికే కొనేసింది. ఇలా విదేశాల నుంచి తరలివస్తున్న సైనిక వాహనాలలో అవినీతి కూడా ఊరేగుతూ వస్తోంది. ఈ అవినీతి క్రీస్తుశకం 1980వ దశకం నుంచి ‘గుబాలిస్తోంది’.. ఇటలీకి చెందిన ఒట్టావియో కుత్రోచి 1986లో ఇక్కడి ప్రభుత్వ నిర్వాహకులతో కలసి దోచుకున్న నాటిది ఈ అవినీతి, అగస్టా ‘గగన శకటాల’ నెక్కి కూడా ఈ ‘ఇటలీ అవినీతి’ దూసుకువచ్చింది! ‘తాతరా’ ట్రక్కుల నిండా అవినీతి.. ‘నాకు లంచం ఇవ్వడానికి ‘తాతరా’ ట్రక్కుల దళారీలు బరితెగించి వచ్చారు!’అని అప్పటి సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ విజయకుమార్ సింగ్ 2012లో వాపోవడం పరాకాష్ఠ. ‘తాతరా’ దళారీలు ఆయనకు పధ్నాలుగు కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారట! ఆయన తిరస్కరించాడు.. కానీ 1986 నుంచి 2012వరకు ఏడువేల ట్రక్కులను మనకు అమ్మిన ఈ ఐరోపా సంస్థ వారు- ఎంతమంది మన సైనిక అధికారులకు, ఎందరు రాజకీయవేత్తలకు ఎన్ని వందల కోట్లు చెల్లించారో? ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయారో??
ఐరోపా వారు మన దేశాన్ని దోచుకొనడం సహస్రాబ్దుల కథ. ఈ దోపిడీ మూకలు మన దేశపు ఆయుధ పటిమ ముందు మోకరిల్లి పలాయనం చిత్తగించడం కూడా సహస్రాబ్దులకు పూర్వం నడచిన కథ. అలెగ్జాండర్ అన్న గ్రీసు దేశపు బీభత్సకారుడు- టెర్రరిస్ట్- క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడడానికి విఫలయత్నం చేసిన నాటి కథ, అంతకు పూర్వం నాటి కథ! ఈ ‘టెర్రరిస్టు’ను ‘గొప్ప చక్రవర్తి’గాను, అసమర్థుడైన ఈ దుర్జనుని ‘విజేత’గాను మన చరిత్ర పుస్తకాలకు ఎక్కించి వెళ్లిన బ్రిటన్ దుండగులు మన దేశాన్ని దురాక్రమించిన నాటిది ఈ దోపిడీ కథ.. క్రీస్తు పూర్వం సహస్రాబ్దుల తరబడి ఈ దేశంలో విలసిల్లిన ఆయుధ పాటవం గురించి, సమరపటిమ గురించి ఎందరో పరిశోధకులు, అధ్యయనశీలురు ఇటీవలి కాలంలో అనేక గ్రంథాలు వ్రాశారు. కానీ, ఆయుధ పాటవాన్ని పునరుద్ధరించుకొని వర్తమానంలో ఉపయోగించుకొనడానికి అనివార్యమైన పరిశోధన, పరిశ్రమ బ్రిటన్ విముక్త భారతదేశంలో డెబ్బయి ఏళ్లుగా జరిగినట్టు లేదు. మన రక్షణ రంగ పరిశోధనలు ‘అనుసంధాన పరిధి’లో ఇరుక్కొని ఉన్నాయి. రష్యాతో పరిజ్ఞాన అనుసంధానం, అనేక ఇతర దేశాలలో అనుసంధానాలు క్రీస్తుశకం 1950లో, 1960వ దశకాలలో అనివార్యమై ఉండవచ్చు. ప్రస్తుతం కూడా అనుసంధానాలు, ఆయుధాల కొనుగోళ్లు మన రక్షణోత్పత్తుల రంగంలో ప్రధానమైన అంశం! ‘అరిహంత’ అణుచోదక జలాంతర్గామిని మూడేళ్లక్రితమే నిర్మించిన మనం అలాంటి మరో ‘జలాంతర్గామి’కోసం రష్యాను అభ్యర్థిస్తూనే ఉన్నాము! రష్యా ప్రభుత్వం, ‘విచిత్ర దౌత్యవిన్యాసాల’ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ‘ఎండమావి’ సముద్ర జలాలలో ఈ రెండవ జలాంతర్గామిని ప్రదర్శిస్తూనే ఉన్నారు! మన హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్- హాల్- సంస్థవారు ముప్పయి రెండేళ్లు శ్రమించి 2015 జనవరిలో ‘తేజస్’ యుద్ధ విమానాన్ని మన వైమానిక దళాలకు అప్పగించారు. రష్యావారి ‘మిగ్గు’లపై ఆధారపడిన మనం- స్వయం సమృద్ధ గగన సమర పటిమను సాధించినట్టు మురిసిపోయాము.. ఇంతలోనే ఫ్రాన్స్ నుండి ముప్పయి ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు తరలివస్తున్న సమాచారం మెరిసిపోతోంది! స్వదేశీయ ‘తేజస్’- విదేశీయ ‘రాఫెల్’ ముందు వెలవెలపోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కనబడిన సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ‘రాఫెల్’ పైనుంచి ప్రయోగించగలరట.. మనం వెనుకబడి ఉండడం కఠోర వాస్తవం కాదా?
బాల్యవివాహాలను నిషేధించడానికి వీలైన చట్టానికి రూపకల్పన చేసిన న్యాయశాస్త్ర కోవిదుడు హరవిలాస్ శారద. బాల్య వివాహాల నిషేధపు చట్టం అందువల్లనే ‘శారద చట్ట’మైంది. ఈ మహనీయుడు గొప్ప పరిశోధకుడు. క్రీస్తుశకం 1906వ సంవత్సరంలో ‘హైందవ సమాజ ప్రాచీన చరిత్ర’ - హిస్టరీ ఆఫ్ ఏన్సియంట్ హిందూ సొసైటీ- అన్న గ్రంథాన్ని హరవిలాస శారద రచించాడు. భౌతిక, రసాయన, ఆర్థిక, వాణిజ్య, ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో అతి ప్రాచీన భారతదేశపువాస్తవ స్థితిగతులను గురించి ఆయన ఈ గ్రంథంలో వివరించి ఉన్నాడు. ప్రాచీన భారతీయుల ‘సమరవిద్య’- మిలిటరీ సైన్స్-కు సంబంధించిన అనేక వివరాలను ఈ బృహత్ గ్రంథంలో శారద ఉల్లేఖించాడు. గ్రీసు దేశం నుంచి వచ్చిపడిన అలెగ్జాండర్ భారతీయుల అస్తశ్రస్త్రాల గురించి అచ్చెరువునందినాడు! అలెగ్జాండర్ ఇక్కడ ఎవ్వరినీ గెలవలేదని, ఓడిపోయి పారిపోయాడని ఈ గ్రంథం ద్వారా మరోసారి ధ్రువపడింది. కలియుగంలో ప్రస్తుతం 5118వ సంవత్సరం నడుస్తోంది. కలియుగం 2776లో అంటే క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ మన దేశంలో బీభత్సకాండ సృష్టించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఫిలాస్ట్రాటస్ అనే చరిత్రకారుడు ఇలా వ్రాసినట్టు ‘శారద’ తన గ్రంథంలో తెలిపాడు. ‘అలెగ్జాండరు ఒకవేళ ఈ ప్రాంతంలోకి చొరబడి ఉండి ఉంటే ఈ ఋషులు- సేజెస్- నివసిస్తున్న దుర్గమ స్థలాలను అతడు స్వాధీనం చేసుకోలేకపోయేవాడు.. తమపై శత్రువులు దాడిచేసినట్టయితే ఈ ‘ఋషులు’ అగ్నిశిలలతోను, పిడుగులతోను వారిని తిప్పికొట్టేవారు. ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా ఈ శిలలు, పిడుగులు ప్రస్ఫుటించేవి... గతంలో ఈజిప్టుకు చెందిన ‘హెర్క్యులస్’, ‘బాకుస్’ అనేవారు ఉమ్మడిగా ఈ ‘దుర్గమ స్థలాల’పై దాడిచేశారు. వివిధ రకాల ఆయుధ శకటాలను వారు ఉపయోగించారు. ఋషుల దుర్గమ స్థలాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. దాడులు జరిగేవరకు ఆ ధర్మాచార్యులు తమకేమీ సంబంధం లేనట్టు నిరామయంగా ఉన్నారు. జరిగిన వెంటనే అగ్నిగుండాల వంటి, పిడుగుల వంటి ఆయుధాలను ఋషులు కురిపించారు. ఆకాశం నుండి దూకిన ఈ ఆయుధాలు దురాక్రమణకారులను ధ్వంసం చేశాయి..’
ఈజిప్ట్‌వారి భంగపాటు గురించి తెలిసిన అలెగ్జాండర్ అందువల్ల పంజాబ్‌లోకి రానే లేదు. అయితే గాంధారం- నేటి అఫ్ఘానిస్తాన్-లోనే అలెగ్జాండర్ సైన్యంపై భారతీయ వీరులు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ సంగతిని ‘అరిస్టాటిల్’కు వ్రాసిన ఉత్తరంలో అలెగ్జాండరు స్వయంగా పేర్కొన్నట్టు ‘శారద’ తన గ్రంథంలో ఉటంకించాడు! ప్రాచీన గ్రీసు దేశపు రచయితలకు భారతీయ యుద్ధ పద్ధతులు అర్థం కాలేదు. అందువల్ల దురాక్రమణను భారతీయులు దునుమాడిన పద్ధతి వారికి ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ బ్రాహ్మణులు శత్రువుకు దూరంగా నిలబడి మెరుపులను, పిడుగులను ప్రయోగించిన సంగతిని థీమిస్టియస్ పేర్కొన్నాడు.’- అని ఆ రచయితలు వ్రాసుకున్నారు. మరింత సమీప గతంలో, క్రీస్తుశకం 1502వ సంవత్సరంలో దురాక్రమించిన పోర్చుగీసు ముష్కరులపై హిందువులు ‘అగ్నిబాణాల’ను సంధించారట! కేరళ తీరంలోని కోజికోడ్ వద్ద జరిగిన ఈ ప్రతిఘటనకు తట్టుకోలేక పోర్చుగీసువారు పారిపోయారు.. అని ‘శారద’ వివరించాడు! 1500వ సంవత్సరంలో గుజరాత్ తీరంలో కూడా తమపై ఒకేసారి అనేక శతఘు్నలు వర్షించాయని ‘పోర్చుగీసులు’ తమ దినచర్య వ్రాసుకున్నారు. ఐదువందల ఏళ్లలో కథ మారిపోయింది..
ఇప్పుడు రష్యా నుంచి దాదాపు 71,000 కోట్ల రూపాయల ఆయుధాలను కొనడానికి మన ప్రభుత్వం గోవాలో అక్టోబర్ 15వ తేదీన అంగీకరించింది. ఫ్రాన్స్ నుంచి అరవై వేల కోట్ల రూపాయలకు పైగా ధర పెట్టి ‘రాఫెల్’ విమానాలను కొంటున్నాము. అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాల విలువ ఇంకా ఎక్కువే! మనకు విదేశాల నుంచి ‘పెట్టుబడులు’ వస్తున్నాయన్న ఆర్భాటం రెండు దశాబ్దులుగా హోరెత్తుతోంది.. ఈ పెట్టుబడులు ఎక్కువా? మన దేశం నుంచి తరలిపోతున్న రక్షణ నిధుల విలువ ఎక్కువా? వాణిజ్యం లోటు రూపంలో శత్రుదేశమైన చైనాకు ఏటా సగటున రెండు లక్షల కోట్ల రూపాయలు భారతీయులు చెల్లిస్తున్నారు.. ‘మేక్ ఇన్ ఇండియా’- ‘ భారత్ లో నిర్మించండి’- అన్నది వాస్తవ రూపం సంతరించుకొంటోందా??

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com