మెయిన్ ఫీచర్

సామాజిక ఉద్యమం.. జర్నలిజపు సాహసంపాత్రికేయం కాదు ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనికొండ హనుమంతరావు శతజయంతి వేడుకలు
పుస్తకావిష్కరణ, సదస్సు
16.12.2019 సోమవారం ఉదయం 10.30 ని.లకు
తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం
రజతోత్సవ ప్రాంగణం, మెరీనా ఆవరణ, చెన్నై - 600 005.
**
సంచలనం కాదు సంస్కరణం!
సాహిత్యం కాదు సంభాషణం!
ప్రయత్నం కాదు సాహసం!
కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు, అధ్యయనశీలి, సామాజికవేత్త ధనికొండ హనుమంతరావు (4 మార్చి 1919 - 21 డిసెంబరు 1989) నిర్వహించిన ‘అభిసారిక’ మాసపత్రిక సంపాదకీయాలు పరిశీలిస్తే అలా అనిపించక మానదు. తొలుత జూలై 1949లో తెనాలి నుంచీ, తర్వాత 1954లో మద్రాసు నుంచి హనుమంతరావు కొత్తలోకాలను ఆవిష్కరిస్తూ, అపోహలను పటాపంచలు చేస్తూ మొదలుపెట్టిన ‘అభిసారిక’ పేరులోనే కాదు, పత్రిక ప్రచురించే అంశాలూ, వ్యక్తీకరించే విధానం - ఇలా పలురకాలుగా విలక్షణం. మొదటి సంవత్సరం ముగిస్తున్నపుడు వెలువరించిన సంచిక (1950 జూన్) సంపాదకీయం చివర్లో పేర్కొన్నట్టు వారిది - సాధ్యమైనంతలో విజ్ఞాన ప్రసారమే గురి.
-1-
‘‘... బ్రహ్మచర్యం’’ అతి సూక్ష్మమైన విషయం. నేను ఈ విషయాన్ని గూర్చి 1924 మే 25వ తేది ‘నవజీవన్’ పత్రికలో రాశాను. దీనిని మహదేవదేశాయ్ అనువదించాడు. ఆ అనువాదాన్ని నేను ‘యంగ్ ఇండియా’ లో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ఎంచేతనంటే భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు ఈ విషయాన్ని గూర్చి తెలపమని నాకు అనేక లేఖలు రాశారు9’’ అని గాంధీ ‘యంగ్ ఇండియా’ పత్రిక 1924 జూన్ 5 సంచికలో రాశారు. మళ్ళీ 1927 జనవరి 23 సంచిక యంగ్ ఇండియాలో గాంధీ మళ్ళీ ఇలా రాశారు. ‘‘బ్రహ్మచర్యాన్ని గూర్చి తెలపని అదేపనిగా నలుమూలల నుంచి లేఖలు వస్తున్నాయి. బ్రహ్మచర్యాన్ని ఎలా ఆచరించాలో తెలపమని రాస్తున్నారు. లోగడ నేను వ్రాసినదే తిరిగి ఇక్కడ కొత్త పదాల్లో చెప్పుచున్నాను...’’ సుమారు శతాబ్దం క్రితం విషయం ఇక్కడ పేర్కొనడం ఎందుకంటే దాని గురించి ఈ సమాజానికి ఉండే ఆసక్తి గురించి చెప్పడానికే! చర్విత చర్వణం అయినా ఆ విషయానికి గిరాకీ ఉందని పేర్కొనడానికే! గాంధీ కాలమే కాదు నేటికీ టీవీ ఛానళ్ళలో పొద్దుపోయిన తర్వాత ప్రసారమయ్యే కార్యక్రమాల్లో దాంపత్యసౌఖ్యం గురించి అంశాలుంటున్నాయి. గాలికి వీచడం ఎలాగో, చేపపిల్లకు ఈదడం ఎలాగో - అన్నట్టు ఆడ-మగ కలయిక గురించి పలువురు పైకి భావిస్తున్నా; అంతరాంతరాల్లో ఇంకా సరైన అవగాహన, సమాచారం, దృక్పథం లేని పరిస్థితి ఉంది. దాన్ని ఒప్పుకోవడానికి నేటికీ ధైర్యం చాలడం లేదు. అందుకే దాపరికంతో తెలుసుకోవాలనే ధోరణి! అందుకే ధనికొండ హనుమంతరావు ‘అభిసారిక’ పత్రిక అనేది పాత్రికేయం కాదు, ఉద్యమం; సంచలనం కాదు సంస్కరణం; సాహిత్యం కాదు సంభాషణం; ప్రయత్నం కాదు సాహసం అని ఇదివరకే పేర్కోవడం.
-2-
తెలుగు పత్రికల ధోరణుల గురించీ, తెలుగు సంపాదకుల విభిన్న కృషి గురించీ మూడు దశాబ్దాలుగా తెలుగు పుస్తకాలు ఒక పరిమిత సంఖ్యలో వెలువడుతున్నాయి. అయినా నార్ల వెంకటేశ్వరరావు సాహిత్య సృజన చేశారు అని చెప్పినా; కొడవటిగంటి కుటుంబరావు జర్నలిజపు కృషి విశేషం అని పేర్కొన్నా కొంత కొత్తగా చూసే ధోరణి నేటికీ ఉంది. కనుక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి తెలుగు పత్రికల గ్రాంధిక భాషను వ్యవహార శైలికి మళ్ళించడంలో గొప్ప వారధిగా నిలిచారు అని విశే్లషిస్తే మరింత కొత్తగా చూస్తారు. 1934 ఏప్రిల్ ప్రబుద్ధాంధ్ర (సంపుటం 5, సంచిక 4) లో తెనుగు పత్రికల సంపాదకులకు - అంటూ గిడుగు వేంకట రామమూర్తి రాసిన ఘాటైన వ్యాసాన్ని ప్రచురిస్తూ సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తి ఈ విషయాలను సమర్థిస్తూ విపులమైన సంపాదకీయాన్ని అదే సంచికలో రాశారు. అందులో పత్రికలు ఎవరికి, వాటి భాష ఎలా ఉండాలి అని విపులీకరించారు. వీటిని పరిశీలించిన గూడవల్లి రామబ్రహ్మం తన ‘ప్రజామత’ మాసపత్రికను తర్వాతి సంచికనుంచే వ్యావహారిక భాషలోకి మొత్తంగా మళ్ళించారు. తర్వాతి దిశలో రంగప్రవేశం చేసిన తాపీధర్మారావు వ్యావహారిక భాషను దినపత్రికలలో, సినిమాలలో ప్రవేశపెట్టి చరిత్రగా మిగిలారు.
కానీ, ఈ విషయాలు తెలుగు జర్నలిజం పుస్తకాలలో, కోర్సులలో, పాత్రికేయుల చర్చలలో కనబడవు, వినబడవు. చెప్పుకున్న విషయాలనే తరచు చెప్పుకోవడం మనకలవాటు. అందువల్ల తెలుగు జర్నలిజం పోకడల గురించి, చరిత్ర గురించి వివరించే వ్యాసాలలో, పుస్తకాలలో ‘అభిసారిక’ గురించి కానీ, లేదా ఆ పత్రిక కృషి గురించి కానీ; లేదా దాని శాస్ర్తీయ దృక్పథం, సైన్స్ జర్నలిజం గురించి ప్రస్తావన ఉండదు. ఆసక్తి ఉన్న మావంటి వారికి మహా అంటే ధనికొండ హనుమంతరావు సంపాదకత్వం వహించిన పత్రికలలో ఒకటి అభిసారిక అనే సమాచారం తారసపడవచ్చు. అంతకు మించి మరే సవ్యమైన సమాచారం ఉండదు. ఇంకా మాట్లాడితే సెక్స్ పత్రిక అనే విసురు కూడా ఉండవచ్చు. ఇక్కడ సెక్స్ పత్రిక అంటే సెక్స్‌ను ప్రేరేపించే పత్రికగానే పరిగణించబడుతుంది కానీ, సెక్స్ విజ్ఞానాన్ని అందించే పత్రిక అనే ధోరణి పొరపాటున కూడా కనబడదు. ఇక్కడ ప్రస్తావించిన విషయం ఎప్పటిదో కాదు. నేటికీ జరుగుతున్న తంతు. కనుక ‘అభిసారిక’ ద్వారా ధనికొండ హనుమంతరావు ఆరేడు దశాబ్దాల క్రితం చేసిన కృషి గురించి సామాజిక శాస్త్ర పరిశోధన గానీ, సాహిత్య పరిశీలన గానీ ఆశించలేం.
-3-
అభిసారిక సంపాదకీయాల తీరూ తెన్నూ గురించి చెప్పుకునే ముందు ఇంకో విషయం గురించి చర్చించుకోవాలి. శతాబ్దం తర్వాత కూడా ‘టాబు’తో మొహమాటపడే సమాజంలో ఆరు దశాబ్దాల క్రితం ధనికొండ హనుమంతరావు ఎలా సాహసం చేయగలిగారు? ఈ విషయాలు ఆయన ఎక్కడయినా రాశారేమో, ఎవరైనా దీని గురించి ఎక్కడైనా చర్చించారేమో తెలియదు. అయితే ఇటువంటి పత్రికతో దిగడం గొప్ప సాహసమే! మరి అదెలా సాధ్యం? దానికి అప్పటి సమాజం, ఆయన లోనైన ప్రభావాలు మాత్రమే కారణం. 1919లో జన్మించిన హనుమంతరావు ఉవ్వెత్తున లేచిన సంస్కరణ, స్వాతంత్య్ర ఉద్యమాలను చూస్తూ, తెలుసుకుంటూ పెరిగారు - తెనాలి, ఏలూరు, మచిలీపట్నం వంటి ప్రాంతాలలో. తల్లిని చిన్నతనంలో కోల్పోయిన హనుమంతరావు నిశితపరిశీలన, విమర్శక దృష్టి గల తండ్రి చిటికెన వేలు పట్టుకుని పెరిగాడు. కనుక స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, సంస్కరణదృష్టి, సమున్నతమైన సహనం ఉంటే కానీ అలాంటి ప్రయత్నం చేయడానికి సాహసించరు. ఏ విషయాలుండాలి, ఎలా ఉండాలి, ఏ రూపంలో ఇవ్వాలి - అనే పార్శ్వాలు ఈ పత్రికకు సంబంధించి పరిశీలిస్తే హనుమంతరావు గారి శ్రమ, పట్టుదల, చాకచక్యం బోధపడతాయి. ఎందుకంటే ఆయన ఏకకాలంలో రెండు కీకారణ్యాలలో ప్రయాణం సాగించాడు. ఒకటి అపోహలు, మూఢనమ్మకాలు, భయం, బిడియంతో కూడిన సమాజానికి ఈ లైంగిక విజ్ఞానంతోపాటు ఇతర సామాజిక అంశాలు వివరించే పత్రికతో ప్రవేశించడం. రెండవది ఏ ఏ విషయాలు ఆంగ్లం నుంచి అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకుని, తగిన పదావళి ఎన్నుకుని లేదా రూపొందించుకుని సమాజానికి ఎబ్బెట్టు కల్గించని రీతిలో తెలుగులో ప్రతినెలా ఇవ్వడం. ఈ రెండు చోట్లా ఎటువంటి దారీ, తెన్నూ కనబడని స్థితి. అది కూడా ఆర్థికపరమైన ప్రయత్నమే కానీ ఉద్యోగం కాదు. కనుకనే ధనికొండ హనుమంతరావు ‘అభిసారిక’ ప్రయత్నం వరకు సాహసి, దార్శినికుడు, గొప్ప శ్రామికుడు!
-4-
రచయిత, అనువాదకుడు, జర్నలిస్టు, ఎడిటర్ అయిన ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన కుమారులు శ్రీధర్, రవికుమార్, నరసింహారావు, శంకర్; కుమార్తెలు కమల, విజయలక్ష్మి గార్లు - కనుమూసిన తమ అన్న శేషు గుర్తుగా ఇటీవల 12 సంపుటాలు వెలువరించారు. ఇరవయ్యేళ్ళ వయసు నుంచి మూడు నాలుగు దశాబ్దాలపాటు ఉద్యమంగా రచనలు, పత్రికలు నడిపిన హనుమంతరావు కృషిని ఐదారు దశాబ్దాల తర్వాత లోతుగా, సమగ్రంగా, ప్రజుడిస్ లేకుండా పరిశీలించడం, విశే్లషించడం చాలా అవసరం. దీనికి ఈ శతజయంతి సంవత్సర సంపుటాలు ఎంతగానో దోహదం చేస్తాయి. హనుమంతరావు కృషికి మరింత ఆయుర్దాయం పోసి, మనకు స్ఫూర్తిగా మిగులుతాయి ఈ పుస్తకాలు. రెండవ విడతగా వెలువడుతున్న పుస్తకాలలో 1949 జూలై - 1957 జూన్ మధ్యకాలంలో ధనికొండ హనుమంతరావు నిర్వహించిన ‘అభిసారిక’ పత్రికల సంపాదకీయాలతో లభించినవి అన్నీ ఒక సంపుటంగా వెలువరించడం; దానికి నాతో ముందుమాట రాయించడం ముదావహం. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు ఈ సాహసంలో సంస్కరణ, సైన్స్, ఆరోగ్యం, సమాజం, సాహిత్యం, జర్నలిజం, అనువాదం, సంపాదకత్వం అనే కోణాలు నిబిడీకృతమై ఉన్నాయి.
అభిసారిక సంచికలు మొత్తం పరిశీలించాలనే ఉత్సాహం కలుగుతోంది. అయితే అందుబాటులోకి వచ్చిన అభిసారిక సంపాదకీయాలు మాత్రమే పరిశీలించి నాకు కలిగిన అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను.
-5-
ధనికొండ హనుమంతరావు ‘అభిసారిక’ సంపాదకీయాలు గురించి చర్చించుకునేముందు మరికొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి. రెండు దశాబ్దాల క్రితం వరకు ‘అభిసారిక’ పత్రిక పేరు ఒకటి, రెండు చోట్ల చదవడం తప్పా చూసింది లేదు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకుడిగా పనిచేస్తున్న కాలంలో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ గురించి ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలు పెద్ద ఎత్తున రూపొందించి ప్రసారం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారి కె. చంద్రవౌళిగారి పూనికతో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాలను కూడా ఈ కార్యక్రమాల రికార్డింగ్ గురించి సామర్లకోటను కూడా సందర్శించాం. ఒక ఆరోగ్య సంబంధ విషయాల నిపుణుడిగా జెనెటిక్స్ పిహెచ్.డి. అయిన డా. డి. వి. ఆర్. పూషా పరిచయం అయ్యారు. అప్పుడు తన అభిసారిక పత్రిక సంపాదకుడినని, రాంషా కుమారుడినని చెప్పారు. కొన్ని సంచికలు కూడా ఇచ్చారు. పిమ్మట నాలుగైదు సంవత్సరాల తర్వాత విశాఖపట్నం ఆకాశవాణిలో డా. పూషా గారితో కొన్ని లైంగిక విజ్ఞాన కార్యక్రమాలు రూపొందించాము. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు పూషా నాకు ‘అభిసారిక’ సంచికలు పోస్ట్ లో పంపేవారు. అప్పుడప్పుడు వారితో ఫోన్ లో మాట్లాడుతూనే వున్నాను. 1960 ఏప్రిల్ నుంచి రాంషా అభిసారిక పత్రికను - ధనికొండ హనుమంతరావు నుంచి స్వీకరించి నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత రాంషా కుమారుడు ఆ పత్రికకు ఎడిటర్ గా వచ్చాడు. టెలివిజన్, మొబైల్ కారణంగా ఇండియా టు డే స్థానిక భాషల సంచికలే కాదు సితార వంటి సినిమా వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఈ పరిణామంలో భాగంగా 2018 నవంబరులో రాంషా అభిసారిక - సుమారు ఆరు దశాబ్దాలు నడిచి ఆగిపోయింది. ఇప్పుడు తొలిసారిగా తెలుగులో లైంగిక విజ్ఞానం కొరకు నడిచిన ‘అభిసారిక’ మాసపత్రిక చరిత్రగా మారింది.
ధనికొండ హనుమంతరావు 1952 నవంబరు దాకా తెనాలిలో ఉన్నారు. తర్వాత మద్రాసుకు వెళ్ళి కొంతకాలం ‘చందమామ’ పత్రికలో పనిచేశారు. హనుమంతరావు పెద్ద కుమారుడు శ్రీధర్ గారు చెప్పిన సమాచారం ప్రకారం 1954 జూలై నుంచి మూడు పత్రికలు, మూడు సైజులలో ప్రారంభించాడు. అవేః అభిసారిక, జ్యోతి, చిత్రసీమ! వీటిని ప్రచురించుకోవడానికి మద్రాసులో క్రాంతిప్రెస్‌ను ధనికొండ హనుమంతరావు ప్రారంభించాడు. తర్వాత ఖచ్చితంగా తెలియదు గానీ ఐదారేళ్ళకు మూడు పత్రికలను ముగ్గురు మిత్రులకు ఇచ్చివేశారు. రాంషా ‘అభిసారిక’, రాఘవయ్య ‘జ్యోతి’, కొలను బ్రహ్మానందరావు ‘చిత్రసీమ’ పత్రికలను స్వీకరించారు. 1949 జూలైలో తెనాలిలో మొదలైన అభిసారిక 1952 సెప్టెంబరు తర్వాత ఏ సంచికతో ఆగిందో పూర్తి సమాచారం లేదు. మళ్ళీ 1954 జూలైలో మళ్ళీ మద్రాసులో మొదలైంది. జాగ్రత్తగా పరిశీలిస్తే పత్రిక పేరుతో వాడే చిహ్నం తెనాలిలో వాడింది మద్రాసులో వాడలేదు, కొద్దిగా తేడా వుంది. అలాగే 1957 జూన్ తర్వాత ఏ సంచికతో ధనికొండ హనుమంతరావు ‘అభిసారిక’ ఆపివేశారో సమాచారం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెనాలిలో మూడేళ్ళకు మించి, మద్రాసులో మూడేళ్ళకు మించి మాత్రమే ధనికొండ హనుమంతరావు అభిసారిక నిర్వహించారు. వివిధ వ్యక్తులు, గ్రంథాలయాల ద్వారా హనుమంతరావు కుమారులు కేవలం 69 సంపాదకీయాలు మాత్రమే సేకరించగలిగారు. దొరకనివి ఎక్కువ సంఖ్యలో ఉండకపోవచ్చు కూడా. కనుక అందుబాటులో ఉన్న ఈ సంపాదకీయాల ద్వారానే సంపాదకుడిగా హనుమంతరావుగారి మూర్తిమత్వాన్ని అంచనా వేద్దాం, విశే్లషిద్దాం.
-6-
మూఢనమ్మకాలు, భయం, అజ్ఞానం, నిరక్షరాస్యత పేరుకుని ఉన్న సమాజంలో లైంగిక విజ్ఞానం కోసం ఒక పత్రికను ప్రారంభించినపుడు సంపాదకుడైన యజమానికి ఉండే జర్నలిజం వ్యూహం ఏమిటో ధనికొండ హనుమంతరావు అభిసారిక పత్రిక నిర్వహణలో చూడవచ్చు. పత్రికను మలచుకుంటూనే పాఠకులను మలచుకునే నేర్పు ఉండాలి. దీనికి సంపాదకీయాలను వేదికగా చూసుకున్నాడు ధనికొండ. చాలా అరుదుగానే సంపాదకీయాలు రెండు పేజీలు మించి ఉన్నాయి. ఒక్కోసారి ఒక పేజీకి ముగిసిన సందర్భాలున్నాయి. ఎటువంటి శీర్షిక లేకుండా, సూటిగా, సరళంగా ఒక విషయం గురించి కానీ, పలువిషయాలు గురించి కానీ సంపాదకీయాలు రాశారు. నీళళు నమలకుండా, అవసరమైతే పాఠకులను గానీ, ప్రభుత్వ విధానాలను గానీ విబేధించారు. అది పత్రిక గురించి కావచ్చు, పాఠకుల అభిరుచి గురించి కావచ్చు. సాటి పత్రికల తీరు గురించి కావచ్చు, మరేదైనా కావచ్చు. అప్రియమైన సత్యాన్ని ప్రకటించారు. ధనికొండ హనుమంతరావు సంపాదకీయాన్ని చిక్కని సంభాషణగా తీర్చి దిద్దారు. ఈ సంపాదకీయాల వెలుగులో పత్రిక రూపు, హృదయం ఇట్టే తేటతెల్లం అవుతుంది.
పేరు బాగుంది కానీ అసలు అర్థమేమిటి? అనే ప్రశ్నతో తొలిసంచిక సంపాదకీయం మొదలై - ‘‘నిర్ణీత ప్రదేశం వలెనే, నిర్ణీత కాలంలో రుూ ‘అభిసారిక’ లైంగిక జీవన ప్రాధాన్యతను చర్చిస్తూ లైంగిక విజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది’’ అని స్పష్టం చేస్తుంది.
తొలి సంపాదకీయం నుంచీ లైంగిక విజ్ఞానానికి శాస్ర్తీయ దృక్పథాన్ని, సామాజిక జీవితాన్ని ముడిపెడుతూ చాలాసార్లు వివరిస్తారు, విపులీకరిస్తారు సంపాదకులు. విజ్ఞానానికీ, సమాజానికీ ఉన్న సంబంధం ఏమిటో చాలా బాగా విశదం చేస్తారు. ‘‘... లైంగిక జీవనానికీ, అందువల్ల ఏర్పడే సాంఘిక జీవనానికి చాలా దగ్గరి సంబంధం ఉంది9 శృంగారకాండ మాత్రమే లైంగిక జీవనం కాదు. దానికి శాస్ర్తీయ దృక్పధం ఉంది’’ అని కూడా తొలి సంపాదకీయంలో కనబడుతుంది. ఒకటిన్నర శతాబ్దంగా సాగిన లైంగిక జీవన శాస్త్ర పరిశోధనా ఫలితాలను నాగరికత ప్రబలినకొద్దీ వ్యాపింప చేయాలని అంటారు అదే సందర్భంలో. అంతేకాదు విజ్ఞానం వల్ల కీడు జరుగదు సరికదా, మేలే జరగవలసి వుంటుంది - అని కూడా చాలా ఆశావహంగా పేర్కొంటారు. తెలుసుకోకుండా జీవితాలు భగ్నం చేసుకోకుండా, లోగడ శాస్తవ్రేత్తలు సంపాయించి పెట్టిన విజ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమ మార్గం అని కూడా విశదం చేస్తారు.
శృంగారరస వ్యాప్తికి తన పత్రిక జన్మించలేదని చెబుతూనే సెక్స్ పత్రిక అనగానే బెదరిపోవలసిన అవసరం లేదంటారు. శాస్ర్తీయ దృక్పథంతో, లైంగిక విజ్ఞానాన్ని ఇవ్వడానికి మొదలైన తన పత్రికలో వ్యాసాలు, సమాధానాలు, కథలు - అన్నీ శాస్తబ్రద్ధమై, మనస్తత్వ ప్రాధాన్యతతో సాంఘీక సమస్యలు చర్చిస్తాయంటారు. మనం చదవబోయే ఈ సంపాదకీయాలలో తారసపడే అంశాలు ఏమిటి? సాంఘీక జీవితం; శాస్ర్తీయ దృక్పథం; వైజ్ఞానిక ప్రయోజనం; దాంపత్య సుఖం; బిడ్డల శిక్షణ; మూఢనమ్మకాలు; అజ్ఞానంతో తీసుకునే మందులు, మాకులు; స్ర్తీలకు అవసరమైన అవగాహన; స్ర్తీ పురుష సమానత్వం; జనాభా పెరుగుదల; కరువు; అక్రమ సంతానం; వ్యభిచారం; సెక్స్ నేరాల సామాజిక కోణం; లైంగిక విజ్ఞానం పట్ల విముఖత; స్ర్తీ ఆర్ధిక స్వాతంత్రం, సుఖరోగాలు; లైంగిక విజ్ఞాన విద్య, ప్రిజిడిటి; గర్భస్రావం; గర్భనిరోధం; కుటుంబ నియంత్రణ; కరువు; వైజ్ఞానిక పరిశోధనలు; అక్రమ సంతానానికి ఆస్తి హక్కు; పెళ్ళి నిర్ణయం; శిశుమరణాలు వ్యభిచారిణులకు ప్రభుత్వ చికిత్సలు; లైంగిక విజ్ఞాన ప్రచారం - ఇలా చాలా వుంటాయి.
సామాజిక బాధ్యత అడుగడుగునా కనబడుతుంది. ప్రగతిశీలమైన చైతన్యం అక్షరమక్షరం ద్యోతకమవుతుంది. ఒకరకంగా చూస్తే ‘అభిసారిక’ అనేబదులు కుటుంబ జీవితం లేదా దేశ సౌభాగ్యం అని కూడా నామకరణం చేయవచ్చు. అంత విస్తృతమైన దృక్పథం, ఉన్నతమైన ప్రణాళిక ధనికొండ హనుమంతరావు గారి ‘అభిసారిక’లో స్పష్టమవుతుంది.
-7-
‘‘శాస్ర్తీయ దృక్పథాన్ని మేము మార్చలేము. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే విజ్ఞానమైనపుడు కొంత ఓపికను పాఠకులు చూపాల్సి ఉంటుంది. పోతే వ్యాసాలకు ఎక్కువ స్థలం ఇవ్వకపోతే అవి త్వరగా ఆనవు. ఐనప్పటికీ మరికొంత తగ్గిస్తాము’’ - అని రెండవ సంచికలో పేర్కొంటూ స్ర్తీలు ఎక్కువ విజ్ఞానాన్ని సంపాయించాల్సిన అవసరం ఉంది అని కూడా అంటారు. అశాస్ర్తీయ పద్ధతులను అరికట్టడానికి బిడ్డల శిక్షణ గురించి వ్యాసాలు రెండవ సంచిక నుంచీ ప్రారంభించారు. పేజీలు పెంచమనే సలహాను తిరస్కరిస్తూ ప్రశ్న జవాబుల కోసం ప్రతి మూడు నెలలకోసారి ఒక సప్లిమెంటును చౌకధరకు ఇస్తున్నట్టు కూడా ఇదే సంచికలో ప్రకటించారు. పెద్ద బొమ్మలు వేయండనే సలహాను తిరస్కరిస్తూ నేర్చుకోదగ్గ విషయాలిచ్చి తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాం అంటారు సంపాదకుడు. ఈ విషయాలు గమనిస్తే వస్తు ప్రణాళిక, పత్రికా నిర్వహణపట్ల స్పష్టత మాత్రమే కాదు మొహమాటం లేకుండా పాఠకులకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం గుర్తించవచ్చు. తర్వాతి సంపాదకీయంలో ఆకాశరామన్న ఉత్తరాలను ఖాతరు చేయమంటారు.
ప్రశ్నలలో చాలాభాగం వ్యక్తిగతం కనుక పత్రికలో ప్రచురించకుండా వారికి సర్వీన్ సెక్షన్ ద్వారా జవాబులు పొందవచ్చు అనే అదనపు విభాగం ఏర్పాటు చేస్తారు. వస్తున్న కథలు కామాన్ని రెచ్చగొట్టేవే కానీ; మనస్తత్వ నిరూపణ కానీ, కథలకు ఉండవలసిన లక్షణాలు కానీ ఉండటం లేదని సంపాదకీయంలో ఖండిస్తారు. కొత్త రచయితలు చక్కగా రాస్తే ప్రోత్సహించడమే కాదు పారితోషికం కూడా ఇస్తున్నామని పేర్కొంటారు సంపాదకులు. 1950 జనవరి సంపాదకీయంలో కథలు వివరించబడ్డ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పాఠకులదేనని అంటారు. పత్రిక ప్రారంభమైన ఏడు నెలలకు ఇలా అంటారు - లైంగిక సమస్యలు మేము అనుకున్న దానికన్న ఎక్కువ ప్రాముఖ్యతను కల్గి ఉన్నవని తోస్తున్నది. అలాగే పత్రికాపరంగా వ్యాసాలు పాఠకులను ఆకర్షించలేకపోతున్నాయని అభిప్రాయపడతారు. తొలి సంవత్సరం ముగుస్తున్న వేళ ధనికొండ సింహావలోకనం చేసుకుంటూ రాసిన సంపాదకీయం ఈ విషయాలు చెబుతుందిః
అ) ప్రతి సంచిక ఆలస్యం కాకుండా వెలువరించడం
ఆ) సెక్స్ పత్రికలంటే సామాన్యాభిప్రాయమైన బూతుకు దూరంగా ఉంచడం. సెక్స్ బలహీనత మీద వ్యాపారం చేయడానికి ప్రయత్నించకపోవడం.
ఇ) తాము భరించగలిగినంతవరకు ప్రకటనలు వదలుకోవడం.
ఈ) పత్రిక అమ్మకం కోసం పిచ్చి వేషాలు వేయలేమని నిర్దంద్వంగా ప్రకటించడం
ఉ) సాధ్యమైనంతలో విజ్ఞానమే గురి.
సెక్స్ ఒక శాస్తమ్రే కానీ మ్యాజిక్ కాదంటారు. ఏ మందు మాకుతో ఎక్కువ శ్రమపడకుండా పురుషత్వాన్ని వాగన్ల పరిమాణంలో కొనుక్కునేవారిని హాస్య మాడుతారు. పత్రికల్లో ప్రచురించబడే గుళికలు దగ్గర్నుంచి, తాయెత్తుల వరకూ ప్రజలను మూఢులను చేస్తాయంటారు. ఇటువంటి పత్రికల్లో ప్రకటనలపై ప్రభుత్వం ఓ కన్ను వేయాలంటారు. ఇంకోచోట శాస్ర్తీయ వ్యాసాల్లో చదివి అర్థం చేసుకోవటమే కాక వాటి గురించి ఆలోచిస్తే సత్ఫలితాలు ఉంటాయంటారు. అలాగే వచ్చీ రాని ప్రశ్నలన్నీ సమంజసమైనవి కావంటారు ఎడిటర్ గారు. పత్రిక నడపడం కష్టమైనా విరాళాల ద్వారా సొమ్ముకోరడం లేదంటూ రెండు సంవత్సరాల చందా పదిరూపాయలు కట్టమంటారు. మంచి రచనలు తక్కువగా వచ్చాయని నాల్గవ జన్మదిన సంచికను (1952 జూలైలో) మామూలుగా వెలువరించారు. అప్రియమైన సత్యాలు సంపాదకీయాలుగా ప్రకటించడం విశేషం.
సావకాశంగా పత్రిక చదివేముందు, త్వరగా విషయం తెలుసుకోవడానికి బాక్సులలో సమాచారం పెట్టే పద్ధతిని 1954 ఆగస్టు నుంచి ప్రారంభించారు.
1954 డిసెంబరు సంచికలో ప్రస్తావించిన విషయం విస్మయాన్ని కల్గిస్తుంది. ఒక సుప్రసిద్ధ వారపత్రికలో ప్రచురింపబడిన కథలో నాయకి సామాజిక చట్టోల్లంఘనం చేసి గర్భం ధరిస్తుంది. గర్భనిరోధకమనే మూఢనమ్మకంతో గర్భస్రావం చేసుకుంటుంది. రచయిత, సంపాదకుడు ఒక స్థాయిలో ఉన్నారని హనుమంతరావు విమర్శిస్తారు. ఇది చాలా సాహసంతో కూడిన పోకడ.
1955 ఆగస్టు సంపాదకీయంలో కథా సాహిత్యం విలువ గ్రహించినా, అభిసారికలో కథాభాగం ఇంతకన్నా పెంచలేమని అంటారు. అందువల్ల వేరొక కథల మాసపత్రికకు పై నెల నుంచి తీసుకు వస్తున్నామని కూడా పేర్కొంటారు. అదే సంపాదకీయంలో.
ఈ విషయాలు గమనిస్తే ధనికొండ హనుమంతరావు నిర్వహించిన అభిసారిక మాసపత్రిక స్వరూప, స్వభావం ఎమిటో మనకు బోధపడుతుంది. ఆయన నడిపిన లైంగిక విజ్ఞాన మాసపత్రిక జర్నలిజం ధోరణి ఏమిటో తద్వారా మనకు తెలుస్తుంది.
పత్రికలో ప్రచురింపబడిన అంశాలూ, వాటి ఆలోచనా తీరు గురించి తెలుసుకోవాలంటే ఇంకొంత లోపలికి వెళ్ళి పరిశీలించాలి.
*

- డా. నాగసూరి వేణుగోపాల్ 9440732392