మెయిన్ ఫీచర్

ధనుర్మాసం ముక్తి ప్రదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసినవారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటంవల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళివ్రతం పరుతో విష్వును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెల రోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాసవ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ధనుః అంటే దేనికోసం ప్రార్థిస్తున్నామో అది లభిస్తుందని అర్థం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభవౌతుంది. గోదాదేవి పాడుకున్న ముప్ఫై పాశురాల్నీ రోజుకొకటి చొప్పున గానం చేస్తారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో తులసీ మొక్కలమధ్యగా గోదాదేవి దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే పరమభక్తుడు ఆమెను పెంచి పెద్ద చేశాడు. గోదాదేవి బాల్యంనుంచి శ్రీరంగనాథుని పరమభక్తురాలు. ఆయనే తన సర్వస్వమని భావించింది. ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించింది. స్వామిని పొందడం కోసం ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. ముప్ఫై రోజులు ముప్ఫై పాశురాలతో కీర్తించింది. శ్రీరంగనాథునికి అలంకరించడానికి రంగు రంగు పూలతో అందమైన దండల్ని సిద్ధం చేసింది. వాటిని తానే అలంకరించుకుని, తన అందచందాలను చూసుకుని శ్రీరంగనాథునికి తానే సరిజోడని మురిసిపోయేది. ఓసారి విష్ణుచిత్తుడు పూదండల్లో తలవెంట్రుకని చూశాడు. అది గోదాదేవిదేనని గ్రహించిన ఆయనకి సమస్తం అర్థమైపోయింది. ‘మహాపరాధం జరిగిపోయింది స్వామీ మమ్మల్ని క్షమించమంటూ అనేక విధాలుగా వేడుకున్నాడు. ‘స్వామి నిర్మాల్యాన్ని స్వీకరించడం వరకే మనకు అర్హత. అంతేకానీ మనం ధరించిన వాటితో రంగనాథుని అర్చించడం మహాపరాధం’ అంటూ కుమార్తెను మందలించాడు. అయినా గోదాదేవి పట్టువీడలేదు. ఒకనాటి కలలో ఆ దేవాధిదేవుడే సాక్షాత్కరించి గోదాదేవితో తన కల్యాణానికి ఆనతిచ్చేవరకూ ఆ మాయ వీడలేదు విష్ణుచిత్తుడికి. ఇంకేముంది, తండ్రి అనుమతితో ఆండాళమ్మ రంగనాథ స్వామిలో ఐక్యమైపోయింది.
రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లే గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కీర్తించి ఆయననే పెండ్లాడుతుంది. ఇంతటి మహిమ వున్న వ్రతాన్ని పెళ్లికాని యువతులు నేటికీ ఆచరిస్తుంటారు. విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ అను పేరున (విష్ణుచిత్తీయం అని కూడా అంటారు) గ్రంథ రచన గావించాడు. ఆముక్తమాల్యద అనగా ‘తీసివేసిన దండ’ అని అర్థం. మానవ స్ర్తి దేవున్ని తన భక్తిశ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడేవరకు వదలలేదు. నిష్ఠకలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటినుండి గోదాదేవిని ఆండాళ్‌గా పిలువబడసాగింది. ఆండాళ్ స్వామివారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు. ‘గో’ అనే శబ్దానికి జ్ఞానం అని, ‘ద’ అనే శబ్దానికి అర్థం ఇచ్చునుది అని. కాలాన్ని కొలిచే పద్ధతిలో, సూర్యభగవానుడి సంచారాన్ని బట్టి కొలిచే మాసాన్ని సౌరమానం అని, చంద్రుడి సంచారాన్ని బట్టి కొలిచే మానాన్ని చాంద్రమానంగా పిలుస్తారు. సూర్యుడు ఒక్కోరాశిని దాటటాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన సమయంలో ధనుస్సంక్రమణం. కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలము ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం మొదటి రోజున ధనుర్మాస వ్రతాన్ని, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో భక్తిసాగరంలో మునిగితేలిన వారిని ‘ఆళ్వారులు’ అంటారు. పనె్నండుమంది ఆశ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆండాళ్ అసలు పేరు ‘కోదై’ అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమను తయారుచేయించి, పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి స్నానదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీదళాలు, పూలతో అష్టోత్తర సహస్ర నామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెల రోజులు విష్ణుకథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెల రోజులు చెయ్యలేనివారు పదిహేనురోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. ధనుర్మాసవ్రతం చేయడంవల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఈ తిరుప్పావై పారాయణం చేసినవారికి, తిరుప్పావై గానశ్రవణం చేసినవారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తిప్రదాయం కాగలదు. భోగి వరకూ ఉండే ధనుర్మాసానికి దక్షిణ భారతదేశ సంస్కృతికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పనె్నండు మంది వైష్ణవ ఆళ్వారులలో గోదాదేవి ఏకైక మహిళా ఆళ్వారు. ఆండాళ్ అంటే కాపాడునది అని అర్థం. తిరుప్పావైని ధనుర్మాసంలో అన్ని వైష్ణవాలయాల్లో ప్రతిరోజూ ఉదయానే్న గానం చేస్తారు. ఈ నెలంతా తిరుమల ఆలయంలో జరిగే ఏకాంత సేవలో భోగ శ్రీనివాసుని బదులు శ్రీకృష్ణుడే పాల్గొంటాడు.
గోదాదేవి చిన్నతనం నుంచి కృష్ణునిమీద భక్తిని పెంచుకుంది. అది ప్రేమగా మారి తన భర్త భగవంతుడే అనుకుంది. అందుకు పూజలు చేసింది. కాత్యాయనీ వ్రతం ఆచరించింది. ఎక్కడా పట్టు సడలించలేదు. అంటే ఏదైనా సాధించాలంటే పట్టుదల, లక్ష్యంపై మనసు లగ్నం చేయాలి. ఏకాగ్రత ఉండాలనే విషయాన్ని గోదేదేవి తన జీవితం ద్వారా బోధిస్తుంది. కనుక మనం కూడా ఆచారాలు, సంప్రదాయాలు పాటించడమే కాదు, అందులో వున్న విషయాలను, అవి అంతర్లీనంగా బోధిస్తున్న అంశాలను అవగతం చేసుకుని, అలవర్చుకుని అమలుపరిచినప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది. మనకూ సత్ఫలితాలు కలుగుతాయి. గోదాదేవితో ముడివడిన మాసం ధనుర్మాసం. తన జీవన విధానం, ధనుర్మాస ఆచరణ ద్వారా గోదాదేవి ఎన్నో విషయాలు అంతర్లీనంగా బోధించింది. మన పూజా పునస్కారాల్లోని అంతరార్థం మనలను సక్రమ మార్గంలో నడిపించడమే. అందుకే ధనుర్మాసంలో మనం కూడా సంప్రదాయాలను పాటించి తిరుప్పావై గానం చేసి ముక్తిని పొందుదాం.

- కె. రామ్మోహనరావు 94414 35912