మెయిన్ ఫీచర్

ఆ నవ్వుల వెనుక గుండె తడివుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి కథను తెరకెక్కించాడంటూ
ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే
-ఆ ఆనందంలోనే చిన్న బాధ తన గుండెను తడి చేస్తోందంటున్నాడు దర్శకుడు మారుతి. మెటీరియలిస్టిక్‌గా తయారవుతున్న కుటుంబ బంధాలపై మారుతి సంధించిన తాజా సినిమా -ప్రతిరోజూ పండగే. సాయితేజ్, రాశిఖన్నా జోడీగా సత్యరాజ్, రావు రమేష్ ప్రత్యేక పాత్రల్లో మెరిసిన సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. జిఏ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి బన్నీ వాస్ నిర్మాత. అయితే -సక్సెస్ మీట్ అన్న విషయాన్ని నొక్కి చెప్పకుండా -ఆనందాన్ని, అసలు విషయం మరుగున పడిందేమోనన్న బాధను మీడియా వద్ద
వ్యక్తం చేశాడు మారుతి.
*
ప్రతిరోజూ పండగే -కానె్సప్ట్ కామెడీతో చెప్పాలన్న భావన నాకు లేదు. కామెడీతో కథను చెప్పొచ్చన్న నా స్టయిల్ వర్కౌటైంది కానీ, అసలు విషయం మరుగున పడుతుందేమోన్న చిన్న బాధ ఇప్పుడు కలుగుతుంది.
మెకానిజంగా మారుతోన్న కుటుంబ బంధాలను బలంగా చెప్పాలన్నది నా తపన. అయితే -అసలు విషయాన్ని కామెడీ టైమింగ్ డామినేట్ చేసిందేమో అనిపిస్తోంది. ఇండస్ట్రీనుంచి, స్నేహితులు, ఆడియన్స్ నుంచి వస్తోన్న రిపోర్ట్ -కామెడీ బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని.
మంచి విషయాన్ని మంచి ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలనుకున్నా. అయితే, సినిమా చూసిన తరువాత పేరెంట్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్న ప్రశ్న చాలామందిలో రేకెత్తుతోంది. కొద్దికొద్దిగా వస్తోన్న ఈ రిపోర్టే నాకు పెద్ద ఉపశమనంగా ఉంది.
సినిమా విషయంలో ఆరంభం నుంచీ నేను టెన్షన్ పడలేదు. థాట్ ఎవరికీ చెప్పినా బావుందనే అన్నారు. ఆ ఉత్సాహంతోనే సినిమాను కేవలం 65 రోజుల్లో వేగంగా పూర్తి చేశాం. ధియేటర్లకు వచ్చేముందు కూడా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సంకోచాలు నాకు లేవు. ఎమోషన్స్‌ని ఆడియన్స్ ఎప్పుడూ మిస్ చేయరు. ఇదే కథను ఇంకో పదేళ్ల తరువాత అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా తీసినా మంచి ఫలితమే వస్తుంది. మూలంలో ఉండే బలమే అది.
అయితే, ఒక్కటి మారుతి కామెడీనే కాదు, ఎమోషన్స్‌నీ అద్భుతంగా తెరకెక్కించగలడు అని చెప్పడానికి ఈ సినిమా నాకో బెంచ్ మార్క్. అది ప్రూవ్ చేసుకున్నాననే అనుకుంటున్నా.
ఈ కంటెంట్‌తో సక్సెస్ వచ్చింది కదా! అని మళ్లీ మళ్లీ ఇలాంటి సినిమాలే చేయాలని అనుకోను. నేను చేస్తున్న సినిమాలు చూస్తే మీకే అర్థమవుతుంది -ఎప్పటికప్పుడు జోనర్ మారుస్తున్నానన్న విషయం. ఓకేరకమైన ముద్ర పడకూడదన్నది నా జాగ్రత్త.
ప్రతి సక్సెస్ నాపై బాధ్యత పెంచుతుంది. ఇప్పుడూ అంతే. కథల ఎంపికలోనే కాదు, ఆడియన్స్ పల్స్ పట్టుకునే విషయంలోనూ బాధ్యతాయుతంగానే ఉంటున్నా.
సినిమా బావుంది అన్న ఫస్ట్ టాకే నాకు ముఖ్యం. ఈ టాక్ చివరి వరకూ మారదు. కాకపోతే -వసూళ్లను బట్టి యావరేజ్, అబౌ యావరేజ్, హిట్టు, బ్లాక్‌బస్టర్ అని ఇండస్ట్రీ అనుకుంటుందంతే.
మారుతి కామెడీ టైమింగ్ బావుంటుందన్న ప్రశంస నాలోనూ ఎగ్జయిట్‌మెంట్ పెంచుతోంది. కామెడీకి నిజంగా మారుతి డోర్స్ తెరిచేస్తే -ఎలా ఉంటుందో చూపించే సినిమా చేయాలని ఉంది. ఆ టైమ్ కోసం చూస్తున్నా.
ఏ కష్టాన్నీ సీరియస్‌గా తీసుకోకపోవడం నా నైజం. కష్టాన్ని అధిగమించాలి తప్ప, ఆలోచిస్తూ కూర్చోవాలని అనుకోను. కష్టాలే -తప్పులు సరిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పాఠాలు.
ఈ కథకు బీజం -రెండు మూడు ఇంటెన్స్ ఇన్సిడెంట్స్ చూసినపుడు కలిగింది. తండ్రిని వెంటిలేటర్‌పై పెట్టినపుడు చెబితే -అప్పుడు యూఎస్‌నుంచి వచ్చి అన్ని కార్యక్రమాలూ చూసుకుని వెళ్తామని పిల్లలు చెప్పిన సంఘటన నన్ను కదిలించింది. తల్లిదండ్రుల కంటే వాళ్ల లైఫ్ కండిషనే్స ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయన్న బాధ నుంచి పుట్టిందే ఈ కథ.
మంచి సినిమా తీశానంటూ చిరంజీవి, రాఘవేంద్రరావు, శివనిర్వాణలాంటి పెద్దలు, ఫ్రెండ్స్ ప్రశంసిస్తుంటే హ్యాపీగా ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ మీకు తెలీంది కాదు.
సినిమాలు తీయడానికే అయితే నా దగ్గర చాలా కథలున్నాయి. కాకపోతే, సినిమా సినిమాకు నా మెచ్యూరిటీ లెవెల్స్ మారుతున్నాయి. నేర్చుకున్న విషయ జ్ఞానం నుంచి చూస్తుంటే -ఉన్న కథలతో సంతృప్తి కలగటం లేదు. అందుకే -ట్రెండ్‌కు అనుగుణమైన ఏ కథను చేద్దామనే ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా.
స్టార్ హీరోలతో తీసినంత మాత్రాన దర్శకుడిగా తరువాతి లెవెల్‌కు వెళ్లినట్టే అని నేననుకోను. కథలో తరువాతి లెవెల్‌కు వెళ్లడమనే కోణంలోనే నన్ను నేను జడ్జి చేసుకుంటున్నా. జంధ్యాల స్టార్ హీరోలతో సినిమాలు తీయలేదని -ఆయన్ని దర్శకులు కాదనగలమా?
సినిమాలో టిక్‌టాక్ ఎపిసోడ్ సెటైర్‌గానే పెట్టా. ఇంట్లో కూర్చుని వీడియోలు చేసేస్తున్నామని సంబరపడుతున్నారు తప్ప, అప్‌లోడ్ అవుతున్నవి ప్రపంచమంతా చూస్తుందన్న స్పృహను కోల్పోతున్నారు. ఇది ప్రమాదం అనిపించింది. ఆ పిచ్చిపై ఓ సెటైర్ వేసి -జాగ్రత్త చెప్పాలనుకున్నా. అలా పుట్టిందే రాశి ఖన్నా పాత్ర.
తరువాత ప్రాజెక్టుగా అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. కాకపోతే -ఓ మంచి ప్రేమ కథను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించాలన్న ఆశ అయితే ఉంది. ఆ ఆలోచన ఎటు దారితీస్తుందో చూడాలి.

-మహాదేవ