మెయిన్ ఫీచర్

స్వేచ్ఛ చిరునామా పరహితంలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు స్వేచ్ఛాప్రియుడు. తన మాటలో తన బ్రతుకుబాటలో తనదైన స్వేచ్ఛను వినిపిస్తుంటాడు, తన పనుల్లో చూపిస్తుంటాడు. తన స్వేచ్ఛకు భంగంకలిగినచోట తన గొంతును వినిపించి, తన కార్యదక్షతను చూపి తన స్వేచ్ఛను కాపాడుకుంటాడు. తన స్వేచ్ఛకు సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని సైతం అధిగమించి తన స్వేచ్ఛా ప్రయత్నాన్ని చాటుకుంటాడు. అంతేకాదు, తన స్వేచ్ఛ తనకెంత ముఖ్యమో ఎదుటివారి స్వేచ్ఛ వారికంతే ముఖ్యమన్న విషయానికి, అంతకుమించిన ప్రాధాన్యాన్ని గౌరవాన్ని ఇవ్వడంలో తన సంస్కారాన్ని చెప్పకనే చెబుతాడు.
ప్రతినిత్యం పిల్లలనుంచి పెద్దలవరకు అన్ని వయసులవారికి ఎన్ని ప్రవచనాలు, మరెన్ని ప్రార్థనలు వినే అవకాశమున్నా సందేశాత్మక మాటలు వింటున్నా తమ నడతను తాము సరిదిద్దుకోవడంలో, పిల్లల్ని మరింత క్రమశిక్షణతో పెంచలేకపోవడం సమాజంలో కొట్టొచ్చినట్లు కన్పించే ప్రధాన లోపం. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, సాంస్కృతిక అసమానతలు మానవ జీవితంలో పలు రుగ్మతలకు మూలకారణమవుతాయి. వీటిని అధిగమించేందుకు-
భయాందోళనలనుంచి ధైర్యస్థితికి, అసమానతలనుంచి సమానస్థితికి, నిర్లక్ష్యం నుంచి లక్ష్యం దిశగా, నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతవైపు, ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి చేరాలన్న తపన ఆహ్వానించదగింది, అభినందించదగిందీనూ.
రోమ్ మహానగర నిర్మాణం ఒక్కరోజులో సాధ్యపడలేదన్నది ఎంతటి నగ్న సత్యమో, మానవుడు తనను తాను- తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం జీవితకాలంలోనూ, కొన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు. ఒకరు ఎదగడమంటే పదిమందిని దోచుకోవడం కాదు. స్వేచ్ఛగా ఎదగడం మరొకరి స్వేచ్ఛను హరించడమెంతమాత్రం కాదు. తన స్వేచ్ఛ తనకెంత ముఖ్యమో మరొకరి స్వేచ్ఛ అంతకన్నా ముఖ్యమని గుర్తించి అందుకనుగుణంగా నడుచుకోవడం!
వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో ఉపకరించాలే తప్ప వ్యక్తిత్వాన్ని హరించేందుకు కారణం కాకూడదు. స్వేచ్ఛ, విశృంఖలత్వానికి మధ్య తేడా తెలియనపుడు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించినపుడు ఎన్నో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. అవి తనకు నష్టం కలిగించడమే గాక సమాజానికి అత్యంత అభ్యంతరకరంగా ప్రమాదంగా, తీరని లోటుగా, ఎవరూ తుడవలేని కన్నీటిగా మారుతుంటాయి కూడా!
సంస్కృతి సంప్రదాయాలను గురించి గొప్పగా మాట్లాడుకునే మనం వాటికి అనుగుణంగా నడుచుకుంటున్నామా? నాగరికతనే సంస్కృతి సంప్రదాయాలుగా భ్రమిస్తున్నామా? ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన విషయమిది.
నేటికీ మన దేశంలో ఇరవై శాతం పిల్లలు అక్షరాభ్యాసతకు దూరంగానే ఉన్నారు. మరో ముప్ఫై శాతం మంది పిల్లలు ఇంటర్‌మీడియెట్ విద్యతోనే అర్థాంతరంగా ఆగిపోతున్నారు. మిగతా యాభై శాతం మందిలో డిగ్రీ, ఆపై విద్యను పొందుతున్నవారు ఇరవై శాతం మంది మాత్రమే. రకరకాల ఆత్మన్యూనతలతో, అవమానాలతో, తోటి విద్యార్థుల వేధింపులతో తట్టుకోగలిగి కోరుకున్న విద్యతోపాటు తగిన ఉద్యోగాలు పొందగలుగుతున్నవారి సంఖ్య చాలా చాలా తక్కువనే చెప్పాలి.
ఆచార వ్యవహారాలతో వుండే కుటుంబాల్లో తప్ప గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మద్యం ఉపయోగించే కుటుంబాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. చిన్న వయసులోనే పిల్లలకు మద్యం సేవించాలనే ఆలోచనలకు ఇవి కేంద్ర బిందువులవుతున్నాయి. విద్యాపరంగా ముందుకు పోలేని పిల్లలు పౌట్టకూటి కోసం పనిపిల్లలుగా వివిధ వృత్తులకు సంబంధించి సహాయకులుగా చేరి శ్రమదోపిడీకి గురవుతూ సంపాదించేది స్వల్పం కాగా, నిరక్షరాస్యత కారణంగా చిన్న వయసులోనే ముదిరిపోయే దురలవాట్లు ఎనె్నన్నో. అలాగని అక్షరాస్యులు ముఖ్యంగా ఉన్నత విద్యను పొందినవారందరూ ఉత్తములని చెప్పే అవకాశం లేదు. మంచి మర్యాదల కన్నా మితిమీరిన స్వార్థం, విశృంఖలతే స్వేచ్ఛగా భావించే ధోరణులు తమ అరాచకత్వంతో నిత్య జీవితంలో ఊహించని కల్లోలాలకు కారణమవుతున్నాయి. శిక్షలకన్నా నేర నివారణ ముఖ్యమైనప్పటికి, ఘోరమైన నేరాలు చేసి పెద్దమనుషులుగా చలామణయ్యేవారు ఆలోచనాపరులను ప్రతిక్షణం ఆవేదనకు గురిచేసే తీరు అత్యంత బాధాకరం!
మనుషులమన్న కనీస స్పృహ కలిగినవారెవరైనా పరోపకారం చెయ్యలేకపోయినా అపకారం మాత్రం తలపెట్టరు. విచారించవలసిన విషయం ఏమిటంటే చదువుకి, హోదాకి, అంతస్తుకి సంబంధం లేకుండా సంస్కారహీనత, అమర్యాద, అరాచకం పెచ్చరిల్లుతోంది. వరకట్న వేధింపులకు, అభం శుభం తెలియని వారి బలవన్మరణాలకు ప్రధాన కారణం. సభ్య సమాజం నిరసనలు హెచ్చరికలు ఎలా వున్నప్పటికీ వేధించినవారు శిక్ష అనుభవించిన దాఖలాలు సగానికి సగంకన్నా తక్కువంటే ఆశ్చర్యం అనవసరం.
తెలిసీ తెలియని వయసులో ఆకర్షణలను ప్రేమలుగా భ్రమించినా పెళ్లిపీటలదాకా పయనించిన సందర్భాలు తక్కువనే చెప్పక తప్పదు. కొన్ని సందర్భాల్లో పెద్దింటి అమ్మాయిలు చదువు తప్ప మరో ధ్యాస లేని అబ్బాయిలను తప్పుదోవ పట్టించిన తీరు సమాజానికి కొత్తకాదు.
పెళ్లికిముందే తొందరపడటం తెలిసి చేసే తప్పయితే, తమ ప్రమేయం లేకనే అత్యాచారానికో, మరో రకమైన అఘాయిత్యానికో గురవడం తెలియక జరిగిపోయే ఘోరం. బంధు మిత్రుల సాయమో, చట్టాల ఆసరానో కోరుకుంటే అందే చేయూతకన్నా అసలే పుట్టెడు కష్టాల్లో వున్నవారికి మానసికంగా చిత్రవధకు చేసే అనుభవాలు ఎక్కువ సందర్భాల్లో ఎదురవడం సర్వసామాన్యం.
వీరు వారనే తేడా లేక అత్తమామల వేధింపులు, ఆడపడుచుల సాధింపులు సర్వసామాన్యమైనా సమాజంలో కుటుంబంలోని వ్యక్తులమధ్య సామరస్యత కన్నా వైషమ్యాలు సహనంతో సర్దుబాటు ధోరణులకన్నా గొడవపడి తాడో పేడో తేల్చుకునే తీరు క్షణక్షణానికి పెరిగిపోతుంది. హితంకోరి రాజీ మార్గం చూపేవారు లేనపుడు పరిస్థితులు దారుణంగా తయారవుతున్న సందర్భాలు కోకొల్లలు.
పగలు, ప్రతీకారాలతో ఊగిపోవడమైనా, మానవీయ విలువలు విస్మరించి మృగాలను మరిపించే తీరైనా మానవజాతి జీవితంలో సభ్య సమాజంపై మాయని మచ్చలుగా మిగిలిపోతే స్వేచ్ఛ చిరునామా ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. పైశాచిక ప్రవృత్తికలవారి మానసిక స్థితి ఎలా వున్నా బంధాలు అనుబంధాల విలువలు తెలిసినవారు కోరుకునేది పరహితం. అందులోనే ఇమిడివున్న తమ హితం!

- డా. కొల్లు రంగారావు