మెయన్ ఫీచర్

తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేసిన 2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. 2019 సంవత్సరం తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అందరూ ఊహించిన విధంగానే టీడీపీ ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలతో రాజకీయంగా ఓడిపోయి ఏకాకిగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం తమకు 151 సీట్లు వస్తాయని ఊహించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వంద ప్లస్ సీట్లు వస్తాయని ఆ పార్టీ భావించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడు నెలల పాలన విశే్లషిస్తే సంక్షేమ రంగంలో అన్ని వర్గాలకు వరాలు ప్రకటించారు. రెవెన్యూ లోటు, నిధుల కొరతను లెక్కచేయకుండా సంక్షేమ ఫలాలను అణగారిన, పేద వర్గాలకు అందించాలనే తాపత్రయంతో వైకాపా ప్రభుత్వం దూసుకెళుతోంది. 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనే జగన్ అజెండా ఏమిటో స్పష్టమవుతుంది. నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలలుగా సంక్షేమంపైననే పాలకులు దృష్టిని సారించారు. అభివృద్ధిపై జగన్ తన అజెండాను గత వారమే ఆవిష్కరించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 27వ తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో అమరావతి నుంచి పూర్తి స్థాయిలో రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తారానే అంశంపై స్పష్టత వస్తుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక సర్వత్రా చర్చనీయాంశమైంది. కర్నూలులో హైకోర్టు ప్రధాన కార్యాలయం, అమరావతి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచి ఏర్పాటు, విశాఖకు సచివాలయం తరలింపు, వేసవిలో అసెంబ్లీ సమావేశాలకు భవనం, అమరావతిలోనే రాజ్‌భవన్, కొన్ని ప్రభుత్వ శాఖలు కొనసాగించాలని కమిటీ పేర్కొంది. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలపై గందరగోళం నెలకొంది. నాలుగు ప్రాంతాల్లో రీజనల్ కమిషనరేట్ల కార్యాలయాల ఏర్పాటు మంచి సిఫార్సు అని చెప్పవచ్చు.
అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతమైనా, రాజకీయ పార్టీల మద్దతు ఆశించిన రీతిలో లేదని చెప్పవచ్చును. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి విలువైన భూములను రాజధాని నిమిత్తం ఇచ్చిన రైతుల మనో వేదనను చెప్పనలవికాదు. రాజకీయాలు, సామాజిక వర్గాలతో కలుషితమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైతుల బాధను పట్టించుకునే తీరిక ప్రజలకు, రాజకీయ పార్టీలనేతలకు లేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనను, కర్నూలులో ప్రధాన హైకోర్టు ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించే స్థాయిలో టీడీపీ, వామపక్ష పార్టీలు, జనసేన పార్టీలు లేవు. బీజేపీ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించినా, ఆ పార్టీ నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తే ప్రాంతీయంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైతే పార్టీ దెబ్బతింటుందనే భయం పార్టీలకు పట్టుకుంది. ఇదే వైకాపాకు వరంగా మారింది.
ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చినా, అమరావతి నుంచి అన్ని కార్యాలయాలను తరలించినా పట్టించుకోరు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రజలు కూడా మన ప్రాంతంలో రాజధాని లేనప్పుడు ఎక్కడున్నా మనకెందుకనే ధోరణిలోనే ఉంటారు. కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న విజయవాడ మహానగరం ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరు. అమరావతిలో రాజధాని ఉన్నా, తరలించినా విజయవాడ స్వయం ప్రకాశం ఉన్న నగరం. అమరావతి మన రాజధాని అనే భావోద్వేగం ప్రజల్లో లేకపోవడం వల్లనే వైకాపా ప్రభుత్వం వీలైనంత వరకు అమరావతి రాజధాని ప్రాంతం ప్రాధాన్యతను తగ్గించివేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రీజనల్ కమిషనరేట్లు పెట్టి అవసరమైతే తప్ప విశాఖలో ఉన్న సచివాలయంకు ప్రజలు వచ్చే పరిస్థితి కల్పించకుండా చూడాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. 27వ తేదీన మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలను బట్టి కొత్త సంవత్సరంలో పరిపాలన వికేంద్రీకరణ పనులను వేగంగా అమలు జరిపేందుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో ముందడుగు వేసి విశాఖకు సమీపంలో ఉన్న భీమిలిలోనే ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. బ్రిటీష్ వారి హయాంలో దేశం మొత్తం పైన రెండవ మున్సిపాలిటీగా అవతరించిన పట్టణం భీమిలి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా ఓటమి నుంచి కోలుకోలేదనిపిస్తుంది. జాతీయ స్థాయిలో నమ్మకమైన రాజకీయ పార్టీలకు సన్నిహితంగా లేకపోవడమే టీడీపీకి పెద్ద లోటని చెప్పవచ్చును. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌తో అంటకాగి చంద్రబాబు చేతులు కాల్చుకున్నారు. ఈ రోజు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా, ఎన్నికలు సమీప భవిష్యత్తులో లేనందు వల్ల బాబును పట్టించుకునే జాతీయపార్టీలు లేవు. బీజేపీకి దూరం కావడం చంద్రబాబు రాజకీయంగా చేసిన పెద్ద తప్పు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కోపం రాకుండా వ్యవహరిస్తూ, పార్లమెంటులో బీజేపీ అనుకూల మిత్రులుగా అటు వైకాపా, ఇటు టీడీపీ నడుచుకుంటున్నాయి. అమరావతి రాజధానిని విశాఖకు మార్చే ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించినా, ఉద్యమం చేపట్టినా ఎంత మంది టీడీపీ నేతలు అండగా ఉంటారో అనుమానమే. ఏపీలో రాజకీయ పార్టీలకు ఇతర రాష్ట్రాల మాదిరిగానే బలమైన రాష్ట్భ్రామానం, భాషాభిమానం లేవు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చే సాంస్కృతిక బంధం లేదు. ఎంతసేపు అర్థంపర్థం లేని విద్వేషాలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, జాతీయ స్థాయిలో పల్చనకావడం ఆంధ్రప్రదేశ్ నాయకులకు అలవాటు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలంగా ఉన్నప్పుడు సాంస్కృతికపరంగా కనీసం ఫోకస్ ఉండేది. కాలక్రమంలో వామపక్ష పార్టీలు తుడిచి పెట్టుకునిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు స్వాభిమానంతో కూడిన సాంస్కృతిక బంధం లేకుండాపోయింది. ప్రస్తుతం టీడీపీ, వైకాపాలు ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గాలకు కేంద్రాలుగా మారడంతో, సాంస్కృతికోద్యమానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లవుతున్నా, ఇంకా శాశ్వత రాజధాని ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం పార్టీ టీడీపీకి 23 సీట్లు ఉన్నా, ప్రతిపక్ష నేత చంద్రబాబు బలమైన గళాన్ని వినిపిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలను విశే్లషిస్తే 2019 సంవత్సరంలో కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టుగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలను సాకారం చేసుకున్నారు. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం పనులు చకాచకా సాగుతున్నాయి. పాలనాపరంగా విశే్లషిస్తే ఈ ఏడాది ఎన్నో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించారు. ఆంధ్రాలో మాదిరిగా తెలంగాణలో బలమైనప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు పరిమితమైంది. బీజేపీకి ఒకరే సభ్యులున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మిత్ర పక్షమైన మజ్లిస్ పార్టీ ప్రతిపక్ష పార్టీని పోషిస్తోంది. రాజకీయంగా కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు, మరో సీనియర్ నేత, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. టీఆర్‌ఎస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ, కేసీఆర్‌కు వెనుదన్నుగా నిలిచే కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి వరించింది. ఈ ఏడాది రాష్ట్రంలో చెప్పుకోదగిన సంక్షేమ పథకాలు లేవని చెప్పవచ్చు. ఆర్థిక మాంద్యంపై తొలిసారిగా జాతీయ స్థాయిలో గళం విప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. ఆంధ్రాలో వైకాపా అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇది మంచి పరిణామని చెప్పవచ్చును. ఇరువురు సీఎంలు మూడుసార్లు కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరు కావడాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వాగతించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుని నాలుగు సీట్లు కైవశం చేసుకోవడం టీఆర్‌ఎస్ ఆశనిపాతంగా పరిణమించింది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటుకునేందుకు టీఆర్‌ఎస్ సమాయత్తమవుతోంది. దిశ ఎన్‌కౌంటర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు పెల్లుబికినా, ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత ప్రజల ఆవేశాలు చల్లారాయి. 52 రోజుల ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ శుభం కార్డు వేశారు.
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌లో అన్ని హంగులతో అలరారే సచివాలయం ఉన్నా, దానిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలన్న కేసీఆర్ సంకల్పం కొత్త సంవత్సరం 2020లోనే రూపు దిద్దుకుంటుందా ? ప్రస్తుతానికి మాత్రం సచివాలయంలోని శాఖలను సచివాలయం వెలుపల ఉన్న బీఆర్‌కే భవన్‌తో పాటు వివిధ భవనాలకు తరలించారు. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై సందిగ్థత కొనసాగుతోంది. అన్నీ ఉన్నా ఇంచు మించు అదే బాధలను తెలంగాణ ప్రజలు సచివాలయం విషయంలో ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ తాను ప్రతిపాదించినట్లుగా కొత్త సచివాలయం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్‌ను ఢీ కొనేంతటి పదునైన వ్యూహాలు ఉన్న నేతలు లేరనే అభిప్రాయం బలంగా వినపడుతోంది. ప్రజాకర్షణ ఉన్న నేతలు విపక్ష పార్టీలో లేకపోవడం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్‌గా మారింది. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్నా, ఏ అంశంపై ఎప్పుడు ఎలా స్పందించాలనే దానిపై కేసీఆర్ దార్శనికతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టంపై పెద్దగా ఆందోళనలు, అలజడులు లేకుండా చూసుకుని రాజకీయ చతురతను నిరూపించుకున్నారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, తమకు అనుకూలంగా మలుచుకునే స్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేకపోవడం కేసీఆర్‌కు రాజకీయంగా కలిసివచ్చే అంశం. రాజకీయ విమర్శలను తిప్పిగొట్టేందుకు మానవ హక్కులకమిషన్, లోకాయుక్తలను ఏర్పాటు చేశారు.

- కె. విజయశైలేంద్ర