మెయన్ ఫీచర్

విద్వేషాల వేళ.. విజ్ఞతే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ చరిత్రలో ఒక గతి తర్కం ఉన్నదంటారు సైద్ధాంతికులు. నూరేండ్లు నత్తగుల్లగా నడిచిన చరిత్ర ఉన్నట్లుండి ఒక్కసారి మలుపు తిరిగి జవనాశ్వంలా పరుగిడవచ్చు. 1947-1971, 1977-1991, 2014 ఇలా కొన్ని సందర్భాల్లో భారతదేశ చరిత్రలో ప్రభంజనాలు వీచాయి. భారత్‌పై పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉంది. కానీ, గత నెలలో ‘యూరీ’లో 20 మంది భారత సైనికులను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవటంతో ఆధునిక దక్షిణాసియా చరిత్ర ఒక్కసారి మారిపోయింది. ఇండో-అమెరికన్, ఇండో-రష్యన్, ఇండో-ఫ్రాన్సు రక్షణ ఒప్పందాలు చకచకా జరిగిపోయాయి. కుడితిలో పడిన ఎలుకలా మారిన పాక్ మాత్రం చైనా సహాయంపై ఆధారపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ వంటి ఎన్నో ముస్లిం దేశాలు పాకిస్తాన్‌ను దూరంగా ఉంచుతున్నాయి. విదేశీయ శత్రువులు, దౌత్య సంబంధాలు, దేశ రక్షణకు సంబంధించి పలు కీలక పరిణామాలు చోటు చేసుకోగా, దేశంలో అంతర్గతంగా కూడా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. త్వరలో జరిగే యుపి, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో అనూహ్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంటా బయట నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత జాతికి ఇది పరీక్షా సమయం. విభేదాలు, విద్వేషాలు రగులుతున్న వేళ జాతి జనులు విజ్ఞతతో వ్యవహరించి దేశాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం.
యుపి మాజీ ముఖ్యమంత్రి హేమావతీ నందన్ బహుగుణ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు రీటా జోషీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం యుపి కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపరచేదే. ‘రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలూ లేవు, ఆయనలో దేశభక్తీ లేదు’ అని తెగేసి చెప్పి రీటా కాంగ్రెస్ శిబిరం నుంచి బయటపడ్డారు. ఇదే యుపిలో మాజీ సిఎం, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై నిప్పులు చెరుగుతూ- ఆమెకు కుడి భుజంగా ఉన్న స్వామిప్రసాద్ బయటకు వచ్చారు. ఈ పరిణామం బిఎస్‌పి పునాదులను కదిలించింది.
యుపి సిఎం అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. దీంతో ఈ పెద్ద రాష్ట్రంలో ‘యాదవ కులం’లో ముసలం పుట్టింది. ఇక్కడ అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చీలి పోతుందని, అఖిలేష్ ప్రభుత్వం కుప్పకూలుతుందని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ప్రకటించేలోగా సమాజ్‌వాదీ పార్టీలో, యుపి సర్కారులో కీలక పరిణామాలు తప్పవనిపిస్తోంది. ఇక, తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రికే పరిమితం కావడంతో డిఎంకె అధినేత కరుణానిధి రాత్రికి రాత్రే తన కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని ప్రకటించాడు. మరోవైపు- అయోధ్యలో ఇరవై ఏళ్లుగా స్తబ్దంగా ఉన్న ‘రామ సంగ్రహాలయ’ (మ్యూజియం) నిర్మాణం అకస్మాత్తుగా తెల్లవారేసరికి తెరమీదికి వచ్చింది. ‘ఉమ్మడి పౌర స్మృతి’ (కామన్ సివిల్ కోడ్) అంశానికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. ‘ట్రిపుల్ తలాక్’ను రద్దు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకోవైపు మన సైనికులు జరిపిన ‘మెరుపుదాడులు’ పాక్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. రఫీలా షరీఫ్ అనే సైన్యాధ్యక్షుడే నవాజ్ మాట వినటం లేదు. బలూచిస్తాన్‌లో స్వతంత్ర పోరాటాలు ఊపునందుకున్నాయి. ఈ దశలో ఇండియాను ఏకాకిని చేయాలని నవాజ్ షరీఫ్ ఒక వ్యూహరచన చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హిందూ సామ్రాజ్యం స్థాపించడానికి కృషిచేస్తున్నాడని గనుక ముస్లిం దేశాలన్నీ తనకు అండగా ఉండాలన్నది నవాజ్ ప్రతిపాదన. భారత్‌లోని మావోయిస్టులంతా ఇస్లామిక్ సంస్థలతో కలిసి పనిచేసేలా చైనా ఆదేశించాలన్నది ఆయన అభ్యర్థన. యుద్ధం వస్తే భారత్‌లోని ముస్లింలతో పాటు చైనా కూడా పాక్‌కు మద్దతుగా ఉండాలని నవాజ్ ఆశిస్తున్నాడు. భారత్‌లోని వామపక్ష పార్టీలన్నీ మోదీ సర్కారుపై తిరగబడాలని, ఇండియా మరిన్ని ‘మెరుపుదాడులు’ జరపకముందే పాక్ సైనికులు కాశ్మీర్‌లో మరింత కల్లోలం సృష్టించాలన్నది నవాజ్ షరీఫ్ అంతరంగం. ఆయన ఆలోచనల్లో చాలాభాగం ఇప్పటికే మీడియాలో వార్తలుగా వస్తున్నాయి.
ప్రచ్ఛన్నయుద్ధంలో భాగంగా పాకిస్తాన్ తాను ముద్రించిన ఇండియన్ కరెన్సీని భారత్‌లో ప్రవేశపెట్టింది. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే పాక్ ఇలా చేస్తోంది. మరోవైపు కేరళలో అంతర్యుద్ధ వాతావరణం నెలకొన్నది. చైనాకు కావలసింది ఇదే. ‘రోగం ఒకటైతే మందు మరొకటి’ అన్నట్లు దశాబ్దాల పర్యంతం మన అధినాయకులు కాశ్మీరు సమస్యను రావణకాష్టంలా మార్చారు. ఈ పరిస్థితిని నేడు పాక్ తనకు అనుకూలంగా మలచుకొంటోంది.
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ తాజాగా రెండు ప్రధాన చర్యలు చేపట్టింది. మొదటిది దాదాపు ఇరవై ఇద్దరు పార్లమెంటు సభ్యులను వివిధ దేశాలకు పంపటం. రెండవది బలూచిస్థాన్ అసెంబ్లీలో భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించాలని ఒత్తడి తేవటం. మొదటి చర్య సిమ్లా ఒప్పందానికి విరుద్ధం. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్‌లో అస్తిత్వం లేదు. ఐఎస్‌ఐ అనే మిలటరీ సంస్థ చేతిలో అతడు కీలుబొమ్మ. పాకిస్తాన్‌లో అంతర్జాతీయ నేరస్ధుడు దావూద్ ఇబ్రహీం దాక్కొని ఉన్నాడని, అతడి ఆరు నివాస స్థావరాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటీవలే బలూచిస్తాన్‌లో పాక్ వ్యతిరేక ప్రదర్శనలు మొదలయ్యాయ.
1948లో పాకిస్తాన్ బలూచిస్తాన్‌ను, కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి పాలకులు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేదు. చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పుడు కూడా అప్పటి భారత ప్రధాని నెహ్రూ- అది ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారం అని ప్రకటించారు. కాశ్మీర్ సమస్యను ఐరాసకు నివేదించి నెహ్రూ మరో చారిత్రక తప్పిదం చేశారు. కాశ్మీర్‌కు సంబంధించి వి.కె.కృష్ణమీనన్ ఐరాసలో ఆరుగంటల సేపు అరిచి మాట్లాడినా ఆయన కంఠశోష అరణ్యరోదన అయింది. ఇపుడు కొన్ని దేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నందున పాకిస్తాన్ ప్రస్తుతం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అంటే- పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచమంతా కోడై కూస్తుంటే- ఆ మచ్చను మాపుకోవటానికి ఇండియాపై ఎదురుదాడికి దిగుతోంది.
నేడు మనం రెండు దృశ్యాలను చూస్తున్నాము. ఒకటి పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు. ఐఎస్‌ఐ ఆయన మాట వినటం లేదు. సొంత పార్టీ సభ్యులే ఆయనపై తిరగబడ్డారు. ఇక రెండవ దృశ్యం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్షపార్టీల వారు ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం. రాజకీయ కోణంలో రాహుల్, రాజీవ్ దేశాయ్, సంజయ్ ఝా, అజయ్ ఆలోక్, దిగ్విజయ్ సింగ్, సంజయ్ హెగ్డే వంటి వారు దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ భద్రత కంటే వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి. మోదీని రాముడిగా, నవాజ్ షరీఫ్‌ను రావణాసురునిగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంద్రజిత్తుగా చిత్రిస్తూ వాల్‌పోస్టర్స్ వెలిశాయి.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యవహార శైలిని అనేక దేశాలు తప్పుపడుతున్నాయి. ‘్భరత్‌కు మద్దతుగా పాక్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటాం’అని బంగ్లాదేశ్ రక్షణాధికారి ఎస్‌కె కమాల్ ప్రకటించారు. ఇరాన్‌లోని షియాలు కూడా భారత్‌కు అనుకూలంగా యుద్ధంలో పాల్గొనబోతున్నారు. ఇక, ఇండియా జరిపిన సర్జికల్ దాడుల గురించి భారత ప్రజలకన్నా ముందే ఇరాన్‌కు తెలియడానికి రహస్య కారణాలేమిటి? ఇరాన్‌కు ఆనుకొని చమురు పైపులు చైనాకు వెళ్తున్నాయి. వాటిపై దాడి జరిగితే చైనా ఇరుకున పడుతుంది. సౌదీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బహ్రెయిన్, ఖతార్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాలు ఇండియా వెంట ఉన్నాయి. శ్రీలంక, భూటాన్, అమెరికా, యూరపు దేశాలు మొత్తం 40కి పైగా ఇండియా వెంట ఉన్నాయి. రష్యా తాత్కాలికంగా తటస్థవైఖరి అవలంబించినా పూర్తిస్థాయి యుద్ధం మొదలైన తర్వాత ఇండియాకే మద్దతునిస్తుందని అనుకుంటున్నారు. ఈ కారణంగానే ముషారఫ్ ఇటీవల ‘మనం ప్రపంచ రాజ్యాల మధ్య ఏకాకిగా మిగిలిపోయాము’ అని మాట్లాడిన టేపు మీడియాలో విడుదలైంది. చైనా, నేపాల్ మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతునిస్తున్నవి. యుద్ధం గనుక వస్తే దేశంలోని అంతర్గత శత్రువులు చైనా, పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా స్నేహహస్తం అందించి భారత జాతికి వెన్నుపోటు పొడుస్తారన్న అనుమానాలు లేకపోలేదు.
మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికలలో గెలవాలంటే ఓట్లు సంపాదించుకోవాలి. ఈ కారణంగా రాజకీయ నాయకులు పరస్పర నిందలకు పాల్పడుతుంటారు. దేశంపై ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు నేతలంతా ముక్తకంఠంతో ఏకతాగీతం ఆలాపించాలి కానీ- ఎన్నికల్లో గెలుపు కోసం రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు ప్రధాని మోదీని తిట్టడంలో విజ్ఞత ఉందా? ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. జాతి ప్రయోజనాలు మరచి ఓట్ల కోసం నిందారోపణలు చేయడం ఇపుడు చూస్తున్నాము. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడడం- కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు చేస్తున్న దేశద్రోహం కాదా?

-ముదిగొండ శివప్రసాద్