మెయిన్ ఫీచర్

తమోగుణమే అజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
‘‘స ఏకః’’అని ప్రకటిస్తూ, సమస్త జగత్కార్యమును నిర్వహిస్తున్న ఈశ్వరుడు మాయారూపమని పరమాత్మకు భిన్నమని ప్రస్తావించుట ఎంతవరకు సమంజసము అనే సందేహము కల్గును. సంపదుపాసనలతో కార్యబ్రహ్మమును చేరిన వారికి క్రమముక్తి, తత్త్వజ్ఞాన సాధనతో నిర్వికల్ప సమాధిలో ఆత్మసాక్షాత్కారముతో సద్యోముక్తి లభించునని ముందు స్పష్టము చేయబడినది. యుగాంతములో కార్యబ్రహ్మ, కారణబ్రహ్మములో లయవౌనని చెప్పినందువలన, నిర్గుణ పరబ్రహ్మమే ఆద్యంతములు లేనిదని నిశ్చయించుకొనుట యుక్తము.
112. శుద్ధాద్వయ బ్రహ్మవిబోధనాశ్యా
సర్పభ్రమో రజ్జువివేకతో యథా
రజస్తమః సత్త్వమితి ప్రసిద్ధా
గుణాస్తదీయాః ప్రధితైః స్వతార్యైః॥
రజ్జువును ప్రత్యక్షముగా చూచిన తోడనే సర్పమనే భ్రాంతి నశించినట్లు, అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారముతో మాయ యొక్క ధర్మములైన రాజస, తామస, సాత్త్విక గుణములు కార్యరూపములోనే ప్రసిద్ధవౌతున్నవి. గుణములు ధర్మములు. ధర్మాధర్మములు ఆ ప్రత్యక్షములు. కేవలము కార్యరూపములోనే విదితవౌను గాని అన్యథా వ్యక్తము కావు.
రజోగుణము వ్యక్తమయే విధానము
113. విక్షేపశక్తీ రజసః క్రియాత్మికా యతః
ప్రవృత్తి. ప్రసృతా పురాణీ
రాగాదయో‚ స్యాః ప్రభవన్తి నిత్యం
దుఃఖాదయో యే మనసో వికారాః॥
మాయకు మూడు ముఖాలు వాటినే శక్తులని కూడా అందురు. మొదటిది ఆవరణశక్తి ఇది చైతన్యాన్ని సంకుచితంచేసి చూపిస్తుంది, రెండవది విక్షేపశక్తి. విక్షేపశక్తి విజృంభించి ప్రపంచాన్ని బయటపెట్టి జగద్భావాన్ని పెంపొందిస్తుంది. ఆవరణ, విక్షేపశక్తులు ప్రాపంచిక బంధ హేతువులు. మూడవదైన జ్ఞానశక్తి మాత్రము ముక్తికి హేతువు. రజోగుణము, మాయ యొక్క విక్షేపశక్తిని రేకెత్తించి రాగద్వేషాలను మనిషిలో కలుగజేస్తుంది. అనాదియైన అవిద్య కారణంగా మనిషి ప్రాపంచిక విషయములకు బద్ధుడై జీవనయానం కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, జ్ఞానశక్తిని వృద్ధిచేసికొని మాయను అధిగమించటము సాధ్యము. మనస్సును నియంత్రించుకోలేక, కామక్రోధాలను అణచుకోలేని రజోగుణ సంపన్నుడు నిత్యము దుఃఖమును పొందునని ‘‘రజసస్తు ఫలం దుఃఖం’’అనే గీతా వచనం స్పష్టము చేస్తున్నది (్భ.గీ.14-16)
114. కామఃక్రోధో లోభ దంభాభ్యసూయా‚
హంకారేర్ష్యా మత్సరాద్యాస్తు ఘోరాః
ధర్మా ఏతే రాజసాః పుంప్రవృత్తి ర్యస్మా
దేతత్తద్రజో బన్ధహేతుః॥
రజోగుణ ధర్మములు ఇచ్చట వివరింపబడుతున్నది. కోరికలు విషయాసక్తిని కల్పించును. ‘‘కామాత్ క్రోధో‚ భిజాయతే’’(విషయ వాంఛ తీరనప్పుడు కోపము కలుగును- భ.గీ.2-62). కామక్రోధములతోపాటు లోభత్వము, కపట ప్రవర్తన, మచ్చరము, అహంభావము, ఈర్ష్య, ఇత్యాది సమస్తమూ రాజస గుణమువలన ఉత్పన్నమైనవే. ఈ గుణములన్నీ అతిఘోరమైనవి. కారణమేమన, అవి మనిషిని సదా కార్యోన్ముఖుణ్ణిచేసి, ప్రాపంచిక కార్యములందే వాని ఆసక్తి పెంచును. అనునిత్యము కర్మకు బద్ధుడై బంధవిముక్తికొరకు శ్రద్ధతో యత్నము చేయుటకు వాని ప్రవృత్తి అంగీకరించదు.
తమో గుణము
115. ఏషావృతిర్నామ తమోగుణస్య
శక్తి ర్యయా వస్త్వవభాసతే‚ న్యథా
సైషా నిదానం పురుషస్య సంసృతేః
విక్షేపశక్తేః ప్రసరస్య హేతుః॥
ఏ శక్తివలన ఆత్మ, అంతఃకరణ రూపములో భాసిస్తున్నదో అదే తమోగుణమునకు చెందిన ఆవరణశక్తి. ఇదే మనిషి సంసారబంధమునకు మూలము. జనన-మరణ వలయమునుండి వ్యక్తి తప్పించుకొనలేక పరిస్థతి ఏర్పరచి బాధించును. విక్షేపశక్తి వ్యాపించుటకు తమోగుణముయొక్క ఆవరణశక్తే కారణము.
తామసబుద్ధిగల వ్యక్తి ప్రవర్తన ఏవిధముగా ఉండునో స్మృతి ఇలా స్పష్టం చేస్తున్నది- ‘‘అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ’’ (తమోగుణావృతమైనందువలన అధర్మమును ధర్మమని, అన్ని విషయములను తద్విపరీతముగను గ్రహించిన వ్యక్తి తామసబుద్ధి గలవాడు- భ.గీ.18-32).
116. ప్రజ్ఞావానపి పండితో‚ పి చతురో‚ ప్యత్యస్తసూక్ష్మార్థ దృగ్
వ్యాలీఢస్తమసా న వేత్తి బహుధా సంబోధితో‚ పి స్ఫుటమ్‌
భ్రాన్త్యారోపితమేవ సాధు కలయత్యాలబతే తద్గుణాన్
హన్తాసౌ ప్రబలా దురస్త తమసః శక్తిర్మహత్యానృతిః॥
ప్రజ్ఞగల మేధావియైనా, మంచి పండితుడైనా, సూక్ష్మదృష్టికలవాడైనా, పలు విధములుగా బోధింపబడినా, తమోగుణముచే ఆవృతమైన వ్యక్తి, యథార్థతను గ్రహించలేడు. మోహావేశముతో వివశుడై, మంచిని- చెడుగాను, లేని దానిని-ఉన్నట్లు భావించి సత్యదూరమైన దానినే అవలంబించి, సత్యమును తృణీకరిస్తాడు. తామస గుణము మిక్కిలి బలీయమైనది. ఆ శక్తినే ఆక్రమించబడిన వ్యక్తి జీవితము దుఃఖమయమగును.
117. అభావనా వా విపరీతభావనా
సంభావనా విప్రతిపత్తి రస్యాః
సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం
విక్షేపశక్తిః క్షవయత్యజస్రమ్‌॥
తమోగుణముతో ఆవృతమై, సంభవా సంభవములను వ్యక్తి తెలిసికొనలేక పోవుటమే అభావన. అభావనతో, విరుద్ధ్భావన అనగా జడపదార్థ సముదాయమైన శరీరమే ఆత్మ అనే ఆలోచన ఏకమై, తామసగుణ ప్రేరితమైన ఆవరణశక్తి విపరీతముగా వృద్ధిచెంది, ఆ మానవుణ్ణి ఏనాడూ వదిలిపెట్టదు. విడవని తమోగుణ ఆవరణశక్తి, దాని సహయోగముతో విక్షేపశక్తి ప్రబలిన వ్యక్తి వినాశము తప్పదు. జనన మరణములను అధిగమించలేక సంసారబంధంలో చిక్కుకొని, మృత్యుపాశంలో పడుతూ దుఃఖమును అనుభవించటమే వినాశము. ఎవరు మృత్యువును అధిగమింతురో వారెన్నడూ దుఃఖ భాగులు కారు. వారు పరమసుఖమును శాశ్వతముగా పొందుదురు.
- ఇంకావుంది...