మెయిన్ ఫీచర్

కొత్త దశాబ్దంలోనైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో సంవత్సరాన్ని కాలగర్భంలో కలిపేసి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం.. కొత్త ఆశలతో, కొంగొత్త కోరికలతో మరో దశాబ్దాన్ని మొదలుపెట్టేశాం.. ఈ కొత్త దశాబ్దంలోనైనా మహిళలపై వివక్ష తగ్గి మహిళలను పురుషులతో సమానంగా చూస్తారని ఆశ.. మహిళలను పూజ్యభావంతో చూసే పురిటిగడ్డ మన భారతదేశం. అలాంటి భారతదేశంలో నేడు ఆడబిడ్డల పుట్టుక కూడా ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా నమోదైన జననాల గణాంకాలు కూడా ఔననే సమాధానమిస్తున్నాయి. నేటితరం మహిళలు ఉన్నత చదువులతో, కొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. పురుషుల కంటే మహిళలు ఏ రకంగానూ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. కానీ చిన్నప్పటి నుంచీ తాము ఆడపిల్లలకంటే అధికమన్న సామాజిక ఆధిపత్య భావనల మధ్య పెరుగుతున్న మగపిల్లలు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు అందంగా ఉండి తమ ప్రేమను కాదన్నా, తమను పట్టించుకోకుండా చదువుల వైపు మొగ్గుచూపుతున్నా, తమను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా అబ్బాయిలు భరించలేకపోతున్నారు. దీనికి కారణం అబ్బాయిలమన్న అహంకారమే.. దీన్ని పోగొట్టాలి.. అంతేకాదు రాజకీయంగా రాజ్యాంగపరంగానే కాదు.. సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనల్ని మనం సంస్కరించుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే జెండర్ ఎడ్యుకేషన్, జెండర్ సెన్సిటివిటీ పట్ల అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే వారికి అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలని, వారిని తమతో సమానంగా చూడాలని అనుకుంటారు.
ఇవే కాదు..
లింగనిష్పత్తి, సమానత్వం, వేతనాలు, చట్ట సంస్థలు, రాజకీయ ప్రాతినిధ్యం.. వంటి వాటిల్లో ఈ దశాబ్దంలో తప్పకుండా మార్పు రావాలి.
లింగనిష్పత్తి
కారణం ఏదైనా.. కారకులెవరైనా దేశవ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. మరీ ప్రమాదకరమైన అంశం ఏమిటంటే విజ్ఞానవంతులు, చదువుకున్నవాళ్లు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్యలో తరుగుదల నమోదవడం, తాజాగా విడుదలైన జనాభా లెక్కల వివరాలు ఈ చేదు నిజాన్ని బయటపెట్టాయి.
ఒక్క అరుణాచల్‌ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు, ఎంతమంది అమ్మాయిలు పుట్టారనే సంఖ్యను ‘లింగనిష్పత్తి’గా పిలుస్తారు. దేశవ్యాప్తంగా 2017 ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకూ నమోదైన జననాల ప్రకారం మొదటిస్థానంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో లింగనిష్పత్తి 1047 ఉంటే.. రెండో స్థానంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 78కి తగ్గి 968గా నమోదైంది. ఆ ఏడాది దేశం మొత్తం పుట్టినవారిలో అబ్బాయిలకన్నా అమ్మాయిలు సుమారు 11.21 లక్షల మంది తక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్, తెంగాణ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌లలో కూడా లింగనిష్పత్తి దారుణంగా తగ్గుతోంది. రాష్ట్రాలవారీగా లింగనిష్పత్తిలో ఏపీ 11, తెలంగాణ 20వ స్థానంలో ఉన్నాయి. జాబితాలో ఆఖరున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 890 మంది అమ్మాయిలే పుట్టగా.. చివర నుంచి రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 898 మందే ఉన్నారు. దేశంలో లింగ నిష్పత్తి అతి తక్కువగా.. అంటే 900 కంటే దిగువన ఉన్నది ఆ రెండు రాష్ట్రాలే.. ఆడపిల్లల జననాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చాలామంది ఉద్యోగులు, విద్యావంతులు మొదట అబ్బాయి పుట్టిన పక్షంలో రెండో బిడ్డను కనకుండా ఆపేస్తున్నారు. ఉన్నత కుటుంబాలు, బాగా విద్యావంతులైన కుటుంబాల్లో ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతుండటం కూడా లింగనిష్పత్తి తగ్గేందుకు కారణమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా స్ర్తి, పురుష నిష్పత్తి, తారతమ్యాలు పోవడానికి మరో వందేళ్లు పడుతుందని అంచనా.
విదేశాల్లో..
విదేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో జననాలకు, భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ప్రకారం 2017లో 110 దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ప్రకారం 2017లో 110 దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో 12, 479 మంది జన్మించారు. అక్కడ బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య 155 తక్కువగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 70 మంది తక్కువగా ఉన్నారు. దక్షిణాఫ్రికా, సూడాన్, పోలండ్, సౌదీ అరేబియా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో బాలికలు ఎక్కువగా పుట్టారు.
సమానత్వం
ఇంట్లో ఆడపిల్ల, మగపిల్లాడు ఉంటే వారిద్దరినీ ఎలా పెంచుతామన్నది తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. పిల్లలకు బొమ్మలను కొనిపెట్టడం దగ్గరి నుంచీ నీతి నియమాలను బోధించడం వరకూ.. అన్నింటిలోనూ అబ్బాయిలు అధికమన్న భావనను పొరబాటున కూడా పిల్లలిద్దరి మనసులో పడకుండా చూసుకోవాలి. సాంప్రదాయం, సామాజిక కట్టుబాట్ల ముసుగులో అమ్మాయిల్ని కట్టిపడేయకుండా బాల్యం నుంచి ఆడపిల్లకు స్వేచ్ఛ, సమానత్వాన్ని కలిగిస్తూ పెంచాలి. అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే ఆడపిల్లలతో ఎలా మసగాలి, వారిని ఎలా గౌరవించాలి అన్న విషయాలను చెబుతూ పెంచాలి. ఆడపిల్లలు వారికి ఏ రూపంలో కష్టమొచ్చినా స్వేచ్ఛగా ఇంట్లో చెప్పుకోగలిగే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. వారి ప్రవర్తనలో ఏ పాటి తేడా కనిపించినా వెంటనే వారిని ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని ఆరాతీయాలి. అంతేతప్ప వారిని చీటికిమాటికి కసరకూడదు.
సినిమాలు
సినిమాల్లో అమ్మాయిలను వేధించడం, వెటకారాలు ఆడటం, దురుసుగా ప్రవర్తించడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా దాడులకు దిగడం వంటివి పరిపాటిగా మారాయి. యుక్తవయస్కులపై బలమైన ప్రభావం వహించే సినిమాల్లో ఈ ధోరణిని చక్కదిద్దడం మంచిది. అంతేకాదు.. అమ్మాయి, అబ్బాయిల మధ్య చక్కటి అనురాగాలను ప్రదర్శించడం అవసరం. ఇలాంటివి అనుసరిస్తూనే మారుతున్న కాలానికి తగ్గ సినిమాలు రావడం చాలా ముఖ్యం.
చట్టాలు
అమ్మాయిలను సమానంగా చూడటానికి, అమ్మాయిలపై వేధింపులకు చాలానే చట్టాలు ఉన్నాయి. కానీ వీటిల్లోని లొసుగులను ఉపయోగించుకుని అబ్బాయిలు చట్టానికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటివి జరగకుండా చూసి తప్పు చేసిన వాడికి త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అలాగే లింగవివక్షపైనా, దాని నిరోధక చట్టాలపైనా యుక్త వయస్సు నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలి. ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యలు కొత్త కొత్త చట్టాలతోనో, శిక్షలతోనే పరిష్కారమైపోయేవి కాదు. వాటి మూలాలు, పరిధి మన సమాజంలో, కుటుంబాల్లో లోతుగా వేళ్లూనుకుని ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలన్నా, ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలన్నా, మహిళలకు సమాజంలో సమానత్వం కల్పించాలన్నా ఆ కృషి కుటుంబాల నుంచి, ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి. లింగవివక్ష మూలంగా మన సమాజం ఆర్థికంగా, సామాజికంగా.. ఏ రకంగా చూసుకున్నా భారీ మూల్యం చెల్లించుకోవలసిందే.. అందుకే పరిస్థితులను అర్థం చేసుకుని ఈ సమస్యల నుండి బయటపడటానికి ఈ దశాబ్దిలోనే ముందడుగు వేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే మహిళలను సంరక్షిస్తూ, వారికి సమానత్వం కలిగించే దిశగా అడుగులను వేద్దాం.. ఆడబిడ్డను కాపాడుకుందాం.
*

- సన్నిధి