మెయిన్ ఫీచర్

పర్యావరణహితమే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణ కోసం తన చదువును కూడా త్యాగం చేసి ఉద్యమ బాట పట్టిన పదహారేళ్ల గ్రెటా థున్‌బర్గ్ గురించి అందరికీ తెలిసిందే.. స్వీడెన్‌కు చెందిన గ్రెటా ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్’ పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టి మేధావులు సైతం హర్షించే విధంగా దానికి సారథ్యం వహిస్తోంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. అయినా వాటిని లెక్కచేయకుండా సమస్యపై నిజాయితీగా పోరాడుతోంది. పదహారేళ్ల వయసు పిల్ల అంటే ఎలా ఉంటుంది? గాలిలో తేలియాడుతూ.. ఊహలతో ఊసులాడుతూ.. ఏ బాధ్యతా లేకుండా.. హాయిగా.. ఆనందంగా గడిపేస్తుంటుంది. కానీ గ్రెటా మాత్రం చిన్నవయస్సులో ఓ బాధ్యతను నెత్తిమీదకు ఎత్తుకుంది. మనిషి తన సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవనం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఈ భూమిపై బతికే మిగిలిన జీవుల్లా తానూ ఓ జీవిననే విషయాన్ని మర్చిపోయి ఆధునికత పేరుతో పర్యావరణానికి హాని కలిగిస్తున్నాడు. స్వచ్ఛమైన గాలి, నీరు, నేల.. వంటివి లేకుండా భవిష్యత్తు తరాలు ఎలా బతుకుతాయనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నాడు. వీటివల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు చెప్పి, వారికి అవగాహన కలిగించి పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ఎంతోమంది నాయకులు, స్వచ్ఛంద సంస్థలు.. కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలన్న తపన మాత్రం గ్రెటాలో రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె పర్యావరణహితం కోసం ఆ సమస్యను తలకెత్తుకుంది. దీనికోసం తన చదువును కూడా త్యాగం చేసింది. గత సంవత్సరం దీని గురించి ఐక్యరాజ్యసమితిలో కూడా తన స్పీచ్ ద్వారా అందరికీ వినిపించింది. ఇలా పర్యావరణ హితం కోరి తన చేస్తోన్న కృషికిగానూ 2019 నోబెల్ శాంతి పురస్కారానికి గ్రెటాను నామినేట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో గ్రెటా గురించి తన తండ్రి ఇటీవలే ఒక ఆంగ్ల టీవీ ఛానల్‌తో సంభాషించాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
2018, ఆగస్టులో గ్రెటా స్వీడిష్ పార్లమెంటు ఎదుట ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్’ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో వస్తోన్న మార్పులు.. మొదలైన సమస్యల గురించి ప్రపంచ దేశాల నాయకులు చర్చలు జరిపి వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించే వరకు తాను బడికి వెళ్లనని, సమస్య ఒక కొలిక్కి వచ్చేవరకు ఇలా స్ట్రైక్ చేస్తానని ఆమె వివరించింది. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది విద్యార్థులు గ్రెటాకు మద్దతు తెలిపారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు వారు కూడా స్కూలుకు వెళ్లడం మానేశారు. ఈ క్రమంలోనే మార్చి 15, 2019న 225 దేశాల్లో దాదాపు 2200 ప్రదేశాల్లో నిరసనలు జరిపారు. ఇందులో పది లక్షల మంది విద్యార్థులు, పెద్దలు పాల్గొన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 27న జరిగిన క్లైమేట్ స్ట్రైక్‌లో ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు జరిగిన అతి పెద్ద క్లైమేట్ స్ట్రైక్ కూడా ఇదే.. ఈ ఉద్యమానికి ప్రపంచస్థాయి గుర్తింపు కూడా లభించింది. అలా పర్యావరణ హితం కోసం గ్రెటా చేస్తోన్న ఈ పోరాటానికి భారీస్థాయిలో ఆదరణ లభిస్తోంది. కానీ గ్రెటా తీరు గురించి ఆమె తండ్రి స్వేన్ట్ థున్‌బర్గ్ స్పందిస్తూ ‘గ్రెటా స్కూల్ స్ట్రైక్‌ను మొదలుపెట్టడానికి మూడు, నాలుగు సంవత్సరాల ముందు నుంచే వాతావరణంలో వస్తోన్న మార్పుల గురించి ఆలోచిస్తూ దిగులు పడేది. కొన్ని సంవత్సరాల తరువాత తను స్కూలుకు వెళ్లడం మానేసింది. ఎవ్వరితో సరిగా మాట్లాడేది కాదు. సమయానికి భోజనం చేసేది కాదు. కూతురిని అలాంటి పరిస్థితుల్లో చూడటం ఒక తండ్రిగా నాకు బాగుండేది కాదు. తనను ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడం కోసం ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడ్ని. కొన్ని రోజుల తరువాత నా భార్య కూడా ఇలాగే చేసింది. తన పనులన్నీ పక్కన పడేసి తనతో ఎక్కువ సమయం గడిపేది. ఈ క్రమంలోనే గ్రెటా మాకు వాతావరణ మార్పుల గురించి ఎన్నో విషయాలు చెప్పేది గ్రెటా.. అలా మేమూ పర్యావరణం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. అయితే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలన్న తపన మాత్రం గ్రెటాలో రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. దీంతో మేము కూడా తన కోసం పర్యావరణ హితంగా మారిపోయాము. దీనిలో భాగంగానే నా భార్య విమానాల్లో ప్రయాణం చేయడం మానేసింది. నేను శాకాహారిగా మారాను. ఇలాంటి పనులు ఆమెకు మరింత శక్తిని ఇచ్చాయి. ఏ మార్పు అయినా ఇంటి నుంచి మొదలయితే ఆ మార్పు ప్రపంచమంతా వచ్చినట్లే కదా.. కానీ నేను ఏమి చేసినా నా కూతురి కోసమే చేశాను. నాకు ఇద్దరు కూతుళ్లున్నారు. నిజాయితీగా చెప్పాలంటే అన్నింటికన్నా నాకు వాళ్లే ముఖ్యం. వాళ్లు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. గ్రెటాను అందరూ ఓ గొప్ప ఉద్యమకారిణిగా, సామాజికవేత్తగా, పర్యావరణవేత్తగా చూస్తారు. కానీ నాకు మాత్రం ఆమె ఓ సాధారణమైన, తండ్రి చాటు ఆడపిల్ల. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు. మిగిలిన వారిలా తను కూడా ఆడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది.. సమాజ శ్రేయస్సు కోసం చదువును వదిలేసింది అంతే.. కానీ సమాజం కోసం ఉద్యమకారిణిగా మారడం బాగుంది కానీ.. కొంతమంది నుంచి తను ఎదుర్కొనే ద్వేషాన్ని చూసినప్పుడు మాత్రం ఆందోళన కలుగుతుంది. భయం వేస్తుంది. తన గురించి వచ్చే తప్పుడు వార్తలు, అబద్ధాలు, వ్యక్తిగత కక్షతో చేసే విమర్శలు.. నాలో భయాన్ని కలిగిస్తాయి. గ్రెటా తాను అనుకున్నది సాధించి భవిష్యత్తులో మళ్లీ చదువుకోవాలని నా కోరిక. దీనికోసం తనకు నానుంచి ఎలాంటి సహాయం కావాలన్నా.. చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’ అంటూ చెప్పుకొచ్చాడు స్వేన్ట్.
ఆయన కోరిక మేరకు ఈ సమస్య అతి త్వరలోనే పూరె్తై గ్రెటా మళ్లీ స్కూలు మెట్లెక్కాలని ఆ తండ్రి తరఫున మనమూ కోరుకుందాం.

- సన్నిధి