మెయిన్ ఫీచర్

ప్రపంచ బాలమేధావి సుచేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుచేతా సతీష్.. ప్రపంచ బాలమేధావి.. కేరళకు చెందిన పదమూడేళ్ల బాలిక సుచేత. ప్రస్తుతం దుబాయిలో కుటుంబంతో పాటు నివసిస్తోంది. అక్కడ సుచేత ‘ది ఇండియన్ హైస్కూల్’లో ఎనిమిదో తరగతి చదువుతోంది. సుచేతకు సంగీతమంటే చాలా ఇష్టం. వాళ్ల ఇంట్లో అందరికీ సంగీతమంటే ప్రాణం. అందుకే సుచేత కూడా నాలుగు సంవత్సరాల వయసు నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. చిన్నవయస్సు నుంచే సంగీతం నేర్చుకోవడంతో ఆమెకు కూడా సంగీతం అంటే ఇష్టం పెరిగింది. అలా సంగీత సాధనలో పడింది. ఎనిమిదేళ్ల వయసులో హిందుస్థానీ సంగీతం పట్టు సాధించడం మొదలుపెట్టింది సుచేత. అలా ఆ సంగీత పరీక్షలో విజయం సాధించింది. తరువాత ఆమె తన మాతృభాషలో పాటలు పాడటం నేర్చుకుంది. అలా ఒక్క భాషనే ఎందుకు? అన్ని భాషలో నేర్చుకుంటే బాగుంటుంది కదా.. అప్పుడు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండొచ్చు కదా అనుకుంది సుచేత. అనుకున్నదే తడవుగా మాతృభాషైన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ.. వంటి అనేక భారతీయ భాషలపై కూడా పట్టు సాధించి ఆ భాషల్లోనూ పాటలు పాడటం మొదలుపెట్టింది. ఒక కార్యక్రమంలో భాగంగా ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..’ అనే తెలుగు పాటను పాడి అందరిచేతా శెభాష్ అనిపించుకుంది సుచేత. ఇలా దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోంది ఈ యంగ్‌స్టర్.
వివిధ భాషల్లో రూపొందిన పాటలు నేర్చుకోవడంపై ఉన్న ఇష్టం, సంగీతంపై ఉన్న మక్కువతో సుచేత కేవలం భారతీయ భాషలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన భాషల్లో రూపొందించిన పాటలు పాడటం నేర్చుకుంది. ఇలా పదమూడేళ్ల ప్రాయంలో 120 భాషల్లో స్పష్టమైన ఉచ్ఛారణతో చక్కగా, అలవోకగా పాటలు పాడుతోంది. అయినా ఆ అమ్మాయికి తృప్తి లేదు. ఇంకా ఇంకా కొత్త భాషలు నేర్చుకోవాలని తపన పడుతోంది. అయితే ఇంత చిన్నవయస్సులోనే తన టాలెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న సుచేతను చూసి కుటుంబ సభ్యులందరూ గర్వపడుతున్నారు. విదేశీ భాషల్లో సుచేత నేర్చుకున్న తొలి భాష జపనీస్. ఒకరోజు సుచేత నాన్న స్నేహితురాలు దుబాయ్‌కి వచ్చిందట. అక్కడ సుచేత ఇంటికి వచ్చిన తరువాత ఆమె ఒక జపనీస్ పాట పాడిందట. అది విన్న సుచేత జపనీస్ నేర్చుకోవాలని పట్టుబట్టి మరీ నేర్చుకుందట. అందులోనే సుచేత తొలిపాటను పాడింది. దుబాయ్‌లో ఉన్నందున అప్పటికే అరబిక్ నేర్చుకుంటున్న సుచేత.. ఆ భాషలో కూడా పాట పాడటం మొదలుపెట్టింది. తరువాత ఫిలిప్పీన్స్ భాషైన టాగలాగ్‌లో నైపుణ్యం సాధించింది. ఇలా క్రమంగా వారానికో కొత్త భాషకు సంబంధించిన పాటలను ఔపోసన పట్టడం మొదలుపెట్టింది. ఇందుకోసం సుచేత చాలా కష్టపడుతోంది. ఒక భాష నేర్చుకునేటప్పుడు ఆ భాష తెలిసిన వ్యక్తులతో మాట్లాడుతోంది. అలాగే గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయంతో కూడా సుచేత భాష నేర్చుకుంటోంది. అలా కరావోకే ట్రాక్ సహాయంతో పాటలు నేర్చుకుంది. ఒక పాట నేర్చుకోవడానికి ముందుగా దాని లిరిక్స్ రాసుకుని, దాన్ని చదువుతూ, ఆ పాటను ప్లే చేస్తూ పాటను నేర్చుకుంటాం ఎవరిమైనా.. కానీ సుచేత అలాకాదు.. ఒక భాషకు సంబంధించిన పాట నేర్చుకోవాలంటే లిరిక్స్‌తో పనిలేకుండా దాన్ని చాలసార్లు విని ఒంటపట్టించుకుంటుంది. అలా ఏ భాషకు సంబంధించిన పాటైనా ఇట్టే నేర్చేసుకుంటుంది. తను ఎంచుకున్న భాషలో ఒక పాట నేర్చుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుందట. ఫ్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు ఆమెకు కాస్త కష్టంగా అనిపించాయట. ఆ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి మాత్రం రెండు రోజులు పట్టిందట. ఇన్ని భాషల్లో పాటలు నేర్చుకున్నా సుచేతకు మాత్రం న్యూజిలాండ్‌లోని మావోరి తెగ మాట్లాడుకునే టీ రియో అనే భాషకు సంబంధించిన పాటంటే చాలా ఇష్టమట. ఇలా నేడు సుచేత 120 భాషల్లో సునాయాసంగా పాటలు పాడేస్తుంది. ఇందులో పాప్, హిప్-హాప్, జానపదం.. ఇలా రకరకాల పాటలను నేర్చుకుంది. అలా ప్రపంచంలో భాషలన్నింటిలో పాటలు పాడే ప్రావీణ్యం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించిందీ వరల్డ్ చైల్డ్ సింగర్. ఇందులో భాగంగా దుబాయ్‌లో నిర్వహించిన ఒక సంగీత కచేరీలో నిరంతరాయంగా 6.15 గంటలపాట 102 భాషల్లో పాటలు పాడి రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. ఒక సంగీత కచేరీలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన రికార్డు ఒకటైతే.. సుదీర్ఘ సమయం పాటు పాటటలు పాడిన బాలికగా రెండో రికార్డును తన వశం చేసుకుంది సుచేత. ఈ రెండు ప్రపంచ రికార్డులే తాజాగా ఆమెకు ‘గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డును దక్కేలా చేశాయి. సుచేత మాత్రం తాను ఇంకా ఇంకా అనేక భాషలు నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాదు.. ఆమె పెద్దయ్యాక తన తండ్రిలా డాక్టర్ అవ్వాలని కలలు కంటోంది. ఆమె ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని.. కన్న కలలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సుచేత.

- మహి