మెయిన్ ఫీచర్

స్ఫూర్తిదాయకమీ సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

70వ దశకంలో ‘మహాస్థ్రానానికి’ సరిజోడైన ‘డమరుధ్వని’ గీతాలతో తెలుగు సాహి త్య లోకాన ప్రభంజనం సృష్టించిన ప్రముఖ ఉత్తరాంధ్ర అభ్యుదయ కవి ‘సీరపాణి’ని ఇటీవల వారి స్వగృహంలో నేను కలవడం జరిగింది. అతనితో నేను మాట్లాడిన సందర్భంలో, గతంలో కొనే్నళ్లపాటు చాగంటి సోమయాజులు (చా.సో)గారు, మీరు కలిసి ‘అరసం’ (అభ్యుదయ రచయితల సంఘం) విజయనగరంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు కదా! వారితో మీ పరిచయం, అనుభవం ఎలాంటిది? ఆయనపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నలు వేసిన నాకు, సీరపాణి నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే- ఆరుద్ర, కృష్ణశాస్ర్తీల కోరిక మేరకు చా.సో విజయనగరంలో అరసంను ప్రారంభించారని, వారి సూచన మేరకు సీరపాణి అనే యువకవిని సంస్థలో భాగస్వామునిగా చేయడం జరిగింది. చాసో అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా విజయనగరంలో అరసంను ప్రారంభించినట్టు సీరపాణి గుర్తుచేసుకున్నారు. విజయనగరంలో అరసం వేదికపై అనేకమంది పూర్వకవుల జయంతులు, వర్థంతులు చేయడం, పలు సాహితీ సదస్సులు విజయవంతంగా నిర్వహించడం జరిగిందిన చెప్పారు. అలాగే పలువురు కవులు, రచయితలు, సాహితీ పోషకులను ఒకే వేదికపై తీసుకురాగలిగామని ఆనాటి జ్ఞాపకాలను సీరపాణి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
1974వ సంవత్సరంలో ఉప్పల లక్ష్మణరావుగారి ఆధ్వర్యంలో, అప్పటికే బరంపురంలో దిగ్విజయంగా నడుస్తున్న ‘వికాస సాహితి’ అనే సాహితీ సంస్థ రాష్టవ్య్రాప్తంగా తెలుగు భాషకు సంబంధించి వచన కవితల పోటీలను నిర్వహించింది. ఆ పోటీలలో యువకవి సీరపాణి ‘కన్నీటి లేఖ’ కవిత ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. ఆ వర్తమానం బరంపురం నుండి చా.సోకు అందింది. ఆ విషయాన్ని ఒకసారి సాయంత్రంవేళ దంతులూరి రామరాజుగారు, చా.సోగారు మాట్లాడుకుంటూ, మన సీరపాణికి సాహిత్య అకాడమీ కార్యదర్శి పదవి ఇచ్చినా అర్హుడేనని అనుకుంటున్న మాట నా చెవిన పడింది. నేను వారిదగ్గరికి వెళ్లిన వెంటనే, చా.సోగారు, ఒక మంచి శుభవార్త చెబుతాను, నాకు ఏమిస్తావు అని అడిగారు. దానికి నేను ఏమిమ్వగలను సార్.. మీ వంటి పెద్దలకు అని అన్నాను. నీ పెన్ను కావాలని అడిగారు. దానికి నా పెన్ను పాతది, మీకు ఎందుకు సార్.. వేరే కొత్త పెన్ను కొనిస్తానని అన్నాను. నీ పాత పెనే్న కావాలని కోరారు. అంటే అతనికి నాపైగల అవ్యాజమైన ప్రేమానురాగాలకు ఈ సంఘటన నిదర్శనమని చెప్పగలను. నా జీవితంలో మరపురాని సంఘటన అది. ఆయన ప్రశంసలు పొందడానికి ఆనాటి వర్థమాన కవులు తహతహలాడిపోయేవారు. ఆ అదృష్టం నాకు దక్కినందుకు నేను ఎంతో ఆనందాన్ని పొందానని, ఆ ప్రశంసయే నా కవిత్వ సంపదకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు సీరపాణి.
పాటకు తెలంగాణ, విమర్శకు రాయలసీమ, కథకు ఉత్తరాంధ్రలను పుట్టినిల్లుగా పేర్కొనవచ్చు. గురజాడ నుంచి గంటేడ వరకు అనేకమంది లబ్దప్రతిష్టులైన కథకులు ఉత్తరాంధ్ర నేల తల్లిపై పుట్టినవారే. వారిలో చా.సాగా ప్రఖ్యాతి పొందిన చాగంటి సోమయాజులను ముఖ్యంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు.
1915వ సంవత్సరం జనవరి 17వ తారీఖున శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ పుణ్య దంపతులకు చా.సో జన్మించారు. బాల్యమంతా నాగావళి తీరం ఒడ్డునే గడిచింది. ప్రాథమిక విద్య శ్రీకాకుళంలోనూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి విజయనగరం ఉన్నత పాఠశాలలోనూ, ఉన్నత చదువులు మాత్రం మహారాజా కళాశాలలో చదివినట్లు తెలియుచున్నది. 1941లో భారతి పత్రికలో తొలి కవిత ‘్ధర్మక్షేత్రం’ ప్రచురించబడింది. తొలి కథ ‘చిన్నాజీ’ మాత్రం అదే పత్రికలో 1942లో ప్రచురితమయ్యింది. 1968లో చా.సో కథలను కొన్నింటిని పుస్తక రూపంలో ‘చా.సో. కథల సంకలనం’గా వెలువరించారు.
చా.సో కథల్లో వ్యదార్థ జీవుల యథార్థ జీవనాలు స్పష్టంగా ప్రస్ఫుటించేవి. పేద, మధ్యతరగతి అణగారిన మరియు పీడిత ప్రజల సుఖదుఃఖాలను, కష్టనష్టాలను ఉన్నది ఉన్నట్లుగా ఆయా కథలలో చిత్రించేవారు.
చా.సో విశిష్టమైన కథారచయిత. కథావస్తువు, సన్నివేశము నడక, పాత్రోచిత సంభాషణ- ఇలా అన్నింటిలోనూ చా.సో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపించేది. డబ్బు మనిషిని ఏ విధంగా అవినీతిమయం చేస్తుందో, అదే డబ్బు మానవీయ విలువలను ఏ విధంగా నాశనం చేస్తుందో, పెత్తందారి సమాజంలో మనుషులు ఆ డబ్బుకు ఏ విధంగా కక్కుర్తిపడి ప్రవర్తిస్తారో, దానికోసం ఎటువంటి అఘాయిత్యం చేయడానికైనా వెనుకాడని బూర్జువా వర్గ ప్రవర్తన అనే విషయాలను సునిశితంగా పరిశీలించి తన కథలలో ఇమిడ్చి వివిధ రకాల పాత్రలను సృష్టించడంలో చా.సోకు సాటిరారు వేరెవ్వరు.
చా.సో కధలు రాసే కాలంలో ఈ తెలుగు నేలపై మనుషుల మధ్య నైతిక విలువలు పతనం కావడం, అవినీతి విపరీతంగా పేరుకుపోవడం, మానవీయ సంబంధాలు మంటగలిసిపోవడం, పెత్తందారీ పోకడలు పెచ్చరిల్లిపోవడం జరిగింది. ఆనాటి సమాజంలో వుండే దుర్నీతిని మరియు దుష్ట సాంప్రదాయాలని ఎండగడుతూ సంస్కరణ దిశగా తన కథలలో వివిధ సన్నివేశాలను సృజియిస్తూ, తద్వారా సామాజిక చైతన్యాన్ని జనంలో తీసుకురావడానికి ఓ కవిగా తన వంతు ప్రయత్నం చేశారు. అందుకే అతని కథలు ఎక్కువగా హిందీ, కన్నడం, మలయాళం, ఉర్దూ మరియు రష్యన్ భాషల్లో అనువదించబడ్డాయి.
‘‘చా.సో. కథలు ఎక్కువగా బుద్ధిని తాకుతాయి. హృదయంలోకి చొచ్చుకుపోవడం తక్కువే అయినా, కొన్నిచోట్ల కథ హృదయదఘ్నంగానే ఉంటుందని’’ చా.సో గారాలపట్టి, సాహితీ వారసురాలైన చాగంటి తులసి అంటారు. ఆమె ఇటీవల తన తండ్రి కథలను ఐదింటిని నాటికలుగా రాసి ప్రచురించడం జరిగింది కూడా. ముఖ్యంగా ‘ఎందుకు పారేస్తాను నాన్నా, జంక్షన్లో బడ్డీ, వాయులీనం, కుంకుడాకు మరియు వజ్రహస్తం’ అనే ఐదు కథలను ఎంపిక చేసుకొని వాటికి ఆమె దృశ్యరూపం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో చా.సో అభిమానులు అందరూ ఆనందించవలసినదే. ఎందుకంటే ఆ దృశ్యరూపాలను ఏదైనా నాటక సమాజం ప్రదర్శిస్తే, తిలకించే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది కాబట్టి. తులసిగారు తీసుకున్న తన తండ్రిగారి ఐదు కథలలోని కథావస్తువులను పరిశీలిస్తే, వాటి సమాజ స్థితిగతులు నేటి వర్తమాన సమాజానికి ఇనే్నళ్లయినా దగ్గరగా ఉండడం గమనార్హం. మద్రాస్ రాష్ట్రంలో ‘అరసం’ వ్యవస్థాపనలో ముఖ్యభూమిక వహించినవారు
ఆరుద్రగారు.. ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ అరసంను రాష్టవ్య్రాప్తంగా స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా చా.సోను పేర్కొనచ్చు. ఆరుద్ర సూచన మేరకు అరసంలో చేరిన చా.సో 1994వ సంవత్సరం జనవరి 2వ తేదీన చనిపోయే వరకు సంస్థలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం విశేషం. మిత్రులైన శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, ఆచార్య రోణంకి అప్పలస్వామి వారిని చాసో ఎంతో ప్రభావితం చేశారు.
1995 నుండి చాసో కుటుంబ సభ్యులు విజయనగరంలో ‘చా.సో స్ఫూర్తి’ పేరు ట్రస్ట్ నెలకొల్పి ప్రతి ఏటా అతని జన్మదినం రోజున అభ్యుదయ సృజనాత్మక సాహిత్యానికి నిబద్ధతతో కృషిచేస్తున్న వర్థమాన అభ్యుదయ రచయితలకు చా.సో స్ఫూర్తి సాహితీ పురస్కారాన్ని అందించడం ముదావహం.

పిల్లా తిరుపతి రావు 7095184846