మెయిన్ ఫీచర్

మనోమయ కోశమునకు ఆద్యంతములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
178. మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు
చరత్యత్ర న గచ్ఛన్తు సాధవో యే ముముక్షవః॥
నానా ప్రకారములైన ప్రలోభములకు తావైన విషయములనే మహారణ్యములో, మనస్సనే అతి పెద్దపులి సంచరించను. దాని బారిని పడకుండుటకు, మోక్షేచ్ఛగల సాధకులు, విషయాసక్తిని విడనాడి, శ్రేయస్కరముకాని విషయారణ్యములోనికి ప్రవేశించవలదు.
179. మనఃప్రసూతే విషయానశేషాన్
స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః
శరీరవర్ణాశ్రమ జాతిభేదాన్
గుణక్రియా హేతుఫలాని నిత్యమ్‌॥
జాగ్రదవస్థలో స్థూల రూపములోను, స్వప్నావస్థలో సూక్ష్మ రూపములోను అనేక ప్రకారములైన విషయములపై ఆసక్తి కలుగజేస్తూ శరీర వర్ణాశ్రమ జాతి ఇత్యాది భేదములన్నింటికి అనుగుణముగా భోగ్యపదార్థములను మనస్సే ఎల్లవేళలా సమకూరుస్తున్నది. దేహధారుని సమస్త ఆచార వ్యవహారములకు, చేసే క్రియలకు, భోక్తగా అతడు అనుభవించే ఫలభోగమునకు మనోవ్యాపారమే కారణవౌతున్నది.
180. అసంగచిద్రూప మముం విమోహ్య
దేహేన్ద్రియ ప్రాణగుణైర్నిబధ్య
అహం మమేతి భ్రమయత్యజస్రం
మనః స్వకృత్యేషు ఫలోపభుక్తిషు॥
సంగరహిత అఖండ జ్ఞానస్వరూపమైన జీవిత్మా తత్త్వతః, ఎట్టి ప్రతిబంధకములు లేనిది. కాని, త్రిగుణాత్మకమైన దేహము, ప్రాణములు, ఇంద్రియాదుల గుణములతో ఉపాధి కారణంగా బద్ధవౌతున్నది. నేను-నాది అనే దేహపరమైన అభిమానమును మనస్సు కల్పిస్తున్న కారణంగా, వ్యామోహముతో సదా లౌకిక మరియు వైదిక కార్యములందు మునిగి, వాటి ఫలభోగముకొరకు దేహధారుడు ఇహపరములకు చక్రభ్రమణ చేసే గతి ఏర్పడుతున్నది.
181. అధ్యాసయోగాత్పురుషస్య సంసృతిః
అధ్యాసబన్ధస్త్వమునైవ కల్పితః
రజస్తమోదోషవతో‚ వివేకినో
జన్మాదిదుఃఖస్య నిదాన మేతత్‌॥
శరీరముపై ఆత్మ అధ్యస్తమవగా దేహమే ఆత్మ అనే అపోహ కల్గును. భ్రాంతి మనో ప్రేరితము. అధ్యస్తరూపమైన దేహాత్మబుద్ధి రాజసగుణము, తామస గుణములయొక్క ఆవరణ విక్షేప శక్తులవలన అంతఃకరణములో ఉత్పన్నవౌతున్నది. ఆత్మకు వ్యతిరిక్తమైన తన దేహముపై, ఆత్మ లక్షణములు మనస్సుద్వారా ఆరోపితమైనందువలన, ఆ మోహముతో అవివేకి దుఃఖమయమైన జీవితమును గడుపుతూ, జన్మజరా మరణాదులను అధిగమించలేని పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తున్నది.
ఆత్మానాత్మ వివేకముతో ఆత్మస్వరూప లక్షణములైన ‘‘సత్యంజ్ఞానమనంతమ్’’అనే ధర్మములు (లక్షణములు), దేహములో లేవని అవగతమైనప్పుడే, జనన మరణములను అధిగమించశక్యము.
182. అతఃప్రాహుర్మనో‚ విద్యాం పణ్డితాస్తత్త్వ దర్శినః
యేనైవ భ్రామ్యతే విశ్వం వాయునేవాభ్రమణ్డలమ్‌॥
తత్త్వజ్ఞాన సంపన్నులు, వేదాంత పండితులు మనస్సు సంసార బంధమునకు మూల హేతువగుటవలన, మనస్సునే అవిద్యగా ప్రస్తావిస్తున్నారు. మేఘముల సముదాయము, వాయువు కారణంగా ఎట్లు ఇటునటూ, క్రిందకూ మీదకూ కదులుతున్నదో, అట్లే ఈ ప్రపంచములో ప్రాణులు మనస్సు కారణంగా భ్రమిస్తున్నవి.
183. తన్మనః శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణా
విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తిః కరఫలాయతే॥
మోక్షమును కోరేవాడు దృఢ ప్రయత్నముతో, సత్త్వగుణమును వృద్ధిచేసికొని, రాజసతామస గుణముల ఆవరణ- విక్షేప శక్తులపై నియంత్రణ పొంద శక్యము. మనస్సును కల్మష రహితముగా శుద్ధిపరచుకొని, శాంత మనస్కుడై, సద్బుద్ధిని సాధించిన వ్యక్తికి మోక్షము చేతిలో పెట్టిన పండువలె ప్రాప్తించును.
184. మోక్షైకసక్త్యా విషయేషు రాగం
నిర్మూల్య సంన్యస్య చ సర్వకర్మ
సచ్ఛ్రద్ధయా యః శ్రవణాదినిష్ఠో
రజస్స్వభావం స ధునోతి బుద్ధేః॥
మోక్షపాప్తి తప్ప ఇతరములేవీ ఆశించని వ్యక్తి, సమస్త సకామకర్మలను విడచిపెట్టి, గురుబోధనలందు శ్రద్ధ వహించి, సత్తామాత్రబ్రహ్మమందు అత్యంత నిష్ఠ కల్గి ఉండవలెను. ఈ విధంగా మోక్షసాధన సల్పిన వ్యక్తి, అహంకారాది గుణములతో కూడిన రాజస స్వభావమును సమూలంగా అంతమొందించుకొనును.
185. మనోమయో నాపి భవేత్పరాత్మా
హ్యాద్యన్తవత్త్వాత్ పరిణామిభావాత్‌
దుఃఖాత్మకత్వా ద్విషయత్వ హేతోః
ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః॥
మనోమయ కోశమునకు ఆద్యంతములు ఉన్నవి. అది శరీరముతోపాటు వృద్ధిక్షయములనే పరిణామములను సహితము పొందుతున్నది. విషయ గ్రహణకు మూలముగా, మనోమయ కోశము సుఖదుఃఖాది వికారములకు స్థానవౌతున్నది. చేతనమయమైన ఆత్మ సర్వసాక్షి. ద్రష్టగా మనోవ్యాపారమును నిరంతరము పర్యవేక్షిస్తూ, దేహధారుని సమస్త క్రియలను తెలిసికొంటున్నది. జడము, దృక్‌రూపమైన మనస్సు, చిత్ స్వరూపమైన ద్రష్ట అగుట అసంభవము. అందువలన, మనోమయ కోశము, సద్రూపము, శాశ్వతము, వికార రహితమైన ఆత్మ కాజాలదు.
- ఇంకావుంది...