మెయిన్ ఫీచర్

కర్మల ఫలితాలే జన్మపరంపరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
186. బుద్ధిర్బుద్ధీన్ద్రియైః సార్థం సవృత్తిః కర్తృలక్షణః
విజ్ఞానమయ కోశః స్యాత్ పుంసః సంసారకారణమ్‌॥
చక్షురాది పంచ జ్ఞానేంద్రియములతో సంబంధమున్న నిశ్చయాత్మకబుద్ధి, కర్తృత్వ లక్షణముతో కార్యాచరణ చేస్తున్నది. బుద్ధియొక్క సహాయ సహకారములు లేకపోయిన, ప్రాణి ఏ కార్యమునూ చేయలేదు. అందువలన, సంసారబంధమునకు విజ్ఞానమయకోశమే కారణవౌతున్నది. సంశయాత్మక రూపమైన మనస్సు, నిశ్చయాత్మక రూపమైన బుద్ధి రెండునూ అంతఃకరణ భాగములే. మనస్సు విషయగ్రహణ చేసే ఇంద్రియము (కరణము), బుద్ధి కర్త(చేసేది). అందువలన, మనోమయకోశమును కప్పుతూ ఉన్న విజ్ఞానమయ కోశమునకు ప్రత్యేకతనిస్తూ వేరుగా దాని కర్తృత్వలక్షణము చెప్పబడింది.
187. అనువ్రజచ్ఛిత్ప్రతి బింబశక్తిః
విజ్ఞాన సంజ్ఞః ప్రకృతేర్వికారః
జ్ఞానక్రియావా నహమిత్యజస్రం
దేహేన్ద్రియాదిష్వభిమన్యతే భృశమ్‌॥
విజ్ఞానమనే పేరుగల విజ్ఞానమయ కోశము, అన్నమయాది కోశములవలె శరీరముతో స్వభావసిద్ధిముగా వచ్చే అవిద్య వికారరూపము. సూర్యబింబము, ప్రతిబింబ రూపములో జలాదులందు ప్రకాశగుణమును పొందినట్లు, ఆత్మ చిత్తమందు ప్రతిఫలించి ప్రకాశవంతవౌతున్నది. చిత్‌ప్రతిబింబశక్తిని అనుసరించి వచ్చిన శక్తితో విజ్ఞానమయకోశము యొక్క అంతర్భాగమైన బుద్ధి, క్రియాశీలత్వము పొంది కార్యనిర్వహణ చేయును. బుద్ధిప్రయోగమువలన జ్ఞానము పొందబడును కాని, వికారాత్మకమైన బుద్ధి, ఎల్లప్పుడు దేహముతో తాదాత్మ్యము చెంది, దేహముపై అత్యంత అభిమానముతో ప్రవర్తించును. అజ్ఞానమువలన ప్రాప్తించిన దేహాత్మబుద్ధి, జ్ఞానసముపార్జనతో అంతవౌను. సత్త్వగుణాన్వితమైన బుద్ధిని ప్రయత్నముతో జ్ఞానార్జనవైపు మరల్చిన, విశుద్ధబుద్ధి, అహంకారాది వికారములను మరి ప్రదర్శించదు.

188. అనాదికాలో‚య మహంస్వభావో
జీవ స్సమస్త వ్యవహారవోఢా
కరోతి కర్మాణ్యను పూర్వవాసనః
పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని॥
అజ్ఞానము అనాదియైన ప్రకృతి జనితము. అందువలన, పురుషుడు (జీవి) దేహారంభమునుండి, ఈ దేహేంద్రియములతో కూడుకొనిన దేహమే నేను అనే అహంభావ స్వభావముతో ప్రవర్తించుట సర్వసామాన్యము. పూర్వ వాసనలను అనుసరించి, పుణ్యఫలమునిచ్చే పుణ్యకర్మలను, పాప ఫలమునిచ్చే పాపకర్మలను ఆచరిస్తూ, యావజ్జీవితమూ తన అభిమతము ప్రకారము వ్యక్తి వ్యవహరించును. అందుచేత, విజ్ఞానమయ కోశము ద్వారా పొందిన కర్మఫలితమునూ, దేహధారుడే(విజ్ఞానమయ కోశముతో ఉన్న కారణంగా) అనుభవించును.
189. భుంక్తే విచిత్రాస్వపి యోనిషు వ్రజ
న్నాయాతి నిర్యాత్యధ ఊర్ధ్వమేషః
అస్యైవ విజ్ఞానమయస్య జాగ్ర
త్స్వప్నాద్యవస్థాః సుఖదుఃఖభోగః॥
దేహధారుడు తను చేసిన కర్మలననుసరించి ప్రాప్తించిన జన్మకై విచిత్రములైన యోనులను ఆశ్రయించి ఏదో రూపములో అనగా, దేవ తిర్యక్ మనుష్య పశు పక్షివృక్షాది దేహములతో, పుట్టుక జరుగుతుంది. పుణ్యకర్మ ఫలితంగా ఊర్ధ్వలోకములో దేవయోని విశేషముగల గంధర్వాది జన్మనో, ఇహలోకంలో ఐశ్వర్యవంతుల సంతానముగానో, లేక దుష్కర్మ ఫలితంగా హీన జన్మనో, లేక నిషిద్ధకర్మల ఫలితంగా తిర్యగ్, స్థాణువాది జైన్ననా లభించవచ్చు. సుఖభోగముకొరకు స్వర్గాది ఊర్ధ్వలోకములందు మరియు దుఃఖభోగముకొరకు నరకాది అధోలోకములందు జీవుని భ్రమణ, సంసారబంధమును ఛేదించుకునే వరకు కొనసాగును. విజ్ఞానమయ కోశము, పూర్వవాసనలననుసరించి దేహారంభమునుండి వస్తున్నది. అందువలన, అది సంసార బంధమునకు హేతువుగా పరిగణింపబడుతున్నది.
190. దేహాది నిష్ఠాశ్రమ ధర్మకర్మ గుణాభిమానః సతతం మమేతి
విజ్ఞానకోశో‚ యమతిప్రకాశః ప్రకృష్టసాన్నిధ్యవశాత్పరాత్మనః
అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధీః సంసరతి భ్రమేణ॥
విజ్ఞాన మయకోశము ఆత్మస్థానమునకు అతి సమీపములో నిర్మితమై ఉన్నది. అందువలన, స్వతఃసిద్ధముగా ప్రకాశించే ఆత్మ తేజశ్శక్తివలన విజ్ఞానమయకోశము, ప్రతిబింబరూపములో అత్యంత ప్రకాశవంతవౌను. దేహపరమైన గృహస్థాది ఆశ్రమ ధర్మములలోను, సమస్తకర్మలలోను అత్యంత అభిమానముతో విజ్ఞానమయ కోశము వ్యవహరించును. ఆత్మకు ఉపాధిగా పరిగణించబడుతున్న ఈ కోశము, ‘నేను-నాది’అనే అహంకార పూరిత ప్రవృత్తిని, మనోబుద్ధ్యాదులద్వారా వికారరూపమైన అపోహలను కల్గిస్తున్న కారణంగా, సంసారబంధమునకు విజ్ఞానమయకోశము కారణమని ప్రస్తావించబడుచున్నది.
191. యో‚యం విజ్ఞానమయః ప్రాణేషు హృది
స్ఫురత్స్యయం జ్యోతిః
కూటస్థస్సన్నాత్మా కర్తా భోక్తా భవత్యుపాధిస్థ.॥
పరపూర్ణ జ్ఞాన స్వరూపమైన ఆత్మ హృదయస్థానంలో అంతరేంద్రియముల సమీపములో ఉన్నది. కూటస్థమైన ప్రత్యగాత్మ స్వయం జ్యోతిస్స్వరూపము. నిత్యము ఒకే పరిమాణములో ఒకే రీతిలో, ఉండే ఆత్మ వికార రహితము. అంతేకాదు, ఉపాధివశంగా దేహాన్ని ఆశ్రయించినా, ఆత్మ స్వతంత్రప్రవృత్తి కలది. ఇంద్రియములవలె అది ప్రాణముపై ఆధారపడదు. మీదుమిక్కిలి, సకలేంద్రియ వ్యవహారమునకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తున్నది.
- ఇంకావుంది...