మెయిన్ ఫీచర్

తాదాత్మ్య దోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
విజ్ఞానమునకు మూలమైన కోశమునకు అతి సమీపములో ఉన్న కారణంగా, బుద్ధిద్వారా జరిగే సమస్త కార్యముల కర్తృత్వభోక్తృత్వములు ఆత్మపై ఆపాదింపబడుతున్నవి. ఆత్మ నిర్వికారి మరియు నిష్క్రియి. అందువలన, కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మకు చెందవు. కర్తగా దేహధారుడే తత్ఫలమును అనుభవించును.
192. స్వయం పరిచ్ఛేదము పేత్య బుద్ధేః
తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః
సర్వాత్మకః సన్నపి వీక్షతే స్వయం
స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ॥
బుద్ధి యథార్థతను గ్రహించలేకపోవుట చేత, కేవలం తాదాత్మ్య దోషమువలననే, శరీరము ఆత్మగా భావించబడుతున్నది. ఈ భేదదృష్టి స్వకపోలకల్పితము; యదార్థము కాదు. మృణ్మయమైన ఘటాదులు ఏ రూపంలో తయారైనా వాటిలోనున్న పదార్థము మృత్ (మట్టి) తప్ప తద్వ్యతిరిక్తము కాదు. అదే విధముగా జీవాత్మ, సద్రూపమైన పరమాత్మాంశము, తద్భిన్నము కాదు. అయినా, అజ్ఞానావస్థలో సర్వాత్మకతాభావనలేని కారణంగా, నేను-నీవు అనే భేదబుద్ధితోను, సర్వజ్ఞుడైన పరమాత్మ వేరు తాను వేరనే ద్వంద్వ భావనను కల్పించుకొని, అజ్ఞాన దశలో మనిషి వ్యవహరించును.
193. ఉపాధి సంబన్ధవశాత్పరాత్మా
ప్యుపాధిధర్మాననుభాతి తద్గుణః
అయోవికారా నవికారివహ్నివత్
సదైక రూపో‚ పి పరః స్వభావాత్‌॥
అగ్నికి ఎట్టి అకార వికారములు లేకపోయినా, కొలిమిలో మండుతున్న ఇనుప వస్తువుల ఆకార వికారములకు అనుగుణముగా అగ్నిలో వాటి వికార రూపములు ప్రకటితవౌతున్నవి. అదే విధంగా, నిత్యముక్త సచ్చిదానంద ప్రజ్ఞాన ఘనస్వరూపమైన పరమాత్మ స్వరూపమే జీవాత్మ. ఏ విధమైన వికారములు లేనిది. కాని, శరీరములో విజ్ఞానమయ కోశమునకు అతిచేరువలో ఉపాధివశమున ఉన్న కారణంగా, ఆ కోశ గుణములను పొందుతూ, అవిద్య రూపమైన అహంభావము బుద్ధిలో ప్రకటితవౌతున్నది. అందువలన, బుద్ధిననుసరిస్తూ వచ్చిచేరిన దేహధర్మములు, మరియు దేహసంబంధిత కర్తృత్వభోక్తృత్వాది గుణములు వికారశూన్యమైన ఆత్మపై, అజ్ఞానదశలో ఆపాదింపబడుతున్నవి.
మోక్షప్రాప్తికి మార్గమేది?
శిష్య ఉవాచ
194. భ్రమేణాష్యన్యథా వా‚స్త జీవభావః పరాత్మనః
తదుపాధేరనాదిత్వా న్నానాదేర్నాశ ఇష్యతే॥
గురువర్య! పరమాత్మ క్షయరహితము, ఆద్యంతములేనిది కదా! జీవత్వము మాయవలన, భ్రాంతివలన కల్గినా లేక వాస్తవముగా ఉన్ననూ, జీవాత్మకు ఉపాధియైన విజ్ఞానమయకోశములో అనాదినుండి వస్తున్న అవిద్య సర్వదా ఉన్నప్పుడు, మరి అజ్ఞాన నాశనము ఎట్లు జరుగుతుంది? అనాదియైన దేనికీ క్షయము అంగీకరింపబడదు కదా?
195. అతో‚ స్య జీవభావో‚ పి నిత్యోభవతి సంసృతిః
న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీ గురో వద॥
ఉపాధికొరకు జీవాత్మ ఈ శరీరమును ఆశ్రయించగా జీవత్వము సిద్ధిస్తున్నది. ఉపాధిలోనున్న అవిద్య అనాదైనప్పుడు జీవత్వము, అవిద్య కూడ శాశ్వతముగానే ఉండవలె కదా? అనాదిగా ఉన్నవి నాశనమగుట అసంభవము. తత్కారణముగా సంసారబంధము అంతములేక కొనసాగవలసినదే. ఇది సత్యమైన మరి నాకు మోక్షము ఎట్లు లభించునో మానవీయ గురువర్య! నాకు తెలియజేయుము.

ఆత్మజ్ఞానమే మోక్షోపాయము
శ్రీ గురురువాచ
196. సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తచ్ఛృణు
ప్రామాణికీ న భవతి భ్రాన్త్యా మోహిత కల్పనా॥
ఓ తెలివైన శిష్యా! నీవు మంచి ప్రశ్ననే అడిగితివి. దీని సమాధానమును జాగ్రత్తగా వినుము. జ్ఞానాభావముతో మోహితుడైనప్పుడు, కల్పితబుద్ధివలన ఉత్పన్నమైన భ్రాంతి ఎన్నడూ సత్యము కాదు. యథార్థతను తెలిసికొనిన అజ్ఞానరూపమైన భ్రాంతి అంతవౌను. ప్రకృతి జనితమైన దేహమునకు నిత్యత్వము లేదు. నిత్యత్వములేని బుద్ధిద్వారా కల్గిన మోహము, భ్రాంతి, నిత్యమని భావించుట తగదు.
197. భ్రాన్తిం వినా త్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః
న ఘటేతార్థసంబన్ధో నభసో నీలతాదివత్‌॥
ఆకాశము స్వచ్ఛమైనది. దానిని ఎటువంటి పదార్థములూ కలుషితము చేయజాలవు. కాని, యథార్థమును తెలిసికొనలేక ఆకాశమునకు నీలపీతత్వాది గుణములున్నట్లు అపోహ కల్గుతున్నది కదా!. అదే విధముగా, సంగరహితము, క్రియా రహితము, ఆకార రహితమైనది జీవాత్మ, అజ్ఞానముచే దేహమే ఆత్మ అనే దేహాత్మభావన, దేహముపై మోహమువలనే కల్గుతున్నది. అనేక వికారములకు నిలయమైన శరీరమునకు, ఆత్మ లక్షణములేవియూ లేవు. కాని, అజ్ఞానులు భ్రాంతిమూలముగ ఆత్మపై దేహగుణములను ఆపాదించి వ్యవహరించడము జరుగుతున్నది.
198. స్వస్య ద్రష్టు ర్నిర్గుణ స్యాక్రియస్య
ప్రత్యగ్బోధానన్దరూపస్య బుద్ధేః
భ్రాన్త్యా ప్రాప్తో జీవభావో స త్యో
మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్‌॥
సాక్షిగా వ్యవహరించే ఆత్మ, గుణాతీతము, క్రియారహితము. అంతరాళములో విరాజిల్లే పరిపూర్ణ జ్ఞానానంద స్వరూపమైన ఆత్మకు, జీవభావము, సాన్నిధ్యములో ఉన్న బుద్ధితో తాదాత్మ్యము చెందుతున్న కారణంగా, భ్రాంతి రూపములో ప్రాప్తిస్తున్నది.
- ఇంకావుంది...