మెయిన్ ఫీచర్

తెర’గని అందాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మ్ ఇండస్ట్రీలో-
హీరోల స్టామినా వేరు. కెరీర్‌ని సుదీర్ఘంగా కొనసాగించొచ్చు. హీరోయిన్లు -సుదీర్ఘ స్క్రీన్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం తక్కువ. తళుక్కుమనడం. నిలబడితే కొంతకాలం కాంతులీనడం. మహా అయితే దశాబ్దంపాటు స్టార్ స్టాటస్‌ను ఆనందించటం. కెరీర్ వేగం నెమ్మదించగానే -పెళ్లి చేసుకుని తెరకు దూరమవ్వడం. కొంతకాలం గ్యాప్ తీసుకుని -రీ ఎంట్రీ అంటూ స్క్రీన్‌కు మళ్లీ రావడం. ఇది చాలాకాలంగా చూస్తున్నదే. నిజానికి -హీరోయిన్‌గా తొలి సినిమా చేయడం చాన్స్. సీనియర్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం స్టాటస్. ఇదీ టాలీవుడ్‌లో కనిపిస్తోన్న హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్.
**
ఒకప్పుడు -స్క్రీన్‌పై మళ్లీ మోజు పుట్టినపుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీనియర్ హీరోయిన్లు ప్రయత్నించేవారు. ఇప్పుడు -క్యారెక్టర్లను పుట్టించు సీనియర్ హీరోయిన్లను ఒప్పిస్తున్నారు. ఒకప్పటి అందగత్తెలకు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో -ఓ హోదాతోనే తెరకు రావడాన్ని చూస్తున్నాం. సంక్రాంతికొచ్చిన పెద్ద, మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటే -విజయశాంతి, టబు, సుహాసిని, సంగీతలాంటి సీనియర్లు అలా వచ్చినవాళ్లే. తాజాగా ప్రభాస్ జాన్ చిత్రంలో అలనాటి అందగత్తె భాగ్యశ్రీ అమ్మ పాత్రలో కనిపించనుంది. అంటే టాలీవుడ్‌లో రీ ఎంట్రీల సీజన్ మొదలైందన్న మాట.
**
సినిమా అంటేనే గ్లామర్. దానికి పెర్ఫార్మెన్స్ తోడైతే, వాళ్లకందే స్టేటస్ వేరు. వాళ్లకోసమే చాన్స్‌లు పుడుతుంటాయి. స్టార్ ఇమేజ్ వస్తే -మూడు షిఫ్టులు పరుగే. ఒక్క తెలుగులోనే కాదు -కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అవకాశాలు తలుపు తడుతుంటే కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక చావాలి. పొద్దునే్న ముంబైలో షూటింగ్. మధ్యాహ్నం హైదరాబాద్‌లో. సాయంత్రానికి తమిళనాడు మహాబలిపురంలో. ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు అన్నంత బిజీ లైఫ్‌ని గడుపుతున్న సీనియర్ హీరోయిన్లూ ఉన్నారు.
కొందరు కథానాయికలు వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడ్డాక మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్‌తో కెమెరాముందుకొస్తోన్న సందర్భాలు కోకొల్లలు. కొందరు సినిమాకే అందం తెస్తుంటే, ఇంకొదరు గుంపులో గోవిందగా నటించి వెళ్లిపోతున్నారు. తాజాగా చిత్ర దర్శకులే తెరచాటుకెళ్లిన అలనాటి హీరోయిన్లను వెతికి పట్టుకుని పాత్రలు పుట్టించి చిత్రాల్లో నటించడానికి ఒప్పిస్తున్న పరిస్థితులు లేకపోలేదు. డిమాండ్‌వున్న సీనియర్ హీరోయిన్లను పాత్రలకు ఒప్పించటం అనేది ఫస్ట్ గ్రేడ్‌గా చూస్తున్నారు. అలాకాకుండా -పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పర్సనల్ లైఫ్‌లో ఫ్రీ అయిపోయాను కనుక నటించడానికి రెడీ అంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు సెకెండ్ గ్రేడ్‌గా పరిగణించబడుతున్నారు. ఏదేమైతేనేం సీనియర్ హీరోయిన్లు -అందమైన తల్లులు, అక్కలు, వదినల పాత్రల్లోనే కాదు కథా సంబంధమైన ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తుండటం చూస్తున్నాం. సంక్రాంతికొచ్చిన మూడు చిత్రాల్లో ముగ్గురు అలనాటి కథానాయికలు రీ ఎంట్రీ ఇచ్చారు. మహేష్‌బాబు హీరోగా వచ్చిన ‘సరిలేని నీకెవ్వరు’ చిత్రంలో లేడీ అమితాబ్‌గా జాతీయ అవార్డు అందుకున్న నటి విజయశాంతి ఓ ముఖ్య పాత్ర చేశారు. 13 ఏళ్ల తరువాత తెలుగు తెరపై ఆమె తళుక్కుమన్నారు. వందేమాతరం, ప్రతిఘటన, నవభారతం, రేపటిపౌరులు, దేవాలయం, ఒసే రాములమ్మ చిత్రాలతో అగ్రనటిగా పేరుపొందిన విజయశాంతి -మహేష్ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా తన స్టామినాను చూపించారు. గతంలో ఆమె చేసిన విప్లవాత్మక నేపథ్యమున్న పాత్రే ఇందులోనూ వైవిధ్యంగా చేయడంతో పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విజయంతో విజయశాంతికి మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు పుష్కలం. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో టబు రీ ఎంట్రీ ఇచ్చారు. కూలీ నెం 1 చిత్రంతో గ్లామర్ స్టార్‌గా ఎదిగిన టబు -తరువాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడా కీర్తి పతాకం ఎగురవేశారు. తాజా రీ ఎంట్రీలో ఆమెకు సరైన సీన్స్ లేకపోవడంతో పాత్ర తేలిపోయింది. డబ్బింగ్ కూడా సరిగా కుదరలేదు. ఈ చిత్రం హిట్ అయినా టబుకు మరికొన్ని అవకాశాలు రావడం ఓరకంగా అదృష్టమే అనుకోవాలి. ఒకే ఒక్క అవకాశం ప్లీజ్ అన్న డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. సంగీతలో వున్న కామెడీ టైమింగ్ మరోసారి హైలెటైంది. చివరికి ఆమె టైమింగ్‌కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే చివరి సీన్‌లోనూ ఆమె చేత డైలాగు చెప్పించారు. ఓ రకంగా విజయశాంతికి ఎంత ప్రాధాన్యత వున్నదో కనిపించకుండా సంగీతకు అంతే ప్రాధాన్యత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దక్కింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సంక్రాంతి రేసులో వచ్చిన ఎంత మంచివాడవురా చిత్రంలో నటి సుహాసిని కనిపించి ప్రేక్షకులకు కనువిందుచేశారు. మంగమ్మగారి మనవడు చిత్రంనుండి మంచి నటిగా పేరుతెచ్చుకున్న సుహాసిని ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్ తల్లిగా అలనాటి ప్రేమపావురాలు బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ జాన్ చిత్రంలో కనిపించబోతోంది. ఇంద్రజ అంటేనే యమలీల గురొస్తుంది. ‘నీ జీను పాంటు చూసి పిల్లోడా’ అన్నపాట వింటేనే ఇంద్రజ ఇమేజ్ ఏంటో తెలుస్తుంది. అటువంటి ఇంద్రజ రీ ఎంట్రీలో శతమానం భవతి చిత్రంతోపాటుగా ఇటీవల విడుదలైన సాఫ్ట్‌వేర్ సుధీర్‌లో అందమైన అమ్మ పాత్రలో ఇమిడిపోయింది. ‘నా మొగుడు నాకే సొంతం’ అంటూ జయసుధతో సమానమైన పాత్రను పోటాపోటీగా నటించిన వాణీ విశ్వనాధ్ కూడా ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 30ఏళ్ల తరువాత నటి కాంచన అర్జున్‌రెడ్డి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి చిత్ర విజయానికి తోడ్పడింది. నాని హీరోగా వచ్చిన ఎంసిఏ చిత్రంలో భూమిక చావ్లా ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ చిత్రంలో నటించినందుకుగాను భూమికకు బెస్ట్ సపోర్టు యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అలనాటి అందాల నాయిక జమున కూడా చాలా రోజుల తరువాత అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రంతో ప్రేక్షకులముందుకు రావడం తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్నిస్తోంది. ఖుష్బూ స్టాలిన్‌తో, మీనా వెంకటేష్‌తో కలిసి దృశ్యంలో, రాశి కల్యాణవైభోగం చిత్రంతో, పెద్దరికం నాయిక సుకన్య మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంతో, అంతకుముందు ఆ తరువాత, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలలో అలనాటి నటి రోజా ఫేం మధుభాల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇపుడు లైలా, నగ్మా, రంభ, నిరోషా లాంటివారు కూడా రీఎంట్రీకి తహతహలాడుతున్నారు. చివరగా చెప్పొచ్చేదేంటంటే, గతంలో అద్భుతమైన ఇమేజ్ తెచ్చుకున్న కథానాయికలు ఇపుడు అందమైన అమ్మలుగా తెరపై ప్రత్యక్షమవుతుండడం తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తున్న మాట నిజమే. కానీ వారు ఎంచుకుంటున్న పాత్రలు మాత్రం సరైన పంథాలో సాగక అనామకంగా మిగిలిపోవడం బాధాకరం. మరొక సినిమా వారి ఖాతాలోకి రాకపోతే ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చిన చిత్రం సరైన ఎంట్రీ కాదనే అర్థం. అందమైన అమ్మలకి మోడల్‌గా ఇపుడు నటి నదియా నిలిచిపోయారు. అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా నటించినా ఆ తరువాత దృశ్యంలో ఆమె పాత్ర మరోసారి తెరపై మెరిసింది. అలాంటి పాత్రలు వరించినప్పుడే సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ కెమెరా ముందుకు వచ్చినా హీరోయిన్లకు డిమాండ్ వుంటుంది. ఏదో చిన్న పాత్రయినా వస్తే చాలు అనుకుంటే మాత్రం ఇక్కడ వున్న పోటీకి, గ్లామర్‌తో మిసమిసలాడే మాజీ హీరోయిన్ల హవాకి తట్టుకోవడం చాలా కష్టం. అందుకే కొంచెం లేట్ అయినా మంచి పాత్రలతో ప్రేక్షకులకు ముందుకు వస్తే నాలుగు కాలాలపాటు తెలుగు తెరను మరోసారి ఏలవచ్చు!
*