మెయిన్ ఫీచర్

సంకల్పంతో ఏదైనా సాధ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేళ్ల వయస్సులోనే రెండు కాళ్లూ పోలియో బారిన పడ్డాయి. కానీ ఏమాత్రమూ వెనకడుగు వేయలేదు. మొక్కవోని దీక్షతో ముందుకే సాగింది. ఫలితంగా అంతర్జాతీయ వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా మారింది. అంతేకాదు.. జాతీయ స్థాయిలో టెన్నిస్ కూడా ఆడుతోంది. వివరాల్లోకి వెళితే..
మహిళలంటే బలహీనులని అందరూ అనుకుంటూ ఉంటారు. దివ్యాంగులను ఏ ఉపయోగమూ లేనివారిగా భావిస్తుంటారు. ఇలా ఎప్పుడూ ఆలోచించకూడదు అంటోంది గీతాచౌహాన్. ఈమె అంతర్జాతీయ వీల్‌చెయిర్ బాస్కెట్ బాల్ ప్లేయర్. జాతీయస్థాయిలో టెన్నిస్ కూడా ఆడుతుంది. గీతా చౌహాన్‌కు ఆరు సంవత్సరాల వయసులో పోలియో వచ్చింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. చిన్నవయస్సులోనే ఆ సమస్యతో జీవించడం అంత సులభం కాదు. అందుకే ఆమె ప్రయాణం చాలా కష్టంగా సాగింది. సాధారణ జీవితంలోనే కాదు.. చాలా స్కూళ్లలో గీతకు అడ్మిషన్ ఇవ్వలేదు. పైగా గీతను చులకనగా చూసేవారు. చాలామంది గీతతో పాటు కూర్చునేందుకు ఇష్టపడేవారు కాదు. ఆమెను తాకితే ఏదో అవుతుందని వాళ్లు, వాళ్ల తల్లిదండ్రులు భయపడేవారు. ఆమె నాన్నకు గీత బయటకు వెళ్లడం, చదవడం ఇష్టం ఉండేది కాదు. దానితో గీత ఇంట్లోనే ఉండాలని కోరుకునేది. బయటకు వెళితే వారి చేష్టలు గుర్తుకువచ్చి భయపడిపోయేది. కానీ గీతకు చదువుకోవాలని ఉండేది. అందుకే ముందడుగే వేయాలనుకుంది. ఎంత కష్టమైనా జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంది. అందుకు గీత తల్లి, సోదరి ఆమెకు చాలా సాయపడ్డారు. అప్పటి నుంచి కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకుంది గీత.
ఒకసారి అనుకోకుండా గీత ఇళ్లు విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కుటుంబానికి దూరంగా ఐదారు సంవత్సరాలు ఉంది. ఆ సమయంలో బాగా కుంగిపోయింది. ఆ కుంగుబాటు నుంచి బయట పడటానికి ఆమె స్నేహితులు ఆమెకు బాగా సహాయపడ్డారు. ఆ సమయంలోనే దివ్యాంగులకు కూడా క్రీడలు ఉన్నాయని కొందరు గీతతో చెప్పారు. ఆమెకు అది ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఆ దిశగా ఆలోచనలు చేసింది. అప్పుడు మొదలుపెట్టింది గీత ఆటలు ఆడటం.. అయితే అది అంత సులభం కాలేదు. ప్రాక్టీసుపై బాగా శ్రద్ధ పెట్టాలి. చాలా చాలా కష్టపడాలి. ముఖ్యంగా శరీర భాగాలు, భుజాలు, మోకాళ్లు బలంగా ఉండాలి. ఆడేటప్పుడు నడుంనొప్పి ఎక్కువగా వస్తూంటుంది. వెనె్నముక చాలా బలంగా ఉండాలి. ఆట ఆడుతూ పడితే.. లేపడానికి ఎవరూ రారు. వారికి వారే లేవాలి. రెఫరీ అనుమతినిచ్చే వరకూ కోచ్ కూడా లోపలికి రాకూడదు. ఆ భయాన్ని పోగొట్టుకునేందుకు చాలా ప్రాక్టీసు చేయాలి.. ఇలాంటి కష్టాలన్నింటినీ పట్టుదలతో, సంకల్పంతో దాటేసింది గీత. అందుకే పడితే ఆమెకు ఆమే లేస్తుంది. ఇందుకు మిగతా ప్లేయర్స్ ఆసరాను తీసుకుంటుంది. ఇలా విజయం వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ.. నేడు అంతర్జాతీయ వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఆడేస్థాయికి వెళ్లిపోయింది గీత. ఒకప్పుడు ఆమెకు సరైన గౌరవం లభించేది కాదు. ఇప్పుడందరూ ఆమెను గౌరవిస్తున్నారు. అంతకుముందు ఆమె ఆడే ఆటల పట్ల కుటుంబం అంత ప్రాధాన్యం ఇచ్చేది కాదు. ఈ ఆటను ఏదో పనికిరాని పనిలా భావించేవారు. కానీ ఇప్పుడు గీతకు వచ్చిన పేరు ప్రతిష్టలు చూస్తుంటే అది చాలా గొప్పదని వారికి అర్థమైంది. దీనితో గీతకు తాను ఏదైనా సాధించగలను అనే పట్టుదల పెరిగింది. ‘ఇంకొంచెం సహకారం అందిస్తే చాలు.. మరిన్ని విజయాలను మూటకట్టుకుంటాను’ అని చెబుతోంది గీత.
ఇప్పుడు ఆమె టోర్నీ ఆడి ఇంటికి వెళితే చాలు.. ఆమె ఇద్దరు మేనకోడళ్లు ఆమె చుట్టూ చేరి.. ‘అత్తా! ఏం మెడల్స్ తీసుకొచ్చావో చూపించు. మేము కూడా నీలాగే ఆడి.. బోలెడు మెడల్స్ తెచ్చుకుంటాము.. నీలాగే ఆడిన ప్రతిసారీ మెడల్స్‌ను గెలుచుకుంటాము’ అని చెబుతుంటారు. ఇలా వారు చెబుతున్నప్పుడు గీత ఆనందంతో ఉప్పొంగిపోతుంటుంది. తాను మరొకరికి స్ఫూర్తిగా మారానన్న సంతోషంలో ఆమె కళ్లల్లో ప్రతిఫలిస్తుంటుంది. ఎందుకంటే ఆమెకు చిన్నప్పుడు ఆడుకునే అవకాశం లేదు. ఇప్పుడు వచ్చింది. ఆ లోటు ఈ ఆటలతో తీరిపోయింది. ఆడటానికి వచ్చినప్పుడు ఆమెకు సమస్యలేవీ కనిపించవు. ఒత్తిడి, కుంగుబాటు, ఆర్థిక ఇబ్బందులు ఏవీ.. కనిపించవు. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు ఆమెకు కూడా ఆట మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆటను ఆస్వాదిస్తూ ఆడుతుంది. ‘ఇకముందు కూడా ఇలాగే.. పట్టుదలతో ఇంకాస్త మెరుగ్గా ఆడతాను. పారా ఒలంపిక్స్‌లో ఆడి గెలవాలనేది నా జీవితాశయం’ అని చెబుతోంది గీత. ఆమె అనుకున్నది సాధించి పారా ఒలంపిక్స్‌లో ఆడి భారతదేశానికి మరింత పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ గీత.

-మహి