మెయన్ ఫీచర్

నిర్భయ దోషులకు ఉరి ఎప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకీ నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా ? ఇపుడు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారంతో పాటు తీవ్రమైన, నేరాలకు పాల్పడిన హంతకులను ఈ దేశం క్షమిస్తుందా? ఒక కేసులో ఉన్న నిందితులు అందరికీ శిక్షను ఒకేమారు అమలుచేయాలా? లేక వేర్వేరుగా శిక్షను అమలు చేయవచ్చా? ఇదో చర్చనీయాంశంగా మారింది.
నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలులో జాప్యం తగదని, తొందరగా అమలుచేయాలని దేశవ్యాప్తంగా ఒకే మాట వినిపిస్తోంది. దిశ హంతకులకు వేసిన ‘ఎన్‌కౌంటర్’ శిక్షనే విధించి ఉంటే ఇంత వరకూ వచ్చేది కాదు కదా అనేదే అందరి అభిప్రాయం. దేశ ప్రజల సహనాన్ని నిర్భయ హంతకులు పరీక్షిస్తున్నారని స్వయంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఒకసారి సుప్రీంకోర్టు దోషులు అందరికీ శిక్షను ఖరారు చేసిన తర్వాత వారి విడివిడిగా విక్షను విధంచడానికి సైతం ఎలాంటి అడ్డంకులూ లేవని, ఉరి శిక్షను వాయిదా వేయగల ఏకైక అవకాశం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ వేయడం ద్వారా మాత్రమే సాధ్యమని సోలిసిటర్ జనరల్ వాదించారు. క్షమాభిక్ష తిరస్కారానికి గురైన తర్వాత మరేదైనా అప్పీలు లేదా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నా దోషులను, సహదోషులను ఉరితీయవచ్చని జైలు నిబంధనలు చెబుతున్నాయి. దోషులు అంతా దళితులు, వారిని తప్పుడు కేసులో ఇరికించారని, ముఖేష్‌సింగ్, రాం సింగ్ ఇద్దరూ దళితులేనని వారిద్దరూ క్షమాభిక్ష పెట్టుకోకపోవడం వారి తప్పుకాదని న్యాయవాది రెబెకా జాన్ వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టులోనూ, ఢిల్లీ హైకోర్టులోనూ ఉరి శిక్ష అమలుకు కాలపరిమితి ఉండాలని, అంతకు మించి దోషులకు చివరి క్షణం వరకూ అవకాశం కల్పిస్తూ పోతే అసలు చట్టంపై దురభిప్రాయం కలుగుతుందని కేంద్రప్రభుత్వం చెబుతోంది. అంటే నిర్భయ హంతకులను ఉరి తీయాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది.
ఉరిశిక్ష అమలును తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలనూ అనే్వషిస్తున్న హంతకులు ఉద్ధేశ్యపూర్వకంగానే ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరుగా క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడం, అది కాస్తా తిరస్కారానికి గురైన తర్వాత సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు వేయడం, దానినీ తిరస్కరించిన తర్వాత రాష్టప్రతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కారాన్ని సవాలు చేయడం దానిపైనా సుప్రీంకోర్టు స్పష్టమైన ధోరణితో ఉండటంతో ఉరిశిక్షలను ఖరారు చేసిన ఢిల్లీ హైకోర్టులో సరికొత్త ఆరోపణలను సంథించడం ఇదంతా పక్కా ప్రణాళికగానే కనిపిస్తోంది.
ఉరి శిక్ష అమలు కాబోతున్న సమయంలో దోషులను చివరి కోరిక గురించి అడిగినపుడు వారి నుండి ఎలాంటి సమాధానం లేకపోగా, నర్మగర్భంగా వ్యవహరించడం చూసినపుడే జైలు అధికారులు వీరేదో వ్యూహంతో ఉన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు. దేశంలో ఇంత వరకూ ఏ నిందితులపైనా చేయనంత ఖర్చును తిహార్ జైలు అధికారులు వీరికోసం వెచ్చిస్తున్నారు. జైలులో వీరికి కాపలా కాయడానికి దోషుల భాష అర్థం కాని పోలీసులు ఎంపిక చేసి కంటికి రెప్పలా భద్రత కల్పిస్తున్నారు. ఏ దశలోనైనా నిందితులు ఏ రకమైన ఆత్మహత్యలకు తెగబడి ఉరినుండి తప్పించుకున్నట్టయితే మిగిలిన నిందితులకు సరికొత్త అస్త్రం ఇచ్చినట్టవుతుంది.
2012 డిసెంబర్ 16వ తేదీన సాకేత్‌లోని పీవీఆర్ సెలక్ట్ సిటీ వాక్‌లో సినిమా చేసిన 23 ఏళ్ల (నిర్భయ) యువతి తన స్నేహితుడితో కలిసి సినిమా ముగియగానే మునిర్కా బస్టాండ్‌కు చేరుకుని ద్వారక నుండి పాలం రోడ్డుకు వెళ్తున్న బస్సు ఎక్కింది. ముందు ఆమె స్నేహితుడ్ని బస్సులో నుండి తోసేసిన దోషులు ఆ బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి చెప్పలేని రీతిలో వేధించి, హింసించి, గాయపరచి బస్సులో నుండి మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద తోసేసారు. నిర్భయ స్నేహితుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చి రక్షించమని అరుస్తున్నపుడు అటుగా వెళ్తున్న రాజ్‌కుమార్ అనే మొబైల్ సెక్యూరిటీ పోలీసు గమనించి వారిని రక్షించి చావు బతుకుల మధ్య వారిని చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ రష్మీ అహుజా తొలి అత్యవసర వైద్య సాయం అందించారు. 2012 డిసెంబర్ 17వ తేదీన వసంతవిహార్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 120 బీ సెక్షన్ కింద కేసు నమోదైంది. దోషులపై ఐపీసీ 365,366, 376(2)(జీ), 377, 307, 302, 396, 395 రెడ్ విత్ 397, 201, 412 సెక్షన్ల కింద సబ్ ఇనస్పెక్టర్ ప్రతిభా శర్మ కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 21న మెజిస్ట్రేట్ ఉషా చతుర్వేది మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అదే నెల 25వ తేదీన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పవన్‌కుమార్ మరోమారు నిర్భయ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రోజురోజుకూ నిర్భయ ఆరోగ్యం విషమించడంతో డిసెంబర్ 27వ తేదీన సింగపూర్‌లోని వౌంట్ ఎలిజిబెత్ ఆస్పత్రికి తరలించారు. 29వ తేదీన అదే ఆస్పత్రిలో మరణించింది.
దాంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఆక్రోషంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. కేసును తొలి దశలో ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్ధ లూత్ర ఒక సవాలుగా తీసుకుని ఎలాంటి న్యాయపరమైన లొసుగులు లేకుండా దోషులకు ఉరిశిక్ష పడేలా కృషి చేశారు. దోషుల తరఫున ఎంఎల్ శర్మ, ఏపీ సింగ్‌లు వాదనలు వినిపించారు. దోషుల పిటిషన్ల( 607, 608 / 2017, ఎస్‌ఎల్‌పీ 3119, 3120 / 2014 )ను విచారించిన సుప్రీంకోర్టు 429 పేజీల తీర్పును వెలువరించింది. అందులో అన్ని అంశాలనూ ప్రస్తావించడమేగాక, దోషులకు మరణశిక్ష ఏ విధంగా సరైందో కూడా వివరించింది. ఇంత జరిగాక కూడా ఇంకా న్యాయ అవకాశాలను దోషులు వెతుక్కుంటూనే ఉన్నారు. సమీప భవిష్యత్‌లో వారికి ఉరి శిక్ష పడే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే వారిప్పట్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీ హైకోర్టు మరో మారు డెత్ వారెంట్లు జారీ చేసిన తర్వాతనే దానిని సవాలు చేసేందుకు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఆ డెత్ వారెంట్లపై మరోమారు రాష్టప్రతి క్షమాభిక్షను కోరే అవకాశం ఉంటుంది. ఇదంతా న్యాయసమీక్షలో ఉన్న సాంకేతిక లోపం. ఆ లోపాన్ని సమర్థంగా వారు ఉపయోగించుకుంటున్నారు. నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో రాంసింగ్ జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి జైలు నుండి ఇప్పటికే విడుదలయ్యాడు. మిగిలిన వారు నలుగురు. అందులో ముఖేష్ కుమార్(32), అక్షయ్ సింగ్(31) , వినయ్ శర్మ(26), పవన్ గుప్త(25) అలియాస్ కాలూ ఉన్నారు. వీరికి ట్రయిల్ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. 2017 మే 5వ తేదీన నిర్భయ కేసు అత్యంత అరుదైన కేసుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దోషులకు ఉరి శిక్షే సరైనదిగా తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఉరి ఖరారు చేసిన నాటి నుండి దోషుల డ్రామాలు మొదలయ్యాయి. దాదాపు రెండేళ్ల పాటు వౌనంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేయలేదు. క్యూరేటివ్ పిటిషన్లు వేయలేదు. రాష్టప్రతికి క్షమాభిక్ష కోరలేదు. దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి కోరేంత వరకూ వారంతా వౌనంగానే ఉన్నారు. ఆశాదేవి పిటిషన్‌తో ఉరి శిక్ష అమలు వ్యవహారంలో కదలిక రావడంతో దోషులు తమ కుతంత్రాలకు తెరతీశారు. జనవరి 7వ తేదీన పాటియాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఆదేశించింది. దాంతో ఆఘమేఘాల మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌లు దాఖలు చేశారు. మరో పక్క రాష్టప్రతిని క్షమాభిక్ష కోరారు. ఆ మార్గాలు అన్నీ మూసుకుపోవడంతో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియతో జనవరి 22న ఉరిశిక్ష అమలు కాలేదు. మరోమారు పాటియాల కోర్టు ఫిబ్రవరి 1వ తేదీ ఏడు గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. దాంతో ఒకరి తర్వాత ఒకరుగా నిర్భయ దోషుల పిటిషన్ల పరంపర మొదలైంది. ఇక చేసేది లేక ఢిల్లీ కోర్టు ఉరితీతను తాత్కాలికంగా నిలిపివేస్తూ జనవరి 31న ఆదేశాలు ఇచ్చింది. ముఖేష్ సింగ్‌కు న్యాయపరంగా అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి తిరస్కరించారు. ఈ నిర్ణయం వెలువడగానే అక్షయ్‌సింగ్ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. నాలుగోదోషి పవన్‌గుప్త వ్యూహాత్మకంగానే ఇంత వరకూ న్యాయపరంగా ఎలాంటి అవకాశాలనూ వినియోగించుకోలేదు. అతనికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం, రాష్టప్రతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం, క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. దోషుల వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పట్లో వారు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేసేలా కనిపించడం లేదు, ఎందుకంటే వారికి ఇప్పట్లో ఉరిశిక్ష అమలయ్యే అవకాశాలూ కనిపించడం లేదు. మళ్లీ డెత్ వారెంట్లు జారీ అయ్యేది ఎపుడో ఎవరికీ తెలియదు. డెత్ వారెంట్లు జారీ కాగానే మళ్లీ వరుసగా పిటిషన్లు దాఖలు కావడం ఖాయం. మరో పక్క ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తున్నారు. పాటియాల కోర్టు ఉరిశిక్షలపై స్టే విధించడంపై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. దోషులకు ఉరి శిక్ష అమలు కావడంలో జాప్యం చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని ఆయన వాదించారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురూ దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిర్భయపై ఈ నలుగురూ అమానవీయంగా వ్యవహరించిన దారుణపై దేశం దిగ్భ్రాంతికి గురైందని పవన్ గుప్త ఇంత వరకూ క్యూరేటివ్ పిటిషన్ లేదా క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని, ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకే ఇలా చేస్తున్నారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వేసిన పిటిషన్‌పై దోషుల తరఫున ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ మరణ శిక్ష విధించిన తర్వాత ఉరి శిక్ష అమలుకు సుప్రీంకోర్టు కానీ, రాజ్యాంగం కానీ ఎలాంటి గడువునూ నిర్దేశించలేవని స్పష్టం చేశారు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారికి సైతం మానవ హక్కులు ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈవ్యవస్థపై ఉంటుందని న్యాయవాది దోషుల తరఫున వాదించారు. ఈ విషయంలో న్యాయస్థానం ప్రజల ఒత్తిడికి ఎందుకు గురవుతున్నాయో, ఎందుకు తొందరపడుతున్నాయో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.
దేశంలో గత నాలుగేళ్లుగా ఒక్క ఉరి శిక్ష కూడా అమలు కాలేదు. అంత మాత్రాన ఉరిశిక్ష విధించడం ఆగలేదు. చివరి సారిగా యాకుబ్ మెమెన్, అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, ధనంజయ్ చటర్జీలకు భారత్‌లో ఉరి తీశారు. 1991 తర్వాత దేశంలో 16 మందిని ఉరితీశారు. ధనుంజయ్ చటర్జీని 2004 ఆగస్టు 14న కోల్‌కటాలోని అలిపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌ను 2012 నవంబర్ 21 యరవాడ జైలులో ఉరితీశారు. మహమ్మద్ అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9 వ తేదీన తిహార్ జైలులో ఉరితీశారు. యాకుబ్ మెమెన్‌కు 2015 జూలై 30న నాగ్‌పూర్ జైలులో ఉరితీశారు. దేశంలో ఉరిశిక్ష కేసులను 371 మంది ఎదుర్కొంటున్నారు. వీరందరికీ తాము చేసిన తప్పులకు ఉరిశిక్ష పడినా, వివిధ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఈ కేసుల్లో ఒకటి 1991 నాటిది. అంటే 29 సంవత్సరాలుగా ఆ పోరు కొనసాగుతోందని అర్థం. తాజాగా తెలంగాణలో సమత కేసులో ముగ్గురు దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిర్భయ ఘటన తర్వాత మహిళా చట్టాలను పటిష్టం చేశారు. 2018 ఏప్రిల్ 21వ తేదీన తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో 12 ఏళ్ల చిన్నారులపై అత్యాచారం కేసుల్లో నేరుగా ఉరిశిక్ష విధించే వీలు కలిగింది. అయినా ఘటనలు ఆగడం లేదు. చట్టాన్ని మరింత పటిష్టం చేసి, ఉరిశిక్షను అమలు చేయడంపై దృష్టి సారించాలా? లేక మహిళలపై దాడులు నిలిచిపోయేలా సమాజాన్ని జాగృతం చేయాలా? ఏది ముందు జరగాలి??

- బీవీ ప్రసాద్ 9963345056