మెయిన్ ఫీచర్

ఏరీ.. ఆ హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్ ఇండియా సినిమా -బాహుబలి.
ఈ సినిమాలో జక్కన్న ఓ అద్భుతమైన సన్నివేశాన్ని రూపొందించాడు -విలన్ ఎంత బలవంతుడో చూపించడానికి. కండలు తిరిగిన బల్లాల దేవుడు బాగా బలిసిన ‘మొహంజదారో’ను వట్టి చేతులతో ఎదుర్కోవాలి. దర్శకుడు ఏం సీనేశాడ్రా బాబూ అనిపిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకునేలా సీన్ తీశాడు. కాకపోతే -గ్రాఫిక్స్ ఎద్దు సీన్‌లోని ఫీల్‌ని చంపేసింది.
-కొనే్నళ్లు వెనక్కెళదాం.
టాలీవుడ్‌లో చక్కటి క్లాసిక్ -దేవత.
ఈ సినిమాలో దర్శకుడు హేమాంబరధర రావు మర్చిపోలేని భావోద్వేగ సన్నివేశాన్ని రూపొందించాడు -ఆడియన్స్ కళ్లు చెమ్మగిల్లేలా. సినిమాకు ప్రాణం పోసిన కథానాయకి సావిత్రి చనిపోతుంది. తన తల్లి (యజమాని) ఇక్కడే చనిపోయిందని గిరిగీసి మరీ చూపిస్తూ తల్లడిల్లుతుంది ఓ శునకం. కథానాయకుడు ఎన్టీఆర్ కదిలిపోతాడు. ఆయనతోపాటు ఆడియన్సూ కళ్లనీళ్లు పెట్టుకుంటారు. సీన్ ఓక ఎత్తయితే -ఆ శునకం కళ్లలోని ఎక్స్‌ప్రెషన్ మరో ఎత్తు. ఆడియన్స్ ఇక్కడే పడిపోయారు. ఆ సీన్‌లో ప్రాణం ఉంటుంది. అందుక్కారణం -ఆ శునకం గ్రాఫిక్స్ కాదు. మనతో, మనిషితో పెరిగే జీవి.
*
కారణాలు ఏమైనా కావొచ్చు.. తోటి ప్రాణుల్ని పాత్రలు చేసుకునే సినిమాలు తెలుగులో కనుమరుగయ్యాయి. అలాంటి కథాంశాన్ని ఎత్తుకున్నా అనేకానేక నియమ నిబంధనల మధ్య -ప్రాణుల్ని పాత్రల్ని చేయడంకంటే గ్రాఫిక్స్‌ని స్క్రీన్‌కెక్కించటం సులువైపోయింది. కాకపోతే -అలాంటి సన్నివేశాల్లో అలాంటలాంటి కథల్లో జీవం ఉండటం లేదంతే. చట్టాలకంటే, తోటి ప్రాణుల్ని గౌరవిస్తూ వాటినీ మనిషితో సమానంగా పాత్రల్ని చేసి సమాన స్థాయిని ఇచ్చింది టాలీవుడ్ ఒకప్పుడు. ఇప్పుడు చట్టాలకు భయపడి.. వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో -మనిషితో సమానమైన స్థాయిని తీసేసి వాటిని ‘మూగ జీవులు.. జంతువులు’ అన్న హోదాకు పరిమితం చేసే పరిస్థితి వచ్చింది టాలీవుడ్‌కి. ‘చట్టాన్ని గౌరవించాలి’ అన్న ఉద్దేశాన్ని మనసునుంచి తీసేయకుండానే -మనతో.. మనిషితో బతికే తోటి ప్రాణులనూ బిగ్ స్క్రీన్‌కు దూరం చేయకూడదన్న ఆలోచన ఎందుకు చేయకూడదు.
****
తెలుగు సినిమా అంటేనే ప్రేమమయం. ముఖ్యంగా ప్రియురాలు, ప్రియుడు మధ్య సాగే కథలే కొన్నిలక్షలు దాటిపోయాయి. ఏ కథలోనైనా కామన్ థ్రెడ్ ఇదే.
అందుకు భిన్నంగా అప్పుడప్పుడూ -మూగజీవుల వేదన, లేదా వాటి చిలిపి చేష్టల ఆధారంగా మనిషితో మరో ప్రాణికుండే ప్రేమను చూపించే కథలూ టాలీవుడ్‌లో వచ్చాయి. అవన్నీ గతంలో అద్భుతంగా తెరపై పండిన కథలే. ఇపుడు మాత్రం ఇటువంటి కథలను ఎత్తుకోవాలంటే -సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. అప్పటి చిత్రాల్లో ఆయా దర్శక నిర్మాతలు వారికి నచ్చిన జీవ కారుణ్య కథల్ని తీసుకొని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. అవన్నీ చూసిన ప్రేక్షకులు తమ ఇళ్లలోనూ మూగ ప్రాణుల్ని పెంచుకొని ఆయా సినిమాలపై అభిమానాన్ని చూపించారు. కానీ ఇపుడు అటువంటి పరిస్థితి లేదు. జంతువులను చూపాల్సివస్తే అనేక కారణాలు చూపాలి. ఆయా మూగ ప్రాణులపై ఎటువంటి హింస షూటింగుల్లో జరగకూడదన్న భారత ప్రభుత్వ నిబంధన సమర్థించదగిందే. అయితే, ఈ నిబంధన కారణంగా పెంపుడు ప్రాణుల్ని తెరపై చూపించే కథలు దూరమైపోయాయి. తద్వారా నేటి తరానికి జీవకారుణ్యానికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలుగానీ, భావనలుగానీ లేకుండా పోతున్నాయి. అందుకే -ఇప్పటితరం వీడియో గేమ్స్‌లో డిజిటల్ జంతువులతో ఆడుకుంటూ అసలు ప్రేమ ఫీలవ్వలేకపోతున్నారు.
బి విఠలాచార్య తన ప్రతి చిత్రంలో ఏదోక పెంపుడు ప్రాణినో, వన్యప్రాణినో చూపించేవారు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో పాములు నాట్యం చేస్తాయి. విలన్ల భరతం పడతాయి. హీరోలకు సహాయపడతాయి. అలా ఎలుగులు, పులులు, జింకలు, ఏనుగులు- ఇవన్నీ ఆయా కథలను నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించినవే. ఇక్కడ చాలాచోట్ల వినిపించే చిన్న సినిమాటిక్ విషయం తమాషాకు చెప్పుకుందాం. బి విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారట. కొన్నాళ్లు షూటింగ్ చేశాక, కాల్షీట్ల ఇబ్బందితో ఎన్టీఆర్ మరో సినిమాకు వెళ్లిపోయారు. ఒకసారి తనను కలిసి విఠలాచార్య అసిసెంట్‌తో -ఏమయ్యా, మీ సినిమా మిగతా షూటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు?’ అని. దానికి ఆ అసిస్టెంట్ ‘మీమీద షూట్ చేసే పార్టేదీ లేదండి’ అన్నాడట. ఎన్టీఆర్ ఆశ్చర్యపోయి ‘అదేంటి?’ అని ప్రశ్నిస్తే.. ఆ అసిస్టెంట్ ‘మీ పాత్రను మా గురువు చిలక చేసేశారు. క్లైమాక్స్‌లోనే మళ్లీ హీరోగా మారుతుంది. ఇప్పటికే తీసుకున్న రషెస్‌లో ఏదోకటి పెట్టి మ్యానేజ్ చేద్దామన్నారు’ అన్నాడట. దీంతో ఎన్టీఆర్ అవాక్కయ్యారట. ఇది నిజమో, పుట్టించిన కథనమో తెలీదుకానీ, ఈ చర్చలో ‘చిలుక’కున్న ప్రాధాన్యతను గుర్తెరగాలి. అంజిగాడు (బాలకృష్ణ) ఎన్ని చిత్రాల్లో ఎలుగుబంటి బారిన పడి హాస్యాన్ని పండించలేదు. చదలవాడ కుటుంబరావు మరెన్ని సినిమాల్లో గాడిద, గుర్రాలతో తన్నులు తినలేదు. అవన్నీ హాస్యంకోసమే. సెంటిమెంట్ సీన్స్‌లోనూ మూగప్రాణులు అద్భుత పాత్రలే పోషించాయి. రాముడు-్భముడు చిత్రంలో అమాయకుడైన రాముడికి ఓ శునకమే ధైర్యంగా నిలబడుతుంది. ‘రామూ గెలుపు నీదే’ చిత్రంలో కుక్కకీ, విలన్‌కి యాక్షన్ ఎపిసోడే ఉంటుంది. విలన్ ఎత్తుల్ని తుత్తునియలు చేసి హీరోకి సహాయపడుతుంది శుకనం రాము. అందుకే -రామూ గెలుపునీదే టైటిల్ పెట్టేశారు. ‘కాడెద్దులు ఎకరం నేల’ చిత్రంలో కాడెద్దుల నటన మరువలేనిది. ఇక సావిత్రి, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు కాంబోలో వచ్చిన ‘నమ్మినబంటు’ చిత్రంలో రాముడు భీముడుగా నటించిన ఎద్దుల నటన మర్చిపోలేం. చెంగు చెంగున గంతులు వేయండి, ఓ జాజివనె్న బుజ్జాయిల్లారా.. నోరులేని తువ్వాయిల్లారా అన్న పాటలో సావిత్రితోపాటు చెంగుచెంగున ఎగిరే రెండు లేగ దూడల్ని ఎవరైనా మర్చిపోతారా?
ఆత్మబంధువు, ఖైదీ కన్నయ్య, రాము చిత్రాల్లో నటించిన శునకం నటన ఎంత అద్భుతం. స్వర్ణమంజరి చిత్రంలో ఓ చింపాంజీకి ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమాలో నటింపజేశారు. కథానాయిక అడవులపాలైతే, ఒడిలోని బిడ్డని అక్కున చేర్చుకొని పాలుపట్టి, వన్యమృగాల బారిన పడకుండా కాపాడే సన్నివేశంలో చింపాంజీ నటన నటీనటులకన్నా అద్భుతం. జింబో చిత్రం అంతా అడవిలోనే షూటింగ్. దాంతో అడవిలోవున్న జంతువులన్నీ చక్కగా నటించి చూపుతాయి. గురువును మించిన శిష్యుడు చిత్రంలో దేవలోకం నుంచి దిగివచ్చిన అశ్వం అంటూ సాగే పాటలో నటించిన గుర్రాన్ని మరువలేం. ఆడబ్రతుకు చిత్రం క్లైమాక్స్‌లో భూకంపం వచ్చి కథానాయకుడు రాళ్లలో ఇరుక్కుపోతాడు. నాయిక దేవిక తన భర్తకోసం వెదుకుతుంటుంది. ఆమె పెంపుడు కుక్కే కథానాయకుడు ఎక్కడ వున్నాడో వాసనపట్టి తీసుకెళ్తుంది. తోడు-నీడ చిత్రంలో కథను మలుపుతిప్పే పాత్ర ఎద్దుదే. అలాగే కృష్ణ నటించిన ‘దేవుడులాంటి మనిషి’ చిత్రంలోనూ ఇదే సీన్ ఇలాగే సాగి కథానాయికలిద్దరూ చనిపోతారు. ఆ తరువాతే మరో కథ మొదలవుతుంది.
జంతువులంటే ఇక్కడ దైవాంశవున్న జీవులుగా చిత్రీకరించిన కథలు కూడా వున్నాయి. ఉదాహరణకు పాము నేపథ్యంగా రూపొందించిన అనేక చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు భక్తిని దర్శింపజేశాయి. ముఖ్యంగా నోము, దేవతాలారా దీవించండి, నాగమోహిని చిత్రాల్లో ఆయా సర్పాలు దైవాంశతో వున్నాయని చూపించడంతో అదొక కేటగిరిలా కన్పిస్తుంది. యమలోకపు గూఢచారి చిత్రంలో కథానాయకుడిని యమభటులు పొరపాటున తీసుకెళ్తారు. మళ్లీ హీరో భూమీదకు రావాలంటే జరగరాని నష్టం జరిగిపోయింది. ఇక తప్పదన్నట్టు కథానాయకుణ్ణి ఓ శునకంగా మార్చి భూమీదకు పంపుతారు. ఈ సినిమా మొత్తం ఆ మూగజీవి నటనతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. శ్రీప్రియ, మురళీమోహన్ నటించిన ‘పొట్టేలు పున్నమ్మ’ చిత్రాన్ని దేవర్ ఫిలింస్ రూపొందించింది. దేవర్ ఫిలింస్ అంటేనే మొత్తం సినిమాలన్నీ ఏదోక వన్యప్రాణితో తీసేవారు. దానికి తగ్గ అద్భుతమైన కథా వుండేది. అడవిరాముడు చిత్రంలో కాళి అనే ఏనుగు -కథకు కీలకం. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘అమ్మ ఎవరికైనా అమ్మ’లో టైటిల్ రోల్ ఏనుగుదే. శ్రీరామబంటు చిత్రంలో ఆంజనేయుడికి ప్రతిరూపంగా కోతి నటించింది. నల్లత్రాచు చిత్రం ఒకే గదిలో నల్లత్రాచు ఎక్కడుందో తెలియక, ఎప్పుడు కాటేస్తుందో తెలియక చావుకోసం ఎదురుచూసే నలుగురి కథనాన్ని తీసుకుని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. శే్వతనాగు చిత్రాన్ని సౌందర్య అద్భుత నటనకన్నా పాము కోసమే చూశారు. డాన్సర్ అనూరాధ తొలిసారిగా కథానాయికగా నటించిన పంచకల్యాణి చిత్రంలో టైటిల్ రోల్ గాడిదది. ఆ చిత్రంలో గాడిద ప్రేక్షకులకు కళ్లనీళ్లు పెట్టిస్తుంది. అంత అద్భుతంగా జంతువులచేత నటింపజేశారు. ఇపుడు ఏ జంతువైనా సరే గ్రాఫిక్స్‌లో కన్పిస్తుంది. గ్రాఫిక్స్ అనగానే వాటికి ఎటువంటి హావభావాలుండవు. దీంతో ఆ పాత్రలు స్క్రీన్‌పై తేలిపోతున్నాయి. ప్రేక్షకులకు మైండ్‌లో రిజిష్టర్‌కాని పాత్రలుగా మిగిలిపోతున్నాయి. దీంతో ఇప్పటి సినిమాలు చూసే యువతరానికి ఆయా జంతువుల గొప్పదనం తెలీని పరిస్థితి ఎదురవుతోంది. ఆమధ్య శివాజీ గణేశన్ మనవడితో ‘గజరాజు’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కోసం వన్యప్రాణి పరిరక్షణకు సంబంధించిన అనుమతి పత్రం తీసుకొని షూటింగ్ చేశారట. ఈ నేపథ్యంలో ఇప్పటితరానికి ఆయా వన్యప్రాణుల నటన కూడా చూపాలంటే ఆయా కథల గురించి ఓ బోర్డు ఏర్పాటు చేసి, వారికి కథా కథనాలు వివరించాలి. షూటింగ్‌లో బోర్డు తరఫునుంచి కొందరు సభ్యులువచ్చి వన్యప్రాణులపై ఎటువంటి హింస జరగకుండా చూడాలి. ఆ ప్రకారంగా ఇప్పటి చిత్రాల్లో గ్రాఫిక్స్ బొమ్మలు కాకుండా నిజమైన జంతువులను ఉపయోగించి చిత్రాలను రూపొందిస్తే నేటి తరానికి ఆయా జంతువుల భావోద్వేగాల నటనను చూపించవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సినిమా లవర్స్ ఆశ.

-జి రాజేశ్వరరావు