మెయన్ ఫీచర్

రిజర్వేషన్ ప్రాథమిక హక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పబ్లిక్ సర్వీసు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు ఇవ్వకూడదంటూ 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సవాలు చేస్తూ అక్కడి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. అయితే ఏ వర్గానికైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే అందుకు తగ్గ సమాచారాన్ని సేకరించే వీలుందని పేర్కొంది. ఉద్యోగాల నియామకాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనని, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే అందుకు తగ్గ సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలని, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని కూడా పేర్కొంది. అంటే పరోక్షంగా ఎలాంటి ఆధారం లేకుండా రిజర్వేషన్లు కల్పించరాదని సుస్పష్టం చేసింది.
శతాబ్దాలుగా అణచివేత, పీడనలో మగ్గిపోయిన భారతదేశంలోని కొన్ని వర్గాల సామాజికాభివృద్ధికి వివిధ అంశాల్లో సమాన అవకాశాలను అందించడానికి రిజర్వేషన్లు రూపొందించారు. అపుడే స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు గడచినా ఇంకా ఆయా వర్గాలు అనుకున్నంతగా అభివృద్ధి సమాజంలో మమేకం కాలేకపోయారనే భావనతో కేవలం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లకే పరిమిత కాకుండా పదోన్నతుల్లోనూ, రాజకీయ పదవుల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ వారికి రిజర్వేషన్లను కల్పించారు. ఆయా వర్గాలు ఎన్నో శతాబ్దాలుగా ఎదుర్కొన్న చారిత్రాత్మక అణచివేత, అసమానతలను, వివక్ష నుండి బయటపడి సమాజంలో తాము సైతం అందరితో సమానమేనని, సమాజంలో ఎలాంటి వివక్ష లేదని గుర్తించేలా వారి ఆర్ధిక, సామాజిక స్థితిని పెంచే ఈ ప్రత్యేక కార్యక్రమం ఎంతో దూరదృష్టితో ప్రారంభించారు.
నిజానికి బ్రిటిష్ భారతదేవంలో అనేక ప్రాంతాల్లో స్వాతంత్య్రానికి పూర్వం కూడా కొన్ని కులాలు, ఇతర వర్గాలకు అనుకూలంగా కొన్ని కోటాలు ఉన్నాయి. వివిధ రకాల సానుకూల వివక్ష కోసం ప్రజల నుండి డిమాండ్లు వచ్చేవి కూడా.
1882 , 1891లో కొల్హాపూర్ మహరాజు సాహులకు బ్రాహ్మనేతరులకు, వెనుకబడిన వర్గాల వారికీ రిజచర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902 నాటికి అనేక వర్గాల ప్రజలకు అవి వర్తించాయి. అందరికీ ఉచిత విద్యను అందించాడు, హాస్టళ్లను ప్రారంభించాడు. అదే విధంగా విద్యావంతులకు తగిన ఉపాధి లభించేలా చూశాడు. వర్గరహిత సమాజం ఏర్పాటు కావాలని, అంటరానితనాన్ని రూపుమాపాలని ఆయన కోరుకునేవాడు. ఈ క్రమంలో 50 శాతం వరకూ వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు.
1921 సెప్టెంబర్ 16న మొదటి జస్టిస్ పార్టీ ప్రభుత్వం తమ రిజర్వేషన్లను ఆమోదించింది. ఈ మేరకు జీవో 613ను జారీ చేసింది. తద్వారా భారత శాసనసభలో రిజర్వేషన్ల ద్వారా ఎన్నికకు శ్రీకారం చుట్టిన మొదటి సంస్థగా జస్టిస్ పార్టీ అవతరించింది. అప్పటి నుండి రిజర్వేషన్లు కావాలనో, వద్దనో శాసించే చరిత్ర మొదలైంది. రిజర్వేషన్లను కల్పించడం కూడా ఒక ప్రామాణికంగా మారిపోయింది.
బ్రిటిష్ రాజ్ 1909 నాటి భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వేషన్ అంశాలను చేర్చారు. స్వాతంత్య్రం సిద్ధించడానికి ముందే రిజర్వేషన్ల అమలుకు చర్యలు చేపట్టారు. 1932 జూన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కీలక నిర్ణయాన్ని చేసింది. బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డోనాల్డ్ మత పురస్కారాలను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్స్‌కు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలనేది ఆ ప్రతిపాదన. యురోపియన్లు, అణగారిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు అనుగుణంగా నియోజకవర్గాల నుండి ఎన్నికల ద్వారా భర్తీ చేయడానికి అనేక సీట్లను కేటాయించారు. అందులో వారు మాత్రమే ఓటు వేసే నిబంధన చేర్చారు. అంతే కాదు, వారు ఇతర సీట్లలో కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈ ప్రతిపాదన చాలా వివాదాస్పదం అయ్యింది. దీనికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ బీఆర్ అంబేద్కర్ సహా అనేక మంది ఈ నిర్ణయాన్ని సమర్ధించారు, ఆచరించారు. చర్చల తర్వాత మహాత్మాగాంధీ, అంబేద్కర్‌లు ఒక అవగాహన ఒప్పందానికి కూడా వచ్చారు. పూనా ఒప్పందం ప్రకారం దళితులకు సీట్లు కేటాయింపు జరిగింది.
1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు 1980 తర్వాత ఒబీసీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంది. 2019లో ఆర్థికంగా నిరుపేదలకు సైతం రిజర్వేషన్లను కల్పించింది. కులవివక్షను నిషేధించిన రాజ్యాంగం ఆ దిశగా తీసుకున్న అనేక చర్యల్లో భాగంగా 1954లో విద్యా మంత్రిత్వశాఖ వారికి విద్యాసంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లను కల్పించింది. 1982లో ప్రభుత్వ రంగం, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, 7.5 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితిని అంచనా వేయడానికి మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1979లో ఈ తరహా ముఖ్యమైన మార్పు ప్రారంభం అయింది. కమిషన్ వద్ద ఒబీసీ లెక్కలు లేకపోవడంతో 1931 నాటి జనాభా లెక్కల డేటాను ఉపయోగించి తమ నివేదికను రూపొందించింది. తద్వారా ఈ వర్గాలు జనాభాలో 52 శాతం ఉన్నట్టు గణించారు. ప్రభుత్వం ఒబీసీలకు 27 శాతం కోటాను అమలచేయాలని 1980లో తమ నివేదికను అందజేసింది. అయితే ఇది రాష్ట్రాల్లో అమలులోకి వచ్చినా, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలులోకి రాలేదు. 2019లో ప్రభుత్వం ఈ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడం మొదలుపెట్టింది.
భారత రాజ్యాంగం పౌరులు అందరికీ సమానత్వపు హక్కును కల్పించింది. ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొంటూనే ఆర్టికల్ 15లో కుల, మత, లింగ వివక్షకు తావుండరాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 16లో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్టికల్ 15 క్లాజ్ -4లో ఈ అధికరణం కింద లేదా 29వ అధికరణంలోని క్లాజు (2)లో ఏం పేర్కొన్నా, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు లేదా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారి అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం జారీ చేయవచ్చు. ఈ నాలుగో క్లాజును 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
రాజ్యాంగంలోని 46వ అధికరణం బలహీనవర్గాల విద్యా ఆర్ధికాభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని పేర్కొంది. ఈ క్లాజు కారణంగా షెడ్యూల్డు కులాలు, తెగల వారిని సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీ నుండి కాపాడుతుంది. ఈక్రమంలోనే అనేక వాదనలు, వివాదాలు జరిగాయి.
1992లో సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. 50 శాతం మించితే రాజ్యాంగం పేర్కొన్న సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్టవుతుందని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒబీసీ, ఈబీసీలకు కల్పించిన రిజర్వేషన్లుతో ఆ హద్దును దాటిపోయింది. కొన్ని రాష్ట్రాలు కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాయి. తమిళనాడులో కుల ఆధారిత రిజర్వేషన్లు 69 శాతం వరకూ ఉన్నాయి.
భారత ప్రభుత్వం, పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థల్లో ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఇంద్రసాహ్నీ కేసులో సుప్రీంకోర్టు 1993లో తీర్పు చెబుతూ ఇది రాజ్యాంగ విరుద్ధమేనని, అయితే ఐదేళ్ల పాటు మాత్రమే ఈ రిజర్వేషన్లను కొనసాగించాలని ఆదేశించింది. 1995లో ఎస్సీ ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించడానికి వీలుగా ఆర్టికల్ 16ను సవరిస్తూ అధికరణం 16లో 4ఏను చేరుస్తూ రాజ్యాంగంలో 77వ సవరణ చేశారు. రిజర్వేషన్ ద్వారా పదోన్నతి పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పర్యావసానంగా సీనియారిటీ ప్రయోజనాన్ని అందించడానికి 85వ రాజ్యాంగ సవరణతో మరింత నవీకరించారు. రిజర్వు చేసిన ఖాళీల బ్యాక్‌లాగ్ సమూహంగా పరిగణించి వాటిని భర్తీ చేయడానికి రాజ్యాంగంలో 81వ సవరణ చేశారు. దీనికి 50 శాతం పరిధి అనేది వర్తించకుండా చూశారు. రాజ్యాంగంలో 82వ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల్లో రాయితీలు కల్పించారు. ఈ నాలుగు రాజ్యాంగ సవరణల చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎం. నాగరాజు- ఇతరులు, వెర్సస్ కేంద్రప్రభుత్వం పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 2006లో ఈ సవరణలను సమర్థించింది. కానీ సంబంధిత అంశంలో ప్రతిసారీ బలవంతపు కారణాలను ఆయా ప్రభుత్వాలు సమర్థించుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 2007లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉటంకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే 2012లో ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. కుల ప్రాతిపదికన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి అవసరమైన డేటాను ఇవ్వడంలో ఆ ప్రభుత్వం విఫలం కావడంతో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. డేటాను సేకరించమని తాము ఆదేశించలేమని, అయితే రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాలు అందుకు సరిపడా డాటాను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది. తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012 సెప్టెంబర్ 5వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కేసులోనూ అదే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక మంది హైకోర్టుకు వెళ్తే ఆ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 2019లో తిరిగి సమీక్షించినపుడు హైకోర్టు తన తీర్పును సరిదిద్దుకుంది. ఆ సమయంలో హైకోర్టు ఒక ఆదేశం ఇస్తూ, రిజర్వేషన్ నిరాకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం రావడానికి కారణం ఏమిటో దాని సహేతుకత ఏమిటో స్పష్టం చేయాలని పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4), 16(4ఏ) ప్రకారం ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌లు కల్పిస్తే పొందాలే తప్ప, అది ప్రాథమిక హక్కు మాత్రం కాదని తెలిపింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, పీఎస్ నరసింహ వాదించారు. డేటా లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఎస్సీ, ఎస్టీల తరఫున కపిల్ సిబాల్, దుష్యంత్ దవే, కొల్ని గోంజాల్వెజ్‌లు వాదించారు. ఇందిరాసహాని కేసులో గానీ, నాగరాజు, అజిత్‌సింగ్, జర్నయిల్ సింగ్ కేసరల్లో కానీ తీర్పులు పరిశీలించినపుడు రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ధర్మాసనాలు ఉత్తర్వులు ఇవ్వలేదనేది స్పష్టమవుతుంది. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన పనే్లదని, తప్పనిసరి రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనని రాష్ట్రాలను ఆదేశిస్తూ తాము మాండమస్ రిట్ జారీ చేయలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఏ రాజేంద్రన్ వర్సస్ సురేష్ చాంద్ గౌతమ్ కేసు తీర్పు దీనికి ప్రాతిపదిక అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు వెలువడిన వెంటనే దీనిపై కేంద్ర ప్రభుత్వం, మరోపక్క వివిధ రాష్ట్రాలు సవాలుచేసేందుకు సిద్ధమయ్యాయి. ఏ రూపంలోనైనా అట్టడుగు వర్గాల పక్షాన ప్రభుత్వాలు నిలవాల్సిందే.

- బీవీ ప్రసాద్ 9963345056