సంపాదకీయం

అవినీతి ‘పిల్లి’కి గంట?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలలో పోటీచేసే తమ అభ్యర్థుల నేరప్రవర్తనకు సంబంధించిన వివరాలను విపులంగా ప్రచారం చేయాలని రాజకీయ పక్షాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం హర్షణీయం. ఈ ‘నేర ప్రవర్తన’ అభియోగాల సమగ్ర సమాచారాన్ని ఆయా రాజకీయ పక్షాలవారు స్థానిక, జాతీయ వార్తాపత్రికలలో ప్రచురింప చేయాలని, సామాజిక మాధ్యమాలలో నిక్షిప్తం చేయాలని సర్వోన్నత న్యాయమూర్తులు గురువారం ఆదేశించడం ‘అనైతిక ప్రవర్తన’పై మరో ‘పిడుగు’. ఒక రాజకీయ పార్టీ ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన నలబయి ఎనిమిది గంటలలోగా ఈ ‘నేర ప్రవర్తన’ వివరాలను ఆ రాజకీయ పార్టీ ప్రచారం చేయాలన్నది సర్వోన్నత న్యాయాదేశం... ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థుల నేరప్రవృత్తిని మాత్రమే ప్రచారం చేయడం ఇంతవరకు మన రాజకీయ పక్షాల ఎన్నికల ‘విలాసం’- ఫ్యాషన్-! ఇప్పుడు ప్రతి రాజకీయ పక్షం తన సొంత అభ్యర్థుల నేర ప్రవర్తనను మతప్రదాతల- వోటర్‌లు-కు వివరించవలసి రావడం ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనకు దోహదం చేయగల వినూతన నైతిక పరిణామం! ప్రతి రాజకీయ పక్షం ఈ ‘నేర ప్రవర్తన’ వివరాలను తమ సంస్థ అంతర్జాల- వెబ్‌సైట్-వ్యవస్థలో పొందుపరచడం తప్పనిసరి... అందువల్ల చైతన్యవంతులైన మతప్రదాతలు వివిధ పక్షాల అభ్యర్థుల గుణగణాలతోపాటు ఈ నేర ప్రవృత్తిని సైతం కూలంకషంగా అధ్యయనం చేసిన తరువాతనే తమ ప్రదానం చేయడానికి వీలుకలుగుతుంది. ప్రస్తుతం పార్లమెంటుకు, రాష్ట్రాల చట్టసభలకు ఎన్నిక అయి ఉన్న ప్రజాప్రతినిధులలో దాదాపు మూడవ వంతు వివిధ రకాల నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు, అభియోగాలు దాఖలయి ఉండడం ఈ సర్వోన్నత న్యాయాదేశాన్ని అనివార్యంచేసిన కఠోర వాస్తవం! ఇలా నేరప్రవర్తనకు పాల్పడినట్టు ఆరోపణలకు, అభియోగాలకు గురిఅయిన రాజకీయవేత్తలను దశాబ్దుల క్రితం రాజకీయ పక్షాలు చట్టసభల ఎన్నికలకు అభ్యర్థులుగా ఎంపిక చేయకపోవడం చరిత్ర. ఇలా ఆరోపణలకు, అభియోగాలకు గురిఅయిన రాజకీయవేత్తలు తమంత తాముగా ఎన్నికల పోటీనుంచి తప్పుకోవడం కూడ చరిత్ర! తమ నిర్దోషిత్వం న్యాయస్థానాలలో నిగ్గుతేలిన తరువాత మాత్రమే వారు మళ్లీ ఎన్నికలలో పోటీచేయడానికి సిద్ధపడేవారు! క్రమంగా కథ మారిపోయింది! ఆరోపణలను, అభియోగాలను రాజకీయవేత్తలు పట్టించుకోవడం మానేశారు. నేరస్థుడని న్యాయస్థానంలో ధ్రువపడిన తరువాత, ‘ఎన్నికల సాధికార సంఘం’-ఎలక్షన్ కమిషన్-వారు బహిష్కరించే వరకు నేరప్రవృత్తికల రాజకీయవాదులు ‘ప్రతినిధుల’ పదవులకు పోటీపడుతూనే ఉండడం నడుస్తున్న చరిత్ర...
ఈ నేర రాజకీయాలను నిర్మూలించడానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రమేయం కల్పించుకొనడం ఇది మొదటిసారి కాదు. అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానం వివిధ ఆదేశాలనివ్వడం చరిత్ర! కానీ ‘అవినీతి రాజకీయం’, ‘నేర రాజకీయం’ ‘‘బోసి మెడ పిల్లి’’వలె విశృంఖల విహారం చేస్తూనే ఉంది! ‘బోసి మెడ పిల్లి’ మెడలో గంటకట్టలేని ‘ఎలుకల సమూహం’వలెనే రాజకీయాలను నిరోధించలేని ‘రాజ్యాంగ వ్యవస్థ’ చతికిలపడి ఉండడం నడుస్తున్న చరిత్ర... అందువల్ల ‘పిల్లి’-నేరమయ రాజకీయం- నిర్భయంగా నిర్లజ్జగా తను ‘బోసి మెడ’ను ప్రదర్శిస్తూ విహరిస్తూనే ఉన్నది... మరిన్ని పిల్లలను పెడుతూనే ఉంది! రాజకీయవేత్తలు నేరాలకు పాల్పడడం పట్ల ‘మత ప్రదాతలు’ సైతం పెద్దగా పట్టించుకొనకపోవడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ స్వచ్ఛతను భంగపరుస్తున్న విపరిణామ క్రమం... ‘‘అందరూ అవినీతిపరులే, అందరూ హంతక ప్రవృత్తికలవారే... అందువల్ల నైతికతను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎవరికీ వోటువేయలేము!’’ అని అనేక లోక్‌సభ, శాసనసభా నియోజకవర్గాలలోని మత ప్రదాతలు వాపోతున్నారన్నది బహిరంగ రహస్యం! కానీ ‘‘ఎవరూ మంచివారు లేనప్పుడు’’ అందరినీ తిరస్కరించడానికి ఇప్పుడు వీలుంది. ‘‘ఈ అభ్యర్థులలో ఎవరినీ ఎన్నుకోవడం లేదు’’- నన్ ఆఫ్ ది అబవ్- ఎన్‌ఓటిఏ- నోటా- అని ప్రకటించడానికి సైతం మతప్రదాతల- వోటర్ల-కు ఇప్పుడు వీలుంది! అయినప్పటికీ దాదాపు మూడవ వంతు లోక్‌సభా, శాసనసభా నియోజకవర్గాలలో ‘నేర ప్రవర్తకులు’ ఎన్నికవుతున్నారు... నేర ప్రవర్థకులు ఎవరు??
అభ్యర్థులు మాత్రమేకాదు మత ప్రదాతలలోని అధిక శాతం సైతం ‘అనైతికత’తో ప్రభావితం అవుతున్నారు. డబ్బిచ్చి నేరగ్రస్తులు మతాంకాల- వోట్ల-ను కొంటున్నారు. అమ్ముతున్నవారు కూడ ఎన్నికల అక్రమాలలో సమాన భాగస్వాములు! ఇందుకు కారణం సమాజ సమష్టి పతనం... పతనానికి కారణం మన విద్యావిధానం బుద్ధిని పెంచుతోంది, పరిజ్ఞానాన్ని పెంచుతోంది, హృదయాన్ని సంస్కారాలతో నింపడం లేదు, న్యాయాన్యాయ విచక్షణ పట్ల ధ్యాసను పెంచడం లేదు. ఫలితంగా సంస్కారం సౌశీల్యం లేని విద్యావంతులు అన్ని రంగాలలోకి చొఱబడుతున్నారు, రాజకీయ రంగంలోకి కూడ ఈ చొఱబాటు కొనసాగుతోంది. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతం అవుతున్నకొద్దీ భారతీయ సంస్కారం అంతరించిపోతోంది! ‘దేశభక్తి’పాతబడి ‘వాణిజ్య సంస్థల పట్ల భక్తి’ పెరుగుతోంది! రాజకీయాలలోనే కాదు అన్ని రంగాలలోను నేర ప్రవర్తన విస్తరించడానికి ప్రధాన కారణం ఇలా భారతీయ సనాతన సంస్కార స్వభావం సన్నగిల్లడం... 2009లో లోక్‌సభకు ఎన్నికయిన ప్రతినిధులలో ముప్పయిశాతం నేరాభియోగగ్రస్తులట! ఈ నేరచరితుల శాతం 2014లో ఏర్పడిన లోక్‌సభలో ముప్పయినాలుగు శాతానికి ప్రస్తుత లోక్‌సభలో నలబయి మూడు శాతానికి పెరిగిపోవడం సర్వోన్నత న్యాయస్థానం చర్యను అనివార్యం చేసిన విపరిణామం కావచ్చు...
దాదాపు పదహారువందల మంది చట్టసభల ప్రతినిధులకు వ్యతిరేకంగా దాఖలయి ఉన్న అభియోగాలను విచారించి దోషులను నిర్దోషులను నిర్ధారించడంకోసం పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుచేయాలని 2017 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు అనుమతి కూడ లభించింది. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నమోదయిన ఆరోపణలను, దాఖలైన అభియోగాలను సంవత్సరం కాలవ్యవధిలోగా విచారించి తీర్పులను వెలువరించాలన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్దేశం! కానీ ఈ ‘క్షిప్ర కార్యాచరణ’- ఫాస్ట్‌ట్రాక్- న్యాయస్థానాలు ఈ రెండేళ్లలో ఎన్ని అభియోగాలను విచారించాయన్న వివరాలు వెల్లడి కాలేదు! ఆరోపణ-ఎఫ్‌ఐఆర్- నమోదయిన నాటినుంచి - సంవత్సరంలోగా కాకపోయినా- కనీసం రెండేళ్ల గడువులో విచారణ పూర్తయి తీర్పులు వెలువడితే ‘నేర ప్రవర్తకులు’ ఎన్నికల ప్రక్రియనుంచి బహిష్కృతులు కాగలరు. ‘అప్పీళ్లు’ విచారణ ఎన్ని ఏళ్లు పట్టినా నష్టంలేదు. ఎందుకంటే మొదటి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించిన వేత్తలు ఎన్నికలలో పోటీచేయకుండా ‘ఎలక్షన్ కమిషన్’ నిరోధించగలదు... అప్పీళ్ల విచారణ పూర్తయ్యేవరకు ‘నేరస్థులు’గా నిర్ధారితులైన వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచవచ్చు!