మెయన్ ఫీచర్

మోదీని అనుసరించిన కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించడం అనూహ్యం కాకపోయినప్పటికీ, అందరూ ఊహించిందే అయినప్ప టికీ గౌరవప్రదమైన సీట్లు పొందాలని చూసిన భాజపాకు తీవ్ర ఆశాభంగం కలిగిన్నట్లయింది. వాస్తవానికి హర్యానా, ఝార్ఖండ్‌లలో ఎదురైనా ఎదురు దెబ్బలతో ఒక విధంగా అమిత్ షా ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చివేశారు. అయితే మారిన వ్యూహానికి కట్టుబడకుండా, భావోద్వే గాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడంలో అలవాటుపడిన పార్టీ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేస్తూ మొత్తం ప్రచారాన్ని కేజ్రీవాల్‌కు అనుకూలంగా మలచడంలో తోడ్పడ్డారని చెప్పవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికలలో విజయాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాలనే అనుసరిస్తూ కేజ్రీవాల్ ఈ ఎన్నికలలో భాజపాను మట్టి కరిపించి విజయం సాధించినట్లు స్పష్టం అవుతుంది.
వ్యక్తిగత విమర్శలను ఆసరా చేసుకొని ప్రజల నుండి సానుభూతి పొందే వ్యూహాన్ని మోదీ అడుగుజాడలను అనుసరించి కేజ్రీవాల్ మరోసారి ప్రజల మద్దతు చూర గొన్నారు. ఉదాహరణకు 2014 ఎన్నికల ముందు మోదీని ‘చాయివాలా’ అంటూ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తే ‘చాయి పే చ.. చాయి పే చ..’ అంటూ దేశ వ్యాప్తంగా ప్రచారంలో మోదీ సంచలనం కలిగించడం తెలిసిందే. అదేవిధంగా, రాహుల్‌గాంధీ ‘చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తే ట్విట్టర్ లో తన పేరు ముందు చౌకీదార్.. అనే పదాన్ని ప్రధాని జత చేసుకున్నారు. అదే వరవడిని కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు అనుసరించి ప్రజలలో పెద్ద చర్చకు దారి తీశారు. అదే వ్యూహాన్ని అనుసరించిన కేజ్రీవాల్, భాజపా ఎంపీ పారవేశ్ వర్మ తనను ‘ఉగ్రవాది’గా ఆరోపిస్తే, ప్రత్యారోపణలు చేయలేదు. ‘నేను ఉగ్రవాది నా?’ అంటూ సభల్లో అడిగారు. వారంతా ‘కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై ప్రజలకే వదిలి వేస్తున్నాను అంటూ నిజంగా తాను ఉగ్రవాదిని అయితే భాజపా గుర్తు కమలంకే ఓట్ వేయమని చెప్పారు. ఈ అంశంపైననే ప్రజలలో భావో ద్వేగాలను రెచ్చగొట్టారు. ఆ రోజున తనకు ఇంటికి వెళ్ళగానే తన ముసలి తల్లి తండ్రులు ఈ విషయం ప్రస్తావించారని, ‘నీవు ఉగ్రవాదివి కావు, పక్క దేశభక్తి గలవాడిని..’ అంటూ మెచ్చుకున్నారని అంటూ చెప్పారు.
ఎన్నికల సమయంలో మతం కార్డును తెలివిగా ఉపయోగించడంలో మోదీ సిద్దహస్తులు. ఉదాహరణకు, 2019 ఎన్నికలలో చివరి దశ ఓటింగ్‌కు ముందు కేదారనాథ్‌కు వెళ్లి, కాషాయ వస్త్ధ్రారణతో ఒక గుహలో రాత్రి అంతా ఉండి, ధాన్యం చేసుకున్నారు. ఈ ఫొటోలు మీడియాలో విస్తృతంగా వచ్చేటట్లు చూసారు. అదే వరవడిని, కేజ్రీవాల్ కూడా అనుసరించారు. ఓటింగ్ కు ముందు రోజు కుటుంభం సభ్యులతో కలసి హనుమాన్ దేవాలయం సందర్శించారు. ఓటింగ్ రోజున నుదుటి బొట్టు ధరించారు. ఆ విధంగా ఒక విధంగా భాజపా సానుభూతి పరుల ఓట్లను కూడా కైవసం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో మోదీ తన వ్యక్తిగత విశ్వాసాల ద్వారా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. గతంలో గుజరాత్ ఎన్నికలప్పుడు సహితం ఓటింగ్ రోజున తల్లి పాదాలకు నమస్కారం చేసేవారు. అదే విధంగా కేజ్రీవాల్ సహితం ఓటింగ్‌కు వెళ్లే ముందు తల్లితండ్రులకు నమస్కారం చేశారు. మోదీ మొత్తం ఎన్నికల ప్రచారం తన చుట్టూ జరిగేటట్లు చూసుకుం టారు. తనకు, మిగిలిన ప్రతిపక్షాలకు మధ్య పోరాటంగా కనిపించేటట్లు చేస్తారు. కేజ్రీవాల్ కూడా అదే చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియాగాంధీ ఆయనను ‘మృత్యు వ్యాపారి’ అంటూ నిందించగా, దానిని ‘గుజరాత్ ప్రతి’అంశంగా మోదీ మారారు. ఆమె ఆరోపణలకు ఆరు కోట్ల గుజరాతీ ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా, 2019 ఎన్నికలకు ముందు ఫుల్వమా ఉగ్రదాడికి సమాధానంగా బాలకోట వద్ద ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసిన్నట్లు ప్రకటించగా, అందుకు సాక్ష్యం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. 130 కోట్ల మంది భారత ప్రజలే సాక్ష్యమని అంటూ ప్రధాని తిప్పి కొట్టారు. అలాగే భాజపా నాయకులు తపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రస్తావిస్తూ ఇది రెండు కోట్లమంది ఢిల్లీ పౌరులకు, భాజపాకు మధ్య జరుగుతున్న పోరాటంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. భాజపా ఆరోపణలకు రెండు కోట్ల మంది ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఆ విధంగా ఈ ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా కాకుండా, తనకు, ఇతర పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంగా వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల సానుభూతి పొందారు. భాజాపా నాయకుల వ్యూహాత్మక తప్పిదాలు అనేక విధాలుగా కేజ్రీవాల్‌కు కలసి వచ్చాయి. ఒక వంక స్థానిక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, మరోవంక అందరు కలసి తనను కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తున్నారని అంటూ ‘బాధితుడి’గా ప్రజల ముందుకు వెళ్లి సానుభూతి పొందారు. గతంలో అనేక ఎన్నికలలో మోదీ ఏవిధంగా సానుభూతి పొందుతూ వచ్చారో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే చేశారు. అందుకనే 9 నెలల క్రితం 56.68 శాతం ఓట్లతో ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ సీట్లను గెలుపొందిన భాజపా ఇప్పుడు ఎంతగా తాపత్రయపడినా 40 శాతంకు లోపుగానే ఓట్లు పొంద గలిగింది. అయితే ఈ విజయాలను తన ఘనకార్యంగా భావించి, దేశంలో ప్రధాని మోదీకి ధీటైన నాయకుడి తానే అనే అపోహలతో, ప్రతిపక్షాలు అందరికి తన నాయ కత్వం తప్ప గత్యంతరం లేదనే అహంకారంతో 2014లో వలే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదగడం కోసం ప్రయ త్నాలు చేస్తే ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు.
ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేంద్ర మంత్రి ఒకరు ‘ఉగ్రవాది’ అన్నారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెల్లడి చేస్తుందని, ప్రజలలో చులకన భావం కలిగిస్తుం దని మరచి పోతున్నారు. నిజంగా ఉగ్రవాది ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎంతో శక్తివంతుడైన హోమ్ మంత్రి అమిత్ షా ఏమి చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ఆవేశంలో, ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా తాత్కాలికంగా ప్రేక్షకుల నుండి హర్తాతిరేకాలు పొందవచ్చు. సోషల్ మీడియాలో ఎన్నో ప్రశంసలు పొందవచ్చు. కానీ కేంద్రం లో, సగంకు పైగా రాష్ట్రాలలో అధికారమలో ఉన్న, ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయపార్టీగా చెప్పుకొనే వారు భావ దారిద్య్రాన్నీ వెల్లడి చేస్తుంది. వారి పాలనా వైఫల్యాలను వ్యక్తం చేస్తుంది. తమకు పుట్టగతులు కనిపించకపోయినా ఢిల్లీ ప్రజలు ‘విభజన’ రాజకీయాల ను తిరస్కరించారని కాంగ్రెస్, వామపక్షాలు సంబరపడి పోతున్నాయి. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఓటర్లు భాజపాను తిరస్కరించలేదు. కేవలం కేజ్రీవాల్‌ను ఆదరించారు. ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో భిన్నంగా ఓటు వేస్తున్నారంటే వారు తమకు సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలన అందించే నాయకత్వం కోసం చూస్తున్నారని కూడా అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీలోకి ఫిరాయించిన మొత్తం 23 మంది ఎమ్యెల్యేలు గత ఏడాది ఎన్నికలలో ఓటమి చెందారు. మహారాష్ట్రాలో ఇతర పార్టీల నుండి భాజపా ఫిరాయింపు లను ప్రోత్సహించి సీట్లు ఇచ్చినవారిని పూర్తిగా తిరస్కరిం చారు. హర్యానా, ఝార్ఖండ్‌లో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో పార్టీ ఫిరాయించి పోటీ చేసిన ఆప్, భాజపా అభ్యర్థులు ఘోరంగా ఓటమి చెందారు. ఆప్, తెలుగు దేశం, వైసీపీ, టీఆర్‌ఎస్ వంటి పార్టీలు అన్ని సంస్థాగత నిర్మాణంతో పని లేకుండా నాయకుల సామ ర్థ్యంపై కూడా ఆధార పడుతూ ఉంటాయి. ఇప్పుడు భాజపా కూడా సంస్థాగత సామర్థ్యంపై కాకుండా ఒకరి ద్దరు నాయకులపై ఆధార పడటం ఆ పార్టీ తిరోగమనాన్ని వెల్లడి చేస్తుంది. చివరకు గ్రామా పంచాయతీ ఎన్నికలలో సహితం మోదీ, అమిత్ షా బొమ్మలే తమను గెలిపిస్తా యనే భరోసా ఆ పార్టీ నాయకులలో వ్యక్తం కావడం సైద్ధాంతిక పార్టీగా పతనావస్థను వెల్లడి చేస్తుంది.
రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం ఉంటే కేంద్రంలో తమ పెత్తనం కొనసాగదని భజనపరులను ప్రోత్సహిం చిన కాంగ్రెస్ బాటలో ప్రయాణం చేయడం ఆత్మహత్య సదృశ్యం అని గ్రహించాలి. నిత్యం మీడియాలో కనిపించే వారిని కాకుండా ప్రజలు మధ్య, వారితో కలసి తిరగగల నాయకులను పెంచుకోవాలి. ఆవిధంగా ప్రజా నాయకులు గా ఎదిగిన కళ్యాణ్‌సింగ్, మదన్‌లాల్‌ఖురానా, ఉమాభా రతి, బి.ఎస్. యెడ్డ్యూరప్ప వంటి నాయకులు ఇప్పుడు ఎందుకు పార్టీలో ఎదగడంలేదో సింహావలోకనం చేసుకో వాలి. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసే, అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలు నడిపేవారికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యతలు కొనసాగుతున్నంతకాలం కాంగ్రెస్‌కు భిన్నమైన రాజకీయ సంస్కృతిని అలవరచలేమని గమనించాలి.

- చలసాని నరేంద్ర