మెయిన్ ఫీచర్

ఆలోచనా ధోరణి మారాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి చారిత్రాత్మక తీర్పు వచ్చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమీషన్ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది. శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పు బట్టింది. లింగ అసమానత్వపు ధోరణిని కేంద్రం విడనాడాలని హితవు పలికింది. మహిళల శారీరక లక్షణాలతో వారి సామర్థ్యాన్ని అంచనా వేయడం మహిళలకు, సైన్యానికి అవమానకరమని తేల్చింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిరాకరించడం పక్షపాతపూరిత నిర్ణయమని, సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘క్షేత్ర పోరాట విధులకు మహిళలు తగినవారు కాదు’ అన్న వ్యాఖ్యలను తప్పుపడుతూ.. పురుషులతో సమానంగా స్ర్తిలని పరీక్షించాలని, వారిని ఒక వర్గంగా పక్కన పెట్టొద్దని సుప్రీం సూచించింది. అందరి ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
ఆర్మీలో మహిళలకు శాశ్వత కమీషన్ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్ పోస్టింగ్‌కూ అర్హులా? కాదా? అన్నది ఎప్పుడూ జవాబు దొరకని ప్రశే్న.. సైన్యంలో పదాతి దళ పోరాట విధుల్లో మహిళల నియామకంపై ఉన్న నిషేధం ఎత్తివేసి, కమాండర్ల పోస్టుల్లో వారిని నియమించే విషయాన్ని పరిశీలించాలని గత నెలలో భారత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా తమ స్పందనను సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ‘క్షేత్ర పోరాట విధులకు మహిళలు తగినవారు కాదు.. మహిళా అధికారులను కమాండర్లుగా అంగీకరించడానికి పురుష జవానులు ఇంకా మానసికంగా సన్నద్ధం అవ్వలేదు.. మాతృత్వం, ప్రసూతి, పిల్లల పోషణలాంటి సవాళ్లు మహిళలకు అధికంగా ఉన్నాయి’ అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఒకప్పుడు బ్రిటీష్ వలస పాలకులు కూడా భారతీయులను కమాండర్లుగా అంగీకరించరని వాదించేవారు. ఇది కూడా అలాగే ఉంది. భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి సైనికులు వస్తుంటారు. సైనిక శిక్ష వౌలిక ఉద్దేశ్యం వారి పద్ధతులను, వైఖరిని మార్చడమే..
భారత సాయుధ బలగాల్లో మహిళా అధికారుల నియామకాలు 1992లో ప్రారంభమయ్యాయి. వైమానిక దళంలో పోరాట విధుల్లో వారికి అవకాశం కల్పిస్తున్నారు. చాలామంది మహిళలు ఫైటర్ పైలెట్లుగా మారి కదన రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే నౌకాదళంలో సెయిలర్లుగా కూడా వారిని అనుమతించబోతున్నారు. కానీ సైన్యం మాత్రం ఇంకా మహిళలను పక్కన పెడుతూనే ఉంది. డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు, సిగ్నలర్లు, అడ్మినిస్ట్రేటర్లు, న్యాయవాదుల వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తోంది. పోరాట క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకు మహిళలు వైద్యం అందిస్తున్నారు. ల్యాండ్ మైన్లను గుర్తించి, తొలగిస్తున్నారు. కమ్యూనికేషన్ లైన్ల ఏర్పాటులోనూ మహిళలు భాగమవుతున్నారు. మహిళా అధికారులకు అర్హత, ర్యాంకును బట్టి సైన్యం 20 ఏళ్ల సర్వీసును కల్పిస్తోంది. గత సంవత్సరం నుంచి మహిళలను సైనిక పోలీసులుగా నియమించేందుకు అనుమతిస్తోంది. ఇప్పుడు మహిళలు ఒక్క క్షేత్ర పోరాట విధులు తప్ప దాదాపు అన్ని విధులనూ నిర్వర్తిస్తున్నారు. పదాతి దళం, ఆర్మ్డ్ కోర్‌ల్లో మాత్రం మహిళలను ఇంకా అనుమతించడం లేదు. 2019 లెక్కల ప్రకారం సైన్యంలో మహిళల శాతం 3.8 మాత్రమే.. వారి వాటా వైమానిక దళంలో 13 శాతం, నౌకాదళంలో 6 శాతంగా ఉంది. 40 వేలకు పైగా పురుష అధికారులంటే.. దాదాపు 1500 మంది మహిళా అధికారులు ఉన్నారు. మహిళా సాధికారత విషయంలో దీన్నో మైలురాయి అని భావించలేము అని దిల్లీకి చెందిన దిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్‌కు చెందిన పరిశోధకురాలు ఖుల్లర్ అన్నారు. ‘ఇప్పటికీ ద్వారాలు పరిమితంగానే తెరిచారు. పురుషాధిక్యత బాహాటంగానే ఉంది. సంస్థాగత నిర్మాణ స్థాయిలోనే మహిళలను దూరం పెట్టడం జరుగుతోంది. సైన్యంలో పైస్థాయిలోని వైఖర్లలోనూ లింగ అసమానతలు ప్రతిబింబిస్తున్నాయి. మిగతా దళాలతో పోలిస్తే, సైన్యంలో పురుషాధిక్య భావనలు ఎక్కువగా పాతుకుపోయాయి.’ అని ఖుల్లర్ అభిప్రాయపడ్డారు. కానీ మాజీ సైనికాధిపతి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా జనరల్ బిపస్ రావత్ మాట్లాడుతూ.. ‘సైన్యంలో ముందు వరుసలో సేవలందించేందుకు మహిళలు ఇబ్బంది పడతారు. కాబట్టే వారు క్షేత్రస్థాయిలో పోరాట విధుల్లో లేరు. దీనితో తోడు మాతృత్వ సెలవులు ఒక సమస్య.. మహిళలకు భద్రత, గోప్యత కూడా ఎక్కువ అవసరం.. అలాగే పోరాటంలో ప్రాణాలు వదిలిన మహిళల మృతదేశాల బ్యాగులను స్వీకరించేందుకు భారతదేశం ఇంకా సిద్ధంగా లేదు. మహిళా అధికారులను వారి కన్నా కింది స్థాయి జవానుల కళ్ల నుంచి కూడా కాపాడాల్సి వస్తుంది’ అని ఆయన చెప్పారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
కదనరంగంలో అవకాశాల కోసం ప్రపంచవ్యాప్తంగా, మహిళలు గట్టిగానే పోరాడాల్సి వస్తోంది. ప్రస్తుతం పదికిపైగా దేశాల్లో సైన్యంలో క్షేత్రస్థాయి పోరాట విధుల్లో మహిళలు ఉన్నారు. 2013లో అమెరికా, 2018లో బ్రిటన్ సైన్యాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి. చాలామంది ఈ చర్యలను స్వాగతించారు. నేడు సుప్రీం కోర్టు కూడా ఆర్మీలో మహిళలకు శాశ్వత కమీషన్ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్ పోస్టింగ్‌కూ అర్హులని నిర్ణయించింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమీషన్ హోదా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఏది ఏమైనా అభివృద్ధి దిశగా మహిళలు మరో అడుగు ముందుకేసే అవకాశం వచ్చింది.

-సన్నిధి