మెయిన్ ఫీచర్

సత్యనిష్ఠ- అసత్పరిహారము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
330. జీవతో యస్య కైవల్య విదేహే చ స కేవలః
యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్శ్రుతిః॥
ఎవడు జీవన్ముక్తి పొందునో వానికి దేహ పతనానంతరము పునర్జన్మ ఉండదు. అతడు బంధవిముక్తుడై నిశ్రే్శయ సమును పొందును. పరమాత్మయందు ఎంత స్వల్పమైన భేదమును కనబరచినా ఆ వ్యక్తికి భయము తప్పక కల్గునని తైత్తిరీయ శ్రుతి ఇలా ప్రకటిస్తున్నది- ‘‘యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కరుతే అథ తస్య భయం భవతి తత్త్వేవ భయం విదుషో‚ మన్వానస్య’’ (ఏ వ్యక్తి, తాను పరమాత్మకు భిన్నమని, భేదభావనతో ఇసుమంత దూరముచేసి వ్యవహరించినా, వానికి భయము తప్పక కలుగును. తత్త్వతః జీవ పరమాత్మలలో లేని భేదము, ఏనాడైనా జీవేశ్వరులు వేర్వేరనే భేదభావము వివేకవంతునకు సహితము కలిగిన, అదియే వాని భయమునకు కారణమని గ్రహించవలెను-
331. యదా కదా వాపి విపశ్చిదేషః
బ్రహ్మణ్యననే్త‚ ప్యణుమాత్రభేదమ్‌
పశ్యత్యథాముష్య భయం తదేవ
యదీక్షితం భిన్నతయా ప్రమాదాత్‌॥
ఏ సమయమందైనావిద్యాసంపన్నుడైన ఆత్మజ్ఞాని ఎట్టి పరిధులు, క్షయములేని అనంతమైన బ్రహ్మమందు, అత్యల్ప భేదమును ప్రమాదవశమున కనబరచినా, అది వానిలో భయమును కలుగజేయును. భయరహితుడే, ద్వంద్వ భావనలేక బ్రహ్మైక్యత పొందును.
332.శ్రుతి స్మృతిన్యయ శతైర్నిషిద్ధే
దృశే్య త్ర యః స్వాత్మమతిం కరోతి
ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం
నిషిద్ధకర్తా స మల్లిమ్లుచో యథా
శతాధికములైన శ్రుతివాక్యములు, స్మృతి బోధనలు శరీరము, దృశ్య ప్రపంచము జడములు, నశించే ధర్మము కలవి. వాటిని ఎన్నడూ బ్రహ్మ పదార్థములుగా పరిగణించరాదని ఉద్ఘాటిస్తున్నవి. అందువలన, ఎవడు దేహాత్మ భావనతో, దేహమే ఆత్మ అనే బుద్ధి కలిగి ఉండునో, వాడు దురాలోచనాపరుడు, చేయకూడని పనులు చేసే పాపి అనుభవించినట్లు, దుఃఖముపై దుఃఖమును ఎడతెరిపి లేక అనుభవించును.
333.సత్యాభిసంధానరతో విముక్తో
మహత్త్వమాత్మీయ ముపైతి నిత్యమ్
మిథ్యాభిసంధానరతస్తు నశే్యద్
దృష్టం తదేత ద్యదచోరచోరయోః
బ్రహ్మాత్మ భావనకు ఏ విధమైన అంతరాయము కలుగనీయక, అత్యంత జాగరూకతతో ఆత్మస్థితుడై ఉండే సత్యనిష్ఠగల సాధకుడు బ్రహ్మైక్యత పొందును. నిర్విరామ బ్రహ్మాత్వ భావనతో బ్రహ్మైక్యతను సాధించిన వ్యక్తి నిత్యముక్తుడు. సద్వస్తువైన ఆత్మను విస్మరించి, అసద్వస్తువులైన దేహాదులందు ఆసక్తి చూపేవాడు నశించును. సత్యాభిసంధానమును విడనాడి అనృతాభిసందానముగల వ్యక్తి ఎట్లు నశించునో ఛాందోగ్య శ్రుతిలో ఒక దృష్టాంతముతో ఆత్మతత్త్వము బోధింపబడినది. తనయొక్క స్వరూపమును అనృతముతో సంబంధించినదిగా చేసినవాడు, సత్యమును వీడి అసత్యమును అంగీకరించును. అసత్యమునందు అభినివేశము కలవాడగుటచే తాను సంకల్పించిన అసత్యమైనదానిచే ఆవరింపబడి, తన స్వరూపమును మభ్యపరచి కాల్చిన కత్తిని చేతితో పట్టుకొనును. ఆ విధముగా దహింపబడుటచే మరణశిక్షకు సహితము పాత్రుడగును. పూర్వకాలములో పలు రాజ్యములలో సత్యాసత్యములను నిర్ణయించుటకు దోషిగా అనుమానించబడే వ్యక్తిని ఎర్రగా కాల్చిన కత్తిని పట్టుకొనమని, ఆ వ్యక్తి కాలి తన నిర్దోషిత్వమును నిరూపించుకోలేకపోయిన కఠినముగా శిక్షించే పద్ధతి ఉండేది.
334. అతి రసదనుసన్ధిం బన్ధహేతుం విహాయ
స్వయమయ మహమస్మీత్యాత్మదృష్ట్యైవ తిష్ఠేత్
సుఖయతి నను నిష్ఠా బ్రహ్మణి స్వానుభూత్యా
హరతి పరమ విద్యాకార్య దుఃఖం ప్రతీతమ్
యతీంద్రుడు, మోక్షపరాయణుడు నిత్యత్వములేని సమస్త ఆత్మేతర అసద్వస్తువులందు మోహమును కృతనిశ్చయముతో స్వయంగా త్యజించవలెను. ఆత్మనిష్ఠాపరాయణుడై, నేను పరబ్రహ్మ స్వరూపమును తప్ప తద్భిన్నము కాదనే భావనతోనే అహర్నిశలు గడపవలెను. పరమాత్మ చింతన హృదయములలో స్థిరమైన కారణముగా, అచిరకాలంలోనే ఆత్మదర్శనానుభూతిని పొంది శాశ్వత బంధవిముక్తికి అర్హుడౌను. దుఃఖకారకమైన అజ్ఞానము ఏది జన్మతః ప్రకృతినుండి ప్రాప్తించినదో, అది సమూలముగా నశించి నిరవధిక ఆనందమును పొందును.బహు సంఖ్యలో శ్రుతి తార్కాణములు, ఆత్మవేత్త బ్రహ్మైక్యత పొంది దుఃఖమును అతిక్రమించునని నిర్థారిస్తున్నవి.‘తరతి శోకమాత్మవిత్’ (ఆత్మజ్ఞాని దుఃఖమును దాటివేయును), ‘తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథ అమృతస్య ఏష సేతుః’ (ఏకాత్మకమైన అక్షర పరబ్రహ్మమును తెలిసికొనుడు. అదియే మోక్షప్రాప్తికి సాధనము.
ఇంకా ఉంది