మెయిన్ ఫీచర్

ఏకాత్మభావమే ముక్తిమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
335. బాహ్యాభిసన్దిః పరివర్థయేత్ఫలం
దుర్వాసనా మేవ తతస్తతో ధికామ్
జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం
స్వాత్మానుసన్ధిం విదధీత నిత్యమ్
బాహ్య విషయములపైకి మనస్సు మరలిన, మెల్ల మెల్లగా దుర్వాసనలు పెరిగి మరల జన్మకు హేతువులౌను. తొలుత వివరించినట్లు, పరాకుతనముతో ఆత్మానుసంధానమును విసర్జించిన అది వినాశమునకు దారితీయునని తెలిసికొనుట అతి ముఖ్యము. ప్రాపంచిక, దేహాది ఆత్మేతర పదార్థములపైకి మనోప్రసారమును అరికట్టి, బ్రహ్మాత్మభావనతో అనుక్షణము ఆత్మానుసంధానము చేసిన సాధకుడే ముక్తిని పొందును.
336. బాహ్యే నిరుద్ధే మనసః ప్రసన్నతా
మనః ప్రసాదే పరమాత్మదర్శనమ్‌
తస్మిన్ సుదృష్టే భవబన్ధనాశః
బహిర్నిరోధః పదవీ విముక్తేః॥
బాహ్య విషయములందు ఆసక్తి చూపని అంతర్ముఖుడైన వ్యక్తి మనస్సులో వికారములు ఉద్భవించవు. నిర్మలమైన మనస్సుగలవాడే ప్రసన్నచిత్తుడు కాగలడు. మనఃప్రసాదము లభించగా ఆత్మావలోకనము నిశ్చితము. సుషుప్తి సమయములో మనస్సు శాంతించినందున ఆత్మ, పరమాత్మతో లయమై సుఖానుభూతిని పొందుతున్నది కదా! అందువలన, మనస్సుకు ప్రసన్నత చేకూరినపుడే, ఆత్మావలోకనము సాధ్యమై భవబంధ విముక్తి లభించును. బాహ్యానుసంధానమును నిరోధించుటయే నిరతిశయ సుఖము పొందుటకు మార్గమని పునఃస్పష్టము చేయబడినది.
స్మృతి దీనినే ఈ విధముగా ప్రస్తుతిస్తున్నది-
‘‘ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే॥
(మనస్సు ప్రసన్నతను పొందిన వెంటనే దుఃఖములన్నీ నశించును. ప్రసన్నచిత్తుడైన సాధకుని బుద్ధి పూర్తిగా బాహ్య విషయములనుండి వైతొలగి, పరమాత్మయందు మాత్రమే స్థిరమై ఉండును- భ.గీ.2-65). ఇంకనూ,
‘‘ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్‌
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్‌॥
(ప్రశాంత మనస్సుగలవాడు, క్షీణించిన రజోగుణముతో ప్రాపంచిక విషయములందు ఆసక్తి చూపనివాడు, పరమాత్మయందు ఏకీభావముగల సాధకుడు, సర్వశ్రేష్ఠమైన బ్రహ్మనందమును పొందును- భ.గీ.6.27).
337. కః పండితః సన్ సదసద్వివేకీ
శ్రుతి ప్రమాణః పరమార్థదర్శీ
జానన్హి కుర్యా దసతో‚ వలమ్బం
స్వపాతహేతోః శిశువన్ముముక్షుః॥
అత్యంత శ్రేష్ఠమైన పరమార్థమును ఆకాంక్షించేవాడు, ఇంద్రియ గ్రాహ్యముకాని పరబ్రహ్మమును నిర్దేశిస్తున్న శ్రుతి ప్రమాణమందు విశ్వాసమున్నవాడు, సద్రూపమైన బ్రహ్మమును, అసద్రూపమైన దృశ్యప్రపంచ లక్షణములను బాగుగా ఎఱిగినవాడూ, యదార్థ జ్ఞానముగల విద్యాసంపన్నుడూ, మోక్షమునే కోరువాడూ, బుద్ధివికాసములేని శిశువువలె ప్రవర్తించడు. శైశవావస్థలో విచక్షణాజ్ఞానము ఉండనందువలన, ప్రమాదకరమైన పనులు చేయుటకు ఉద్యమించవచ్చు. కాని, పరిపూర్ణ జ్ఞానముగల వివేకవంతుడు, బ్రహ్మపదార్థమైన ఆత్మను విస్మరించి, నిత్యత్వములేని అసద్వస్తువులను ఆశ్రయించి సంసారబంధము వీడుటకు యత్నము చేయడుకదా!
338. దేహాదిసంసక్తిమతో న ముక్తి
ర్ముక్తస్య దేహాద్యనిమత్యభావః
సుప్తస్య నో జాగరణం న జాగ్రత్తః
స్వప్నస్తయో ర్భిన్నగుణాశ్రయత్వాత్‌॥
జాగ్రత్స్వప్నావస్థలు పరస్పర విరుద్ధ్ధర్మములు కలవి. నిద్రలో మునిగి ఉన్నవానికి, జాగరము ఉండదు, జాగరూకుడు స్వప్నములు చూడడు. అదే విధముగా, దేహముతో తాదాత్మ్యము చెందినవానికి ముక్తి ఎన్నటికీ లభించదు, ముక్తి పొందిన వానికి దేహమందు అభిమానము ఎంతమాత్రము ఉండదు.
339. అన్తర్బహిః స్వం స్థిర జంగమేషు
జ్ఞానాత్మనాధారతయా విలోక్య!
త్యక్త్భాలోపాధి రఖణ్డరూపః
పూర్ణాత్మనా యః స్థిత ఏష ముక్తః॥
సర్వాత్మకమగు పరమాత్మ సమస్త చరాచరములలోను సర్వాంతర్గామిగా, అంతర్బాహ్య విభేదములేక అధిష్ఠాన రూపములో ఉన్నదనే జ్ఞానముతో, ఉపాధులనన్నింటినీ విడచి, ఏకాత్మ భావనతో తాను అఖండ సచ్చిదానంద స్వరూపమనే భావనతో ఎవడు ఉండునో వాడే ముక్తుడు.

ఇంకా ఉంది