మెయన్ ఫీచర్

అసలు సిసలు న్యాయం అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే విశిష్ట ప్రజాస్వామ్య దేశంగానే కాదు, 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్న న్యాయవ్యవస్థ భారత్ సొంతం. మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీషు సంస్కృతుల సమ్మేళనం. దేశంలో సాధారణ న్యాయవ్యవస్థ రెండువేల ఏళ్లుగా పరిణామం చెందుతూ వస్తోంది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ, న్యాయపాలన ఉండేది, న్యాయాధికారుల సమక్షంలోనే బహిరంగంగానే విచారణ జరిగేది. ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారం లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు, తీర్పును ఇచ్చే గ్రామ పెద్ద కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు అప్పటికపుడు దోషి ఎవరనేది ధృవీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేది. అలాగే ఎవరైనా వ్యక్తి పదవీ స్వీకారం చేసేటపుడు పులి దంతాన్ని పట్టుకోవడం రివాజుగా ఉండేది. ఇలాంటి సంప్రదాయాలు న్యాయవ్యవస్థలో ఎన్నో ఉండేవి. కాలం మారుతున్నా, సాంకేతికత పెరుగుతున్నా, విశ్వాసాల్లో మార్పు వచ్చినా న్యాయవ్యవస్థపై మాత్రం నమ్మకం పోలేదు. చివరి ఆయుధంగా సగటు భారతీయుడు న్యాయవ్యవస్థనే నమ్ముకుంటున్నాడు. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న లోపాలు కారణంగా న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. తొందరగా న్యాయం కోరుకుంటున్న వారు, అత్యవసరంగా తీర్పులు ఇవ్వాల్సిన అనివార్య ఘటనలు ఎక్కువ కావడంతో దేశంలో అనేక కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయి.
తరతరాలుగా తీర్పు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. ఎలాంటి అధ్యయనం, పరిశోధన, పరిశీలన చేయకుండా తీర్పులు ఇవ్వడం దానినే తుది న్యాయం గా చెప్పడం చాలా దేశాల్లో కొనసాగుతోంది. అలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో సైతం ఒక్క కేసు కూడా పెండింగ్‌లో ఉండేందుకు అవకాశం లేదు. ఏ రోజుకారోజు తీర్పులు వెలువడేవి. కానీ ఏ దేశంలో లేని విశిష్టత భారతదేశ న్యాయవ్యవస్థ సొంతం. న్యాయం జరగకపోయినా న్యాయవ్యవస్థ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లకూడదు అనే అంతర్లీన సైద్ధాంతిక శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే నిరపరాది శిక్షకు గురికాకూడదు అనే భావన మానసికంగా వేళ్లూనుకుంది. దాని వల్ల అపరాదిని సైతం నిరపరాదిగానే చూడటం మన తొలి దృష్టికోణంగా ఉంటోంది.
భారత ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు న్యాయవ్యవస్థ. పౌరుల ప్రాధమిక హక్కులకు భరోసాగా నిలుస్తున్న ప్రాధమిక వ్యవస్థ ఇది. విభిన్నతలకు సమాహారంగా నిలుస్తున్న భారత్‌లో రోజుకో కొత్త రూపంలో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అడ్డంకులను అధిగమించి, సవాళ్లను ఎదుర్కొని సక్రమమైన ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుకోవడంలో భారత న్యాయవ్యవస్థ పాత్ర కొట్టి పారేయలేనిది. ప్రజస్వామ్య పురోగమనానికి ఇరుసుగా ఉపయోగపడుతున్న న్యాయవ్యవస్థ కొండల్లా పేరుకుపోతున్న పెండింగ్ కేసులతో కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. దేశంలో చట్టబద్ధమైన పాలనకు, సాఫీ ప్రస్థానానికి ఆటంకం కలిగిస్తున్న పరిణామమిది. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో 3.18 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేస్తున్న కొత్త చట్టాలకు సమాంతరంగా న్యాయవ్యవస్థలో వౌలిక సదుపాయాలు, కొత్త కోర్టులు ఏర్పాటుచేయకపోవడం, న్యాయమూర్తుల పోస్టులను పెంచకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పాటు ఆధునిక టెక్నాలజీని మరీ ముఖ్యంగా రోబోటిక్ వ్యవస్థలను, కృత్రిమ మేథస్సును వినియోగించుకోకపోవడంతో కేసులు వాయిదాలు పడి పేరుకుపోతున్నాయనేది నిర్వివాదాంశం.
దేశంలో 3 కోట్ల 18 లక్షల 62వేల 195 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో వెల్లడించారు. ఇందులో 50ఏళ్లు దాటిన కేసులు, 30 ఏళ్లు దాటిన కేసులు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 30 ఏళ్లుదాటిన కేసులు 86,298 ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 59,670 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో 43,63,260 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో 3.11 కోట్లు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇన్ని కేసులు నెమ్మదిగా పరిష్కారం అవుతూ అమూల్యమైన సమయం గడిచిపోయిన తర్వాత న్యాయం చేకూర్చినా, వాటి ప్రతిఫలాలు అనుభవించే స్థితి కక్షిదారులకు లేకుండా పోతోంది. జనాభాకు సరిపడా న్యాయస్థానాలు ఏర్పాటు చేసే వ్యవస్థీకృతమైన వౌలిక సదుపాయాలు, ఆర్ధిక పరిస్థితులు కరువై, కుంటినడకన కేసులు పరిష్కారమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బాధితులుగా మిగిలిపోతున్నది మహిళలు, గిరిజనులు, హరిజనులు, బీద బడుగు బలహీన వర్గాల వారు, వృద్ధులే ఎక్కువ.
సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 135, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 13, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 398 కేసులు విచారణలో ఉన్నాయి. అంటే రాజ్యాంగ ధర్మాసనాల ముందే 546 కేసులున్నాయి. పాలనాపరమైన కేసులు 39670, ఇతర కేసులు సుమారు 20వేలు సుప్రీంకోర్టులో ఉన్నాయి.
నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ సమాచారం ప్రకారం హైకోర్టుల్లో 18.79 లక్షల సివిల్ తగాదాలు, 12.18 లక్షల క్రిమినల్ తగాదాలతో పాటు 12.65 లక్షల రిట్లు కూడా ఉన్నాయి. ఇందులో 20 ఏళ్లు దాటిన కేసులు 6.86 లక్షలు కాగా 30 ఏళ్లు దాటినవి 1.03 లక్షలు, అంతకు మించినవి 44,409 కేసులున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 11 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు పరిధిలో 5.65 లక్షలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో 5.59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 30ఏళ్లు దాటిన కేసులు తెలంగాణలో 83 కాగా ఆంధ్రాలో 43 ఉన్నాయి. అదే తెలంగాణ హైకోర్టులో 2.20 లక్షలు, ఆంధ్రా హైకోర్టులో 1.97 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ నివేదికలో స్పష్టం చేసింది.
ఏ విధంగా చూసినా అన్ని కోర్టుల్లో కలిపి 3.53 కోట్ల వరకూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖ నివేదిక తెలుపుతోంది. కేవలం జిల్లా కోర్టుల్లో 3.11 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు నియమించిన పరిశోధన విశే్లషణ విభాగం నివేదిక ప్రకారం భారత్‌లో 61 కిలోమీటర్లకు ఒక పోలీసు ఇనస్పెక్టర్ పోస్టు ఉండగా, 157 కిలోమీటర్లకు ఒక న్యాయాధికారి పోస్టు ఉంది. అంటే కనీసం ఒక ఇనస్పెక్టర్ దాఖలు చేసే కేసులు చూసేందుకైనా కనీసం ఇద్దరు లేదా ముగ్గురు న్యాయాధికారుల అవసరం ఉంది. మరో చిత్రమైన విషయం ఏమంటే ఉన్న న్యాయాధికారుల సంఖ్యే చాలదు అనుకుంటే వారు కూర్చునేందుకు కోర్టు గదుల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో 5018 కోర్టు గదులు లేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం 15540 కోర్టు గదులున్నా సదుపాయంగా మాత్రం లేవు. 20వేల న్యాయాధికారుల్లో నివాసానికి 8538 మందికి క్వార్టర్లే లేవు. 41,775 మంది సహాయక సిబ్బంది కొరత ఉంది. నేషనల్ కోర్టు మేనేజిమెంట్ ప్రస్తావనను 1958లోనే లా కమిషన్ తన 14వ రిపోర్టులో తెచ్చింది. కాని అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. అమెరికాలో 10 లక్షల మందికి 107 మంది, ఆస్ట్రేలియాలో 42 మంది, కెనడాలో 76 మంది, ఇంగ్లాండ్‌లో 51మంది న్యాయాధికారులుండగా, భారత్‌లో 10 లక్షల మందికి (1981 జనాభాలెక్కల ప్రకారం) 10 మంది మాత్రమే న్యాయాధికారులున్నారు. మన దేశంలో కనీసం 10 లక్షలమంది జనాభాకు 50 మంది న్యాయాధికారులు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే కోర్టుల సంఖ్య కూడా రెట్టింపు చేయాలని కేంద్రాన్ని సూచించింది. ఆల్ ఇండియా జడ్జీల సంఘం ఇతరులు వెర్సస్ కేంద్ర ప్రభుత్వం (2002) కేసులో 2002 మార్చి 21న సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ దేశంలో వ్యాజ్యాల నివారణకు, ఉన్న వ్యాజ్యాల త్వరితగతిన పరిష్కారానికి అవసరమైన చర్యలను కేంద్రం తీసుకోవాలని ఆదేశించింది. 2013 నాటికి కోర్టుల సంఖ్యను కూడా రెట్టింపు చేయాలని పేర్కొంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో న్యాయాధికారుల సంఖ్యను 60,530కి పెంచాలని లెక్కలు వేశారు. అలా పెంచగలిగితేనే దేశంలో కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుందని గుర్తించారు. అంతా కాగితాలకే పరిమితమైపోయింది. అక్కడక్కడా రిక్రూట్‌మెంట్ జరుగుతున్నా అది ఏ మాత్రం సరిపోదు.
ప్రస్తుత అవసరాలు తీరాలంటే రానున్న ఐదేళ్లలో కనీసం 8521 మంది న్యాయమూర్తులను నియమించాలి, ప్రస్తుత గణాంకాల ప్రకారం 5535 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే 2040 నాటికి దేశంలో అన్ని కేసులను ఎప్పటికపుడు పరిష్కరించాలంటే 75,594 మంది న్యాయాధికారులు కావాలని సుప్రీంకోర్టు సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్ విభాగం అంచనా వేసింది.
యుపీలో దిగువ న్యాయస్థానాల్లో 74.78 లక్షలు, మహారాష్టల్రో 37.01 లక్షలు, గుజరాత్‌లో 16.97 లక్షలు, బీహార్‌లో 27.17 లక్షలు, పశ్చిమ బంగాలో 22.71 లక్షల కేసులు సబార్డినేట్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని జె మార్క్ రామ్‌సేయర్ అండ్ ఎరిక్ బి రామసేయర్ (హార్వర్డు లా స్కూల్ ) తమ నివేదికలో పేర్కొంది.
3.18 కోట్ల కేసులు పరిష్కారం కావాలంటే 320 ఏళ్లు పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత కాలం ఎలా గడిచినా ఏ రోజుకారోజు ఏ కోర్టులో ఎన్ని కేసులు దాఖలయ్యాయో, ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయో, గమనిస్తూ విశే్లషణ చేసేందుకు కేంద్రం నేషనల్ కోర్టు మేనేజిమెంట్ సిస్టంను అమలులోకి తెచ్చింది. కోర్టుల అభివృద్ధి, ప్రణాళిక విధానంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్ ఎన్‌సిఎంబి బేస్‌లైన్ నివేదిక కూడా ఇదే అభిప్రాయంతో కోర్టుల్లో పనితీరును మెరుగుపరిచేందుకు అనేక సూచనలు చేసింది. న్యాయస్థానాల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించడం, సిబ్బందికి, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, వ్యాజ్యాల్లో వాది, ప్రతివాదిలకు సైతం సౌకర్యాలను కల్పించాలని సూచించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 3.3 కోట్ల వ్యాజ్యాల్లో 46 శాతం వాటా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలదే. తమ స్థాయిలోనే పరిష్కరించదగిన అంశాలను వ్యాజ్యాలుగా న్యాయస్థానాలపైకి కార్యనిర్వాహక వ్యవస్థ నెడుతోందని, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వడం లేదని సుప్రీంకోర్టు బెంచ్ ఆవేదన చెందింది. అంతే కాదు ప్రభుత్వాలు నిద్ర వీడటంలేదని పేర్కొంది. 46 శాతం మేర కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే శాఖ, ఆర్ధిక శాఖ, కమ్యూనికేషన్ల శాఖ, హోం శాఖ, రక్షణ శాఖలకు చెందినవే. కేసులు వేయడం, డజన్ల కొద్దీ న్యాయవాదులను, అదనపు సొలిసిటర్ జనరల్ స్థాయి అధికారులను నియమించడంతో కేంద్రం తమ పని అయిపోయిందని భావిస్తోంది, కాని వాస్తవికంగా వ్యాజ్యాలను తగ్గించడానికి ఎలాంటి కృషి చేయడం లేదని పేర్కొంది. నేషనల్ లీగల్ మిషన్‌ను సీరియస్‌గా నిర్వహించడానికి, కేసులను 15 ఏళ్ల పెండింగ్ నుండి కనీసం మూడేళ్లకు తగ్గించడానికి ఉన్న మార్గాలను గుర్తించడానికి కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నది సుప్రీంకోర్టు బెంచ్ ఆరోపించింది. నేషనల్ లిటిగేషన్ పాలసీ కూడా చేస్తే బావుంటుందేమో ఆలోచించాలని కూడా సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. కేసులు పరిష్కారం కావాలంటే కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచించాల్సి ఉంది. రాష్ట్రాలు ఆర్ధికభారం నెపం మోపకుండానే కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లాలి, కేసుల పెండింగ్ వల్ల వాది, ప్రతివాదిలలో ఏ పాత్ర పోషించినా కనిపించని విపరీతమైన ఆర్ధిక భారం ఆయా ప్రభుత్వాలకే అన్నది సుస్పష్టం. లక్ష రూపాయిలు చెల్లింపు కేసుల్లో ప్రభుత్వాలు పంతాలకు పట్టింపులకు పోయి కోట్లాది రూపాయిలు వెచ్చించిన సందర్భాలు లేకపోలేదు. ప్రభుత్వం కొన్నికేసులు గెలిస్తే గెలవచ్చు గాక, కాని వ్యర్థమవుతున్న నిధులు ప్రజలవే అనే స్పృహ లేనంతకాలం కోర్టుల్లో వ్యాజ్యాలు మురుగుతూనే ఉంటాయి. ఈ కేసుల పెండింగ్ తగ్గించేందుకు గొప్ప ప్రత్యామ్నాయంగా సామాన్యులకు న్యాయం అందించేందుకు అందుబాటులోకి వచ్చిన న్యాయ పరిష్కారమే ప్రత్యామ్నాయ న్యాయ వివాదాల పరిష్కారం (ఎడిఆర్). కాలాతీత కేసులను తొలగించి మిగిలిన వాటిని తొందరగా పరిష్కరించేందుకు బహుముఖీన వ్యూహాన్ని అమలుచేయాలి. అపుడు సగటు పౌరుడికి అసలు సిసలు న్యాయం అందుతుంది.

- బీవీ ప్రసాద్ 9963345056