మెయిన్ ఫీచర్

వౌనంగానే గెలిచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు పందొమ్మిది సంవత్సరాలు..
ఆమె భర్తకు నలభై అయిదు సంవత్సరాలు..
పైగా ఆయన నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి..
అయినా ‘మన అప్పుల భారం తీరాలంటే ఆయనను పెళ్లి చేసుకోవాల్సిందే’ అని ఆదేశం..
ఆ ఆదేశానికి ఆమె తలొంచక తప్పలేదు.. ఫలితంగా ఏడు సంవత్సరాలకే ఆమె విధవగా మారింది. అయినా విధి రాసిన రాతకు ఆమె తలొగ్గలేదు. తన తలరాతను మార్చుకుంది. కేరళలోని త్రిన్సూర్ జిల్లాలో మొట్టమొదటి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పరచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 20 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి.. విధిని ఎదిరించి ముందుకు సాగిన ఈమె విజయగాథ సినిమాను తలపిస్తోంది కదూ.. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె గురించిన వివరాలను తెలుసుకుందాం..
ఆమె పేరు ‘ఉమ’. ఉమ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టి పెరిగింది. పందొమ్మిదేళ్ల ఉమ.. తన పెళ్లి గురించి చాలా కలలే కంది. యువరాజులాంటి వ్యక్తి వచ్చి తనను పెళ్లిచేసుకుంటాడనుకుంది. తనను రాజకుమారిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడనుకుంది. తన పెళ్లి సాంప్రదాయ దక్షిణ భారత ఆలయంలో ఎంతో వైభవంగా జరగాలని ఆమె ఎప్పుడూ కలలు కనేది. రకరకాల పూలతో చక్కగా అలంకరించిన వేదికపై తన వివాహం జరుగుతుందని, అనంతరం బీచ్‌లో పెద్ద విందు కార్యక్రమం కూడా ఉంటుందని ఊహించుకుంది. కానీ నిజజీవితంలో అవేవీ జరగలేదు. ఒకరోజు తన తల్లి ఆమెను తీసుకెళ్లి ప్రేమన్ థాయికడ్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అప్పుడు ఉమకు పందొమ్మిది సంవత్సరాలు. ప్రేమన్‌కు నలభై అయిదు సంవత్సరాలు.. అంటే ఉమ కంటే 26 సంవత్సరాలు పెద్ద. అంతకుముందు వారు ఎప్పుడూ కలుసుకోలేదు. మేళతాళాల లేవు.. భాజాభజంత్రీలు లేవు.. వివాహ వేడుక అసలే లేదు.. కానీ ఉమ తల్లి మాత్రం.. అతనే నీ భర్త అని చెప్పింది. ఇక నుంచి నీవు ప్రేమన్ ఆస్తివమ్మా అని చెప్పింది ఉమ తల్లి. ఉమకు ఏమీ అర్థం కాలేదు. ప్రేమన్ కూడా ఇక నుంచి నీవు నా భార్యవు అన్నాడు. కానీ.. ఆయన ఆస్తులపై ఆమెకు మాత్రం ఎలాంటి హక్కులు లేవని ముందే చెప్పాడు. అలా ఆమెను ప్రేమన్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఆమెను ఒక్కదానే్న ఇంట్లో వదిలేసి అతను బయటకు వెళ్లిపోయాడు. ఆమెకు నిద్రపట్టలేదు. రాత్రంతా లోలోపల కుమిలిపోతూ, ఆలోచించుకుంటూ ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆరుగంటలకు ప్రేమన్ తిరిగివచ్చి.. ఆమెను బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అతను కొన్ని గంటలపాటు విరామం లేకుండా తాగుతూనే ఉన్నాడు. ఆమె గురించి అస్సలు ఆలోచించలేదు. ఉమ మాత్రం వౌనంగా కూర్చుని.. అతన్ని చూసి ‘తన జీవితం ఎందుకిలా అయింది’ అంటూ ఆలోచిస్తూనే ఉంది. అలా బాగా తాగిన తరువాత ప్రేమన్ ఆమెను చూస్తూ ‘నువ్వు నాకు రెండో భార్యవు.. నాకు తీవ్రమైన క్షయవ్యాధి.. నా సంరక్షణను చూసుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను.. నా ఆస్తులపై కానీ, నా ఆదాయంపై కానీ నీకు ఏమాత్రం హక్కులు లేవు.. అర్థమైందా?’ అని చెప్పాడు. ఆమెకు ఏం చెప్పాలో? ఏం మాట్లాడాలో అర్థం కాక వౌనంగా ఉండిపోయింది.
నిజానికి ప్రేమన్‌కు ఉమ నాలుగో భార్య.. ఈ విషయాన్ని ఉమ చాలా త్వరగానే తెలుసుకుంది. ఉమకు చిన్నప్పటి నుండీ కష్టాలే.. ఉమ తండ్రి టీకే బాలకృష్ణన్ సొంతూరిలోనే చిన్న చిన్న జబ్బులకు వైద్యుడిగా పనిచేసేవారు. పెద్దయ్యాక తను కూడా తండ్రిలా డాక్టర్‌ని అవ్వాలనుకుంది. ఉమకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి మరోవ్యక్తిని ఇష్టపడింది. ఆమెకు బాలకృష్ణన్ అంటే ఇష్టముండేది కాదు. కారణం అతను ఇంట్లో కంటే బయటనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు దీపావళి పండుగరోజు టపాకాయలు కొనుక్కోమని ఉమకు డబ్బులిచ్చి దుకాణానికి పంపించింది. ఉమ తిరిగి వచ్చేసరికి తల్లి ఇంట్లో లేదు. ఉమను, ఉమ తమ్ముడిని, బాలకృష్ణన్‌ని వదిలేసి ఇంటి నుండి వెళ్లిపోయింది. దాంతో ఉమ అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఉమ వయస్సు ఎనిమిది సంవత్సరాలు.. ఆమె తమ్ముడి వయస్సు మూడు సంవత్సరాలు.. బాలకృష్ణన్ పనికి వెళ్లేవాడు. ఇంట్లో తమ్ముణ్ని ఉమనే చూసుకునేది. అంత చిన్న వయసులో ఆమెకు ఏం పని వస్తుంది? వంట కూడా రాదు. దాంతో అష్టకష్టాలు పడి వంట నేర్చుకుంది. ఇందుకు ఇరుగుపొరుగు మహిళలు సాయపడ్డారు. ఇలా కొన్నాళ్లకే ఉమ చాలా వంటలు నేర్చుకుంది. ఉదయం ఐదు గంటలకే లేచి టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం వండేది.. తొమ్మిది గంటలకు బడికి వెళ్లేది. సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చాక తమ్ముణ్ని చూసుకుంటూ రాత్రికి భోజనం వండేది. ఆ వయసులో స్నేహితులందరూ ఆడుకుంటూంటే ఉమ ఇంటి పని చూసుకునేది. తరువాత ఉమకు పదిహేడేళ్ల వయసున్నప్పుడు ఇరుగు పొరుగు మహిళలతో కలిసి కోయంబత్తూరుకు 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురవయూర్‌లోని ఒక ప్రముఖ ఆలయాన్ని దర్శించుకునేందుకు పొరుగింటివారితో కలిసి ఉమ కూడా వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన ఉమకు రెండు రోజుల తరువాత ఒక ఉత్తరం వచ్చింది. అది ఉమ తల్లి రాసింది. గుళ్లో ఒక మహిళ ఉమను చూసి తనకు పరిచయమైన ఉమ తల్లికి ఈ విషయం చెప్పడంతో ఉమకు ఉత్తరం రాసింది ఆమె తల్లి.
వెంటనే ఉమ గురవయూర్‌లోని తల్లి దగ్గరకు వెళ్లింది. ఆమెను తీసుకెళ్లిన రెండో భర్త భారీగా అప్పులు చేసి ఆమెను వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులు ఇచ్చినవాళ్లందరూ ఉమ తల్లిపై ఒత్తిడి తెచ్చేవారు. ఉమ కనిపించడంతో ఆమె కన్నతల్లి ఒక ప్లాన్ వేసింది. ప్రేమన్‌కు ఉమను ఇచ్చి పెళ్లి చేస్తే అతను ఉమ అప్పులన్నీ తీర్చేస్తాడు అని ఒప్పందం చేసుకుని ఉమకు చెప్పింది. అందుకు ఉమ ఒప్పుకోలేదు. తిరిగి ఆమె బాలకృష్ణన్ దగ్గరకు వెళ్లింది. కానీ తల్లి దగ్గరకు వెళ్లిందనే నెపంతో బాలకృష్ణన్ ఉమను ఇంటికి రానివ్వలేదు. అలా ఉమ తప్పని పరిస్థితిలో తల్లి దగ్గరకు వచ్చేసింది. ఆమె చెప్పినట్లు ప్రేమన్‌తో వెళ్లాల్సి వచ్చింది.
ప్రేమన్ రోజూ ఉమను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని ఉద్యోగానికి వెళ్లేవాడు. ఎవరితోనూ కనీసం ఒక నిముషం సేపు కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇలా ఆరు నెలలు ఒంటరిగా ఇంట్లో నాలుగు గోడల మధ్యనే గడిపింది ఉమ. అలా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోసాగింది. అయితే పోనుపోను ప్రేమన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రతిరోజూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా ఏడు సంవత్సరాలు గడిచాయి. ప్రేమన్ చనిపోయాడు. ఆయన ఆస్తులేమీ ఉమకు దక్కలేదు. అయితే ప్రేమన్ మరణంతో ఉమకు కాస్త ఉపశమనం దొరికింది. ఆయన చనిపోవాలని ఆమె కోరుకోలేదు కానీ అతను బతికే వీలు లేదు కాబట్టి.. ఆయన మరణంతో ఉమకు రెండో అవకాశం దొరికింది. అయితే ఆ పరిస్థితుల నుండి తేరుకునేందుకు ఆమెకు కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నవారికి సాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. తన భర్త వైద్యం కోసం తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరిగేది కదా.. ఆ సమయంలో చాలామంది సరైన వైద్యం పొందలేకపోతుండటాన్ని ఆమె గమనించింది. అందుకు పేదరికంతో పాటు ఏ జబ్బుకు ఎలాంటి వైద్యం చేయించుకోవాలి? దానికి ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న కనీస అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమని ఆమె గ్రహించింది. అలాంటి వారికి ఎలాగైనా సహాయ పడాలని అనుకుంది. దరఖాస్తు ఫారాలు నింపడం, ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స చేయించుకోవాలి? ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లాలి? వంటి విషయాలను పేదరికంలో జబ్బులతో మగ్గుతున్న వారికి చెబుతూ ఉండేది. ప్రేమన్‌కు తరచూ వెళ్లే తిరువనంతపురంలో ఓ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ, ఆసుపత్రి సమీపంలో ఉన్న ఒక టెలిఫోన్ బూత్ నుంచి ప్రేమన్ తన ఇంటికి ఫోన్ చేసేవాడు. అలా ఆ బూత్ నిర్వాహకుడికి ప్రేమన్ ఇంటి నెంబరు తెలుసు. ప్రేమన్ చనిపోయిన తరువాతి కాలంలో అక్కడికి వచ్చే నిరుపేద రోగులకు, సాయం కోసం చూస్తున్న వారికి అతను ఉమ ఇంటి నెంబరును ఇచ్చేవాడు. దాంతో ఆమెకు రోజూ వందల సంఖ్యలో ఫోన్లు వచ్చేవి. అలా ఉమ అందరికీ సలహాలు చెబుతూ సాయం చేయడం మొదలుపెట్టింది.
ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఆమె ‘శాంతి మెడికల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. సరైన వైద్యం చేయించుకునేందుకు వేలాదిమందికి ఆమె సాయం అందిస్తోంది. దాతల సాయంతో దేశవ్యాప్తంగా ఆమె 20 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ జబ్బుకు ఎక్కడ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? ఏ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుకు వైద్య సేవలు అందుతాయి? వంటి అనేక రకాల వివరాలను సేకరించేందుకు ఆమె దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తిరిగింది. వివరాలకోసం అన్ని ఆసుపత్రులకు ఉత్తరాలు రాసేది. కానీ అటువైపు నుంచి ఏ స్పందన వచ్చేది కాదు. దాంతో ఆమే అన్ని ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఆమె ముఖాముఖిగా మాట్లాడి వివరాలు తెలుసుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లినా కొందరు ఆమెను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. అది భాష. ఉమకు తమిళం మాత్రమే వచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష తెలియక చాలా ఇబ్బందులు పడేది. దశాబ్దకాలంగా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి సాయం అందించేందుకు శాంతి సెంటర్ ప్రాధాన్యమిస్తోంది.. దేశంలో అవసరమైనన్ని డయాలసిస్ కేంద్రాలు లేవు. కిడ్నీ దాతల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికోసం కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమె నిధులను సేకరిస్తోంది. కిడ్నీ సంబంధిత జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఆమె మొట్టమొదటి డయాలసిస్ కేంద్రాన్ని కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఏర్పాటుచేసింది. ఇప్పుడు భారతదేశం అంతటా 20 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. దీనికోసం ఆమె చాలా విరాళాలను సేకరించింది. కిడ్నీల దానం కోసం ప్రజలను ఒప్పించడం అంత సులువు కాదు. చాలామంది కిడ్నీ దానం ఇస్తే తమ ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారు. కాబట్టి, ఇతరులకు చెప్పడం కంటే ముందు తానే చేసి చూపించాలని నిర్ణయించుకుని ఆమె తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేసింది. మూత్రపిండాలు విఫలమైన ఓ అనాథకు ఆమె తన కిడ్నీని ఇచ్చింది. ఇలా ఉమ త్యాగం వెనుక ఎన్నో కష్టాలు.. ఎదురు దెబ్బలు.. దేనికీ వెరవలేదు.. బాధపడలేదు.. విధిని ఎదిరించింది.. మొండిగా జీవించింది.. నేడు వందలమందికి ప్రాణదానం చేస్తోంది..

-ఎస్.ఎన్.యు.మహేశ్వరి